25-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - సదా ఒకే చింతలో ఉండండి, మేము బాగా
చదువుకుని స్వయానికి రాజ్యతిలకాన్ని దిద్దుకోవాలి అని, చదువు ద్వారానే రాజ్యము
లభిస్తుంది’’
ప్రశ్న:-
పిల్లలు
ఏ ఉల్లాసములో ఉండాలి? నిరుత్సాహులుగా అవ్వకూడదు, ఎందుకు?
జవాబు:-
మేము ఈ
లక్ష్మీ-నారాయణుల వలె అవ్వాలి అని సదా ఇదే ఉల్లాసము ఉండాలి, దీని కొరకు పురుషార్థము
చేయాలి. నిరుత్సాహులుగా ఎప్పుడూ అవ్వకూడదు, ఎందుకంటే ఈ చదువు చాలా సహజమైనది. ఇంట్లో
ఉంటూ కూడా చదువుకోవచ్చు. దీనికి ఎటువంటి ఫీజు లేదు, కానీ ధైర్యము తప్పకుండా కావాలి.
పాట:-
నీవే తల్లివి,
తండ్రివి నీవే...
ఓంశాంతి
పిల్లలు తమ తండ్రి మహిమను విన్నారు. మహిమ ఒక్కరిదే, ఇంకెవరి మహిమను గానం చేయలేరు.
బ్రహ్మా, విష్ణు, శంకరులకు కూడా ఎటువంటి మహిమా లేదు. బ్రహ్మా ద్వారా స్థాపన
చేయిస్తారు, శంకరుని ద్వారా వినాశనము చేయిస్తారు, విష్ణువు ద్వారా పాలన చేయిస్తారు.
లక్ష్మీ-నారాయణులను ఇటువంటి యోగ్యులుగా కూడా శివబాబాయే తయారుచేస్తారు. కావున
శివబాబాకే మహిమ ఉంది, వారి మహిమను కాకుండా ఇంకెవరి మహిమను గానం చేయాలి. వీరిని ఈ
విధంగా తయారుచేసే టీచరే లేకపోతే వీరు కూడా ఇలా తయారవ్వలేరు. ఆ తర్వాత మహిమ ఉన్నది
సూర్యవంశము వారికి, వారు రాజ్యము చేస్తారు. తండ్రి సంగమములో రాకపోతే వారికి రాజ్యము
కూడా లభించదు. ఇంకెవరి మహిమా లేదు. విదేశీయులు మొదలైనవారినెవరినీ మహిమ చేయవలసిన
అవసరము లేదు. మహిమ ఉన్నది కేవలం ఒక్కరికే, వేరెవరికీ లేదు. ఉన్నతోన్నతుడు శివబాబాయే.
వారి ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది కావున వారిని బాగా స్మృతి చేయాలి కదా.
స్వయాన్ని రాజులుగా తయారుచేసుకునేందుకు స్వయమే చదువుకోవాలి. ఉదాహరణకు బ్యారిస్టరీ
చదువుకునేవారు స్వయాన్ని ఆ చదువు ద్వారా బ్యారిస్టర్లుగా తయారుచేసుకుంటారు కదా.
శివబాబా మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఎవరైతే బాగా చదువుకుంటారో
వారే ఉన్నత పదవిని పొందుతారు. చదువుకోనివారు పదవిని పొందలేరు. చదువుకోవడం కోసం
శ్రీమతము లభిస్తుంది. ముఖ్యమైన విషయము పావనముగా అవ్వడమే, దాని కోసమే ఈ చదువు ఉంది.
