27-04-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు పుష్పాలుగా అయి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి, పుష్పాల వంటి పిల్లల నోటి నుండి రత్నాలు వెలువడతాయి’’

ప్రశ్న:-
పుష్పాలుగా అయ్యే పిల్లలకు సదా సుగంధభరితముగా ఉండేందుకని భగవంతుడు ఎటువంటి శిక్షణనిస్తారు?

జవాబు:-
ఓ నా పుష్పాల వంటి పిల్లలూ, మిమ్మల్ని మీరు ఆంతరికముగా చూసుకోండి - నా లోపల ఆసురీ అవగుణము రూపీ ముల్లు ఏదీ లేదు కదా! ఒకవేళ లోపల ఏదైనా ముల్లు ఉన్నట్లయితే - ఎలాగైతే ఇతరుల అవగుణాల పట్ల ద్వేషము కలుగుతుందో, అలా మీ ఆసురీ అవగుణాలను కూడా ద్వేషించండి, అప్పుడు ఆ ముల్లు తొలగిపోతుంది. స్వయాన్ని చూసుకుంటూ ఉండండి - శిక్షలు అనుభవించవలసి వచ్చే విధమైన వికర్మలేవీ మనసా-వాచా-కర్మణా జరగడము లేదు కదా!

ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఈ సమయములో ఇది రావణ రాజ్యము అయిన కారణముగా మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు, అందుకే వారిని అడవి ముళ్ళు అని అంటారు. ఇది ఎవరు అర్థం చేయిస్తున్నారు? అనంతమైన తండ్రి. వారిప్పుడు ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తున్నారు. మాయ ఎటువంటిదంటే, అక్కడక్కడా పుష్పాలుగా అవుతున్నవారిని, వెంటనే మళ్ళీ ముళ్ళగా చేసేస్తుంది. దీనినే ముళ్ళ అడవి అని అంటారు, ఇందులో అనేక రకాల జంతువుల వలె ఉండే మనుష్యులు ఉంటారు. వాస్తవానికి మనుష్యులే కానీ పరస్పరములో జంతువుల వలె కొట్లాడుకుంటూ, గొడవపడుతూ ఉంటారు. ప్రతి ఇంటిలోనూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. అందరూ విషయ సాగరములోనే ఉన్నారు, ఈ ప్రపంచమంతా విషం యొక్క చాలా పెద్ద సాగరము, ఇందులో మనుష్యులు మునకలు వేస్తున్నారు. దీనినే పతిత భ్రష్టాచారీ ప్రపంచమని అంటారు. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతున్నారు. తండ్రిని తోట యజమాని అని కూడా అంటారు. బాబా కూర్చుని అర్థం చేయిస్తున్నారు - గీతలో జ్ఞానము యొక్క విషయాలు ఉన్నాయి మరియు భాగవతములో మనుష్యుల నడవడిక ఎలా ఉంటుంది అన్నదానికి సంబంధించిన వర్ణణ ఉంది. ఏటువంటి విషయాలను రాసేశారు. సత్యయుగములో ఇటువంటివి చెప్పరు. సత్యయుగము ఉన్నదే పుష్పాల తోట. ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతున్నారు. పుష్పాలుగా అయి మళ్ళీ ముళ్ళలా అయిపోతారు. ఈ రోజు చాలా బాగా నడుచుకుంటారు, మళ్ళీ మాయా తుఫానులు వచ్చేస్తాయి. కూర్చుని-కూర్చునే మాయ ఎటువంటి పరిస్థితిని తీసుకువస్తుంది. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తాను. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారని భారతవాసులకు చెప్తున్నారు. ఇది నిన్నటి విషయమే. లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి, దానినే గార్డెన్ ఆఫ్ అల్లా అని అంటారు. అడవి ఇక్కడే ఉంది, తర్వాత పుష్పాల తోట కూడా ఇక్కడే ఉంటుంది కదా. భారత్ స్వర్గముగా ఉండేది, అక్కడ అన్నీ పుష్పాలే ఉండేవి. తండ్రియే పుష్పాల తోటను తయారుచేస్తారు. పుష్పాలుగా అవుతూ-అవుతూ మళ్ళీ సాంగత్య దోషములోకి వచ్చి పాడైపోతారు. ఇక అంతే, బాబా, మేము ఇక వివాహము చేసుకుంటామని అంటారు. మాయ ఆర్భాటాన్ని చూస్తారు కదా. ఇక్కడైతే పూర్తి శాంతి ఉంది. ఈ ప్రపంచమంతా అడవిలా ఉంది. అడవికి తప్పకుండా నిప్పు అంటుకుంటుంది కావున అడవిలో నివసించేవారు కూడా అంతమైపోతారు కదా. 5 వేల సంవత్సరాల క్రితం అంటుకున్న అగ్నియే మళ్ళీ అంటుకోనున్నది, దానికి మహాభారత యుద్ధము అన్న పేరును పెట్టారు. అటామిక్ బాంబుల యుద్ధమైతే మొదట యాదవుల ద్వారానే జరుగుతుంది, దాని గురించి కూడా చెప్పుకుంటూ ఉంటారు. సైన్స్ ద్వారా మిసైల్స్ ను తయారుచేసారు. శాస్త్రాలలోనైతే చాలా కథలు ఉన్నాయి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, కడుపు నుండి ఈ విధముగా ముసలాలు మొదలైనవి ఏమైనా వెలువడగలవా. సైన్స్ ద్వారా బాంబులు మొదలైనవి ఎన్ని తయారుచేస్తున్నారనేది మీరిప్పుడు చూస్తున్నారు. కేవలం రెండు బాంబులను వేస్తేనే ఎన్ని పట్టణాలు అంతమయ్యాయి, ఎంతమంది మనుష్యులు మరణించారు, లక్షలాది మంది మరణించి ఉంటారు. ఇప్పుడు ఇంత పెద్దగా ఉన్న ఈ అడవిలో కోట్లాదిమంది మనుష్యులు ఉన్నారు, దీనికి నిప్పు అంటుకోనున్నది.

