26-04-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 31.12.2009


‘‘కొత్త సంవత్సరములో సర్వాత్మలకు సందేశాన్ని ఇచ్చి బంగారు ప్రపంచాన్ని కానుకగా ఇవ్వండి, బాబా సమానముగా అవ్వడానికి దేహీ-అభిమానులుగా ఉండే నేచర్ ను నేచురల్ చేసుకోండి’’

ఈ రోజు బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ స్నేహములో మరియు బాప్ దాదా ప్రేమలో లవలీనమై ఉన్న స్వరూపములో చూస్తున్నారు. ఒక్కొక్క బిడ్డ పరమాత్మ ప్రేమలో మెరుస్తున్నారు. పిల్లలందరూ ప్రేమ అనే విమానములో చేరుకున్నారు. నిజానికైతే కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి వచ్చారు, కానీ అందరి నయనాలలో ఏం కనిపిస్తుంది? న్యూ ఇయర్, కొత్త సంవత్సరము అన్నది నిమిత్తమాత్రమే, కానీ మీ అందరి నయనాలలో ఏ ఉత్సాహము ఉంది? మూడు అభినందనలు తెలియజేస్తున్నారు. ఒకటి - మీ కొత్త జీవితానికి అభినందనలు, రెండు - కొత్త యుగానికి అభినందనలు మరియు మూడు - పరివారముతో మరియు బాబాతో మిలనానికి అభినందనలు. మీ నయనాలలో ఏం తిరుగుతుంది? మీ కొత్త యుగము ఎదురుగా వస్తుంది కదా! కొత్త యుగము ఇక వచ్చేసినట్లే అని మనసులో ఉత్సాహము కలుగుతుంది. కొత్త యుగము యొక్క మెరిసే డ్రెస్ ఎదురుగా ఎంత స్పష్టముగా ఉందంటే - ఈ రోజు సంగమయుగములో ఉన్నాము మరియు త్వరలోనే ఈ మెరిసే డ్రెస్ ను ధరించాలి అన్నట్లు ఉంది. దానిని ఎదురుగా చూస్తూ, చూస్తూ సంతోషిస్తున్నారు. వీడ్కోలు కూడా ఇస్తున్నారు మరియు అభినందనలను కూడా తీసుకుంటున్నారు. ఎలా అయితే పాత సంవత్సరానికి వీడ్కోలు ఇచ్చినప్పుడు ఇక ఆ సంవత్సరాన్ని మర్చిపోతారో మరియు కొత్త సంవత్సరమే ఎదురుగా వస్తుందో, అలాగే మీ ఎదురుగా పాత ప్రపంచానికి కాదు, కొత్త ప్రపంచానికి అభినందనలు తెలియజేస్తున్నారు. పాత ప్రపంచానికి వీడ్కోలు చెప్తున్నారు. మరి ఈ రోజు అందరికీ కొత్త యుగము కోసం ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి. ప్రపంచములోని వారు కూడా కొత్త సంవత్సరానికి అభినందనలను తెలియజేస్తారు మరియు దానితోపాటు గిఫ్ట్స్ కూడా ఇస్తారు. అలాగే బాప్ దాదా కూడా పిల్లలైన మీకు పాత స్వభావ-సంస్కారాలకు వీడ్కోలు పలికి కొత్త ప్రపంచములోకి వెళ్ళే కానుకను ఇస్తున్నారు, ఆ కొత్త ప్రపంచములో అంతా ప్రాప్తియే ప్రాప్తి. సారములో చెప్పాలంటే కొత్త ప్రపంచములో అప్రాప్తి అంటూ ఏదీ ఉండదు. ఇటువంటి బంగారు ప్రపంచము యొక్క గిఫ్ట్ ను బాప్ దాదా పిల్లలైన మీలోని ప్రతి ఒక్కరికీ కానుకగా