27-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ చేత కాలుడిపై విజయము పొందేలా చేసేందుకు, కాలుడికే కాలుడైన బాబా వచ్చారు, మన్మనాభవ మంత్రముతోనే మీరు కాలుడిపై విజయము పొందుతారు’’

ప్రశ్న:-
ఆత్మిక తండ్రి ఆత్మిక యాత్రికులైన మీకు ఏ విశేషమైన శిక్షణను ఇస్తారు?

జవాబు:-
ఓ ఆత్మిక యాత్రికులారా - మీరు దేహాభిమానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అవ్వండి. రావణుడు అర్ధకల్పము నుండి మిమ్మల్ని దేహాభిమానులుగా చేసాడు, ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వండి. ఈ ఆత్మిక జ్ఞానాన్ని సుప్రీమ్ ఆత్మయే మీకు ఇస్తారు, ఇతరులెవ్వరూ ఇవ్వలేరు.

పాట:-
ఓం నమః శివాయ...

ఓంశాంతి
పిల్లలు తమ తండ్రి మహిమను విన్నారు. భగవంతుడు ఉన్నతోన్నతమైనవారని అంటూ ఉంటారు కూడా. వారు పిల్లలందరికీ తండ్రి. మిగిలినవారెవరైతే ఉన్నారో, అందరూ పరస్పరము సోదరులు మరియు అందరికీ తండ్రి ఒక్కరే. వారు శివబాబా. తండ్రి అర్థం చేయించారు - ఓ పిల్లలూ, భక్తి మార్గములో మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు - లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి. రచయిత నుండి రచనకు వారసత్వము లభిస్తుంది, అది హద్దు వారసత్వము, ఇది అనంతమైన వారసత్వము. అనంతమైన తండ్రి అయితే ఒక్కరే, వారి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుంది. వారు నిరాకారుడు, వారి పేరు పరమపిత పరమాత్మ శివ. శివ పరమాత్మాయ నమః అని అంటారు కూడా, వారు ఉన్నతోన్నతమైనవారు. మీ బుద్ధి నిరాకార తండ్రి వైపుకు వెళ్తుంది. వారు పరంధామములో ఉంటారు, ఆత్మలైన మీరు అక్కడి నుండే వస్తారు, తండ్రి కూడా అక్కడే ఉంటారు. వారు సర్వులకు సద్గతినిచ్చేవారు. అందులోనూ భారత్ పరమపిత పరమాత్ముని జన్మ స్థలము, శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. ఆ ఆత్మిక తండ్రినే జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు, ముక్తిప్రదాత, మార్గదర్శకుడు అని అంటారు. వారే దుఃఖహర్త-సుఖకర్త - ఇది భారతవాసులకు తెలుసు. ఇది దుఃఖధామము, భారత్ యే సుఖధామముగా ఉండేది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు - ఓ భారతవాసులారా, మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, అప్పుడు మీ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉండేది. దేవీ-దేవతలు ధర్మ-శ్రేష్ఠులుగా, కర్మ-శ్రేష్ఠులుగా ఉండేవారు, ఇప్పుడు వారు ధర్మ-భ్రష్టులుగా, కర్మ-భ్రష్టులుగా అయిపోయారు. స్వయాన్ని పావన దేవతలుగా పిలుచుకోలేరు. కలియుగాంతం వరకు భక్తి మార్గము నడుస్తుంది, అందులో జ్ఞానముండదు. జ్ఞానముతో సద్గతి కలుగుతుంది. ఎప్పటివరకైతే సర్వుల సద్గతిదాత అయిన తండ్రి రారో, అప్పటివరకు సద్గతి లభించదు. తండ్రి అంటారు - నేను కల్పము యొక్క సంగమయుగములో వస్తాను. ఈ సమయములో ఉన్నదే పతిత ప్రపంచము. పావనమైనవారు ఒక్కరు కూడా లేరు. సన్యాసులు పవిత్రముగా అవుతారు కానీ వారు పునర్జన్మలనైతే ఇక్కడే తీసుకోవాల్సి ఉంటుంది. విషము ద్వారా జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. తిరిగి వెళ్ళేది లేదు. ఎప్పుడైతే చక్రము పూర్తవుతుందో, అప్పుడే తండ్రి వచ్చి తీసుకువెళ్తారు. దీనిని ఆత్మిక జ్ఞానమని అంటారు. పరమ ఆత్మ ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తారు. పరమ ఆత్మయే జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు. ఇకపోతే, శాస్త్రాల జ్ఞానము భక్తి మార్గానికి చెందినది. తండ్రి అంటారు, యజ్ఞ తపాదులు, తీర్థయాత్రలు మొదలైనవి చేస్తూ ఇంకా కిందకు దిగుతూ వచ్చారు. మీరు ముందు సతోప్రధానముగా ఉండేవారు. భారత్ లో పవిత్రత ఉన్నప్పుడు శాంతి, సంపదలు కూడా ఉండేవి. ఆరోగ్యము, ఐశ్వర్యము రెండూ ఉండేవి. నేటికి 5 వేల సంవత్సరాల కిందటి విషయము, ఈ భారత్ స్వర్గముగా ఉండేది. ఆ సమయములో వేరే ధర్మమేదీ ఉండేది కాదు. కేవలం పరమపిత పరమాత్మ స్థాపించిన ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఒక్కటే ఉండేది. స్వర్గ స్థాపనను వారే చేస్తారు, మనుష్యులు చేయలేరు. శ్రీకృష్ణుడిని రచయిత అని అనరు. అలా కాదు. రచయిత ఒక్క నిరాకారుడైన శివుడు మాత్రమే. మిగిలినవారంతా వారి రచన. రచయిత నుండే రచనకు వారసత్వము లభిస్తుంది.