26-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తమ సత్యాతి-సత్యమైన చార్టును
పెట్టుకున్నట్లయితే అవస్థ బాగుంటుంది, చార్టు పెట్టుకోవడము వలన కళ్యాణము జరుగుతూ
ఉంటుంది’’
ప్రశ్న:-
ఏ స్మృతి పాత
ప్రపంచము నుండి సహజముగానే పక్కకు తప్పుకునేలా చేస్తుంది?
జవాబు:-
మేము
కల్ప-కల్పము తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటాము, ఇప్పుడు మళ్ళీ మేము
వారసత్వము తీసుకునేందుకు శివబాబా ఒడిలోకి వచ్చాము, బాబా మమ్మల్ని దత్తత తీసుకున్నారు,
మేము సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యాము, శివబాబా మాకు గీతను వినిపిస్తున్నారు
- ఒకవేళ ఈ స్మృతి ఉన్నట్లయితే, ఈ స్మృతియే పాత ప్రపంచము నుండి పక్కకు తప్పుకునేలా
చేస్తుంది.
ఓంశాంతి
పిల్లలైన మీరు శివబాబా స్మృతిలో ఇక్కడ కూర్చున్నారు. వారు మనల్ని సుఖధామానికి
యజమానులుగా మళ్ళీ తయారుచేస్తున్నారని మీకు తెలుసు. పిల్లల బుద్ధిలో లోలోపల ఎంత
సంతోషముండాలి, ఇక్కడ కూర్చుని ఉండగానే పిల్లలకు ఖజానా లభిస్తుంది కదా. అనేక రకాల
కాలేజీలలో, యూనివర్సిటీలలో ఎవరి బుద్ధిలోనూ ఈ విషయాలు ఉండవు. బాబా మనల్ని
స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తున్నారని మీకు మాత్రమే తెలుసు. ఈ సంతోషముండాలి కదా.
ఈ సమయములో మిగిలిన ఆలోచనలన్నింటినీ వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఇక్కడ
కూర్చున్నప్పుడు, మేము ఇప్పుడు సుఖధామానికి యజమానులుగా అవుతున్నామని బుద్ధిలో నషా
ఉండాలి. సుఖము మరియు శాంతి యొక్క వారసత్వాన్ని మనము కల్ప-కల్పము తీసుకుంటాము.
మనుష్యులకైతే ఏమీ తెలియదు. కల్పక్రితం కూడా చాలా మంది మనుష్యులు అజ్ఞానాంధకారములో,
కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తూ సమాప్తమైపోయారు. మళ్ళీ అలాగే జరుగుతుంది. మమ్మల్ని
తండ్రి దత్తత తీసుకున్నారని లేదా మేము శివబాబా ఒడిలోకి వచ్చామని పిల్లలు అర్థం
చేసుకుంటారు. వారు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు
మనము బ్రాహ్మణులము. మనము సత్యాతి-సత్యమైన గీతా పాఠాన్ని వింటున్నాము. మనము బాబా
నుండి మళ్ళీ రాజయోగముతో మరియు జ్ఞాన బలముతో వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఇటువంటి
ఆలోచనలు లోలోపల వస్తూ ఉండాలి కదా. తండ్రి కూడా వచ్చి సంతోషకరమైన విషయాలను
తెలియజేస్తారు కదా. పిల్లలు కామ చితిపై కూర్చుని నల్లగా భస్మమైపోయారని తండ్రికి
తెలుసు. అందుకే నేను అమరలోకము నుండి మృత్యులోకములోకి వస్తాను. మేము మృత్యులోకము
నుండి అమరలోకములోకి మళ్ళీ వెళ్తామని మీరంటారు. తండ్రి అంటారు - ఏ మృత్యులోకములోనైతే
అందరి మృత్యువు జరిగి ఉందో, నేను ఆ మృత్యులోకములోకి వెళ్తాను, వారిని తిరిగి
అమరలోకములోకి తీసుకువెళ్తాను. శాస్త్రాలలోనైతే ఏవేవో వ్రాసేసారు - వారు
సర్వశక్తివంతుడని, ఏది కావాలనుకుంటే అది చేయగలరని వ్రాశారు. కానీ, ఓ పతిత-పావన బాబా
రండి, వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనముగా చేయండి, దుఃఖాన్ని హరించి సుఖాన్ని
ఇవ్వండి - దీని కోసమే వారిని పిలవడము జరుగుతుందని పిల్లలకు తెలుసు, ఇందులో గారడి
యొక్క విషయమేమీ లేదు. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేయడానికే తండ్రి వస్తారు.