ఇచ్చారు. మేము బంగారు ప్రపంచానికి అధికారులుగా అవుతున్నాము అని మీకు కూడా నషా ఉంది కదా. ఇటువంటి గిఫ్ట్ ను మరెవ్వరూ ఇవ్వలేరు. బాబా ప్రతి బిడ్డకు ఏమని డైరెక్షన్ ఇచ్చారంటే - తండ్రి వారసత్వముగా ఇస్తున్న ఈ బంగారు ప్రపంచము గురించిన సందేశాన్ని సర్వాత్మలకు ఇచ్చి వారికి కూడా మీరు గిఫ్ట్ ను ఇవ్వండి. మీ వద్ద ఏ గిఫ్ట్ ఉంది? ఒకటి, కొత్త ప్రపంచము యొక్క గిఫ్ట్ ను ఇవ్వండి మరియు రెండవది, మీ వద్ద అనేక ఖజానాలు ఉన్నాయి. గుణాల ఖజానా, శక్తుల ఖజానా, స్వమానాల ఖజానా, ఇలా ఎన్ని ఖజానాలు ఉన్నాయి. కావున అందరికీ ఏదో ఒక గుణాన్ని, ఏదో ఒక శక్తిని గిఫ్ట్ గా ఇవ్వండి, ఆ గిఫ్ట్ ద్వారా వారి జీవితము మారిపోవాలి మరియు బంగారు ప్రపంచానికి అధికారులుగా అవ్వాలి, ఎందుకంటే ఈ రోజుల్లో నలువైపులా దుఃఖము, అశాంతి పెరిగిపోవడాన్ని మీరు చూస్తున్నారు. నలువైపులా ప్రతి ఒక్కరిలో భయము, చింత ఉన్నాయి. ఇటువంటి దుఃఖిత, అశాంత ఆత్మలకు కనీసం ఈ సందేశాన్ని అయినా తప్పకుండా అందించండి - ఇప్పుడు బాబా వచ్చారు, ఇప్పటినుండైనా అవినాశీ వారసత్వానికి అధికారులుగా అవ్వండి అని. ఈ సందేశాన్ని ప్రతి ఆత్మకు ఇస్తూన్నారు కూడా, కానీ ఇప్పటికీ కొంతమంది బాబా పిల్లలు సందేశము నుండి వంచితులై ఉన్నారు. ఏది ఏమైనా అందరూ ఒక్క తండ్రి పిల్లలే కదా, కావున మీ సోదరీ-సోదరులకు ఈ సందేశమనే గిఫ్ట్ ను తప్పకుండా ఇవ్వండి, ఎవ్వరూ ఉండిపోకూడదు. సేవ చేస్తున్నారు, బాప్ దాదా పిల్లల సేవను చూసి సంతోషిస్తున్నారు, కానీ బాబా ఆశ ఏమిటంటే - నా పిల్లలెవ్వరూ సందేశము నుండి వంచితులుగా ఉండిపోకూడదు. మీకైతే బంగారు ప్రపంచము యొక్క కానుక లభించింది, కానీ మాకు తెలియనే తెలియలేదు అని ఫిర్యాదు చేయకూడదు. మా తండ్రి వచ్చారు, కానీ మాకు సందేశము లభించలేదు అని ఫిర్యాదు చేయకూడదు, అందుకే ఈ కొత్త సంవత్సరములో ఈ ప్రయత్నమే చేయండి, పరస్పరములో ప్లాన్ తయారుచేయండి - ఏ మూల కూడా మిగిలిపోకూడదు, ఫిర్యాదు రాకూడదు, అందరూ సంతోషించాలి. మా తండ్రి వచ్చేశారు అన్న విషయమైతే తెలియాలి, వంచితులుగా ఉండిపోకూడదు. మరి ఈ కొత్త సంవత్సరములో ఏం చేస్తారు? పరస్పరము కలిసి ప్లాన్ తయారుచేయండి. బాప్ దాదాకు ప్రతి బిడ్డ పట్ల దయ కలుగుతుంది. మీరు కూడా సోదరీ-సోదరుల పట్ల ఇప్పుడు విశేషమైన దయార్ద్ర హృదయాన్ని, కళ్యాణకారీ స్వరూపాన్ని ధారణ చేసి అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. కనీసం ఈ ఫిర్యాదునైతే ఇవ్వకూడదు.