శివబాబా అర్థం చేయిస్తున్నారు, ఎంతైనా తండ్రి అయితే దయాహృదయుడు. తండ్రి అయితే అందరి కళ్యాణము చేయవలసి ఉంటుంది. లేకుంటే ఇంకెక్కడికి వెళ్తారు. నిజంగానే నిప్పు అంటుకుంటుంది అన్నది చూస్తారు, అప్పుడు తండ్రి శరణు తీసుకుంటారు. తండ్రి సర్వుల సద్గతిదాత, పునర్జన్మ రహితుడు, వారిని మళ్ళీ సర్వవ్యాపి అని అనేస్తారు. ఇప్పుడు మీరు సంగమయుగవాసులు. మీ బుద్ధిలో మొత్తము జ్ఞానమంతా ఉంది. మిత్ర-సంబంధీకులు మొదలైనవారితో కూడా తోడును నిర్వర్తించాలి. వారిలో ఆసురీ గుణాలు ఉన్నాయి, మీలో దైవీ గుణాలు ఉన్నాయి. మీ పని ఇతరులకు కూడా ఇది నేర్పించడము. మంత్రాన్ని ఇస్తూ ఉండండి. ప్రదర్శనీ ద్వారా మీరు ఎంతగా అర్థం చేయిస్తారు. భారతవాసుల 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు తండ్రి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి వచ్చారు అనగా నరకవాసులైన మనుష్యులను స్వర్గవాసులుగా తయారుచేస్తారు. దేవతలు స్వర్గములో ఉంటారు. ఇప్పుడు మనకు ఆసురీ గుణాల పట్ల ద్వేషము కలుగుతుంది. స్వయాన్ని ఈ విధముగా చెక్ చేసుకోవడము జరుగుతుంది - నేను దైవీ గుణాలు కలవాడిగా అయ్యానా? నాలో ఎటువంటి అవగుణాలు లేవు కదా? మనసా-వాచా-కర్మణా నేను ఆసురీ పనుల వంటి కర్మలేవీ చెయ్యలేదు కదా? నేను ముళ్ళను పుష్పాలుగా తయారుచేసే వ్యాపారాన్ని చేస్తున్నానా లేదా? బాబా తోట యజమాని మరియు బ్రహ్మాకుమార, కుమారీలైన మీరు తోట మాలులు. తోట మాలులు కూడా రకరకాల వారు ఉంటారు. కొంతమంది ఎవరినీ తమ సమానముగా తయారుచేయలేని అవివేకుల వలె ఉంటారు. ప్రదర్శనీలకు తోట యజమాని వెళ్ళరు, తోట మాలులు వెళ్తారు. ఈ తోట మాలి కూడా శివబాబాతో పాటు ఉన్నారు, అందుకే వీరు కూడా వెళ్ళలేరు. తోట మాలులైన మీరు సేవ చేయడానికి వెళ్తారు. మంచి-మంచి తోట మాలులనే పిలుస్తారు. అవివేకుల వంటి వారిని పిలవకండి అని బాబా కూడా అంటారు. బాబా పేర్లు చెప్పరు. థర్డ్ క్లాస్ తోట మాలులు కూడా ఉన్నారు కదా. ఎవరైతే మంచి-మంచి పుష్పాలను తయారుచేసి చూపిస్తారో, వారిని తోట యజమాని ప్రేమిస్తారు. వారిని చూసి తోట యజమాని సంతోషిస్తారు కూడా. అటువంటివారి నోటి నుండి సదా రత్నాలే వెలువడుతూ ఉంటాయి. కొంతమంది రత్నాలకు బదులుగా రాళ్ళు వేస్తారు, అప్పుడు బాబా ఏమంటారు. శివునికి జిల్లేడు పుష్పాలను కూడా అర్పిస్తారు కదా, అంటే అలాంటివారు కూడా కొంతమంది స్వయాన్ని సమర్పించుకుంటారు కదా. అలాంటివారి నడవడిక ఎలా ఉంటుందో చూడండి. ముళ్ళ వంటివారు కూడా స్వయాన్ని సమర్పించుకుంటారు, సమర్పించుకుని మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతారు. సతోప్రధానముగా అయ్యేందుకు బదులుగా మరింత తమోప్రధానముగా అయిపోతారు. అలాంటివారి గతి ఏమవుతుంది!

