24-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీ ఈ సమయము చాలా-చాలా విలువైనది,
అందుకే దీనిని వ్యర్థముగా పోగొట్టుకోకండి, పాత్రులను చూసి జ్ఞాన దానము చెయ్యండి’’
ప్రశ్న:-
గుణాల
ధారణ కూడా జరుగుతూ ఉండాలి మరియు నడవడిక కూడా బాగవుతూ ఉండాలి, దానికి సహజ విధి ఏమిటి?
జవాబు:-
బాబా ఏదైతే
అర్థం చేయించారో, అది ఇతరులకు అర్థం చేయించండి. జ్ఞాన ధనాన్ని దానము చేసినట్లయితే
గుణాల ధారణ కూడా సహజముగా జరుగుతూ ఉంటుంది, నడవడిక కూడా బాగవుతూ ఉంటుంది. ఎవరి
బుద్ధిలోనైతే ఈ జ్ఞానము ఉండదో, జ్ఞాన ధనాన్ని దానము చెయ్యరో, వారు పిసినారులు. వారు
అనవసరముగా తమను తాము నష్టపరచుకుంటారు.
పాట:-
బాల్యపు రోజులు
మర్చిపోవద్దు...
ఓంశాంతి
మధురాతి మధురమైన పిల్లలు పాటను విన్నారు, అర్థాన్ని బాగా అర్థం చేసుకున్నారు. మనము
ఆత్మలము మరియు మనము అనంతమైన తండ్రికి పిల్లలము - ఇది మర్చిపోకండి. ఇప్పుడిప్పుడే
తండ్రి స్మృతిలో హర్షితులవుతారు, ఇప్పుడిప్పుడే మళ్ళీ స్మృతిని మర్చిపోవడముతో
దుఃఖపడతారు. ఇప్పుడిప్పుడే జీవిస్తారు, ఇప్పుడిప్పుడే మరణిస్తారు అనగా ఇప్పుడిప్పుడే
అనంతమైన తండ్రికి చెందినవారిగా అవుతారు, ఇప్పుడిప్పుడే మళ్ళీ దైహిక పరివారము వైపుకు
వెళ్ళిపోతారు. కావున తండ్రి అంటారు, ఈ రోజు నవ్వారు, రేపు ఏడవకండి. ఇది పాట యొక్క
అర్థము.
చాలా వరకు మనుష్యులు శాంతి కోసమే ఎదురుదెబ్బలు తింటారని, తీర్థ యాత్రలకు
వెళ్తారని పిల్లలైన మీకు తెలుసు. అలాగని ఎదురుదెబ్బలు తినడము వలన ఏదో శాంతి
లభిస్తుందని కాదు. తండ్రి వచ్చి అర్థం చేయించేది ఈ ఒక్క సంగమయుగములోనే. మొట్టమొదటైతే
స్వయాన్ని గుర్తించండి. ఆత్మ ఉన్నదే శాంతి స్వరూపము. ఆత్మ నివసించే స్థానము కూడా
శాంతిధామము. ఇక్కడికి వచ్చినప్పుడు కర్మలు తప్పకుండా చెయ్యాల్సి ఉంటుంది. తమ
శాంతిధామములో ఉన్నప్పుడు శాంతిగా ఉంటారు. సత్యయుగములో కూడా శాంతి ఉంటుంది. అక్కడ
సుఖము కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది. శాంతిధామాన్ని సుఖధామమని అనరు. సుఖమున్న
చోటును సుఖధామమని, దుఃఖమున్న చోటును దుఃఖధామమని అంటారు. ఈ విషయాలన్నింటినీ మీరు
అర్థం చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎవరికైనా అర్థం చేయించాలంటే, సమ్ముఖములోనే అర్థం
చేయించడము జరుగుతుంది. ప్రదర్శనీలో లోపలకి వచ్చినప్పుడు మొట్టమొదట తండ్రి పరిచయాన్నే
ఇవ్వాలి. ఆత్మల తండ్రి ఒక్కరే అని అర్థం చేయించడము జరుగుతుంది. వారే గీతా భగవానుడు,
మిగిలినవారంతా ఆత్మలు. ఆత్మ శరీరాన్ని వదులుతుంది మరియు తీసుకుంటుంది. శరీరాల పేర్లే
