27-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - జ్ఞాన సాగరుడైన తండ్రి ద్వారా మీరు
మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయ్యారు, మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది,
అందుకే మీరు త్రినేత్రులు, త్రికాలదర్శులు మరియు త్రిలోకనాథులు’’
ప్రశ్న:-
విశ్వము
యొక్క ఆత్మిక సేవను పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు - ఎందుకు?
జవాబు:-
ఎందుకంటే మీకు
మాత్రమే సుప్రీమ్ ఆత్మ (శివబాబా) యొక్క శక్తి లభిస్తుంది. మొదట ఆత్మలైన మీకు
సుప్రీమ్ ఆత్మ ద్వారా జ్ఞానపు ఇంజెక్షన్ వేయడము జరుగుతుంది, దీని ద్వారా 5 వికారాలపై
మీరు స్వయము కూడా విజయాన్ని పొందుతారు మరియు ఇతరులను కూడా విజయము పొందేలా చేస్తారు.
ఇటువంటి సేవను ఇంకెవ్వరూ చేయలేరు. కల్ప-కల్పము పిల్లలైన మీరు మాత్రమే ఈ ఆత్మిక సేవను
చేస్తారు.
ఓంశాంతి
తండ్రి స్మృతిలో కూర్చోవాలి, ఇంకే దేహధారి స్మృతిలోనూ కూర్చోకూడదు. కొత్త-కొత్తవారు
ఎవరైతే వస్తారో, వారికి తండ్రి గురించి తెలియనే తెలియదు. వారి పేరు చాలా సహజమైనది,
శివబాబా. తండ్రి గురించి పిల్లలకు తెలియదు, ఇది ఎంత విచిత్రము. శివబాబా
ఉన్నతోన్నతమైనవారు, సర్వుల సద్గతిదాత. వారిని పతితులందరి పావన కర్త, సర్వుల
దుఃఖహర్త అని కూడా అంటారు, కానీ వారెవరు, ఇది బి.కె.లైన మీకు తప్ప ఇంకెవ్వరికీ
తెలియదు. మీరు వారి మనవలు-మనవరాళ్లు. కావున తప్పకుండా మీకు మీ తండ్రి గురించి మరియు
వారి రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుస్తుంది. తండ్రి ద్వారా పిల్లలే అంతా
తెలుసుకుంటారు. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. కలియుగీ పతితులందరినీ సత్యయుగీ పావనులుగా
ఎలా తయారుచేస్తారు అనేది బి.కె.లకు తప్ప ప్రపంచములో ఇంకెవ్వరికీ తెలియదు. కలియుగీ
దుర్గతి నుండి బయటకు తీసేది సత్యయుగీ సద్గతినిచ్చే దాత అయిన తండ్రి మాత్రమే.
శివజయంతి కూడా భారత్ లోనే జరుగుతుంది. తప్పకుండా వారు వస్తారు కానీ వచ్చి భారత్ కు
ఏమిస్తారు, ఇది భారతవాసులకు తెలియదు. ప్రతి సంవత్సరము శివజయంతిని జరుపుకుంటారు కానీ
జ్ఞానము యొక్క మూడవ నేత్రము లేదు, అందుకే తండ్రి గురించి తెలియదు.
పాట:- నయనహీనులకు మార్గాన్ని చూపండి...