ఈ సమయములో అందరూ తమోప్రధానముగా, పతితముగా ఉన్నారని మీకు తెలుసు. మంచి లేక చెడు
మనుష్యులైతే ఉండనే ఉంటారు. పవిత్రముగా ఉండేవారిని మంచివారు అని అంటారు. బాగా
చదువుకుని గొప్ప వ్యక్తులుగా అయితే వారి మహిమ జరుగుతుంది. కానీ వాస్తవానికి అందరూ
పతితులే. పతితులే పతితుల మహిమను చేస్తారు. సత్యయుగములో పావనులు అంటారు. అక్కడ ఎవ్వరూ
ఎవ్వరి మహిమనూ చేయరు. ఇక్కడ పవిత్ర సన్యాసులు కూడా ఉన్నారు, అలాగే అపవిత్ర గృహస్థులు
కూడా ఉన్నారు. పవిత్రుల మహిమ గానం చేయబడుతుంది. అక్కడైతే యథా రాజా రాణి తథా ప్రజ
ఉంటారు. ఇంకే ధర్మములోనూ ఇలా పవిత్రులు, అపవిత్రులు అని అనలేరు. ఇక్కడైతే కొందరు
గృహస్థుల మహిమను కూడా గానం చేస్తూ ఉంటారు. వాళ్ళనే ఖుదా, అల్లా వంటివారిగా
భావిస్తారు. కానీ అల్లాను పతిత-పావనుడు, ముక్తిప్రదాత, మార్గదర్శకుడు అని అంటారు,
మరి అటువంటప్పుడు అందరూ అల్లాగా ఎలా అవ్వగలరు? ప్రపంచములో ఎంతటి ఘోర అంధకారము ఉంది.
ఇప్పుడు పిల్లలైన మీకు అర్థమయ్యింది కావున - మేము చదువుకుని స్వయాన్ని రాజుగా
తయారుచేసుకోవాలి అన్న తపనతో కూడిన చింత మీకు ఉండాలి. ఎవరైతే బాగా పురుషార్థము
చేస్తారో వారే రాజ్యతిలకాన్ని పొందుతారు. మేము కూడా ఈ లక్ష్మీ-నారాయణుల వలె అవ్వాలి
అన్న ఉల్లాసములో పిల్లలు ఉండాలి. ఇందులో తికమకపడే అవసరమేమీ లేదు. పురుషార్థము చేయాలి.
నిరుత్సాహులుగా అవ్వకూడదు. ఈ చదువు ఎటువంటిదంటే దీనిని మంచముపై చారబడి కూడా
చదువుకోవచ్చు, విదేశాలలో ఉంటూ కూడా చదువుకోవచ్చు, ఇంట్లో ఉంటూ కూడా చదువుకోవచ్చు.
ఇది అంతటి సహజమైన చదువు. కష్టపడి మీ పాపాలను అంతము చేసుకోవాలి మరియు ఇతరులకు కూడా
అర్థం చేయించాలి. ఇతర ధర్మాలవారికి కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఎవరికైనా సరే -
నీవు ఒక ఆత్మవు అని తెలియజేయాలి. ఆత్మ స్వధర్మము ఒక్కటే, ఇందులో ఎటువంటి మార్పు
జరగదు. శరీరము పరంగా చూస్తేనే అనేక ధర్మాలు ఉంటాయి. ఆత్మ అయితే ఒక్కటే. అందరూ ఒక్క
తండ్రి పిల్లలే. ఆత్మలను బాబా దత్తత తీసుకున్నారు, అందుకే బ్రహ్మాముఖ వంశావళిగా
మహిమ చేయబడతారు.
ఆత్మకు తండ్రి ఎవరు అన్నది ఎవరికైనా అర్థం చేయించవచ్చు. మీరు ఏ ఫారంలనైతే
నింపిస్తూ ఉంటారో, అందులో చాలా అర్థముంది. తండ్రి అయితే తప్పకుండా ఉన్నారు కదా.