మనమే సుఖధామము యొక్క దేవతలుగా ఉండేవారమని, సతోప్రధానముగా ఉండేవారమని మీకు తెలుసు.
ప్రతి ఒక్కరూ సతోప్రధానత నుండి తమోప్రధానతలోకి రావాల్సిందే. ఇక్కడ కూర్చునే సమయములో
పిల్లలకు ఇంకా ఎక్కువ ఆనందము కలగాలి, స్మృతి కలగాలి. తండ్రినే మొత్తము ప్రపంచమంతా -
ఓ ముక్తిదాత, మార్గదర్శకుడా, ఓ పతిత-పావనా రండి అంటూ స్మృతి చేస్తుంది. రావణ
రాజ్యములో ఉన్నప్పుడే వారిని పిలుస్తారు, సత్యయుగములో పిలవరు. ఇవి చాలా సహజముగా
అర్థం చేసుకునే విషయాలు. ఇవి ఎవరు వినిపించారు? తండ్రిని కూడా మహిమ చేస్తారు,
టీచరును, సద్గురువును కూడా మహిమ చేస్తారు - ముగ్గురూ ఒక్కరే. ఇది మీ బుద్ధిలో ఉంది.
వీరు తండ్రి, టీచరు మరియు సద్గురువు కూడా. పతితులను పావనముగా తయారుచేయడమే శివబాబా
వ్యాపారము. పతితులు తప్పకుండా దుఃఖితులుగా ఉంటారు. సతోప్రధానముగా ఉన్నవారు సుఖముగా
ఉంటారు, తమోప్రధానముగా ఉన్నవారు దుఃఖితులుగా ఉంటారు. ఈ దేవతలది ఎంత సతోగుణీ స్వభావము.
ఇక్కడి మనుష్యులది కలియుగీ తమోగుణీ స్వభావము. ఇకపోతే, మనుష్యులు నంబరువారుగా
మంచివారిగా లేక చెడ్డవారిగా ఉంటారు. సత్యయుగములో ఎప్పుడూ - వీరు చెడ్డవారు, వీరు
ఇలాంటివారు అని అనరు. అక్కడ చెడు లక్షణాలేవీ ఉండవు. అది ఉన్నదే దైవీ సాంప్రదాయము.
అయితే, షావుకార్లు మరియు పేదవారు ఉండవచ్చు. అంతేకానీ అక్కడ ఇది మంచి గుణము లేక చెడు
గుణము అని పోల్చడానికి ఏమీ ఉండదు, అందరూ సుఖముగా ఉంటారు. దుఃఖము అన్న మాటే ఉండదు.
దాని పేరే సుఖధామము. పిల్లలు తండ్రి నుండి పూర్తి వారసత్వము తీసుకునే పురుషార్థము
చేయాలి. మీ చిత్రాన్ని మరియు లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని కూడా పెట్టుకోవచ్చు.
వీరికి నేర్పించేవారు ఎవరో ఉంటారని అంటారు. ఇది భగవానువాచ కదా. భగవంతునికి తమదంటూ
శరీరమేమీ లేదు. వారు వచ్చి అప్పుగా తీసుకుంటారు. భగీరథుడు అని అంటూ ఉంటారు కూడా,
అంటే వారు తప్పకుండా రథముపై విరాజమానమై ఉన్నారు. వారు నందిపై ఏమీ విరాజమానమవ్వరు.