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను మీ అనంతమైన తండ్రిని, 21 జన్మల కోసం మీకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తాను, సూర్యవంశీయుల, చంద్రవంశీయుల పవిత్ర ధర్మాలను స్థాపన చేస్తాను. బ్రాహ్మణ ధర్మము పిలక వంటిది. అందరికన్నా ఉన్నతమైనవారు ఆత్మిక తండ్రి, వారు ఆత్మలను తమ సమానముగా తయారుచేస్తారు. తండ్రి జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు కనుక మిమ్మల్ని కూడా అలా తయారుచేస్తారు. భారత్ యే సుఖధామముగా ఉండేది, ఇప్పుడు దుఃఖధామముగా ఉంది. తండ్రి ఎలా వస్తారు, ఇది ఎవరికీ తెలియదు. సత్యయుగము ఆది నుండి కలియుగాంతము వరకు, ఈ పూర్తి చరిత్ర-భౌగోళికాలు అంతా భారత్ కు చెందినవి. ఈ లక్ష్మీ-నారాయణులు ఎంత ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉండేవారు. ఎప్పుడూ అనారోగ్యంపాలు అయ్యేవారు కాదు. ఇప్పుడు కాలుడిపై విజయాన్ని పొందే శిక్షణను తీసుకుంటున్నారు. ఎవరినైతే కాలుడికే కాలుడు, మహాకాలుడు అని అంటారో, ఆ తండ్రి మిమ్మల్ని కాలుడిపై విజయము పొందేలా చేస్తున్నారు. శివాయ నమః అన్న పేరును కూడా విన్నారు. పరమాత్మను సర్వవ్యాపి అని, కుక్కలో, పిల్లిలో ఉన్నారని మీరు అనరు. దీనిని ధర్మ గ్లాని అని అంటారు. తండ్రిని గ్లాని చేస్తారు. ఇప్పుడిది కల్పము యొక్క సంగమ సమయము. ఈ సమయములోనే వినాశ కాలే విపరీత బుద్ధి కలవారు అని అంటారు. ఇప్పుడు వినాశనమైతే ఎదురుగా నిలబడి ఉంది. యాదవులు, కౌరవులు, పాండవులు ఏమి చేసి వెళ్ళారు అనేది గీతలో కూడా వ్రాసి ఉంది. సర్వ శాస్త్రమయి శిరోమణి శ్రీమత్ భగవద్గీత, దాని నుండే ఇతర శాస్త్రాలు కూడా వెలువడ్డాయి. గీత దేవతా ధర్మము యొక్క శాస్త్రమని మీకు తెలుసు. తండ్రి అంటారు - నేను వచ్చి మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేస్తాను, ఆ తర్వాత మిమ్మల్నే దేవీ-దేవతలుగా తయారుచేస్తాను. ఆ తర్వాత మీరు క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. మీరు 84 జన్మలను ఎలా తీసుకుంటారు అనేది తండ్రి అర్థం చేయిస్తారు. ఎవరైతే మొట్టమొదట సత్యయుగములోకి వస్తారో, తప్పకుండా వారు అందరికన్నా ఎక్కువ జన్మలు తీసుకుంటారు. భారతవాసులైన మీరు మేక్సిమమ్ 84 జన్మలు తీసుకున్నారు, మినిమమ్ ఒక్క జన్మ తీసుకున్నారు. ఇది కూడా తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రిని తప్ప ఇతరులెవరినీ జ్ఞానసాగరుడని అనరు. పతిత-పావనుడు, జ్ఞానసాగరుడు అని అంటూనే బుద్ధి పైకి వెళ్తుంది. తండ్రియే అందరినీ విముక్తులుగా చేసి తిరిగి తీసుకువెళ్తారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. అచ్ఛా, మరి సర్వుల దుర్గతి ఎలా జరుగుతుంది. ఎవరు చేస్తారు. సద్గతి అని సత్యయుగాన్ని, దుర్గతి అని కలియుగాన్ని అంటారు. తండ్రి అంటారు, నేను కల్ప-కల్పము వచ్చి పిల్లలైన మీకు సద్గతిని ఇస్తాను. పిల్లలైన మీరు మొత్తం ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాలను తెలుసుకున్నారు. స్కూళ్ళలోనైతే చరిత్ర-భౌగోళికాలను సగమే నేర్పిస్తారు. సత్య, త్రేతాయుగాలలో ఎవరు రాజ్యము చేసేవారు అనేది ఎవరికీ తెలియదు. చిత్రాలైతే సరిగ్గానే ఉన్నాయి - ఈ లక్ష్మీ-నారాయణులు రాజ్యము చేసేవారు. ఆ రాజధాని ఎంత సమయము నడిచింది అనేది మీరు చెప్పగలరు. క్రిస్టియన్ వంశావళి 2 వేల సంవత్సరాలు నడిచింది, బౌద్ధ వంశావళి ఇంత సమయము నడిచింది. ఇస్లాములు ఉంటారు... వారికంటే ముందు చంద్రవంశీయులు ఉండేవారు, వారు 1250 సంవత్సరాలు ఉన్నారు. సత్య, త్రేతాయుగాలలో సూర్యవంశీయులు, చంద్రవంశీయులు మాత్రమే ఉండేవారు, ఇంకే ధర్మము ఉండేది కాదు. మీరే సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా అవుతారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు.