వారిని స్మృతి చేస్తారు కూడా. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. ఈ రోజుల్లోనైతే
భారత్ లో ఎవరినైనా ఫాదర్ అనేస్తున్నారు. మేయర్ ను కూడా ఫాదర్ అనేస్తారు. కానీ ఆత్మకు
తండ్రి ఎవరు అన్నది తెలుసుకోరు. నీవే తల్లివి, తండ్రివి... అని గానం కూడా చేస్తారు
కానీ వారు ఎవరో, ఎలా ఉంటారో, ఏమీ తెలియదు. భారత్ లోనే - నీవే తల్లివి, తండ్రివి అని
పిలుస్తారు. తండ్రియే ఇక్కడకు వచ్చి ముఖవంశావళిని రచిస్తారు. భారత్ నే మాతృదేశము అని
అంటారు, ఎందుకంటే ఇక్కడే శివబాబా మాత-పితల రూపములో పాత్రను అభినయిస్తారు. ఇక్కడే
భగవంతుడిని మాత-పితల రూపములో స్మృతి చేస్తారు. విదేశాలలో కేవలం గాడ్ ఫాదర్ అని
పిలుస్తారు, కానీ పిల్లలను దత్తత తీసుకునేందుకు మాత కూడా తప్పకుండా కావాలి కదా.
పురుషుడు కూడా స్త్రీని దత్తత తీసుకుంటారు, ఆ తర్వాత ఆమె ద్వారా పిల్లలు జన్మిస్తారు.
రచనను రచించడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇతనిలోకి పరమపిత పరమాత్మ అయిన తండ్రి
ప్రవేశించి దత్తత తీసుకుంటారు. పిల్లలు జన్మిస్తారు. అందుకే వీరిని మాత-పిత అని
అంటారు. వారు ఆత్మల తండ్రి, మళ్ళీ ఇక్కడకు వచ్చి ఉత్పత్తిని చేస్తారు. ఇక్కడ మీరు
పిల్లలుగా అవుతారు, కావున ఫాదర్ మరియు మదర్ అని అంటారు. అది మధురమైన ఇల్లు, అక్కడ
ఆత్మలందరూ ఉంటారు. అక్కడికి కూడా తండ్రి తప్ప ఇంకెవ్వరూ తీసుకువెళ్ళలేరు. ఎవరైనా
కలిస్తే - మీరు మధురమైన ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారా? అని అడగండి. మరి అలాగైతే
పావనముగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది అని చెప్పండి. ఇప్పుడు మీరు పతితులుగా ఉన్నారు.
ఇది ఇనుపయుగ తమోప్రధాన ప్రపంచముగా ఉంది. ఇప్పుడు మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి.
ఇనుపయుగ ఆత్మలైతే తిరిగి ఇంటికి వెళ్ళలేవు. ఆత్మలు మధురమైన ఇంట్లో పవిత్రముగానే
ఉంటాయి. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు
వినాశనమవుతాయి. ఏ దేహధారినీ స్మృతి చేయకండి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా
పావనముగా అవుతారు, అంతేకాక నంబరువారుగా ఉన్నత పదవిని పొందుతారు. లక్ష్మీ-నారాయణుల
చిత్రముపై ఎవరికైనా అర్థం చేయించడం సహజము. భారత్ లో వీరి రాజ్యము ఉండేది. వీరు
రాజ్యము చేసేటప్పుడు విశ్వములో శాంతి ఉండేది. విశ్వములో శాంతిని తండ్రియే
స్థాపించగలరు, ఇంకెవ్వరికీ అంత శక్తి లేదు. ఇప్పుడు తండ్రి మనకు కొత్త ప్రపంచము
కొరకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. రాజులకే రాజులుగా ఎలా అవ్వవచ్చు అన్నది
తెలియజేస్తున్నారు. తండ్రియే జ్ఞానసాగరుడు. కానీ వారిలో ఏ జ్ఞానము ఉంది, ఇది
ఎవ్వరికీ తెలియదు. సృష్టి ఆదిమధ్యాంతాల చరిత్ర-భౌగోళికములను గురించి అనంతమైన
తండ్రియే వినిపిస్తారు. మనుష్యులైతే వారిని ఒక్కోసారి సర్వవ్యాపి అని అంటారు లేక
అందరి లోపల ఏముందో అది వారికి తెలుసు అని అంటారు. మరి అలా చూసుకుంటే స్వయాన్ని
భగవంతునిగా పిలుచుకోలేరు. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు.