మారతాయి. ఆత్మ పేరు మారదు. పిల్లలైన మీరు ఇలా అర్థం చేయించవచ్చు - అనంతమైన తండ్రి
ద్వారానే సుఖము యొక్క వారసత్వము లభిస్తుంది. తండ్రి సుఖము యొక్క సృష్టిని స్థాపన
చేస్తారు. తండ్రి దుఃఖము యొక్క సృష్టిని రచించడమనేది జరగదు. భారత్ లో
లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది కదా. చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ సుఖము యొక్క
వారసత్వము లభిస్తుందని చెప్పండి. ఒకవేళ వారు, ఇది మీ ఊహ అని అన్నారంటే ఇక వారిని
వదిలేయాలి. ఊహ అని భావించేవారు ఏమీ అర్థం చేసుకోరు. మీ సమయమైతే చాలా విలువైనది. ఈ
మొత్తము ప్రపంచములో మీ అంతటి విలువైన సమయము ఇంకెవ్వరికీ లేదు. గొప్ప-గొప్ప వ్యక్తుల
సమయము విలువైనదిగా ఉంటుంది. తండ్రి సమయము ఎంత విలువైనది. తండ్రి అర్థం చేయించి ఎలా
ఉన్నవారిని ఎలా తయారుచేస్తారు. కావున తండ్రి పిల్లలైన మీకు మాత్రమే చెప్తున్నారు -
మీరు మీ విలువైన సమయాన్ని పోగొట్టుకోకండి. జ్ఞానాన్ని పాత్రులకే ఇవ్వాలి. పాత్రులకే
అర్థం చేయించాలి, అందరు పిల్లలు అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకోగలిగేంత బుద్ధి లేదు.
మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఆత్మలమైన మన తండ్రి శివుడు అని అర్థం
చేసుకోనంతవరకు ఆ తర్వాత విషయాలేవీ అర్థం చేసుకోలేరు. చాలా ప్రేమగా, నమ్రతతో అర్థం
చేయించి పంపించాలి ఎందుకంటే ఆసురీ సాంప్రదాయులు కొట్లాడేందుకు వెనుకాడరు.
స్టూడెంట్లను గవర్నమెంట్ ఎంతగా మహిమ చేస్తుంది. వారి కోసం ఎన్ని ఏర్పాట్లు చేస్తుంది.
కాలేజీ స్టూడెంట్లే మొట్టమొదట రాళ్ళు వేయడము ప్రారంభిస్తారు. ఆవేశము ఉంటుంది కదా.
వృద్ధులు లేక మాతలు అయితే ఇంత గట్టిగా రాళ్ళను విసరలేరు. చాలావరకు స్టూడెంట్ల గొడవలే
జరుగుతుంటాయి. వారినే యుద్ధము కొరకు సిద్ధము చేస్తారు. ఇప్పుడు తండ్రి ఆత్మలకు అర్థం
చేయిస్తున్నారు - మీరు తలకిందులుగా అయిపోయారు. స్వయాన్ని ఆత్మకు బదులుగా శరీరముగా
భావిస్తారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని సరి చేస్తున్నారు. ఎంతగా రాత్రికి, పగలుకు
ఉన్నంత వ్యత్యాసము ఉంటుంది. సరిగ్గా అవ్వడముతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు.
మేము అర్ధకల్పము తలకిందులుగా ఉండేవారమని ఇప్పుడు మీరు అర్ధం చేసుకున్నారు. ఇప్పుడు
తండ్రి అర్ధకల్పము కోసం సరి చేస్తున్నారు. అల్లాకు పిల్లలుగా అయినట్లయితే విశ్వ
రాజ్యాధికారము యొక్క వారసత్వము లభిస్తుంది. రావణుడు తలకిందులుగా చేసేటప్పటికి ఆత్మ
మరియు శరీరము యొక్క శక్తులు మరియు విశేషతలు సమాప్తమైపోతాయి, ఇక పడిపోతూనే ఉంటారు.