శివుడిని మరియు శంకరుడిని కలిపేసారు, అందుకే నందిని చూపించారు. తండ్రి అంటారు - మనము
తండ్రికి చెందినవారిగా అయ్యామని మీరు ఎంత సంతోషించాలి. మీరు నా వారు అని తండ్రి కూడా
అంటారు. తండ్రికి పదవిని పొందాలనే సంతోషము లేదు. టీచరు అయితే టీచరే, వారు చదివించాలి.
తండ్రి అంటారు - పిల్లలూ, నేను సుఖ సాగరుడిని, నేను మిమ్మల్ని దత్తత తీసుకున్నాను
కనుక ఇప్పుడు మీకు అతీంద్రియ సుఖము అనుభవమవుతుంది. దత్తత అయితే అనేక రకాలుగా ఉంటుంది.
పురుషుడు కూడా కన్యను దత్తత తీసుకుంటారు. ఆ కన్య అతడిని - వీరు నా పతి అని
భావిస్తుంది. శివబాబా మమ్మల్ని దత్తత తీసుకున్నారని ఇప్పుడు మీరు భావిస్తారు.
ప్రపంచములోని వారికి ఈ విషయాలు అర్థం కావు. వారి దృష్టిలో దత్తత అనగా పరస్పరములో
కామఖడ్గాన్ని ఉపయోగించడము. ఒకవేళ ఎవరైనా రాజు ఒక బిడ్డను దత్తత తీసుకున్నారనుకోండి,
వారు సుఖము కోసం దత్తత తీసుకున్నట్లు అవుతుంది, కానీ అది అల్పకాలికమైన సుఖము.
సన్యాసులు కూడా దత్తత తీసుకుంటారు కదా. వీరు మా గురువు అని మనుష్యులంటే, వీరు మా
ఫాలోవర్స్ అని గురువు అంటారు. ఎన్ని రకాలుగా దత్తత తీసుకుంటారు. తండ్రి పిల్లలను
దత్తత తీసుకుంటారు, వారికి సుఖాన్ని ఇస్తారు, కానీ తర్వాత వివాహము చేసి దుఃఖపు
వారసత్వాన్ని ఇస్తారు. గురువు తీసుకునే దత్తత ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉంది. ఆత్మలను
తమవారిగా చేసుకునేందుకు ఇది ఈశ్వరుని దత్తత. ఇప్పుడు పిల్లలైన మీరు అన్ని రకాల
దత్తతలను చూసారు. సన్యాసులకు చెందినవారిగా ఉన్నప్పటికీ - ఓ పతిత-పావనా రండి, వచ్చి
మమ్మల్ని దత్తత తీసుకుని పావనముగా తయారుచేయండి అని పాడుతూ ఉంటారు. మనమందరము సోదరులము
కానీ, వారు వచ్చి తమవారిగా చేసుకున్నప్పుడే కదా సోదరులుగా అవుతాము. బాబా, మేము
దుఃఖితులుగా అయిపోయామని అంటారు. రావణ రాజ్యము యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు.
దిష్టిబొమ్మను తయారుచేసి కాలుస్తూ ఉంటారు. ఎవరైనా దుఃఖము కలిగిస్తే వారిపై కేసు
పెట్టాలని అనుకుంటారు. కానీ రావణుడు ఎప్పటినుండి శత్రువుగా అయ్యాడు? చివరికి ఈ
శత్రువు మరణిస్తాడా లేదా? ఈ శత్రువు గురించి మీకు మాత్రమే తెలుసు. ఈ శత్రువుపై
విజయము పొందేందుకు మిమ్మల్ని దత్తత తీసుకోవడము జరుగుతుంది. వినాశనము జరగనున్నదని
కూడా పిల్లలైన మీకు తెలుసు, అటామిక్ బాంబులు కూడా తయారై ఉన్నాయి. ఈ జ్ఞాన యజ్ఞము
ద్వారానే వినాశ జ్వాల వెలువడింది. రావణుడిపై విజయము పొంది, తర్వాత కొత్త సృష్టిపై
రాజ్యము చేస్తామని ఇప్పుడు మీకు తెలుసు. మిగిలినదంతా ఒక బొమ్మలాట వంటిది. రావణుడి
దిష్టిబొమ్మ చాలా ఖర్చు చేయిస్తుంది. మనుష్యులు చాలా ధనాన్ని వృధాగా పోగొడతారు.