వీటిని బాగా ధారణ చేసి హర్షితముగా ఉండాలి. ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని సదా
హర్షితముఖము కనిపించే విధంగానే తయారుచేస్తారు. స్కూల్లో ఉన్నత హోదా కొరకు చదివేవారు
ఎంత హర్షితముగా ఉంటారు. వీరు చాలా పెద్ద పరీక్షను పాస్ అవుతారు అని ఇతరులు కూడా
భావిస్తారు. ఇది చాలా ఉన్నతమైన చదువు. ఇందులో ఫీజు మొదలైనవాటి విషయమేదీ లేదు, కేవలం
ధైర్యము కావాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి, అందులోనే మాయ
విఘ్నాలను కలిగిస్తుంది. తండ్రి అంటారు, పవిత్రముగా అవ్వండి. తండ్రితో ప్రతిజ్ఞ చేసి
మళ్ళీ నల్ల ముఖము చేసేసుకుంటారు. ఇది చాలా శక్తివంతమైన మాయ. ఫెయిల్ అయిపోతే ఇక వారి
పేర్లు మహిమ చేయబడలేవు. ఫలానా, ఫలానా వారు ప్రారంభము నుండి మొదలుకుని చాలా బాగా
నడుస్తున్నారు అని మహిమ గానం చేయబడుతుంది. తండ్రి అంటారు, మీ కొరకు మీరే పురుషార్థము
చేసి రాజధానిని ప్రాప్తి చేసుకోవాలి. చదువు ద్వారా ఉన్నత పదవిని పొందాలి. ఇది
రాజయోగము, అంతేకానీ ప్రజాయోగము కాదు. కానీ ప్రజలు కూడా తయారవుతారు కదా. ముఖము మరియు
సేవ ద్వారా - వారు ఎలా అయ్యేందుకు అర్హులో తెలిసిపోతుంది. ఇంట్లో విద్యార్థుల
నడవడిక ద్వారా - వీరు ఫస్ట్ నంబర్లో వస్తారు, వీరు థర్డ్ నంబర్లో వస్తారు అని అర్థం
చేసుకుంటారు. ఇక్కడ కూడా అంతే. చివరిలో పరీక్షలు పూర్తయినప్పుడు మీకు అన్నీ
సాక్షాత్కారమవుతాయి. సాక్షాత్కారమవ్వడానికి పెద్ద సమయమేమీ పట్టదు. అప్పుడు - మేము
ఫెయిల్ అయిపోయామే అని సిగ్గుగా అనిపిస్తుంది. అలా ఫెయిల్ అయిపోయేవారిని ఎవరు
ప్రేమిస్తారు?
మనుష్యులు సినిమా చూడడటములో సంతోషాన్ని అనుభవం చేస్తారు. కానీ తండ్రి అంటారు,
నంబర్ వన్ అశుద్ధముగా తయారుచేసేది ఈ సినిమాలే. వాటికి వెళ్ళేవారు చాలావరకు ఫెయిల్
అయి పడిపోతారు. కొంతమంది స్త్రీలు కూడా ఎటువంటివారు ఉన్నారంటే వారికి సినిమా
చూడకుండా నిద్రపట్టదు. ఇలా సినిమా చూసేవారు అపవిత్రముగా అయ్యేందుకు పురుషార్థము
తప్పకుండా చేస్తారు. ఇక్కడ ఏదైతే జరుగుతుందో, అందులో సంతోషము ఉంది అని మనుష్యులు
భావిస్తారు, కానీ ఇవన్నీ దుఃఖము కొరకే. ఇవన్నీ వినాశీ సంతోషాలు. అవినాశీ సంతోషము
అవినాశీ తండ్రి ద్వారానే లభిస్తుంది. బాబా మనల్ని ఈ లక్ష్మీ-నారాయణుల వలె
తయారుచేస్తారని మీరు అర్థం చేసుకుంటారు. ఇంతకుముందైతే 21 జన్మల కొరకు అని వ్రాసేవారు.
