25-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను కర్మేంద్రియజీత్ గా అయ్యానా, ఏ కర్మేంద్రియమూ నన్ను మోసం చేయడము లేదు కదా!’’

ప్రశ్న:-
కర్మాతీతులుగా అయ్యేందుకు పిల్లలైన మీరు మీతో మీరు ఏ ప్రతిజ్ఞను చేసుకోవాలి?

జవాబు:-
మీతో మీరు ఏమని ప్రతిజ్ఞ చేసుకోండి అంటే - ఏ కర్మేంద్రియము ఎప్పుడూ కూడా చంచలమవ్వకూడదు. నేను నా కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి. బాబా ఏ డైరెక్షన్లు అయితే ఇచ్చారో, వాటిని అమలులోకి తీసుకురావాల్సిందే. బాబా అంటారు - మధురమైన పిల్లలూ, కర్మాతీతులుగా అవ్వాలంటే ఏ కర్మేంద్రియముతోనూ వికర్మలు చేయకండి. మాయ చాలా శక్తివంతమైనది. కళ్ళు మోసం చేస్తాయి కావున స్వయాన్ని సంభాళించుకోండి.

ఓంశాంతి
పిల్లలూ, ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రతి విషయము గురించి స్వయాన్ని ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. బాబా యుక్తిని తెలియజేస్తున్నారు - నేను ఆత్మాభిమానిగా అయి కూర్చున్నానా, తండ్రిని స్మృతి చేస్తున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే ఇది మీ ఆత్మిక సైన్యము. ఆ సైన్యములోనైతే ఎప్పుడూ యువతే చేరుతారు. ఈ సైన్యములో 14-15 సంవత్సరాల యువత కూడా ఉన్నారు, 90 సంవత్సరాల వృద్ధులు కూడా ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇది మాయపై విజయము పొందేందుకు ఉన్న సైన్యము. ప్రతి ఒక్కరూ మాయపై విజయము పొంది బాబా నుండి అనంతమైన వారసత్వాన్ని పొందాలి ఎందుకంటే మాయ చాలా శక్తివంతమైనది. మాయ చాలా శక్తివంతమైనదని స్వయంగా పిల్లలకు కూడా తెలుసు. ప్రతి కర్మేంద్రియము చాలా మోసం చేస్తుంది. అన్నింటికన్నా ముందుగా, ఏ కర్మేంద్రియము ఎక్కువగా మోసం చేస్తుంది? కళ్ళే అన్నింటికన్నా ఎక్కువగా మోసం చేస్తాయి. తన పత్ని ఉన్నప్పటికీ, వేరే ఎవరైనా అందమైన స్త్రీని చూసినట్లయితే, వెంటనే ఆమె పట్ల ఆకర్షణ కలుగుతుంది. కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఆమెను ముట్టుకోవాలని మనసు కలుగుతుంది. బ్రహ్మాకుమార-కుమారీలమైన మనము సోదరీ-సోదరులమని సదా బుద్ధిలో భావించాలని పిల్లలకు అర్థం చేయించడము జరుగుతుంది. ఇందులో మాయ చాలా గుప్తంగా మోసం చేస్తుంది, అందుకే చార్టులో కూడా దీనిని వ్రాసుకోవాలి - రోజంతటిలో ఏయే కర్మేంద్రియాలు నన్ను మోసం చేసాయి. అన్నింటికన్నా పెద్ద శత్రువు ఈ కళ్ళు. కావున - ఫలానావారిని చూసాము, వారి వైపు మా దృష్టి వెళ్ళింది అని వ్రాసుకోవాలి. సూరదాసుని ఉదాహరణ కూడా ఉంది కదా, తన కళ్ళను తను తొలగించుకున్నారు. స్వయాన్ని చెక్ చేసుకున్నట్లయితే, కళ్ళు ఎక్కువ మోసం చేస్తాయి అన్నది తెలుస్తుంది. ఎవరైనా అందంగా ఉన్న స్త్రీని చూసినట్లయితే, తమ పత్నిని కూడా వదిలి ఆమెపై బలిహారమైపోతారు. ఎవరైనా పాడటములో చురుకుగా ఉంటే, బాగా అలంకరించుకుని ఉంటే, కళ్ళు వెంటనే చంచలమైపోతాయి, అందుకే బాబా అంటారు - ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి. సేవ కూడా చేస్తారు కానీ కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఈ శత్రువుపై పూర్తి చెకింగ్ ఉండాలి. లేదంటే మీరు మీ పదవిని భ్రష్టం చేసుకుంటారని అర్థం చేసుకోండి. తెలివైన పిల్లలు ఎవరైతే ఉంటారో, వారు తమ వద్ద డైరీలో నోట్ చేసుకోవాలి - నేను ఫలానావారిని చూసాను, అప్పుడు నా దృష్టి వెళ్ళింది అని. అప్పుడు మీకు మీరే శిక్ష విధించుకోండి. భక్తి మార్గములో కూడా పూజ చేసే సమయములో బుద్ధి వేరే వైపులకు పరిగెడితే, తమను తాము గిల్లుకుంటారు. కావున అటువంటి స్త్రీ ఎవరైనా ఎదురుగా వచ్చినప్పుడు, అక్కడ నుండి పక్కకు వెళ్ళిపోవాలి. అంతేకానీ అక్కడ నిలబడి చూస్తూ ఉండిపోకూడదు. కళ్ళు చాలా మోసం చేస్తాయి, అందుకే సన్యాసులు కళ్ళు మూసుకుని కూర్చుంటారు. స్త్రీలను వెనుక కూర్చోబెడతారు, పురుషులను ముందు కూర్చోబెడతారు. కొంతమంది ఎలా ఉంటారంటే, స్త్రీలను అసలు చూడరు.