తండ్రి అంటారు - ఒకటి, నేను నిష్కాముడిని మరియు రెండు, నేను పరోపకారిని. నన్ను నిందించిన భారతవాసులకు పరోపకారము చేస్తాను. తండ్రి అంటారు - నేను ఈ సమయములోనే వచ్చి స్వర్గ స్థాపనను చేస్తాను. ఎవరినైనా స్వర్గానికి పదండి అని అంటే, మేము ఇక్కడ స్వర్గములోనే ఉన్నాము కదా అని అంటారు. అరే, స్వర్గము సత్యయుగములో ఉంటుంది. కలియుగములో స్వర్గము ఎక్కడ నుండి వచ్చింది. కలియుగాన్ని నరకము అనే అంటారు, ఇది పాత తమోప్రధాన ప్రపంచము. స్వర్గము ఎక్కడ ఉంటుంది అనేది మనుష్యులకు అసలు తెలియనే తెలియదు. స్వర్గము ఆకాశములో ఉందని భావిస్తారు. దిల్వాడా మందిరములో కూడా స్వర్గాన్ని పైభాగములో చూపించారు, కింద తపస్య చేస్తున్నారు. అందుకే మనుష్యులు కూడా - ఫలానావారు స్వర్గస్థులయ్యారని అంటారు. స్వర్గము ఎక్కడ ఉంది? అందరి విషయములోనూ స్వర్గస్థులయ్యారని అంటారు. ఇది ఉన్నదే విషయ సాగరము. క్షీర సాగరమని విష్ణుపురిని అంటారు. వారు పూజ కోసమని ఒక పెద్ద కొలనును తయారుచేసారు. అందులో విష్ణువును పెట్టారు. ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గములోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడ పాల నదులు ఉంటాయి. ఇప్పుడు పిల్లలైన మీరు పుష్పాలుగా అవుతూ వెళ్ళండి. వీరు ముల్లులా ఉన్నారు అని ఎవరైనా అనేలాంటి నడవడికను ఎప్పుడూ నడుచుకోకూడదు. ఎల్లప్పుడూ పుష్పాలుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తూ ఉండండి. మాయ ముళ్ళలా చేస్తుంది, అందుకే స్వయాన్ని చాలా-చాలా సంభాళించుకోవాలి.