రామ రాజ్యము మరియు రావణ రాజ్యము గురించి పిల్లలైన మీకు తెలుసు. మీరు తండ్రి స్మృతిలో
ఉండాలి. శరీర నిర్వహణార్థము కర్మలు కూడా చెయ్యాలి, అయినా కానీ సమయమైతే చాలా
లభిస్తుంది. జిజ్ఞాసువులు మొదలైనవారెవరూ లేకపోతే, ఏ పని లేకపోతే తండ్రి స్మృతిలో
కూర్చుండిపోవాలి. అదైతే అల్పకాలము కొరకు సంపాదన మరియు మీది సదాకాలము కొరకు సంపాదన,
దీని పట్ల ఎక్కువ అటెన్షన్ పెట్టవలసి ఉంటుంది. మాయ పదే-పదే ఆలోచనలను వేరే వైపుకు
తీసుకువెళ్తుంది. ఇదైతే తప్పకుండా జరుగుతుంది. మాయ మరపింపజేస్తూ ఉంటుంది. దీనిపై ఒక
నాటకము కూడా చూపిస్తారు - ప్రభువు ఇలా చెప్తారు, మాయ ఇలా చెప్తుంది అని. తండ్రి
పిల్లలకు అర్థం చేయిస్తుంటారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇందులోనే విఘ్నాలు
కలుగుతాయి. ఇంకే విషయములోనూ ఇన్ని విఘ్నాలు కలగవు. పవిత్రత విషయములో ఎన్ని దెబ్బలు
తింటారు. భాగవతము మొదలైనవాటిలో ఈ సమయము గురించిన గాయనమే ఉంది. పూతనలు, శూర్పణఖలు
కూడా ఉన్నారు, ఇవన్నీ తండ్రి వచ్చి పవిత్రముగా తయారుచేసే ఈ సమయములోని విషయాలే.
ఉత్సవాలు మొదలైనవి కూడా ఏవైతే జరుపుకుంటున్నారో, అవేమిటంటే, ఏదైతే గతించిపోయిందో,
దానిని మళ్ళీ పండుగ రూపములో జరుపుకుంటూ వస్తారు. గతాన్ని మహిమ చేస్తూ వస్తారు. రామ
రాజ్యము యొక్క మహిమను పాడుతారు ఎందుకంటే అది గతించిపోయింది. ఉదాహరణకు క్రైస్ట్
మొదలైనవారు వచ్చారు, ధర్మ స్థాపన చేసి వెళ్ళారు. ఆ తిథి తారీఖులు కూడా వ్రాస్తారు,
ఆ తర్వాత వారి జన్మదినాన్ని జరుపుతూ ఉంటారు. భక్తి మార్గములో కూడా ఈ పని అర్ధకల్పము
నడుస్తుంది. సత్యయుగములో ఇది ఉండదు. ఈ ప్రపంచమే సమాప్తమైపోనున్నది. ఈ విషయాలను అర్థం
చేసుకునేవారు మీలో కూడా చాలా కొద్దిమందే ఉన్నారు. తండ్రి అర్థం చేయించారు, ఆత్మలందరూ
అంతిమములో తిరిగి వెళ్ళాలి. ఆత్మలందరూ శరీరము వదిలి వెళ్ళిపోతారు. ఇంకా కొన్ని
రోజులే మిగిలి ఉన్నాయని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇదంతా వినాశనము
అవ్వనున్నది. సత్యయుగములోకి కేవలము మనము మాత్రమే వస్తాము. ఆత్మలందరూ అయితే రారు.
కల్పక్రితము ఎవరైతే వచ్చారో, వారే నంబరువారుగా వస్తారు. వారే బాగా చదువుకుంటున్నారు
మరియు చదివిస్తున్నారు కూడా. ఎవరైతే బాగా చదువుకుంటారో, వారే మళ్ళీ నంబరువారుగా
ట్రాన్స్ఫర్ అవుతారు. మీరు కూడా ట్రాన్స్ఫర్ అవుతారు. ఆత్మలందరూ నంబరువారుగా అక్కడ
శాంతిధామానికి వెళ్ళి కూర్చుంటారు, మళ్ళీ నంబరువారుగా వస్తూ ఉంటారు అని మీ బుద్ధికి
తెలుసు. అయినా తండ్రి అంటారు, తండ్రి పరిచయాన్ని ఇవ్వడమే ముఖ్యమైన విషయము. తండ్రి
పేరు సదా నోటిలో ఉండాలి. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ ఎవరు? ఇది ప్రపంచములో ఎవ్వరికీ
తెలియదు. భృకుటి మధ్యలో అద్భుతమైన నక్షత్రము మెరుస్తుంది... అని పాడుతారు కూడా. అంతే,
ఇంకేమీ తెలియదు. అయినా, ఈ జ్ఞానము కూడా చాలా కొద్దిమంది బుద్ధిలో మాత్రమే ఉంది.