ఎంతగా రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. వారు భ్రమిస్తూ దుఃఖితులుగా అవుతారు,
ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు మరియు మనము ఇప్పుడు శ్రీమతాన్ని అనుసరిస్తూ, శ్రేష్ఠాచారీ
సత్యయుగీ స్వరాజ్యాన్ని పొందుతున్నాము. సత్యయుగాన్ని స్థాపన చేసే
శ్రేష్ఠాతి-శ్రేష్ఠమైన శివబాబా మనల్ని శ్రేష్ఠమైన దేవతలుగా, విశ్వానికి యజమానులుగా
తయారుచేస్తారు. శ్రీ శ్రీ శివబాబా మనల్ని శ్రీ (శ్రేష్ఠముగా) గా తయారుచేస్తారు. శ్రీ
శ్రీ అని కేవలం ఒక్కరిని మాత్రమే అంటారు. దేవతలను శ్రీ అని అంటారు, ఎందుకంటే వారు
పునర్జన్మలలోకి వస్తారు కదా. వాస్తవానికి శ్రీ అని వికారీ రాజులను కూడా అనలేరు.
ఇప్పుడు మీ బుద్ధి ఎంత విశాలముగా ఉండాలి. మనము ఈ చదువు ద్వారా డబల్ కిరీటధారులుగా
అవుతామని మీకు తెలుసు. మనమే ఒకప్పుడు డబల్ కిరీటధారులుగా ఉండేవారము. ఇప్పుడైతే
సింగిల్ కిరీటము కూడా లేదు. పతితులుగా ఉన్నాము కదా. ఇక్కడ ఎవరికీ ప్రకాశ కిరీటాన్ని
ఇవ్వలేము. ఈ చిత్రాలలో మీరు తపస్యలో కూర్చున్న చోట ప్రకాశ కిరీటాన్ని చూపించకూడదు.
మీరు డబల్ కిరీటధారులుగా భవిష్యత్తులో తయారవ్వనున్నారు. మనము బాబా ద్వారా డబల్
కిరీటధారులైన మహారాజు-మహారాణులుగా తయారయ్యేందుకు వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. ఈ
సంతోషము ఉండాలి. శివబాబాను స్మృతి చేయాలి, అప్పుడు పతితుల నుండి పావనముగా తయారై
స్వర్గానికి యజమానులుగా అయిపోతారు, ఇందులో కష్టముతో కూడిన విషయమేమీ లేదు. ఇక్కడ
విద్యార్థులైన మీరు కూర్చున్నారు. అక్కడ బయట మిత్ర-సంబంధీకులు మొదలైనవారి వద్దకు
వెళ్ళడముతో విద్యార్థి జీవితాన్ని మర్చిపోతారు. అప్పుడు మిత్ర-సంబంధీకులు
గుర్తుకువస్తారు. మాయ ఫోర్సు ఉంది కదా. హాస్టల్ లో ఉంటే బాగా చదువుకుంటారు. బయటకు
వెళ్తూ-వస్తూ ఉంటే సాంగత్య దోషము వలన పాడైపోతారు. ఇక్కడ నుండి బయటకు వెళ్తే
విద్యార్థి జీవితము యొక్క నషా మాయమైపోతుంది. చదివించే బ్రాహ్మణీలకు కూడా ఇక్కడ
ఉన్నప్పుడు ఉన్నంత నషా బయటకు వెళ్తే ఉండదు. ఇది హెడ్ ఆఫీస్, మధుబన్. ఇక్కడ
విద్యార్థులు టీచరు ఎదురుగా ఉంటారు, ఇక్కడ లౌకిక కార్య వ్యవహారాలేవీ ఉండవు. రాత్రికి
పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. కొంతమందైతే మొత్తము రోజంతటిలో శివబాబాను అసలు స్మృతియే
చేయరు. శివబాబాకు సహాయకులుగా అవ్వరు. శివబాబాకు పిల్లలుగా అయ్యారు కనుక సేవ చేయండి.