ఈ రోజు పిల్లలందరూ కొత్త సంవత్సరాన్ని జరుపుకునే ఉల్లాస-ఉత్సాహాలతో చేరుకున్నారు. బాప్ దాదా ఒక్కొక్క బిడ్డను చూసి ఏ పాటను పాడుతారు? తెలుసు కదా! వాహ్ పిల్లలు వాహ్! ఎవరైతే మొదటిసారి వచ్చారో, వారితో కూడా బాప్ దాదా చెప్తున్నారు, మీరు లక్కీ పిల్లలు, ఎందుకంటే సమయము సమాప్తము అయ్యేకంటే ముందే బాబాకు చెందినవారిగా అయిపోయారు. కొత్త పిల్లలకు బాప్ దాదా పదమాల, పదమాల రెట్లు లక్కీగా అయినందుకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ రోజుల్లో బాప్ దాదా పిల్లలందరిలోనూ ఒక విషయాన్ని చూడాలనుకుంటున్నారు, అదేమిటో తెలుసా? ఏ విధముగా ప్రతి ఒక్కరి మనసులో - మేము బాబా సమానముగా అయ్యే తీరబోతున్నాము అన్న ఉల్లాసముందో, లక్ష్యము ఉందో, అవుతాము కాదు, అయ్యే తీరబోతున్నాము అని ఉందో, మరి లక్ష్యము ఏ విధముగా ఉందో, అదే విధముగా ఇప్పుడు బాప్ దాదా లక్ష్యముతోపాటు లక్షణాలను కూడా చూడాలనుకుంటున్నారు. ఏ విధముగా సమానముగా అవ్వాలి అన్న లక్ష్యము ఉందో, అదే విధముగా సమానముగా అయ్యే లక్షణాలు కూడా ఉండాలి. ఇప్పుడు లక్ష్యము చాలా ఉన్నతముగా ఉంది, కానీ లక్షణాల పట్ల విశేషమైన అటెన్షన్ ఇవ్వాలి. సమానముగా అవ్వాలి, ఎంత పెద్ద లక్ష్యమో అంత పెద్ద లక్షణాలు ఉండాలి. ఇప్పుడు కొంతమంది పిల్లలు లక్షణాలను ధారణ చెయ్యాలనుకుంటున్నారు, కానీ మధ్యమధ్యలో ఏమని అంటూ ఉంటారంటే - చాలానే కోరుకుంటున్నాము కానీ... ఈ ‘కానీ’ అనేది తొలగిపోవాలి. మీ నడవడిక మరియు ముఖము ద్వారా, లక్ష్యమెంత పెద్దగా ఉందో అంతగా లక్షణాలు ముఖము ద్వారా, నడవడిక ద్వారా కనిపించాలి. ఎలా అయితే పూర్వము మీరు దేహాభిమానములో ఉండేవారు, దేహాభిమానములో ఉన్నప్పుడు దేహాభిమానపు నేచర్ నేచురల్ గా ఉండేది. దేహాభిమానము రావాలి అని ఎప్పుడైనా పురుషార్థము చేసారా, నేచురల్ నేచర్ గా దేహాభిమానము ఉండేది. అర్ధకల్పము దానికి పురుషార్థము చెయ్యలేదు. అలాగే ఇప్పుడు కూడా దేహీ-అభిమానిగా అయ్యే నేచర్ నేచురల్ గా ఉందా! దేహ-అభిమానపు నేచర్ న్యాచురల్ గా ఉండేది. దేహాభిమానములోకి రావాలి అని ఎప్పుడైనా గుర్తుకువస్తుందా, దాని కోసం పురుషార్థము చేసారా? ఇప్పుడు కూడా దేహ-అభిమానము మరియు దేహీ-అభిమానము, మరి దేహీ-అభిమానిగా అవ్వడములో శ్రమ ఎందుకు! ఎందుకంటే బాప్ దాదా వద్దకు సమాచారము వస్తుంది, ఒక్కోసారి దేహ-అభిమానాన్ని తొలగించుకునేందుకు శ్రమించవలసి వస్తుంది అని. దేహ-అభిమానము నేచురల్ గా ఉన్నప్పుడు మరి దేహీ-అభిమానులుగా ఉండటములో శ్రమ ఎందుకు? బాప్ దాదాకు పిల్లల శ్రమ మంచిగా అనిపించదు. శ్రమ నుండి ముక్తులుగా అవ్వాలి మరియు నేచురల్ నేచర్ అవ్వాలి, దీనినే లక్ష్యము మరియు లక్షణాలు సమానముగా ఉండటము అని అంటారు. అప్పుడు మీరు చూడండి, బాబా