మేమందరము నయనహీనులము అన్న పాట మనుష్యుల ద్వారా తయారుచేయబడినదే. ఈ స్థూల నయనాలైతే
అందరికీ ఉన్నాయి, కానీ స్వయాన్ని నయనహీనులమని ఎందుకనుకుంటున్నారు? జ్ఞానము యొక్క
మూడవ నేత్రము ఎవరికీ లేదని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. తండ్రిని
తెలుసుకోకపోవడము అన్నది అజ్ఞానము. తండ్రిని తండ్రి ద్వారా తెలుసుకోవడము, దీనిని
జ్ఞానమని అంటారు. తండ్రి జ్ఞానము యొక్క మూడవ నేత్రాన్ని ఇస్తారు, దీని ద్వారా మీరు
మొత్తం రచన యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకుంటారు. జ్ఞానసాగరుని పిల్లలైన మీరు మాస్టర్
జ్ఞానసాగరులుగా అవుతారు. మూడవ నేత్రము అంటేనే త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా,
త్రిలోకనాథులుగా అవుతారు. సత్యయుగానికి యజమానులుగా ఉండే ఈ లక్ష్మీ-నారాయణులకు, ఈ
వారసత్వము ఎలా లభించింది, వారెప్పుడు వచ్చారు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు, మళ్ళీ
ఎలా రాజ్యము తీసుకున్నారు అన్నది భారతవాసులకు తెలియదు. వారికి అసలేమీ తెలియదు. ఈ
దేవతలు పావనమైనవారు కదా. పావనముగా తప్పకుండా తండ్రియే తయారుచేస్తారు.
దేవతలను, శివుడిని నమ్మే భారతవాసులైన మీకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు.
శివుని జన్మ కూడా భారత్ లోనే జరిగింది. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు. శివజయంతిని కూడా
ఇక్కడే జరుపుకుంటారు. జగదంబ, జగత్ పిత అయిన బ్రహ్మా మరియు సరస్వతుల జన్మ కూడా ఇక్కడే
జరిగింది. లక్ష్మీ-నారాయణుల జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది, వారే రాధా-కృష్ణులు, ఇది
కూడా భారతవాసులకు తెలియదు. పతిత-పావనా రండి అని పిలుస్తారు, అంటే తప్పకుండా అందరూ
పతితులుగానే ఉన్నారు. సాధువులు, సత్పురుషులు, ఋషులు, మునులు మొదలైనవారంతా మమ్మల్ని
పావనముగా తయారుచేయడానికి రండి అని పిలుస్తారు. మరోవైపు పాపాలను కడుక్కునేందుకని
కుంభమేళాలు మొదలైనవాటికి వెళ్తారు. గంగను పతిత-పావనిగా భావిస్తారు. పతిత-పావనా రండి
అని పిలుస్తున్నారంటే, మనుష్యమాత్రులు ఎవరినైనా పావనముగా ఎలా చేయగలరు? తండ్రి అర్థం
చేయిస్తున్నారు, మీరు మొదట దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉన్నప్పుడు అందరూ
పావనముగా ఉండేవారు, ఇప్పుడు పతితముగా ఉన్నారు. మార్గాన్ని తెలియజేయండి ప్రభూ అని
అంటారు. మరి ఎక్కడికి వెళ్ళే మార్గము? బాబా, జీవన్ముక్తికి మార్గాన్ని తెలియజేయండి,
మాలో 5 వికారాలు ఉన్నాయి అని అంటారు. బాబా, మేమంతా స్వర్గములో ఉన్నప్పుడు
నిర్వికారులుగా ఉండేవారము, ఇప్పుడు వికారులుగా, పతితులుగా అయిపోయాము, దీని
రహస్యమేమిటో కాస్త అర్థం చేయించండి అని అంటారు. ఇవి కల్పితమైన కథలేమీ కావు. తండ్రి
అర్థం చేయిస్తున్నారు - ఇది శ్రీమత్ భగవత్ గీత అనగా పరమాత్ముని ద్వారా వినిపించబడిన
గీత. పతితులను పావనముగా చేసేవారు నిరాకారుడైన భగవంతుడు. మనుష్యులను భగవంతుడని అనలేరు.
తండ్రి అంటారు - ఇంతమంది పెద్ద-పెద్ద గురువులున్నప్పటికీ భారత్ ఇంత పతితముగా, గవ్వ
సమానముగా ఎందుకు తయారయ్యింది. భారత్ ఖండము స్వర్గముగా ఉండేది అన్నది నిన్నటి విషయమే.