తండ్రి అంటారు - గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా పవిత్రముగా అవ్వాలి. తోట యజమాని అయిన బాబా ముళ్ళ నుండి పుష్పాలుగా చేయడానికి వచ్చారు. నేను పుష్పముగా అయ్యానా అని స్వయాన్ని చూసుకోవాలి. పుష్పాలనే ప్రతి చోటకు సేవ కోసం పిలుస్తారు. బాబా, గులాబీ పుష్పాన్ని పంపించండి. ఎవరు ఎటువంటి పుష్పమనేదైతే కనిపిస్తుంది కదా. తండ్రి అంటారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పించేందుకే వస్తాను. ఇది సత్యనారాయణుడి కథ, అంతేకానీ సత్య ప్రజల కథ కాదు. రాజా-రాణులు తయారవుతారంటే తప్పకుండా ప్రజలు కూడా తయారవుతారని అర్థం. రాజా-రాణులు మరియు ప్రజలు నంబరువారుగా ఎలా తయారవుతారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పేదవారి వద్ద 2-5 రూపాయలు కూడా మిగలకపోతే వారేమి ఇస్తారు. వెయ్యి రూపాయలు ఇచ్చేవారికి ఎంతైతే లభిస్తుందో, వీరికి కూడా అంతే లభిస్తుంది. అన్నింటికన్నా ఎక్కువగా భారత్ యే పేదది. భారతవాసులమైన మేము స్వర్గవాసులుగా ఉండేవారమని ఎవరికీ గుర్తు లేదు. దేవతల మహిమను కూడా పాడుతారు కానీ అర్థం చేసుకోలేరు. కేవలం కప్ప వలె శబ్దము చేస్తూ ఉంటారు. బుల్ బుల్ పిట్ట ఎంత మధురముగా పాడుతుంది కానీ దానికి అర్థమేమీ ఉండదు. ఈ రోజుల్లో గీతను వినిపించేవారు ఎంతమంది ఉన్నారు. మాతలు కూడా తయారయ్యారు. గీత ద్వారా ఏ ధర్మము స్థాపనయ్యింది అనేది ఏమీ తెలియదు. ఎవరైనా కొంచెం రిద్ధి-సిద్ధిని చూపించినా చాలు, ఇక వారిని భగవంతుడని అనుకుంటారు. పతిత-పావనా అని పాడుతారు, అంటే పతితముగా ఉన్నారనే అర్థం కదా. తండ్రి అంటారు, వికారాలలోకి వెళ్ళడము నంబరువన్ పతితత్వము. ఈ ప్రపంచమంతా పతితముగా ఉంది. ఓ పతిత-పావనా రండి అని అందరూ పిలుస్తారు. ఇప్పుడు వారు రావాలా లేక గంగా స్నానాలు చేయడము ద్వారా పావనముగా అవుతారా? మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి తండ్రికి ఎంత శ్రమ చేయవలసి ఉంటుంది. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అయిపోతారు. నోటి ద్వారా ఎప్పుడూ రాళ్ళు రానివ్వకండి. పుష్పాలుగా అవ్వండి. ఇది కూడా చదువు కదా. నడుస్తూ-నడుస్తూ గ్రహచారము కూర్చున్నట్లయితే ఫెయిల్ అయిపోతారు, హోప్ ఫుల్ (ఆశ ఉన్నవారు) నుండి హోప్ లెస్ (నిరాశపరులు) గా అయిపోతారు. మళ్ళీ, మేము బాబా వద్దకు వెళ్ళాలని అంటారు. ఇంద్రసభలోకి అపవిత్రులు రాలేరు. ఇది ఇంద్రసభ కదా. తీసుకువచ్చే బ్రాహ్మణిపై కూడా చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. వికారాలలోకి వెళ్ళినట్లయితే బ్రాహ్మణిపై కూడా భారము పడుతుంది, అందుకే ఎవరినైనా సరే జాగ్రత్తగా తీసుకురావాలి. మున్ముందు మీరు చూస్తారు, సాధు-సన్యాసులు మొదలైనవారందరూ క్యూలో నిలబడిపోతారు. భీష్మ పితామహ మొదలైనవారి పేర్లు అయితే ఉన్నాయి కదా. పిల్లలు చాలా విశాలబుద్ధి కలిగి ఉండాలి. భారత్ పుష్పాలతోటగా ఉండేదని మీరు ఎవరికైనా చెప్పవచ్చు. అక్కడ దేవీ-దేవతలు నివసించేవారు, ఇప్పుడైతే ముళ్ళలా అయిపోయారు. మీలో పంచ వికారాలు ఉన్నాయి కదా. రావణ రాజ్యమంటేనే అడవి. తండ్రి వచ్చి ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తారు. ఆలోచించండి - ఇప్పుడు నేను గులాబీ పుష్పముగా అవ్వకపోతే, ఇక జన్మ-జన్మలు జిల్లేడు పుష్పముగానే అవుతాను. ప్రతి ఒక్కరూ తమ కళ్యాణము చేసుకోవాలి. మీరు శివబాబాపై దయ చూపించడము లేదు. మీపై మీరు దయ చూపించుకోవాలి. ఇప్పుడు శ్రీమతముపై నడవాలి. ఎవరైనా తోటలోకి వెళ్ళినప్పుడు సుగంధభరితమైన పుష్పాలనే చూస్తారు, జిల్లేడు పుష్పాలను చూడరు. ఫ్లవర్ షో ఉంటుంది కదా. ఇది కూడా ఒక ఫ్లవర్ షో. చాలా పెద్ద బహుమానము లభిస్తుంది. చాలా ఫస్ట్ క్లాస్ పుష్పాలుగా అవ్వాలి. చాలా మధురమైన నడవడిక ఉండాలి. క్రోధము ఉండేవారితో చాలా నమ్రతతో ఉండాలి. నేను శ్రీమతాన్ని అనుసరించి, పవిత్రముగా అయి, పవిత్ర ప్రపంచమైన స్వర్గానికి యజమానిగా అవ్వాలనుకుంటున్నాను. యుక్తులైతే ఎన్నో ఉంటాయి కదా. మాతల వద్ద చాలా యుక్తులు ఉంటాయి కదా. చతురతతో పవిత్రముగా ఉండేందుకు పురుషార్థము చేయాలి. మీరు ఇలా చెప్పవచ్చు - కామము మహాశత్రువు, పవిత్రముగా అయినట్లయితే సతోప్రధానముగా అవుతారు అన్నది భగవానువాచ, మరి మేము భగవంతుడు చెప్పినది వినద్దా! యుక్తిగా స్వయాన్ని రక్షించుకోవాలి. విశ్వానికి యజమానులుగా అవ్వడం కోసం కొద్దిగా సహనము చేస్తే ఏమైంది. మీరు మీ కోసమే చేసుకుంటున్నారు కదా. వారు రాజ్యము కోసం పోరాడుతారు, మీరు మీ కోసమే అంతా చేస్తారు. పురుషార్థము చేయాలి. తండ్రిని మర్చిపోవడము వల్లనే పడిపోతారు, తర్వాత సిగ్గు అనిపిస్తుంది. మరి దేవతలుగా ఎలా అవుతారు? అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మాయా గ్రహచారము నుండి రక్షించుకునేందుకు నోటి నుండి సదా జ్ఞాన రత్నాలు వెలువడాలి. సాంగత్య దోషము నుండి స్వయాన్ని సంభాళించుకోవాలి.