సమానముగా అవ్వడము చాలా సహజముగా మరియు నేచురల్ గా అనిపిస్తుంది. ఏ విధముగా బ్రహ్మాబాబాను చూసారు కదా, ఇంత పెద్ద పరివారపు బాధ్యత ఉన్నప్పటికీ దేహీ-అభిమాన స్థితి నేచురల్ నేచర్ గా ఉండేది. పిల్లలపై కూడా బాధ్యత ఉంది, కానీ బ్రహ్మాబాబా బాధ్యత ముందు ఈ బాధ్యత ఏమనిపిస్తుంది! ఏ బాధ్యత అయినా కానీ, ఉదాహరణకు జోన్ బాధ్యతలు కావచ్చు, లేక అఫిషియల్ యజ్ఞ వ్యవహారాల బాధ్యత కావచ్చు, కానీ ఈ బాధ్యత బ్రహ్మాబాబా బాధ్యత ముందు ఏపాటిది! శివబాబా సహాయముతో బ్రహ్మాబాబా ప్రాక్టికల్ గా చూపించారు - చేయించేవారు చేయిస్తున్నారు, నేను చేసేవానిగా అయి బాబా సమానముగా అతీతముగా మరియు ప్రియముగా ఉన్నాను. మరి బాబా సమానముగా అవ్వాలి అని అనుకున్నప్పుడు చెక్ చేసుకోండి - ఏదైనా కావచ్చు, మనసా కానీ, వాచా కానీ లేక కర్మణా కానీ, ఏ బాధ్యతలు ఉన్నా కానీ, నేను చేసేవాడిని, ట్రస్టీని, చేయించేవారు యజమాని అయిన శివబాబా. ‘చేయించేవారు’ అన్న పాఠాన్ని నడుస్తూ-నడుస్తూ మర్చిపోతారు. కావున లక్ష్యాన్ని మరియు లక్షణాలను, రెండింటినీ సమానముగా చేసుకోవాలి. ఇప్పుడు పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడముతోపాటు ఈ లక్ష్యాన్ని లక్షణములోకి తీసుకురావాలి. కొత్త సంవత్సరములో కొత్త విషయాలు. ఏమి చెయ్యను, మాయ వచ్చేస్తుంది, కోరుకోవడము లేదు కానీ మాయ వచ్చేస్తుంది... ఈ మాటలకు మరియు సంకల్పాలకు, పాత సంవత్సరముతోపాటుగా వీటికి కూడా వీడ్కోలు చెప్పండి. కేవలం సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వకండి. మాయ కూడా బాప్ దాదా వద్దకు వస్తుంది అని బాప్ దాదా ముందుగానే వినిపించి ఉన్నారు మరియు వచ్చి ఏమని అంటుంది? నేను వెళ్ళే సమయము దగ్గరకు వచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను కానీ కొంతమంది పిల్లలు నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు, నేనేమి చెయ్యను. ఈ రోజు వీడ్కోలుతోపాటు మాయ యొక్క భిన్న-భిన్న రూపాలకు కూడా వీడ్కోలు ఇవ్వాలి. ఉందా ధైర్యము? ధైర్యముందా? చేతులెత్తండి. వీడ్కోలు చెప్పే ధైర్యముందా? వెనక ఉన్నవారికి ధైర్యముందా? ఎవరిలోనైతే ధైర్యము ఉందో, వారు చేతులెత్తండి. బాబా ఈ ధైర్యానికి పదమాల, పదమాల రెట్లు అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకని? ఎందుకని బాప్ దాదా దీని గురించి అంతగా చెప్తున్నారు? ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు, ప్రపంచము యొక్క పరిస్థితులు బాగా పాడవటము మొదలవుతుంది మరియు ‘అకస్మాత్తుగా జరగనున్నది’ అన్న బాప్ దాదా మహావాక్యాలను కొద్ది సమయము నుండి వింటూ ఉన్నారు. కనుక అకస్మాత్తుగా జరగనున్నది, మరియు ఒకవేళ బహుకాలపు అభ్యాసము లేకపోతే మరి మీరే చెప్పండి, అకస్మాత్తు సమయములో అభ్యాసము యొక్క అవసరము ఉంటుంది కదా! ఇప్పుడు చూడండి, బాప్ దాదా హోమ్ వర్కును ఇచ్చారు. పదేసి నిమిషాలు చొప్పున, టోటల్ 24 సార్లు 10-10 నిమిషాల హోమ్ వర్కును ఇచ్చారు. కొంతమంది పిల్లలకు ఇది కష్టమవుతుంది. మరి ఆలోచించండి, ఒకవేళ 10 నిమిషాల అభ్యాసము చేయలేకపోతే ఇక అకస్మాత్తు సమయములో ఏమి చేస్తారు? 24 సార్లు చెయ్యడానికి కొంతమందికి సమయము కాస్త తక్కువ లభిస్తుందని బాప్ దాదాకు తెలుసు, కానీ బాప్ దాదా ట్రయల్ వేసారు, 10 నిమిషాలు ఒకే స్మృతిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా చెయ్యగలరా అని. ఇప్పుడు కూడా 10 నిమిషాలే చేయండి అని బాప్ దాదా చెప్పడము లేదు. సరే, 10 నిమిషాలు వీలు కాకపోతే, ఎవరికైతే వీలవుతుందో వారు చేయండి, ఒకవేళ వీలు కాకపోతే 5 నిమిషాలు చేయండి, 5 నిమిషాల నుండి 6 నిమిషాలు, 7 నిమిషాలు, ఎంతగా పెంచగలిగితే అంతగా ట్రయల్ వెయ్యండి. బాప్ దాదా స్వయమే చెప్తున్నారు, ఇందులో అటువంటిదేమీ లేదు. ఒకవేళ 10 నిమిషాలు ఎక్కువ సమయముగా అనిపిస్తే పోనీ 8 నిమిషాలు చెయ్యండి, 9 నిమిషాలు చెయ్యండి, ఎంత ఎక్కువ చెయ్యగలిగితే అంత అలవాటు చేసుకోండి, ఎందుకంటే బహుకాలపు వరదానాన్ని ఇప్పుడు ప్రాక్టికల్ లోకి తీసుకురావచ్చు. ఒకవేళ ఇప్పుడు బహుకాలపు అభ్యాసము లేకపోతే ఇప్పుడు బహుకాలము పురుషార్థము చేసినందుకు ఏదైతే ప్రాప్తి లభిస్తుందో, అర్ధకల్పము ఆ బహుకాలములో తేడా వచ్చేస్తుంది. ఎంత వీలైతే అంత చేయండి అని బాప్ దాదా అనుమతి ఇచ్చారు, కానీ 5 నిమిషాలు కన్నా ఎక్కువే చేయండి, 10 నిమిషాలు వీలు కాకపోతే 7 నిమిషాలు చేయండి, 8 నిమిషాలు చేయండి, 5 నిమిషాలు కూడా చెయ్యవచ్చు. కానీ ఎప్పుడైనా సరే 10 నిమిషాలు చెయ్యగలిగితే మంచిది. ఎటువంటి సమయము రాబోతుందంటే, మీరు స్వయానికి కూడా మరియు విశ్వానికి కూడా కిరణాలు ఇవ్వవలసి ఉంటుంది. అందుకే బాప్ దాదా అనుమతిని ఇస్తున్నారు, ఎంత ఎక్కువ సమయము చెయ్యగలిగితే, అంత ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఇప్పటి బహుకాలమే భవిష్యత్తుకు ఆధారము. సరేనా? కష్టముగా అనిపిస్తుందా, ఏమీ పర్వాలేదు, ఇప్పుడైతే ఏమీ పర్వాలేదు, బాబాకు వినిపించి మంచి పని చేసారు, ఎందుకంటే ఒకవేళ 10 నిమిషాలు కూర్చోలేకపోతే, ఆలోచనలోనే గడిచిపోతే, 5 నిమిషాలు పోయినట్లే కదా, అందుకే బాప్ దాదా అంటున్నారు, కనీసం 5 నిమిషాలు కన్నా తక్కువ చెయ్యకండి. ఎంతగా పెంచగలుగుతారో అంతగా పెంచుతూ ఉండండి. సరేనా, స్పష్టమయిందా? ఎందుకంటే బాప్ దాదా ప్రతి ఒక్కరినీ ఎంతో శ్రేష్ఠ స్వరూపములో చూస్తారు. బాప్ దాదా దీనికి గుర్తుగా ప్రతి బిడ్డకు ఎన్ని స్వమానాలు ఇచ్చారు. స్వమానాల లిస్టును తీస్తే అది ఎంత పెద్దగా ఉంది?