బాబా భారత్ కు స్వర్గము యొక్క కానుకను ఇచ్చారు. వారు వచ్చి పతితులైన భారతవాసులను
రాజయోగము నేర్పించి పావనముగా తయారుచేసారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి సేవాధారిగా అయ్యి
పిల్లల వద్దకు వచ్చారు. తండ్రి ఆత్మిక సేవాధారి. మిగిలిన మనుష్యమాత్రులందరూ దైహిక
సేవాధారులు. సన్యాసులు కూడా దైహిక సేవాధారులే. వారు కూర్చుని పుస్తకాలు మొదలైనవాటిని
వినిపిస్తారు. తండ్రి అంటారు, నిరాకారుడినైన నేను, సాకార సాధారణ వృద్ధ తనువులోకి
ప్రవేశించి పిల్లలకు అర్థం చేయిస్తున్నాను. ఓ భారతవాసీ పిల్లలూ, చూడండి, ఆత్మిక
తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ బ్రహ్మా వినిపించరు, ఆ
నిరాకారుడైన తండ్రి ఈ తనువును ఆధారముగా తీసుకుంటారు. శివునికైతే తమదంటూ శరీరము లేదు.
సాలిగ్రామాలైన ఆత్మలకైతే తమ-తమ శరీరాలు ఉన్నాయి. పునర్జన్మలలోకి వస్తూ-వస్తూ
పతితముగా అయిపోతారు. ఇప్పుడైతే మొత్తము ప్రపంచమంతా పతితముగా ఉంది. పావనమైనవారు
ఒక్కరు కూడా లేరు. మీరు సతోప్రధానముగా ఉండేవారు, ఆ తర్వాత మాలిన్యము చేరడముతో సతో
నుండి రజో, తమోలలోకి వచ్చారు. భారతవాసులైన మీ వద్దకు శివబాబా వచ్చి శరీరాన్ని ధారణ
చేస్తారు, వారిని భగీరథుడని కూడా అంటారు. మందిరాలలో శంకరుని చిత్రాన్ని చూపిస్తారు
ఎందుకంటే వారు శివుడిని, శంకరుడిని ఒక్కరే అని భావిస్తారు. శివుడు నిరాకారుడు,
శంకరుడు ఆకారీ అన్నది వారు అర్థం చేసుకోరు. శివ-శంకరులు ఒక్కరేనని ఎలా అంటారు. అచ్ఛా,
మరి నందిపై ఎవరు సవారీ చేస్తారు. శివుడా లేక శంకరుడా? సూక్ష్మవతనములోకి నంది ఎక్కడి
నుండి వచ్చినట్లు? శివుడు మూలవతనములో, శంకరుడు సూక్ష్మవతనములో ఉంటారు. మూలవతనములో
ఆత్మలంతా ఉంటారు. సూక్ష్మవతనములో కేవలం బ్రహ్మా-విష్ణు-శంకరులు మాత్రమే ఉంటారు.
అక్కడ జంతువులు ఉండవు. తండ్రి అంటారు, నేను సాధారణ వృద్ధ తనువులోకి ప్రవేశించి మీకు
అర్థం చేయిస్తాను. పిల్లలైన మీకు మీ జన్మల గురించి తెలియదు. సత్యయుగము నుండి
మొదలుకుని మీరు ఎన్ని జన్మలు తీసుకున్నారు? 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడిది మీ
చివరి జన్మ. భారత్ అమరలోకముగా, పావనముగా ఉండేది, అది ఇప్పుడు మృత్యులోకముగా,
పతితముగా ఉంది. సర్వుల సద్గతిదాత అయితే ఒక్కరే కదా. రుద్రమాల అనేది పరమపిత పరమాత్మ
అయిన నిరాకార శివునిదే. శ్రీ శ్రీ 108 రుద్రమాల అని అంటారు. అందరూ శివుని కంఠహారము
వంటివారే. తండ్రి పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత, అందరికీ వారసత్వాన్ని ఇచ్చేవారు.