ఒకవేళ సేవ చేయడము లేదంటే వారు కుపుత్రులు అయినట్లు. బాబా అయితే అర్థం చేసుకుంటారు
కదా. నన్ను స్మృతి చేయండి అని చెప్పడము బాబా బాధ్యత. ఫాలో చేస్తే చాలా-చాలా కళ్యాణము
జరుగుతుంది. వికారీ సంబంధాలైతే భ్రష్టాచారిగా ఉన్నాయి. వాటిని వదిలేస్తూ వెళ్ళండి,
వారితో సాంగత్యము చేయకండి. తండ్రి అయితే అర్థం చేయిస్తారు కానీ వారి భాగ్యములో కూడా
ఉండాలి కదా. బాబా అంటారు - చార్టు పెట్టాలి, దీనితో కూడా చాలా కళ్యాణము జరుగుతుంది.
కొంతమందైతే ఒక గంట కూడా కష్టం మీద స్మృతిలో ఉంటారు. 8 గంటలకు అంతిమములో చేరుకుంటారు.
మీరు కర్మయోగులు కదా. కొంతమందికి అప్పుడప్పుడు ఉత్సాహము కలుగుతుంది, అప్పుడు చార్టు
పెడతారు. అది మంచిదే. తండ్రిని ఎంత స్మృతి చేస్తే, అంత లాభమే ఉంటుంది. ఎవరైతే అంతిమ
సమయములో హరిని స్మరిస్తారో, వారు నారాయణ పదవిని పొందుతారు... అని అంటూ ఉంటారు. ఈ
నానుడిలో మళ్ళీ-మళ్ళీ అని ఎందుకంటారు? ఎవరైతే మంచి రీతిలో స్మృతి చేయరో, వారి
జన్మజన్మల భారమేదైతే ఉందో, అది వారిని మళ్ళీ-మళ్ళీ జన్మ తీసుకునేలా చేసి
సాక్షాత్కారాలు కలిగిస్తుంది, తద్వారా శిక్ష లభిస్తుంది. ఉదాహరణకు కాశీలో కత్తుల
బావిలోకి దూకిన వెంటనే వారికి వారి పాపాలు సాక్షాత్కారమవుతాయి. మేము పాపాలకు శిక్ష
పొందుతున్నామని వారు రియలైజ్ అవుతారు. చాలా శిక్షలు అనుభవించేవారు ఉంటారు. బాబా
సేవలో ఎవరైతే విఘ్నాలు కలిగిస్తారో, వారు శిక్షలకు యోగ్యులు. వారు తండ్రి సేవలో
ఆటంకాలు కలిగిస్తారు. తండ్రికి రైట్ హ్యాండ్ ధర్మరాజు. తండ్రి అంటారు - మీతో మీరు
ప్రతిజ్ఞ చేసుకోండి ఎందుకంటే తండ్రి స్మృతితోనే మీరు పావనముగా అవుతారు. లేదంటే
పావనముగా అవ్వరు. తండ్రి అయితే ప్రతిజ్ఞ చేయిస్తారు. ఇక చేస్తారా, చేయరా అనేది మీ
ఇష్టము. ఎవరైతే చేస్తారో, వారు పొందుతారు. ప్రతిజ్ఞ చేసేవారు చాలా మంది ఉంటారు కానీ
కొందరు మళ్ళీ చెడు పనులు చేస్తూ ఉంటారు. భక్తి మార్గములో - నాకైతే ఒక్కరు తప్ప
ఇంకెవ్వరూ లేరని పాడుతూ ఉంటారు. కానీ, ఆత్మ ఆ విధముగా ఎందుకు పాడుతూ వచ్చిందని అనేది
ఇప్పుడు మీ బుద్ధిలోకి వచ్చింది. నాకైతే ఒక్క గిరిధర గోపాలుడు తప్ప ఇంకెవ్వరూ లేరు...