పిల్లలైన మీరైతే చాలా కృషి చేయాలి. విశ్వ రాజ్య భాగ్యాన్ని తీసుకోవడమనేది చిన్న విషయమేమీ కాదు. వాళ్ళు మహా అయితే 10, 12, 20 వేలు, 1-2 లక్షలు లేదా కోట్లు జమ చేసుకుంటారు, కానీ తర్వాత అంతా సమాప్తమైపోతుంది. పిల్లలైన మీకైతే అవినాశీ వారసత్వము లభిస్తుంది. మీకు అన్నీ ప్రాప్తిస్తాయి. అక్కడ, ఏదైనా పొందడం కోసం కష్టపడాల్సి వస్తుంది అనేటువంటి వస్తువులేవీ ఉండవు. కలియుగ అంతిమానికి మరియు సత్యయుగ ఆదికి రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇక్కడైతే అసలేమీ లేదు.

ఇప్పుడు ఇది మీ పురుషోత్తమ సంగమయుగము. పురుషోత్తమ అనే పదాన్ని తప్పకుండా వ్రాయాలి. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి భగవంతునికి ఎంతో సమయము పట్టదు. మీరు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. మనుష్యులైతే పూర్తిగా ఘోర అంధకారములో ఉన్నారు. స్వర్గాన్ని చూడలేనివారు చాలామంది ఉంటారు. తండ్రి అంటారు - పిల్లలూ, మీ ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేటటువంటిది. మనుష్యులకు ఏమీ తెలియదు. హెవెన్ అంటే ఏమిటి అనేది భారతవాసులు కూడా మర్చిపోయారు. ఒకప్పుడు హెవెన్ ఉండేదని క్రిస్టియన్లు కూడా స్వయం అంటారు. ఈ లక్ష్మీ-నారాయణులను గాడ్-గాడెస్ అని అంటారు కదా. కావున తప్పకుండా గాడ్ యే అలా తయారుచేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - చాలా కృషి చేయాలి. నన్ను ఏ కర్మేంద్రియము మోసం చేసింది అని ప్రతిరోజు తమ లెక్కాపత్రాన్ని చూసుకోండి. నోరు కూడా చాలా మోసం చేస్తుంది. ఇంతకుముందు కచేరి జరిగేది, అప్పుడు అందరూ తమ తప్పులను చెప్పేవారు. నేను ఫలానా వస్తువును దాచిపెట్టుకుని తిన్నాను అని చెప్పేవారు. ఫలానా విధముగా మాయ దాడి చేసిందని, మంచి-మంచి గొప్ప ఇంటి పిల్లలు చెప్పేసేవారు. దాచిపెట్టుకుని తినడము కూడా దొంగతనమే. అది కూడా శివబాబా యజ్ఞము నుండి దొంగతనము చేయడమంటే - అది చాలా తప్పు. ఒక్క పైసా దొంగతనము చేసినా లక్ష రూపాయలు దొంగతనము చేసినా దొంగతనము దొంగతనమే. మాయ పూర్తిగా ముక్కు పట్టుకుంటుంది. ఈ అలవాటు చాలా చెడ్డది. చెడ్డ అలవాటుంటే, మనము ఏమవుతాము! స్వర్గానికి వెళ్ళడమనేది పెద్ద విషయమేమీ కాదు, కానీ అందులో మళ్ళీ పదవులు కూడా ఉంటాయి కదా. రాజు ఎక్కడ, ప్రజలు ఎక్కడ. ఎంత తేడా ఉంటుంది. కర్మేంద్రియాలు కూడా చాలా మోసం చేస్తాయి. వాటిని సంభాళించాలి. ఉన్నత పదవిని పొందాలంటే, తండ్రి డైరెక్షన్లపై పూర్తిగా నడుచుకోవాలి. తండ్రి డైరెక్షన్లు ఇస్తారు, మాయ మళ్ళీ మధ్యలోకి వచ్చి విఘ్నాలను కలిగిస్తుంది. తండ్రి అంటారు - మర్చిపోకండి, లేదంటే అంతిమములో చాలా పశ్చాత్తాపపడతారు. ఫెయిల్ అయినట్లు సాక్షాత్కారము కూడా జరుగుతుంది. మేము నరుని నుండి నారాయణునిగా అవుతామని ఇప్పుడు మీరు అంటారు. కానీ స్వయాన్ని ప్రశ్నించుకోండి, మీ లెక్కాపత్రాన్ని నోట్ చేసుకోండి. కష్టం మీద అర్థం చేసుకుని అమలులోకి తీసుకువచ్చేవారు చాలా తక్కువమంది ఉంటారు. కానీ బాబా అంటారు - దీని ద్వారా మీ ఉన్నతి చాలా జరుగుతుంది. రోజంతటి లెక్కాపత్రాన్ని వ్రాయాలి. ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఎవరినైనా చూసినప్పుడు - ఈమె చాలా బాగున్నారు అన్న ఆలోచన వస్తుంది, ఆ తర్వాత ఆమెతో మాట్లాడుతారు. ఈమెకు ఏదైనా కానుక ఇవ్వాలి, ఇది తినిపించాలి అని మనసు కలుగుతుంది, ఆ ఆలోచనలే నడుస్తూ ఉంటాయి. ఇందులో చాలా ఎక్కువ శ్రమ ఉందని పిల్లలు భావిస్తారు. కర్మేంద్రియాలు చాలా మోసం చేస్తాయి. ఇది రావణ రాజ్యము కదా. తండ్రి అంటారు - అక్కడ చింతించే విషయమేమీ ఉండదు, ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు. చింతించే విషయమే ఉండదు. అక్కడ కూడా చింత ఉంటే, ఇక నరకానికి మరియు స్వర్గానికి తేడా ఏమి ఉన్నట్లు?