ఘడియ, ఘడియ మర్చిపోతారు. మొట్టమొదట అర్థం చేయించాల్సింది ఏమిటంటే - తండ్రియే
పతిత-పావనుడు. వారు వారసత్వాన్ని కూడా ఇస్తారు, చక్రవర్తిగా తయారుచేస్తారు. మీ వద్ద
పాట కూడా ఉంది - చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది, ఈ దారి కోసమే భక్తి మార్గములో
ఎంతగానో వెతికేవారు. ద్వాపరము నుండి భక్తి మొదలవుతుంది, మళ్ళీ అంతిమములో తండ్రి
వచ్చి మార్గాన్ని తెలియజేస్తారు. వినాశన సమయమని కూడా దీనినే అంటారు. ఆసురీ బంధనాల
యొక్క లెక్కాచారాలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. 84 జన్మల పాత్ర
గురించి మీకు తెలుసు. ఈ పాత్ర నడుస్తూనే ఉంటుంది. శివజయంతిని జరుపుతున్నారంటే
తప్పకుండా శివుడు వచ్చి ఉంటారు. తప్పకుండా ఏదో చేసి ఉంటారు. వారే కొత్త ప్రపంచాన్ని
తయారుచేస్తారు. ఈ లక్ష్మీ-నారాయణులు యజమానులుగా ఉండేవారు, ఇప్పుడు అలా లేరు. మళ్ళీ
తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇంతకుముందు ఈ రాజయోగాన్ని నేర్పించారు అని మీ
నోటి నుండి తప్ప ఇంకెవ్వరి నోటి నుండి రాదు. శివబాబా మనకు రాజయోగాన్ని
నేర్పిస్తున్నారు అని మీరే అర్థం చేయించగలరు. శివోహమ్ అని ఏదైతే ఉచ్చరిస్తారో, అది
కూడా తప్పు. మీకు ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు - మీరే చక్రములో తిరిగి బ్రాహ్మణ
కులము నుండి దేవతా కులములోకి వస్తారు. హం సో, సో హం యొక్క అర్థాన్ని కూడా మీరు అర్థం
చేయించవచ్చు. ఇప్పుడు మనము బ్రాహ్మణులము, ఇది 84 జన్మల చక్రము. ఇదేమీ జపించే మంత్రము
కాదు. దీని అర్థము బుద్ధిలో ఉండాలి. అది కూడా క్షణము యొక్క విషయమే. ఏ విధముగా బీజము
మరియు వృక్షము గురించి మొత్తమంతా క్షణములో బుద్ధిలోకి వచ్చేస్తుందో, అదే విధముగా హం
సో రహస్యము కూడా క్షణములో వచ్చేస్తుంది. మనము ఈ విధముగా చక్రములో తిరుగుతాము, దీనిని
స్వదర్శన చక్రమని కూడా అంటారు. మేము స్వదర్శన చక్రధారులము అని మీరు ఎవరికైనా చెప్తే,
ఎవ్వరూ అంగీకరించరు. వీళ్ళందరూ తమకు తాము టైటిల్స్ పెట్టుకుంటారని అంటారు. అప్పుడు
మీరు, మనము 84 జన్మలను ఎలా తీసుకుంటాము అనేది అర్థం చేయిస్తారు. ఈ చక్రము
తిరుగుతుంది. ఆత్మకు తన 84 జన్మల దర్శనము జరుగుతుంది, దీనినే స్వదర్శన చక్రధారిగా
అవ్వటము అని అంటారు. ఇదంతా విని మొదట ఆశ్చర్యపోతారు, వీరు ప్రగల్భాలు పలుకుతున్నారని
అనుకుంటారు. ఎప్పుడైతే మీరు తండ్రి పరిచయాన్ని ఇస్తారో, అప్పుడు ఇక వారికది
ప్రగల్భముగా అనిపించదు. తండ్రిని స్మృతి చేస్తారు. బాబా, మీరు వస్తే మేము
బలిహారమైపోతాము, మిమ్మల్నే స్మృతి చేస్తాము అని పాడుతారు కూడా. తండ్రి అంటారు - మీరు
ఈ విధముగా అనేవారు కదా, ఇప్పుడు మళ్ళీ మీకు గుర్తు చేయిస్తున్నాను. నష్టోమోహులుగా
అవ్వండి. ఈ దేహము నుండి కూడా నష్టోమోహులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ
నన్నే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి. ఈ మధురమైన విషయము అందరికీ
ఇష్టమనిపిస్తుంది. తండ్రి పరిచయము లేకపోతే ఇక ఏదో ఒక విషయములో సంశయము కలుగుతూ
ఉంటుంది, అందుకే మొదటైతే తండ్రి పరిచయము ఉన్న 2-3 చిత్రాలు వారి ఎదురుగా ఉంచండి.