ఈ రోజు బాప్ దాదా అమృతవేళలో చుట్టూ చూడటానికి వెళ్ళారు. ఏం చూడటానికి వెళ్ళారు? బాప్ దాదా చాలా పెద్ద స్వమానాల మాలను ఇచ్చారు. ఒకవేళ ఒక్కొక్క స్వమానములో స్థితులై ఆ స్థితిలో కూర్చున్నట్లయితే, పోనీ స్వమానాలను గుర్తు తెచ్చుకుంటూ ఉండండి మరియు మాలను తిప్పుతూ ఉండండి, అప్పుడు చాలా మజా వస్తుంది. స్వమానాల లిస్టు ఉంది, కానీ ఒకొక్క స్వమానము ఎంత పెద్దది, మరియు దానిని ఎవరు ఇచ్చారు! వరల్డ్ అల్మైటీ అథారిటీ ప్రతి బిడ్డకు అనేక స్వమానాల లిస్టును ఇచ్చారు, వాటిని ఉపయోగించండి, ఎందుకంటే మీ ఈ స్వమానాలను తగ్గించగలిగే అథారిటీ మరేదీ లేదు. మరెవ్వరికీ ఇంత పెద్ద స్వమానాల మాల లభించలేదు. బాప్ దాదా చూసారు, సత్యయుగములోనైతే రాజ్య భాగ్యము లభిస్తుంది కానీ ఈ స్వమానాల మాల సంగమయుగీ ప్రసాదము. బాప్ దాదా ఎప్పుడు పిల్లలను చూసినా, ప్రతి బిడ్డను వారి స్వమాన స్థితితో చూస్తారు - వాహ్ పిల్లలు వాహ్! కావున స్వమానము యొక్క అథారిటీలో ఉండండి, నేను ఎవరిని! ఒకసారి ఒక స్వమానాన్ని ఎదురుగా తెచ్చుకోండి, మరోసారి మరో స్వమానాన్ని ఎదురుగా తెచ్చుకోండి మరియు చెక్ చేసుకోండి - ఈ రోజు అమృతవేళ ఏదైతే విశేష స్వమానాన్ని బుద్ధిలో పెట్టుకున్నానో దానిని ఉపయోగించానా! ఆ స్వమానము ఖజానా వంటిది కదా, ఎందుకంటే ఖజానాలు పెరగడానికి సాధనమేమిటంటే, ఎంతగా ఖజానాలను కార్యములో ఉపయోగిస్తామో అంతగా ఖజానాలు పెరుగుతాయి. ఈ రోజు బాప్ దాదా చూస్తున్నారు, ఏయే పిల్లల వద్ద స్వమానాల స్మృతి అనే మాల పెద్దగా ఉంది, ఎవరి వద్ద చిన్నగా ఉంది. ఎక్కడైతే స్వమానము ఉంటుందో అక్కడ దేహభానము సమాప్తమైపోతుంది. మరి ఈ రోజు బాప్ దాదా చుట్టూ తిరిగి వచ్చారు మరియు చూసారు, ఎలా అయితే స్వమానాల ఖజానా ఉందో అలా ఒక్కొక్క శక్తిని, ఒక్కొక్క గుణాన్ని ఉపయోగించండి, కార్యములో పెట్టండి. అప్పుడు మాయ వచ్చేసింది అని ఏదైతే ప్రాబ్లమ్ గా అనిపిస్తుందో, అక్కడ వాస్తవానికి మాయ రాదు, కానీ మాయ గురించైతే బాబా వినిపించి ఉన్నారు. నన్ను ఆహ్వానిస్తారు, అందుకే వెళ్తున్నాను, ఊరికే వెళ్ళడము లేదు అని మాయ అంటుంది. ఏ విధమైన బలహీన సంకల్పాన్ని అయినా చెయ్యడమంటే మాయను ఆహ్వానించినట్లే, శక్తులను వదిలితే మాయను ఆహ్వానించినట్లే. కోరుకోవడము లేదు కానీ వచ్చేస్తుంది అని అంటారు. ఎవరు బలశాలి అయినట్లు? కోరుకోవడము లేదు కానీ వచ్చేస్తుంది, అప్పుడు మాయ బలశాలి అయినట్లా లేక మీరా? ఈ రోజు పాత సంవత్సరము సమాప్తము కావస్తుంది, కొత్త సంవత్సరములో కొత్త ఉల్లాసము, కొత్త ఉత్సాహము, ఎందుకంటే సంగమయుగము యొక్క గాయనమేమిటంటే, ఒక్కొక్క రోజు ఉత్సాహాలు నిండిన రోజు అనగా ఉత్సవము. ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయంటే ప్రతి రోజూ ఉత్సవమే. అందుకే పక్కాగా ఉంచుకోండి. రోజూ నడుస్తూ-తిరుగుతూ కూడా మీ చార్టు చూసుకోండి, చెక్ చేసుకోండి, చెక్ చేసుకుంటే ఛేంజ్ చేసుకుంటారు కదా. చెక్ చేసుకోకపోతే ఛేంజ్ ఎలా చేసుకుంటారు!

ఈ రోజు కొత్త సంవత్సరానికి బాప్ దాదాకు విశేషముగా ఇదే సంకల్పముంది, అదేమిటంటే - ప్రతి బిడ్డ ఎలా అయితే పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్తున్నారో, అలాగే మాయకు వీడ్కోలు చెప్పండి, వ్యర్థ సంకల్పాలకు వీడ్కోలు చెప్పండి, ఎందుకంటే మెజారిటీలో వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా రావటాన్ని చూసాము. వికారీ సంకల్పాలు తక్కువగానే ఉన్నాయి. కానీ వ్యర్థ సంకల్పాల యొక్క నామ-రూపాలు సమాప్తమైపోవాలి. ప్రతి సంకల్పము సమర్థవంతముగా ఉండాలి, వ్యర్థముగా ఉండకూడదు, ఎందుకంటే వ్యర్థ సంకల్పాలలో కేవలం సంకల్పాలు మాత్రమే నడవడము లేదు కానీ అందులో సమయము కూడా వ్యర్థముగా పోతుంది మరియు బాబా సమానముగా అవ్వడములో దూరము ఏర్పడుతుంది. మీకు సమానముగా అవ్వాలి అన్న కోరికైతే ఉంది, ఇందులో చేతులైతే ఎత్తారు, కానీ బాప్ దాదా సదా చెప్తున్నారు, మనసు యొక్క చేతిని ఎత్తండి. ఈ చేతిని ఎత్తడమైతే ఈజీనే. మరి వీడ్కోలు చెప్పే ధైర్యముందా? ఉందా ధైర్యము? చేతులెత్తండి. అచ్ఛా, ధైర్యవంతులు. కేవలం ఈ ధైర్యాన్ని స్థిరముగా ఉంచుకోండి, అంతే. ఒకవేళ ధైర్యముంటే, ఏదైతే లక్ష్యము పెట్టుకున్నారో, అది తప్పకుండా నెరవేరుతుంది, ఎందుకంటే బాప్ దాదా కూడా మీతోపాటు ఉన్నారు. నా పిల్లలెవ్వరూ వెనుక ఉండిపోకూడదు, నాతోపాటు చేతిలో చేయి వేసి నడవాలి అని బాప్ దాదా కోరుకుంటున్నారు. శివబాబా నిరాకారుడే, స్థూలమైన చేయి లేకపోవచ్చు కానీ శ్రీమతమే వారి చేయి. అడుగు-అడుగులో శ్రీమతముపై నడవడము అంటే చేతిలో చేయి వేసి నడవడము. అందరికీ కొత్త సంవత్సరానికి, కొత్త జీవితానికి మరియు కొత్త యుగానికి, మూడింటికీ పదమాల, పదమాల రెట్లు అభినందనలు. అచ్ఛా!