కానీ ఇప్పుడు బాబా 50-60 జన్మల కొరకు అని వ్రాస్తారు, ఎందుకంటే ద్వాపరములో కూడా
మొదటైతే ఎంతో ధనవంతులుగా, సుఖముగా ఉంటారు కదా. పతితులుగా అవుతారు కానీ ధనమైతే ఎంతో
ఉంటుంది. ఎప్పుడైతే పూర్తిగా తమోప్రధానముగా అయిపోతారో అప్పుడు దుఃఖము మొదలవుతుంది.
మొదటైతే సుఖముగా ఉంటారు. ఎప్పుడైతే ఎంతో దుఃఖితులుగా అవుతారో, అప్పుడు తండ్రి
వస్తారు. మహా అజామిలులు వంటి పాపులను కూడా వారు ఉద్ధరిస్తారు. తండ్రి అంటారు, నేను
అందరినీ ముక్తిధామానికి తీసుకువెళ్తాను. అంతేకాక సత్యయుగ రాజ్యాన్ని కూడా మీకు
ఇస్తాను. అందరి కళ్యాణమైతే జరుగుతుంది కదా. అందరినీ తమ-తమ గమ్య స్థానానికి
చేరుస్తారు - అయితే శాంతిలోకి లేక సుఖములోకి చేరుస్తారు. సత్యయుగములో అందరికీ సుఖము
ఉంటుంది. శాంతిధామములో కూడా సుఖీగా ఉంటారు. విశ్వములో శాంతి ఏర్పడాలి అని అంటారు.
మీరు చెప్పండి - ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉన్నప్పుడు విశ్వములో శాంతి ఉండేది కదా.
అక్కడ దుఃఖము యొక్క విషయమేదీ ఉండదు. దుఃఖమూ ఉండదు, అశాంతి ఉండదు. ఇక్కడైతే ప్రతి
ఇంట్లోనూ అశాంతి ఉంది. ప్రతి దేశములోనూ అశాంతి ఉంది. మొత్తం విశ్వములోనే అశాంతి ఉంది.
ఎన్ని ముక్కలు, ముక్కలుగా అయిపోయింది. ఎన్ని విభజనలు ఉన్నాయి. 100 మైళ్ళకు ఒక భాష
ఉంది. భారత్ యొక్క ప్రాచీన భాష సంస్కృతము అని ఇప్పుడు అంటారు. వాస్తవానికి ఆది
సనాతన ధర్మము గురించే ఎవరికీ తెలియనప్పుడు, మరి దానిని ప్రాచీన భాష అని ఎలా అంటారు.
ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఎప్పుడు ఉండేదో మీరు తెలియజేయవచ్చు. మీలో కూడా
నంబరువారుగా ఉన్నారు. కొందరైతే మందబుద్ధి కలవారు కూడా ఉంటారు. వీరు రాతిబుద్ధి
కలవారిలా ఉన్నారు అని వారిని చూసినా అనిపిస్తుంది. అజ్ఞానకాలములో కూడా - ఓ భగవంతుడా,
ఇతడి బుద్ధి తాళాన్ని తెరవండి అని అంటారు కదా.