2. సుగంధభరితమైన పుష్పముగా అయ్యేందుకు అవగుణాలను తొలగించుకుంటూ వెళ్ళాలి. శ్రీమతము ఆధారముగా చాలా-చాలా నమ్రచిత్తులుగా అవ్వాలి. కామము అనే మహాశత్రువుతో ఎప్పుడూ ఓడిపోకూడదు. యుక్తిగా స్వయాన్ని రక్షించుకోవాలి.

వరదానము:-
శక్తులను చమత్కారముగా భావించేందుకు బదులుగా వాటిని కర్తవ్యముగా భావిస్తూ ప్రయోగించే పూజన యోగ్య మరియు గాయన యోగ్య భవ

స్మృతి ద్వారా ఏ శక్తులైతే ప్రాప్తిస్తాయో, వాటిని చమత్కారముగా భావిస్తూ ప్రయోగించకండి, కానీ వాటిని కర్తవ్యముగా భావిస్తూ కార్యములో ఉపయోగించండి. ప్రపంచములోని మనుష్యుల వద్ద రిద్ధి-సిద్ధుల చమత్కారము ఉంటుంది, కానీ మీ వద్ద ఉన్నది శ్రీమతము. శ్రీమతము ద్వారా శక్తులు తప్పకుండా వస్తాయి, అందుకే సంకల్పాల ద్వారా కర్తవ్యాలు సిద్ధిస్తాయి. సంకల్పము ద్వారా ఎవరికైనా కార్యము చేయడానికి ప్రేరణను ఇవ్వగలరు, అది కూడా శక్తియే. కానీ శ్రీమతములో ఎప్పుడైతే మీ మన్మతము మిక్స్ అవ్వదో, అప్పుడు గాయన యోగ్యులుగా మరియు పూజన యోగ్యులుగా అవుతారు.

స్లోగన్:-
ఏ విధమైన అలజడిలోనైనా నిరుత్సాహులుగా అయ్యేందుకు బదులుగా విశాల హృదయము కలవారిగా అవ్వండి.

అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’

ఎవరైతే సరళచిత్తులుగా ఉంటారో వారే మధురతా గుణముతో సంపన్నులుగా ఉంటారు, వారే సదా హర్షితముగా ఉంటారు. హర్షితచిత్తముగా ఉంటే అందరినీ ఆకర్షిస్తారు. హర్షితము అంటేనే అర్థం అతీంద్రియ సుఖములో ఊగటము. జ్ఞానాన్ని స్మరణ చేస్తూ, అవ్యక్త స్థితిని అనుభవము చేస్తూ అతీంద్రియ సుఖములో ఊగటము, దీనినే హర్షితముగా ఉండటము అని అంటారు. ఇలా ఎవరైతే హర్షితముగా ఉంటారో వారే ఆకర్షిస్తారు.