తండ్రి పరిచయము లభించడముతో వారసత్వము గురించి కూడా తెలుస్తుంది.
తండ్రి అంటారు - నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా చేస్తాను. డబల్ కిరీటధారులైన
రాజుల ఎదురుగా సింగిల్ కిరీటము కలవారు తల వంచి నమస్కరిస్తున్నట్లు ఈ చిత్రాన్ని
తయారుచెయ్యండి. తామే పూజ్యులు, తామే పూజారులు అన్న రహస్యము కూడా అర్థమవ్వాలి. మొదట
తండ్రిని పూజిస్తారు, ఆ తర్వాత కూర్చుని తమ చిత్రాలనే పూజిస్తారు. ఎవరైతే ఇంతకుముందు
పావనముగా ఉండి వెళ్ళారో, వారి చిత్రాలను తయారుచేసి కూర్చుని పూజిస్తారు. ఈ జ్ఞానము
కూడా మీకు ఇప్పుడు లభించింది. ఇంతకుముందైతే, భగవంతుడినే, మీరే పూజ్యులు, మీరే పూజారి
అని అనేవారు. కానీ మీరే ఈ చక్రములోకి వస్తారని ఇప్పుడు మీకు అర్థం చేయించడము
జరిగింది. బుద్ధిలో ఈ జ్ఞానము సదా ఉంటుంది, అంతేకాక దీనిని అర్థం చేయించాలి కూడా.
ధనము ఇచ్చినా ధనము తరగదు... ఎవరైతే ధనాన్ని దానము చెయ్యరో వారిని పిసినారులు అని
కూడా అంటారు. తండ్రి ఏదైతే అర్థం చేయించారో, అది మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి.
ఒకవేళ అర్థం చేయించకపోతే అనవసరముగా తమను తాము నష్టపరచుకుంటారు, గుణాలు కూడా ధారణ
అవ్వవు, నడవడికే అలా తయారైపోతుంది. ప్రతి ఒక్కరూ తమ గురించి తాము అయితే అర్థం
చేసుకోగలరు కదా. మీకు ఇప్పుడు వివేకము లభించింది. మిగిలినవారంతా వివేకము లేనివారు.
మీకు అన్నీ తెలుసు. తండ్రి అంటారు, ఇటువైపు ఉన్నది దైవీ సాంప్రదాయము వారు, అటువైపు
ఉన్నది ఆసురీ సాంప్రదాయము వారు. ఇప్పుడు మనము సంగమయుగములో ఉన్నామని బుద్ధి ద్వారా
మీరు తెలుసుకున్నారు. ఒకే ఇంటిలో ఒకరు సంగమయుగము వారు, ఒకరు కలియుగము వారు, ఇద్దరూ
కలిసి ఉంటారు. హంసగా అయ్యేందుకు యోగ్యముగా లేరని గమనించినప్పుడు ఇక యుక్తి రచించడం
జరుగుతుంది, లేదంటే విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. తమ సమానముగా తయారుచేసేందుకు
ప్రయత్నము చెయ్యాలి. లేకపోతే విసిగిస్తూ ఉంటారు. అప్పుడిక యుక్తిగా పక్కకు
తప్పుకోవలసి ఉంటుంది. విఘ్నాలైతే కలుగుతాయి. ఇటువంటి జ్ఞానాన్ని అయితే మీరే ఇస్తారు.
చాలా మధురముగా కూడా అవ్వాలి. నష్టోమోహులుగా కూడా అవ్వవలసి ఉంటుంది. ఒక వికారాన్ని
వదిలితే ఇక వేరే వికారాలు గొడవ చేస్తాయి. ఏది జరుగుతున్నా కానీ, అది కల్పక్రితము వలె
జరుగుతుందని అర్థం చేసుకోవడము జరుగుతుంది. ఇలా భావించి శాంతిగా ఉండవలసి ఉంటుంది.