ఇప్పుడు నలువైపులా దేశ-విదేశాలలో ఉన్న బాబాకు ప్రియమైన, బాబాకు గారాబమైన, బాబాను చాలా కాలం తర్వాత కలిసిన ప్రతి బిడ్డకు వీడ్కోలు మరియు అభినందనలు. బాప్ దాదా వినిపించారు, పాత సంవత్సరముతోపాటు పాత సంస్కారాలకు కూడా వీడ్కోలు చెప్పే, పాత స్వభావానికి కూడా వీడ్కోలు చెప్పే మహావీరులైన పిల్లలకు, ప్రతి అడుగులోనూ పదమాల సంపాదనను జమ చేసుకునేవారికి, బాప్ దాదా సదా ఏవైతే స్వమానాలు ఇస్తున్నారో, ఆ స్వమానాల స్థితిలో ఉంటూ అనుభవం చేసేవారికి, ప్రతి బిడ్డను బాప్ దాదా ఏ రూపములో చూస్తున్నారంటే, ఈ పిల్లలు ప్రతి ఒక్కరూ 21 జన్మల వారసత్వానికి అధికారులు, పూర్తి కల్పములో 21 జన్మలకు అధికారులుగా అయ్యే వారసత్వము పిల్లలైన మీకు మాత్రమే లభిస్తుంది, నలువైపులా ఉన్న ఇటువంటి శ్రేష్ఠ అధికారీ పిల్లలకు బాప్ దాదా తండ్రి, శిక్షకుడు మరియు గురువు రూపములో, మూడు రూపాలలోనూ ప్రియస్మృతులు మరియు నమస్తే తెలియజేస్తున్నారు.

వరదానము:-
సేవ మరియు పురుషార్థములో సఫలతను ప్రాప్తి చేసుకునే డబుల్ కిరీటధారీ భవ

సంగమయుగములో సదా స్వయాన్ని డబుల్ కిరీటధారులుగా భావిస్తూ నడుచుకోండి. ఒకటేమో - ప్రకాశము అనగా పవిత్రత యొక్క కిరీటము మరియు ఇంకొకటి - బాధ్యతల కిరీటము. పవిత్రత మరియు పవర్ - ప్రకాశము మరియు శక్తి యొక్క కిరీటాన్ని ధారణ చేసేవారిలో డబుల్ ఫోర్స్ సదా నిలిచి ఉంటుంది. ఇటువంటి డబుల్ ఫోర్స్ కల ఆత్మలు సదా శక్తిశాలిగా ఉంటారు. వారికి సేవలో మరియు పురుషార్థములో సదా సఫలత ప్రాప్తిస్తుంది.

స్లోగన్:-
దివ్య గుణాల ఆధారముపై ఆలోచనలు, మాటలు మరియు కర్మలను ఆచరించడమే దివ్యత.

అవ్యక్త సూచనలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’

ఏ వస్తువునైనా ముందు వేడి చేసి దానిని మెత్తగా చెయ్యాల్సి ఉంటుంది, ఆ తర్వాత మోల్డ్ చెయ్యాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా శక్తి రూపము అనేది వేడితనము మరియు నిర్మానత అనగా స్నేహ రూపము అనేది మెత్తదనము. ఎవరికైతే ప్రతి ఆత్మ పట్ల స్నేహము ఉంటుందో, వారే నమ్రచిత్తులుగా ఉండగలరు. స్నేహము లేనట్లయితే దయార్ద్ర హృదయులుగానూ అవ్వలేరు, నమ్రచిత్తత కూడా ఉండదు. శక్తి రూపములో యజమానత్వము ఉంటుంది మరియు నమ్రతలో సేవా గుణము ఉంటుంది. కనుక ఎప్పుడైతే ఈ వేడితనము మరియు మెత్తదనము, రెండూ ఉంటాయో, అప్పుడు ప్రతి విషయములోనూ మోల్డ్ అవ్వగలరు.