అని రోజంతా పాడుతూ ఉంటారు. సంగమములో తండ్రి వచ్చినప్పుడే ఇంటికి తీసుకువెళ్తారు.
మీరు కృష్ణపురిలోకి వెళ్ళేందుకు చదువుకుంటారు కదా. రాకుమారుల కాలేజ్ ఉంటుంది, అక్కడ
రాకుమారులు, రాకుమార్తెలు చదువుకుంటారు. అది హద్దు విషయము. వారైతే అప్పుడప్పుడు
అనారోగ్యము పాలవుతారు, మరణించవచ్చు కూడా. ఇది రాకుమార-రాకుమారీలుగా తయారయ్యే గాడ్
ఫాదర్లీ యూనివర్సిటీ. ఇది రాజయోగము కదా. మీరు నరుని నుండి నారాయణునిగా తయారవుతారు.
మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుని సత్యయుగ రాకుమార-రాకుమారీలుగా అవుతారు.
తండ్రి పిల్లలైన మీకు ఎంతటి ఆనందము కలిగించే విషయాలను వినిపిస్తారు. ఇవి గుర్తుండాలి
కదా. కొంతమందైతే ఇక్కడ నుండి బయటకు వెళ్ళగానే చిక్కుకుపోతారు. తండ్రిని స్మృతి
చేయడము కూడా నంబరువారుగా చేస్తారు. ఎవరైతే ఎక్కువ స్మృతి చేస్తూ ఉంటారో, వారు ఇతరుల
చేత కూడా స్మృతి చేయిస్తూ ఉంటారు. అనేకుల కళ్యాణాన్ని ఎలా చేయాలి అన్నదే బుద్ధిలో
ఉండాలి. బయట ఉన్నవారు ప్రజలకు దాస-దాసీలుగా అవుతారు, ఇక్కడున్నవారు రాజులకు
దాస-దాసీలుగా అవుతారు. మున్ముందు అన్నీ సాక్షాత్కారమవుతూ ఉంటాయి. నిజంగా మేము పూర్తి
పురుషార్థము చేయలేదు అని మీరు కూడా అనుకుంటారు. చాలా చమత్కారాలు చూస్తారు. ఎవరైతే
మంచి రీతిలో చదువుకుంటారో, వారే నవాబులుగా అవుతారు. తండ్రి ఎంతగా చెప్తూ ఉంటారు -
సెంటర్లకు ప్రదర్శనీ చిత్రాలను ఇస్తాను, వాటిని పిల్లలకు నేర్పించి తెలివైనవారిగా
తయారుచేయండి. అప్పుడు బి.కె.లకు సేవ చేయడము వచ్చు అని బాబా అనుకుంటారు. సేవ చేస్తే
ఉన్నత పదవిని పొందుతారు. అందుకే బాబా ప్రదర్శనీలు తయారుచేయడానికి
ప్రాముఖ్యతనిస్తున్నారు. ఈ చిత్రాలను తయారుచేయడము అనేది చాలా సాధారణమైన విషయము.