దానిని నిశ్చితమైన విధి అని భావిస్తారు. అర్థం చేయించే మంచి-మంచి పిల్లలు కూడా
పడిపోతారు. చాలా గట్టిగా చెంపదెబ్బ తింటారు. కల్పక్రితము కూడా చెంపదెబ్బ తిని
ఉండవచ్చు అని అప్పుడు అంటారు. ప్రతి ఒక్కరూ తమ లోపల ఏం జరుగుతుందనేది అర్థం
చేసుకోగలరు. బాబా, మేము క్రోధములోకి వచ్చేసాము, ఫలానావారిని కొట్టాము, ఈ పొరపాటు
జరిగింది అని వ్రాస్తారు కూడా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎంత వీలైతే అంత
కంట్రోల్ చేసుకోండి. మనుష్యులు ఏ విధముగా ఉన్నారు. అబలలపై ఎన్ని అత్యాచారాలు
చేస్తారు. పురుషులు బలశాలిగా ఉంటారు, స్త్రీలు అబలలుగా ఉంటారు. తండ్రి మీకు ఈ
గుప్తమైన యుద్ధము నేర్పిస్తారు, దీనితో మీరు రావణుడిపై విజయము పొందుతారు. ఈ యుద్ధము
ఎవరి బుద్ధిలోనూ లేదు. మీలో కూడా ఇది అర్థం చేసుకోగలిగేవారు నంబరువారుగా ఉన్నారు.
ఇది పూర్తిగా కొత్త విషయము. ఇప్పుడు మీరు సుఖధామము కోసం చదువుకుంటున్నారు. ఇది కూడా
ఇప్పుడు గుర్తుంది, తర్వాత మర్చిపోతారు. ముఖ్యమైన విషయము స్మృతి యాత్ర. స్మృతి
ద్వారా మనము పావనముగా అవుతాము. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఏది జరిగినా కానీ, దానిని నిశ్చితమైన విధి అని భావించి శాంతిగా ఉండాలి.
క్రోధము చేయకూడదు. ఎంత వీలైతే అంత తమను తాము కంట్రోల్ చేసుకోవాలి. యుక్తులు రచించి
తమ సమానముగా తయారుచేసే ప్రయత్నము చెయ్యాలి.
2. చాలా ప్రేమగా మరియు నమ్రతతో అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. అందరికీ ఇదే
మధురాతి మధురమైన విషయాన్ని వినిపించండి - తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా
భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి, ఈ దేహము నుండి నష్టోమోహులుగా అవ్వండి.
వరదానము:-
ప్రతి ఆత్మను భ్రమించడము నుండి, బికారీతనము నుండి రక్షించే
నిష్కామ దయార్ద్ర హృదయ భవ
ఏ పిల్లలైతే నిష్కాములుగా, దయార్ద్ర హృదయులుగా ఉంటారో,
వారి దయతో కూడిన సంకల్పాల వలన ఇతర ఆత్మలకు తమ ఆత్మిక రూపము మరియు ఆత్మ యొక్క గమ్యము
క్షణములో స్మృతిలోకి వస్తుంది. వారి దయతో కూడిన సంకల్పాల వలన బికారులకు సర్వ ఖజానాల
ప్రకాశము కనిపిస్తుంది, భ్రమిస్తున్న ఆత్మలకు ముక్తి లేక జీవన్ముక్తి యొక్క తీరము
లేక గమ్యము ఎదురుగా కనిపిస్తుంది. వారు సర్వుల పట్ల దుఃఖహర్త, సుఖకర్తగా ఉండే
పాత్రను అభినయిస్తారు. దుఃఖితులను సుఖవంతులుగా చేసే యుక్తి లేక సాధనము వారి వద్ద
ఇంద్రజాలపు తాళంచెవిలా సదా ఉంటుంది.
స్లోగన్:-
సేవాధారిగా అయి నిస్వార్థ సేవ చేసినట్లయితే సేవకు ఫలము తప్పకుండా లభించవలసిందే.
అవ్యక్త సూచనలు -
అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి
అంతిమ సమయములో
ప్రకృతిలోని పంచ తత్వాలు బాగా కదిలించేందుకు ప్రయత్నము చేస్తాయి, కానీ విదేహీ అవస్థ
యొక్క అభ్యాసము ఉన్న ఆత్మ ఎంతగా చలించకుండా, స్థిరముగా, పాస్ విత్ ఆనర్ గా అవుతారంటే,
అన్ని విషయాలు దాటి వెళ్ళిపోతాయి కానీ వారు మాత్రము బ్రహ్మాబాబా సమానముగా పాస్ విత్
ఆనర్ గా అయిన ఋజువును చూపిస్తారు. దీని కొరకు సమయాన్ని కేటాయించి ప్రకృతిలోని పంచ
తత్వాలకు సేవ చేస్తూ, శుభ భావన యొక్క సకాష్ ను ఇస్తూ ఉండండి.
| | | |