పిల్లలైన మీరు చాలా-చాలా ఉన్నత పదవిని పొందేందుకు భగవంతుని ద్వారా చదువుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మాయ నిందించేలా చేస్తుంది. మీరు నాకు అపకారము చేశారు, నేను మీకు ఉపకారము చేస్తాను. పిల్లలూ, ఒకవేళ మీరు చెడు దృష్టి పెట్టుకున్నట్లయితే మిమ్మల్ని మీరే నష్టపరచుకుంటారు. ఇది చాలా పెద్ద గమ్యము, అందుకే బాబా అంటారు, మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి - ఏ వికర్మ చేయలేదు కదా? ఎవరినీ మోసం చేయలేదు కదా? ఇప్పుడు వికర్మాజీతులుగా అవ్వాలి. వికర్మాజీతుని కాలము గురించి పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. తండ్రి అర్థం చేయించారు - వికర్మాజీతులుగా అయి 5 వేల సంవత్సరాలైంది, మళ్ళీ వికర్మలు చేసినట్లయితే వామ మార్గములోకి వెళ్తారు. కర్మ-అకర్మ-వికర్మ అనే పదాలు ఉన్నాయి కదా. మాయా రాజ్యములో మనుష్యులు ఏ కర్మ చేసినా, అది వికర్మగానే అవుతుంది. సత్యయుగములో వికారాలు ఉండవు కావున వికర్మలు కూడా అవ్వవు. ఇది కూడా మీకు తెలుసు, ఎందుకంటే మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది. మీరు త్రినేత్రులుగా అయ్యారు. త్రికాలదర్శులుగా, త్రినేత్రులుగా తయారుచేసేవారు తండ్రి. మీరు ఆస్తికులుగా అయ్యారు, అప్పుడు త్రికాలదర్శులుగా అయ్యారు. మొత్తం డ్రామా రహస్యమంతా బుద్ధిలో ఉంది. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము, 84 జన్మల చక్రము, ఆ తర్వాత ఇతర ధర్మాలు వృద్ధి చెందుతాయి. ఇతర ధర్మ స్థాపకులెవరూ సద్గతిని ఇవ్వలేరు, వారిని గురువు అని కూడా అనలేరు. సర్వులకు సద్గతిని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు అందరి సద్గతి జరగనున్నది. వారు ధర్మ స్థాపకులుగా పిలువబడతారు, గురువులుగా కాదు. ధర్మ స్థాపకులు ధర్మ స్థాపన చేయడానికి నిమిత్తులు అయ్యారు. ఇకపోతే వారు సద్గతిని ఇవ్వరు. వారిని స్మృతి చేయడముతో సద్గతి ఏమీ లభించదు, వికర్మలు వినాశనమవ్వవు. అదంతా భక్తి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మాయ చాలా శక్తివంతమైనది, దానితోనే యుద్ధము జరుగుతుంది. మీరు శివ శక్తి పాండవ సైన్యము. మీరంతా పండాలు (మార్గదర్శకులు). శాంతిధామము, సుఖధామము యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. మీరు గైడ్స్ (మార్గదర్శకులు). మీరు ఏమని చెప్తారంటే - తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, ఇంకొకవైపు ఒకవేళ ఏవైనా పాప కర్మలు చేసినట్లయితే వంద రెట్లు పాపం అంటుకుంటుంది. ఎంత వీలైతే అంత ఏ వికర్మలు చేయకూడదు. కర్మేంద్రియాలు చాలా మోసం చేస్తాయి. తండ్రి ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా అర్థం చేసుకుంటారు. పిల్లలకు మాయా తుఫానులు వస్తాయి. స్త్రీ-పురుషులు అని భావించడం వలనే తుఫానులు వస్తాయి. కావున ఈ కళ్ళపై ఎంత కంట్రోల్ పెట్టుకోవాలి? మనమైతే శివబాబా పిల్లలము. తండ్రికి ప్రతిజ్ఞ చేసి రాఖీని కూడా కట్టించుకుంటారు, అయినా సరే మాయ మోసం చేసేస్తుంది, అప్పుడిక విడిపించుకోలేకపోతారు. కర్మేంద్రియాలు ఎప్పుడైతే వశమవుతాయో, అప్పుడు కర్మాతీత అవస్థ ఏర్పడగలదు. మేము లక్ష్మీ-నారాయణులుగా అవుతామని చెప్పడము సహజమే కానీ వివేకము కూడా కావాలి కదా. తండ్రి అంటారు - డైరెక్షన్లను అమలుపరచండి, బాబా-బాబా అని అంటూ ఉండండి. బాబా నుండి మనము పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము. ఇలాంటి టీచరు ఎప్పుడూ, ఎక్కడా లభించరు. ఈ విషయాలన్నీ దేవతలకే తెలియకపోతే, ఇక తర్వాత వచ్చే ధర్మాల వారికి ఎలా తెలుస్తుంది. బాబా అంటారు - వీరు ఏదైనా చెప్పినా, ఇది శివబాబా చెప్తున్నారని అనుకోండి, ఈ దాదా చెప్తున్నారని అనుకోకండి. వీరు నా రథము, వీరేమి చేస్తారు, పిల్లలైన మీకు రాజ్యాన్ని నేను ఇస్తాను. ఈ రథము ఇవ్వరు కదా. వీరు పూర్తి బికారి వంటివారు. వీరు కూడా బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. ఎలాగైతే మీరు పురుషార్థము చేస్తారో, అలాగే వీరు కూడా పురుషార్థము చేస్తారు. వీరు కూడా స్టూడెంట్ లైఫ్ లో ఉన్నారు. ఈ రథాన్ని అప్పుగా తీసుకోవడము జరిగింది, ఇది తమోప్రధానముగా ఉంది. మీరు పూజ్య దేవతలుగా అయ్యేందుకు, మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. ఎవరి భాగ్యములోనైనా లేకపోతే - శివబాబా ఎలా వచ్చి చదివిస్తారు, నాకు సంశయముంది, నాకైతే అర్థం కావడము లేదు అని అంటారు. తండ్రి స్మృతి లేకుండా వికర్మలు వినాశనమవ్వవు. శిక్షలను పూర్తిగా అనుభవించవలసి ఉంటుంది. ఇక్కడ రాజ్యము స్థాపనవుతోంది. రాజులకు ఎంతమంది దాసీలు ఉంటారు. బాబా అయితే రాజుల సంపర్కములోకి వచ్చినవారు. దాసీలను కట్నముగా ఇస్తారు. ఇక్కడే ఇంతమంది దాసీలుంటే, ఇక సత్యయుగములో ఎంతమంది ఉంటారు. ఇక్కడ కూడా రాజధాని స్థాపనవుతోంది.