లౌకిక తండ్రి నుండి హద్దు వారసత్వము లభిస్తుంది, దానిని సన్యాసులు కాకిరెట్ట
సమానమైన సుఖమని భావిస్తారు. తండ్రి అంటారు, తప్పకుండా మీ ఆ సుఖము కాకిరెట్టతో
సమానమైనదే. తండ్రియే వచ్చి జ్ఞానము ద్వారా పతితులను పావనముగా మరియు ముళ్లను
పుష్పాలుగా తయారుచేస్తారు. ఇది గీతా జ్ఞానము. ఈ జ్ఞానాన్ని మనుష్యులెవ్వరూ అర్థం
చేయించలేరు. జ్ఞానసాగరుడు, పతిత-పావనుడైన తండ్రి మాత్రమే అర్థం చేయించగలరు. తండ్రి
నుండే వారసత్వము లభిస్తుంది, దానిని మీరు తీసుకుంటున్నారు. కేవలం మీరు మాత్రమే
సద్గతి వైపుకు వెళ్తున్నారు. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు, వారు కలియుగములో
ఉన్నారు. ఇప్పుడిది కలియుగము యొక్క అంతిమము. మహాభారత యుద్ధము కూడా ఎదురుగా నిలబడి
ఉంది. 5 వేల సంవత్సరాల క్రితం కూడా మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నప్పుడు, ఈ
ప్రపంచానికి నిప్పు అంటుకుంది. ఇప్పుడు మీరు ఈ విధముగా లక్ష్మీ-నారాయణులుగా
తయారయ్యేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మిగిలినదంతా భక్తి మార్గము. తండ్రి
ఎప్పుడైతే వస్తారో, అప్పుడు వారు స్వర్గ ద్వారాలను తెరుస్తారు. తండ్రి అంటారు, ఈ
శివశక్తి భారతమాతలైతే శ్రీమతము ఆధారముగా భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు. మీరు
శివశక్తి భారతమాతలు, మీరు మొత్తము విశ్వాన్ని స్వర్గముగా తయారుచేస్తున్నారు. మీరు
ఉన్నదే శివుని సంతానము, మీరు వారినే స్మృతి చేస్తారు. మీరు శివుని నుండి శక్తిని
తీసుకుని 5 వికారాల రూపీ శత్రువులపై విజయము పొందుతారు. పిల్లలైన మీరు 5 వేల
సంవత్సరాల క్రితం కూడా భారత్ యొక్క ఆత్మిక సేవను చేసారు. ఆ సంఘసేవకులైతే దైహిక సేవను
చేస్తారు. ఇది ఆత్మిక సేవ. సుప్రీమ్ ఆత్మ వచ్చి ఆత్మలకు ఇంజెక్షన్ వేస్తారు,
చదివిస్తారు. ఆత్మయే వింటుంది. మీరు ఆత్మలు. మీరే 84 జన్మలను తీసుకుంటారు. ఒక
శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. 84 జన్మలు తీసుకుని 84 తల్లిదండ్రులను పొందారు.
సత్య-త్రేతాయుగాలలో మీరు స్వర్గ సుఖాలను పొందారు, ఇప్పుడు మళ్ళీ అనంతమైన తండ్రి
ద్వారా సుఖ వారసత్వాన్ని తీసుకుంటున్నారు. తప్పకుండా భారతఖండములో ఈ
లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. అక్కడ రాక్షసులు మొదలైనవారు ఎవరూ ఉండేవారు కాదు.