ఈ నాటకమంతా భారత్ పైనే రచించబడింది. భారత్ యే హెల్ మరియు హెవెన్ గా అవుతుంది. ఇతర ధర్మాల వారి కోసం ఇలా చెప్పరు. వారు హెవెన్ లో ఉండనే ఉండరు. ఎవరైనా మరణించినప్పుడు, స్వర్గస్థులయ్యారని అంటారు కానీ అర్థం చేసుకోరు. నరకవాసులైతే నరకములోనే జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. స్వర్గవాసులు స్వర్గములోనే పునర్జన్మలు తీసుకుంటారు. ఈ లక్ష్మీ-నారాయణులు స్వర్గవాసులుగా ఉండేవారు, వారు ఈ రాజ్యాన్ని ఎలా పొందారు అనేది పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. లక్షల సంవత్సరాల విషయమైతే గుర్తుండదు. సత్యయుగములో ఈ శాస్త్రాలు మొదలైనవి ఉండవు. ఇదంతా భక్తి యొక్క సామాగ్రి. మెట్లు కిందకు దిగాల్సిందే. సతోప్రధానము నుండి సతో, రజో, తమోలలోకి వస్తారు. ఈ మెట్లు దిగడానికి 5 వేల సంవత్సరాలు పడుతుంది. సత్యయుగములో 16 కళల సంపూర్ణులుగా ఉంటారు, తర్వాత త్రేతాలో 2 కళలు తగ్గుతాయి. ఆత్మలో వెండి అనే మాలిన్యము కలిసింది. రాగియుగములోకి వచ్చినప్పుడు, రాగి అనే మాలిన్యము కలిసింది. ఈ సమయములో పూర్తిగా తమోప్రధానముగా ఉన్నారు. ఆత్మలోనే మాలిన్యము కలుస్తుంది. మీరే పూర్తి 84 జన్మలను తీసుకుంటారు. ఆత్మిక తండ్రి అయిన ఈ శివబాబా వచ్చి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. మీరు ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వాలి. రావణుడు ప్రవేశించడముతో అందరూ దేహాభిమానులుగా అయిపోతారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించాలి. మనమే 84 జన్మలు తీసుకుని రకరకాల పాత్రలను అభినయిస్తూ వచ్చాము. ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తయ్యింది. ఇప్పుడైతే శరీరము కూడా శిథిలావస్థకు చేరుకుంది. ద్వాపరము నుండి రావణ రాజ్యము ఉంటుంది. సత్యయుగములో రామ రాజ్యము ఉంటుంది. సత్యయుగములో మీరు ఆత్మాభిమానులుగా ఉండేవారు. ద్వాపర-కలియుగాలలో మీరు దేహాభిమానులుగా అయిపోతారు. ఆత్మను గురించి గాని, పరమాత్మను గురించి గాని తెలియదు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఆత్మ ఒక నక్షత్రము వంటిది. భృకుటి మధ్యలో ప్రకాశించే అద్భుతమైన సితార... అని అంటారు. దానిని దివ్యదృష్టితో తప్ప ఇంకే విధముగానూ చూడలేరు. అది చాలా సూక్ష్మమైనది. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మలమైన మనము 84 జన్మలు తీసుకున్నాము. పరమపిత పరమాత్మ కూడా బిందువు, వారినే జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు, నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. పరమపిత పరమాత్మలో సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. బీజరూపుడైన కారణముగా వారిని సత్-చిత్-ఆనంద స్వరూపుడని అంటారు. తండ్రిలో ఏ జ్ఞానమైతే ఉందో, దానిని తప్పకుండా వినిపించవలసి ఉంటుంది. ఇది స్పిరిచ్యుల్ నాలెడ్జ్. సర్వాత్మల తండ్రి వచ్చి ఆత్మలను చదివిస్తారు. మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. శివబాబా మనల్ని చదివిస్తున్నారు, వారే నాలెడ్జ్ ఫుల్. బాబాయే వచ్చి స్వర్గ రచనను రచిస్తారు, మిమ్మల్ని స్వర్గానికి యోగ్యులుగా తయారుచేస్తారు. ఈ సృష్టి చక్రము యొక్క రహస్యము మనుష్యులెవరికీ తెలియదు. తండ్రినే తెలుసుకోని కారణముగా భారత్ కు ఈ పరిస్థితి ఏర్పడింది. భారత్ లో పవిత్రత ఉండేటప్పుడు, శాంతి-సంపదలు కూడా ఉండేవి. ఇప్పుడు ఇది నరకము, మరి ఎవరైనా స్వర్గములోకి ఎలా వెళ్ళగలరు! పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు.