తండ్రి పిల్లలైన మీ అందరికీ జ్ఞాన ప్రకాశాన్ని ఇస్తారు, తద్వారా తాళం తెరుచుకుంటూ
ఉంటుంది. అయినా కొందరి బుద్ధి తెరుచుకోదు. ఏమంటారంటే - బాబా, మీరు వివేకవంతుల
వివేకము వంటివారు కదా, మా పతి బుద్ధి తాళాన్ని తెరవండి. తండ్రి అంటారు, నేను
కూర్చుని ఇలా ఒక్కొక్కరి బుద్ధి తాళాన్ని తెరిచేందుకు ఏమీ రాలేదు. మరి అలాగైతే అందరి
బుద్ధి తాళాలు తెరుచుకుంటాయి, అందరూ మహారాజులుగా, మహారాణులుగా అయిపోతారు. నేను ఎలా
అందరి బుద్ధి తాళాలను తెరవగలను. వారు సత్యయుగములోకి వచ్చేదే లేకపోతే మరి నేను
తాళాన్ని ఎలా తెరవగలను? డ్రామా అనుసారముగా సమయము వచ్చినప్పుడే వారి బుద్ధి
తెరుచుకుంటుంది. నేను ఎలా తెరవగలను! డ్రామాపైన కూడా ఆధారపడి ఉంది కదా. అందరూ ఫుల్
పాస్ అవ్వరు కదా. స్కూల్లో కూడా నంబరువారుగా ఉంటారు. ఇది కూడా చదువే. ప్రజలు కూడా
తయారవ్వాలి. అందరి తాళమూ తెరుచుకుంటే మరి ప్రజలు ఎక్కడి నుండి వస్తారు. ఇది నియమము
కాదు. పిల్లలైన మీరు పురుషార్థము చేయాలి. ప్రతి ఒక్కరి పురుషార్థము ద్వారా
తెలుసుకోవడం జరుగుతుంది. ఎవరైతే బాగా చదువుతారో, వారిని అక్కడికి, ఇక్కడికి పిలవడం
జరుగుతుంది. ఎవరెవరు బాగా సేవ చేస్తున్నారు అనేది బాబాకు తెలుసు. పిల్లలు బాగా
చదువుకోవాలి. బాగా చదువుకున్నట్లయితే ఇంటికి తీసుకువెళ్తాను, మళ్ళీ స్వర్గములోకి
పంపిస్తాను, లేదంటే ఎంతో కఠినమైన శిక్షలు ఉంటాయి, పదవి కూడా భ్రష్టమైపోతుంది.
విద్యార్థులు టీచర్ ను ప్రత్యక్షము చేయాలి. స్వర్ణయుగములో పారసబుద్ధి కలవారిగా
ఉండేవారు. ఇప్పుడు ఇది ఇనుపయుగము, కావున ఇక్కడ స్వర్ణిమయుగ బుద్ధి ఎలా ఉండగలదు. ఒకే
రాజ్యము, ఒకే ధర్మము ఉన్నప్పుడు విశ్వములో శాంతి ఉండేది. భారత్ లో వీరి రాజ్యము
ఉన్నప్పుడు విశ్వములో శాంతి ఉండేది అని మీరు వార్తాపత్రికల్లో కూడా వ్రాయవచ్చు.
చివరికి తప్పకుండా అర్థం చేసుకుంటారు. పిల్లలైన మీ పేరు ప్రఖ్యాతమవ్వనున్నది. ఆ
చదువులలో ఎన్ని పుస్తకాలు మొదలైనవి చదువుతారు. ఇక్కడ అదేమీ లేదు. చదువు ఎంతో
సహజమైనది. కానీ స్మృతిలో అయితే మంచి-మంచి మహారథులు కూడా ఫెయిల్ అయిపోతారు. స్మృతి
అనే పదును లేకపోతే ఇక జ్ఞాన ఖడ్గము ఉపయోగపడదు. ఎప్పుడైతే బాగా స్మృతి చేస్తారో,
అప్పుడు పదును నిండుతుంది. బంధనము ఉన్నా కూడా స్మృతి చేస్తూ ఉంటే అందులో ఎంతో లాభము
ఉంది. కొందరు బాబాను ఎప్పుడూ చూడను కూడా చూడలేదు, కానీ స్మృతిలోనే ప్రాణాలు
వదిలేస్తారు. వారు కూడా ఎంతో మంచి పదవిని పొందగలరు, ఎందుకంటే ఎంతగానో స్మృతి
చేస్తారు. తండ్రి స్మృతిలో ప్రేమపూరితమైన అశ్రువులు వస్తాయి. ఆ అశ్రువులు ముత్యాలుగా
అవుతాయి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తమ కోసం తామే పురుషార్థము చేసుకుని ఉన్నత పదవిని పొందాలి. చదువు ద్వారా
స్వయానికి స్వయమే రాజ్యతిలకాన్ని దిద్దుకోవాలి. జ్ఞానాన్ని బాగా ధారణ చేసి సదా
హర్షితముగా ఉండాలి.