పిల్లలు ఏమేమి చేస్తున్నారు అనేది బాబాకు తెలుసు. ఈ సమయములో మరణిస్తే, ఏమవుతారు అనేది ప్రతి ఒక్కరి లెక్కాపత్రము ద్వారా బాబా చెప్పగలరు. కర్మాతీత అవస్థను చివరిలో అందరూ నంబరువారుగా పొందుతారు. ఇది సంపాదన. సంపాదనలో మనుష్యులు ఎంత బిజీగా ఉంటారు, భోజనము చేస్తున్నా సరే టెలిఫోన్ చెవి దగ్గర ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు జ్ఞానాన్ని తీసుకోలేరు. ఇక్కడకు పేదవారు, సాధారణమైనవారే వస్తారు. షావుకార్లు అయితే మాకు తీరిక ఎక్కడ ఉంది అని అంటారు. అరే, కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి. బాబా మధురాతి-మధురమైన పిల్లలకు పదే-పదే అర్థం చేయిస్తారు. శివబాబా వచ్చి ఉన్నారని మాకేమి తెలుసు - అని ఎవరూ అనని విధముగా ప్రతి ఒక్కరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలి. కేవలం రోజంతా బాబా-బాబా అనే అంటూ ఉండండి. చాలామంది కుమార్తెలు చాలా స్మృతి చేస్తారు. శివబాబా అని అనగానే కొంతమంది పిల్లలకు ప్రేమ అశ్రువులు వచ్చేస్తాయి. మేము ఎప్పుడు వెళ్ళి వారిని కలుసుకుంటాము అని వారికి అనిపిస్తూ ఉంటుంది. చూడకపోయినా సరే వారు తపిస్తూ ఉంటారు కానీ చూసినవారేమో నమ్మరు. వారు దూరంలో కూర్చుని కన్నీరు కారుస్తూ ఉంటారు. విచిత్రము కదా. బ్రహ్మా యొక్క సాక్షాత్కారము కూడా అనేకమందికి కలుగుతుంది. మున్ముందు చాలామందికి సాక్షాత్కారాలు జరుగుతాయి. మనుష్యులు మరణించే సమయములో అందరూ వచ్చి వారికి భగవంతుడిని స్మృతి చేయమని చెప్తారు. మీరు కూడా శివబాబాను స్మృతి చేయండి. తండ్రి అంటారు - పిల్లలూ, పురుషార్థములో లోటును భర్తీ చేసుకుంటూ ఉండండి. అవకాశము లభిస్తే లోటును భర్తీ చేసుకోండి. ఇది ఎంత గొప్ప సంపాదన. కొంతమందికి ఎంత అర్థం చేయించినా సరే బుద్ధిలో కూర్చోదు. బాబా అంటారు, అలా అవ్వకూడదు. మీ కళ్యాణము చేసుకోండి. తండ్రి శ్రీమతముపై నడవండి. మిమ్మల్ని తండ్రి పురుషులలో ఉత్తములుగా తయారుచేస్తారు. ఇది మీ లక్ష్యము-ఉద్దేశ్యము. బాబా సేవ కోసం ఎన్ని యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. వీరు నిజమే చెప్తున్నారని అందరూ అర్థం చేసుకునేలా అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. ఈ యుద్ధముతోనే ముఖ్యముగా భారత్ లో మరియు మొత్తం విశ్వములో సుఖ-శాంతులు ఏర్పడతాయి. ఇలాంటి కరపత్రాలను అన్ని భాషలలోనూ ముద్రించవలసి ఉంటుంది. భారత్ ఎంత పెద్దది. ప్రతి ఒక్కరికీ తెలియాలి, మాకు తెలియనే తెలియలేదు అని ఎవ్వరూ అనకూడదు. మీరు అంటారు - అరే, విమానాల నుండి కరపత్రాలను వేశాము, వార్తాపత్రికలలో వేశాము, మీరు మేల్కోలేదే. ఇది కూడా చూపించడము జరిగింది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయంలో ఏవైతే చెడు అలవాట్లు ఉన్నాయో - వాటిని చెక్ చేసుకుని తొలగించుకునేందుకు కృషి చేయాలి. మీ సత్యాతి-సత్యమైన లెక్కాపత్రాన్ని పెట్టుకోవాలి. తండ్రి డైరెక్షన్లపై నడవాలి.