ఇప్పుడు ఈ పాత ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నదని మీకు తెలుసు. నేను వచ్చి జ్ఞాన
యజ్ఞాన్ని రచిస్తాను. మీరంతా పవిత్రమైన దేవతలుగా అవుతారు. దేవతలుగా అయ్యే
పురుషార్థాన్ని చేస్తున్నవారు వేలాదిమంది ఉన్నారు. పిల్లల సద్గతి చేయడానికని తండ్రి
వచ్చారు. పిల్లలైన మిమ్మల్ని ముళ్ళు నుండి పుష్పాలుగా చేస్తున్నారు. మీకు జ్ఞానము
యొక్క మూడవ నేత్రాన్ని ఇస్తున్నారు, దీని ద్వారా మీరు మొత్తం డ్రామాను గురించి,
శివబాబా అభినయించే పాత్రను గురించి అంతా తెలుసుకుంటారు. బ్రహ్మా మరియు విష్ణువులకు
మధ్యన కనెక్షన్ ఏమిటి అనేది కూడా మీకు తెలుసు. విష్ణువు నాభి నుండి బ్రహ్మా
వెలువడినట్లు వారు చూపిస్తారు. బ్రహ్మాయే వెళ్ళి విష్ణువుగా అవుతారు. బ్రాహ్మణులే
మళ్ళీ దేవతలుగా అవుతారు. విష్ణువు నుండి బ్రహ్మాగా అవ్వడానికి 5 వేల సంవత్సరాలు
పట్టింది. ఈ జ్ఞానము మీకు ఉంది. బ్రాహ్మణులైన మీ నాభి కమలము నుండి విష్ణుపురి
ప్రత్యక్షమవుతుంది. వారు విష్ణు నాభి నుండి బ్రహ్మా వెలువడినట్లుగా, అప్పుడు సర్వ
వేద-శాస్త్రాల సారాన్ని వినిపించినట్లుగా చిత్రాన్ని తయారుచేసారు. ఇప్పుడు మీరు
బ్రహ్మా ద్వారా మొత్తం సారాన్ని అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు, ముఖ్యమైన
ధర్మశాస్త్రాలు నాలుగు, మొదటి దైవీ ధర్మము యొక్క శాస్త్రము గీత. గీతను ఎవరు
వినిపించారు? శివబాబా. జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు, సుఖసాగరుడు శివబాబాయే. వారు
కూర్చుని భారతఖండాన్ని స్వర్గముగా తయారుచేసారు, అంతేకానీ శ్రీకృష్ణుడు కాదు.
శ్రీకృష్ణుడైతే నా ద్వారా జ్ఞానాన్ని విని శ్రీకృష్ణునిగా అయ్యారు. మరి ఇది
గుప్తమైన విషయము కదా. కొత్త-కొత్త పిల్లలు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు.
శివబాబా స్వర్గాన్ని స్థాపన చేసారు, అక్కడ ఈ లక్ష్మీ-నారాయణులు రాజ్యము చేసేవారు.
ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. తండ్రి అంటారు, ఈ మృత్యులోకములో,
ఈ దుఃఖధామములో ఇది మీ అంతిమ జన్మ. భారత్ అమరలోకముగా ఉండేది. అక్కడ దుఃఖము యొక్క పేరే
ఉండేది కాదు. భారత్ పరిస్తాన్ గా ఉండేది, ఇప్పుడు శ్మశానవాటికగా తయారయ్యింది, మళ్ళీ
పరిస్తాన్ గా అవుతుంది. ఇవన్నీ అర్థం చేసుకోవలసి విషయాలు. ఇది మనుష్యుల నుండి
దేవతలుగా తయారయ్యే పాఠశాల. ఇది శాస్త్రాలను కూర్చుని వినిపించే సన్యాసుల సత్సంగమేమీ
కాదు. 7 రోజుల కోర్స్ తీసుకోనంతవరకు ఈ విషయాలను కొత్తవారెవరూ అర్థం చేసుకోలేరు. ఈ
సమయములో మనుష్యమాత్రులందరూ భక్తులే, వారి ఆత్మ కూడా స్మృతి చేస్తుంది. ఒక్క
ప్రియుడైన పరమాత్మకు అందరూ ప్రేయసులే.