ధైర్యము చేసి ప్రదర్శనీ చిత్రాలను తయారుచేయడములో సహాయము చేయాలి, అప్పుడు పిల్లలకు
అర్థం చేయించడము సులభమవుతుంది. మేనేజర్లు అయిన టీచర్లు చల్లబడిపోయారని బాబా
భావిస్తారు. కొంతమంది బ్రాహ్మణీలు మేనేజర్లుగా అవుతారు, అప్పుడు వారికి దేహాభిమానము
వచ్చేస్తుంది. తమను తాము అన్నీ తెలిసినవారిగా భావిస్తారు. మేము చాలా బాగా
నడుచుకుంటున్నామని భావిస్తారు. కానీ వారి గురించి ఇతరులను అడిగితే 10 విషయాలు
వినిపిస్తారు. మాయ పెద్ద చక్రములో వేసేస్తుంది. పిల్లలైతే ఎల్లప్పుడూ సేవలోనే
నిమగ్నమై ఉండాలి. తండ్రి దయార్ద్ర హృదయుడు, దుఃఖహర్త-సుఖకర్త కనుక పిల్లలు కూడా అలా
తయారవ్వాలి. కేవలం తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి
చేసినట్లయితే నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయిపోతారు. ఇది ఎంత సహజము. తండ్రి
అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే పతితుల నుండి పావనముగా అయి, మీరు శాంతిధామానికి
మరియు సుఖధామానికి వెళ్తారు. ఎవరికైనా నిశ్చయము ఏర్పడితే వెంటనే వారి చేత
వ్రాయించాలి. బ్రహ్మాకుమార-కుమారీలు నిజంగా శివబాబా నుండి వారసత్వాన్ని
తీసుకుంటున్నారని వ్రాస్తారు కూడా. అప్పుడు, అటువంటి తండ్రికి చెందినవారిగా
తప్పకుండా అవ్వాలి, వారి శరణు తీసుకోవాలి అని అర్థం చేసుకుంటారు. మీరు తండ్రి
శరణులోకి వచ్చారు కదా అనగా తండ్రి ఒడిలోకి వచ్చారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి సమానముగా దయార్ద్ర హృదయులుగా, దుఃఖహర్త-సుఖకర్తలుగా అవ్వాలి.
2. సాంగత్య దోషము నుండి తమను తాము చాలా-చాలా సంభాళించుకోవాలి. ఒక్క తండ్రినే ఫాలో
చేయాలి. అనేకుల కళ్యాణము చేసే సేవ చేయాలి. ఎప్పుడూ అహంకారములోకి వచ్చి నాకు అంతా
తెలుసు అని అనుకోకూడదు.
వరదానము:-
అంతర్ముఖులుగా అయి తమ సమయాన్ని మరియు సంకల్పాలను పొదుపు చేసే
విఘ్నజీత్ భవ
ఏదైనా కొత్త శక్తిశాలి ఆవిష్కరణ చేసేటప్పుడు, అండర్
గ్రౌండ్ లో చేస్తారు. మీరు కూడా ఎంతగా అంతర్ముఖులుగా అనగా అండర్ గ్రౌండ్ లో ఉంటారో,
అంతగా వాయుమండలము నుండి రక్షించబడతారు, మనన శక్తి పెరుగుతుంది మరియు మాయ విఘ్నాల
నుండి కూడా సురక్షితముగా ఉంటారు. బాహ్యముఖతలోకి వస్తూ కూడా, అంతర్ముఖులుగా,
హర్షితముఖులుగా, ఆకర్షణా మూర్తులుగా ఉండండి, కర్మలు చేస్తూ కూడా ఈ అభ్యాసము
చేసినట్లయితే, సమయము కూడా పొదుపు అవుతుంది మరియు సఫలతను కూడా అధికముగా అనుభవము
చేస్తారు.
స్లోగన్:-
అనారోగ్యానికి
భయపడకండి, దానికి మెడిసిన్ రూపీ ఫ్రూట్ ను తినిపించి వీడ్కోలు ఇవ్వండి.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి
పిల్లలైన మీరు ఏ ఆత్మ
నుండీ కూడా ఏమీ తీసుకోకూడదు. కేవలం ఒక్క బాబా నుండే తీసుకోవాలి మరియు ఏదైతే
తీసుకున్నారో, దానిని అందరికీ ఇవ్వాలి. ఎక్కడైతే ఇవ్వటము ఉంటుందో అక్కడ తీసుకునే
కోరికను పెట్టుకోకూడదు. ఒకవేళ ఒక ఆత్మ ఇంకొక ఆత్మ నుండి ఏదైనా తీసుకోవాలి అనే
కోరికను పెట్టుకున్నట్లయితే వారికి అల్పజ్ఞ ఆత్మల నుండి అల్పకాలిక ప్రాప్తియే
కలుగుతుంది. సర్వజ్ఞుడైన ఒక్క బాబా నుండి మాత్రమే సదాకాలపు ప్రాప్తి కలుగుతుంది. ఏ
విధమైన తీసుకోవాలన్న కోరికైనా తమ స్వమానము నుండి కిందకు పడేస్తుంది.