2. తండ్రి పేరు అప్రతిష్ఠపాలు అయ్యే విధమైన కర్మలేవీ చేయకూడదు. మీ ఉన్నతి పట్ల శ్రద్ధ వహించాలి. కొద్దిగా కూడా చెడు దృష్టిని పెట్టుకోకూడదు.

వరదానము:-
స్థూలముగా మరియు సూక్ష్మముగా ప్రతి ఆజ్ఞను పాటించే సంపూర్ణ ఆజ్ఞాకారీ భవ

ఎవరైతే సూక్ష్మ ఆజ్ఞలను పాటిస్తారో, ఆ పిల్లలకే స్థూల ఆజ్ఞలను పాటించే శక్తి వస్తుంది. సూక్ష్మమైన మరియు ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే - నిరంతరం స్మృతిలో ఉండండి మరియు మనసా-వాచా-కర్మణా పవిత్రముగా అవ్వండి. సంకల్పములో కూడా అపవిత్రత లేక అశుద్ధత ఉండకూడదు. ఒకవేళ సంకల్పములోనైనా పాత అశుద్ధ సంస్కారాలు టచ్ చేసినట్లయితే సంపూర్ణ వైష్ణవులు లేక సంపూర్ణ పవిత్రులు అని అనరు. అందుకే ఒక్క సంకల్పము కూడా ఆజ్ఞకు విరుద్ధముగా నడవకూడదు, అప్పుడు సంపూర్ణ ఆజ్ఞాకారులు అని అంటారు.

స్లోగన్:-
తండ్రిని తెలుసుకుని హృదయపూర్వకముగా బాబా అని అనడము - ఇది అన్నింటికంటే పెద్ద విశేషత.

అవ్యక్త ప్రేరణలు - ‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చేయండి’’

ఏకరస స్థితిని తయారుచేసుకునేందుకు కర్మయోగులుగా అవ్వండి, కర్మయోగి ఎదురుగా ఎవరు, ఎలా వచ్చినా కానీ వారు స్వయం సదా అతీతముగా మరియు ప్రియముగా ఉంటారు. వీరిది ఈ పాత్ర నడుస్తూ ఉంది అని జ్ఞానము ద్వారా తెలుసుకుంటారు, వారు మంచిని మంచిగా భావిస్తూ సాక్షీగా అయ్యి చూస్తారు మరియు చెడును దయార్ద్ర హృదయులుగా అయ్యి దయా దృష్టి ద్వారా పరివర్తన చేసే శుభ భావనతో సాక్షీగా అయ్యి చూస్తారు, ఇదే ఏకరసముగా అయ్యేందుకు సాధనము.