తండ్రి వచ్చి సత్యఖండాన్ని తయారుచేస్తారు. అర్ధకల్పము తర్వాత మళ్ళీ రావణుడు వచ్చి
అసత్యఖండముగా తయారుచేస్తాడు. ఇప్పుడిది సంగమము. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు.
అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి శ్రీమతముపై నడుస్తూ సత్యాతి-సత్యమైన ఆత్మిక సేవను చేయాలి.
సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తిని తీసుకుని 5 వికారాల రూపీ శత్రువులపై విజయము
పొందాలి.
2. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. జ్ఞానాన్ని
ధారణ చేసి ముళ్ళు నుండి పుష్పాలుగా తయారవ్వాలి మరియు తయారుచేయాలి.
వరదానము:-
వినాశన సమయములో పరీక్షలో పాస్ అయ్యే ఆకారీ లైట్ రూపధారీ భవ
వినాశన సమయములో పరీక్షలో పాస్ అయ్యేందుకు మరియు సర్వ
పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆకారీ లైట్ రూపధారులుగా అవ్వండి. ఎప్పుడైతే మీరు
నడుస్తూ-తిరుగుతూ ఉన్న లైట్ హౌస్ లుగా అయిపోతారో, అప్పుడిక మీ ఈ రూపము (శరీరము)
కనిపించదు. ఏ విధముగా పాత్రను అభినయించే సమయములో వస్త్రాన్ని ధారణ చేస్తారో, కార్యము
సమాప్తము అయ్యాక వస్త్రాన్ని విడిచిపెడతారో, అలా ఒక్క క్షణములో ధరించండి మరియు ఒక్క
క్షణములో అతీతముగా అయిపోండి - ఎప్పుడైతే ఇటువంటి అభ్యాసము ఉంటుందో అప్పుడు చూసేవారు
కూడా అనుభవము చేస్తారు - వీరు ప్రకాశ వస్త్రధారులు, ప్రకాశమే వీరి అలంకారము అని.
స్లోగన్:-
ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలు సదా తోడుగా ఉన్నట్లయితే ప్రతి కార్యములోనూ సఫలత సహజముగా
లభిస్తుంది.
అవ్యక్త సూచనలు -
‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’
తండ్రి
సర్వశక్తివంతుడు కావున వారి చేతిని పట్టుకున్నవారు తప్పకుండా చేరుకుంటారు అన్న
నమ్మకము పెట్టుకోండి. స్వయము బలహీనముగా ఉన్నా కానీ సహచరుడైతే శక్తిశాలిగా ఉన్నారు
కదా! అందుకే తప్పకుండా దాటివేస్తారు. నేను నిశ్చయబుద్ధి విజయీ రత్నాన్ని అని సదా ఈ
స్మృతిలోనే ఉండండి. గతం గతః, బిందువు పెట్టి ముందుకు వెళ్ళిపోండి.
విశేష సూచన - ఈ రోజు
ప్రియమైన బాప్ దాదాకు అతి ప్రియమైనవారు, దేశ విదేశాలలోని బ్రాహ్మణ పరివారములోని
వారందరి ప్రాణమైన, మనందరి హృదయాలలో రాజ్యము చేసేవారు అయిన మన మధురమైన జానకి దాదీగారి
పుణ్య స్మృతి దివసము. దాదీగారు 104 సంవత్సరాల వయసు వరకు విదేహీ మరియు జీవన్ముక
స్థితిలో ఉంటూ జ్ఞానదానముతో పాటుగా గుణాల దానాన్ని చేస్తూ పూర్తి పరివారము యొక్క
అలౌకిక పాలన చేసారు. సారముతో నిండిన, జ్ఞానము యొక్క అనేక గుహ్య రహస్యాలతో నిండిన
వారి క్లాసులు అందరికీ మార్గదర్శనము కలిగిస్తుంటాయి. ఈ రోజుకు కూడా వారి ఛత్రఛాయ
అనుభవమవుతుంది మరియు వారి ద్వారా లభించిన అమూల్యమైన శిక్షణలు అనేకమంది బ్రహ్మావత్సల
చెవులలో మారుమ్రోగుతూ ఉంటాయి. దాదీగారు సత్యత, స్వచ్ఛత మరియు నిరాడంబరతకు ప్రతిరూపము.