2. జ్ఞాన ఖడ్గములో స్మృతి పదునును నింపుకోవాలి. స్మృతి ద్వారానే బంధనాలను
సమాప్తము చేసుకోవాలి. ఎప్పుడూ కూడా అశుద్ధమైన సినిమాలను చూస్తూ తమ సంకల్పాలను
అపవిత్రము చేసుకోకూడదు.
వరదానము:-
లౌకికాన్ని అలౌకికములోకి పరివర్తన చేసి సర్వ బలహీనతల నుండి
ముక్తులయ్యే మాస్టర్ సర్వశక్తివాన్ భవ
ఎవరైతే మాస్టర్ సర్వశక్తివంతులుగా, జ్ఞానసంపన్న ఆత్మలుగా
ఉంటారో, వారు ఎప్పుడూ ఎటువంటి బలహీనతలకు లేక సమస్యలకు వశీభూతులవ్వరు, ఎందుకంటే వారు
అమృతవేళ నుండి ఏదైతే చూస్తారో, వింటారో, ఆలోచిస్తారో లేక కర్మలు చేస్తారో, వాటిని
లౌకికము నుండి అలౌకికములోకి పరివర్తన చేస్తారు. ఏ లౌకిక వ్యవహారమునైనా
నిమిత్తమాత్రముగా చేస్తూ అలౌకిక కార్యాన్ని సదా స్మృతిలో ఉంచుకున్నట్లయితే, ఇక ఏ
విధమైన మాయావీ వికారాలకు వశీభూతమైన వ్యక్తుల సంపర్కములోనూ స్వయం వశీభూతులవ్వరు.
తమోగుణీ వైబ్రేషన్లలో కూడా సదా కమలపుష్ప సమానముగా ఉంటారు. లౌకికమనే బురదలో ఉంటూ కూడా
దాని నుండి అతీతముగా ఉంటారు.
స్లోగన్:-
సర్వులను సంతుష్టము చేసినట్లయితే పురుషార్థములో స్వతహాగానే హై జంప్ జరుగుతుంది.
అవ్యక్త సూచనలు -
సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి
సంకల్పాల శక్తిని జమ
చేసుకోవాలంటే ఏ విషయాన్ని అయినా చూసినా, విన్నా, క్షణములో దానికి ఫుల్ స్టాప్ పెట్టే
అభ్యాసము చెయ్యండి. ఒకవేళ సంకల్పాలలో ఎందుకు, ఏమిటి అన్న క్యూ మొదలుపెడితే, వ్యర్థ
సంకల్పాల రచనను రచిస్తే, వాటికి పాలన చెయ్యాల్సి వస్తుంది. సంకల్పాలు, సమయము, శక్తి
అందులో ఖర్చు అవుతూ ఉంటాయి, అందుకే ఇప్పుడు ఈ వ్యర్థ రచన విషయములో బర్త్ కంట్రోల్
చెయ్యండి, అప్పుడు అనంతమైన సేవకు నిమిత్తులుగా అవ్వగలరు.
| | |