దాదీగారి నుండి లభించిన అనేక అమూల్యమైన శిక్షణల నుండి కొన్ని శిక్షణలను ఇక్కడ
ఇస్తున్నాము, అందరూ వీటిని మీ మనసులోకి గ్రహించగలరు.
1. తమలో ఉన్న సూక్ష్మ
అభిమానాన్ని పరిశీలించుకుని దానిని త్వరగా సమాప్తము చేసుకోవటమే తమను తాము
ఆశీర్వదించుకోవటము.
2. ఎక్కువగా
ఆలోచించటము, మాట్లాడటము మరియు చింతించటము ద్వారా శక్తి ఖర్చు అయిపోతుంది, సైలెన్స్
లో ఉన్నట్లయితే శక్తి జమ అవుతుంది.
3. ఎవరి పొరపాటు
మనసులో ఉండకూడదు, మనసును శుభ్రముగా ఉంచుకున్నట్లయితే ప్రశాంతముగా ఉండగలరు.
4. వివేకము ద్వారా
వ్యర్థాన్ని మరియు నెగెటివ్ ను సమాప్తము చేసినట్లయితే శాంతిప్రియులుగా అయిపోతారు.
5. బాబా నుండి ప్రైజ్
తీసుకోవాలంటే నియమాలపై నడవండి, కొంచెము కూడా ఎక్కడా మోహము గాని, మొగ్గు చూపించడము
గాని ఉండకూడదు.
6. కర్మలు మరియు
సంబంధాల గురించి గుణాల ద్వారా తెలుస్తుంది, అందుకే కర్మలలో ఆత్మికత మరియు సంబంధాలలో
సత్యత ఉండాలి.
7. నమ్రత మరియు సత్యతలను మీ సహచరులుగా చేసుకున్నట్లయితే ప్రతి విషయము ఏక్యురేట్ గా
ఉంటుంది.
8. ప్రేమను
యాచించేందుకు బదులుగా స్వమానములో ఉంటూ అందరికీ గౌరవాన్ని ఇచ్చినట్లయితే ప్రేమకు
పాత్రులుగా అయిపోతారు.
9. ఎవరైతే సత్యముగా,
స్వచ్ఛముగా మరియు సర్వీసబుల్ గా ఉంటారో, వారే పరమాత్ముని ప్రేమకు పాత్రులు.
10. సేవ చేస్తూ డబల్
లైట్ గా ఉండటము, ఇదే అన్నింటికంటే పెద్ద సేవ.
11. పెద్ద విషయాన్ని
చిన్నదిగా చేసినట్లయితే బల్లెము కూడా ముల్లులా అయిపోతుంది.
12. చింతన అనేది
సాధనలో అడ్డుపడుతుంది మరియు స్మరణ అనేది సాధన ద్వారా సిద్ధిని కలిగిస్తుంది.
13. సంతోషమనే ఖజానాను
సదా స్థిరంగా ఉంచుకోవాలంటే పాజిటివ్ గా ఆలోచించే విధానాన్ని నేర్చుకోండి.
14. ఇప్పటి మీ
స్థితియే అంతిమములో పనికివస్తుంది, అందుకే మీ స్థితిని తయారుచేసుకునే విషయము పట్ల
శ్రద్ధ వహించండి.
15. మనోబలాన్ని ఎంతగా
పెంచుకోండి అంటే ముళ్ళ అడవిలో స్వయము కూడా సురక్షితముగా ఉండగలగాలి మరియు ఇతరులకు
కూడా సహయోగాన్ని ఇవ్వగలగాలి.
16. అపవిత్రత నుండి
ముక్తులుగా అవ్వాలంటే ఆంతరిక వైరాగ్య వృత్తిని ధారణ చేయండి.