తండ్రి అంటారు - నేను పిల్లల కోసం ఏదో ఒక కానుకను తీసుకువస్తాను. మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. ఎవరైతే కల్పక్రితం వారసత్వము తీసుకున్నారో, వారే ఇప్పుడు తీసుకుంటారు, మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. వాస్తవానికి ప్రజాపిత బ్రహ్మాకైతే అందరూ సంతానమే. ఇప్పుడు బ్రహ్మా ద్వారా శివబాబా రచనను రచిస్తున్నారు. బ్రహ్మాకుమార-కుమారీలుగా తయారవుతూ ఉంటారు. శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థము చేయాలి, తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి. తండ్రి అంటారు - పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలన్నీ వినాశనమవుతాయి. ఈ స్పిరిచ్యుల్ నాలెడ్జ్ ను తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఆత్మిక తండ్రియే ఆత్మలకు జ్ఞానము ఇస్తారు. మీరు ఆత్మిక యాత్రను చేస్తారు. దేహాభిమానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అవుతారు. ఆత్మ అవినాశీ. ఆత్మలోనే పాత్ర నిండి ఉంది. ఆత్మ 84 జన్మల పాత్రను ఎలా అభినయిస్తుంది అనేది ఇప్పుడు తెలిసింది. మనము సూర్యవంశీయులుగా ఉండేవారము, తర్వాత చంద్రవంశీయులుగా అయ్యాము, మళ్ళీ మనము సూర్యవంశీయులుగా అవ్వాలి. నన్నొక్కరినే స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి సతోప్రధానముగా అయ్యే శిక్షణను ఇస్తున్నారు. భగవానువాచ - గీతా భగవానుడు శివబాబా, అంతేకానీ శ్రీకృష్ణుడు కాదు. శ్రీకృష్ణుని ఆత్మ కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మిక యాత్రను చేయాలి మరియు చేయించాలి. స్వయాన్ని సతోప్రధానముగా తయారుచేసుకునేందుకు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థము చేయాలి.

2. కాలుడిపై విజయాన్ని పొందేందుకు తండ్రి శిక్షణల పట్ల అటెన్షన్ పెట్టాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మలకు జ్ఞానాన్ని ఇవ్వాలి.

వరదానము:-
బాప్ దాదా కర్తవ్యాన్ని తమ లక్ష్యముగా చేసుకునే మాస్టర్ మర్యాదా పురుషోత్తమ భవ

‘‘తమలోని విశేషతలను ఎంతగా తలచుకుంటారో, అంత నషా ఎక్కుతుంది’’ అని అంటారు. ఇతరుల సంపాదన పట్ల ఎప్పుడూ దృష్టి వెళ్ళకూడదు. ఇతరుల నషాను లక్ష్యముగా చేసుకునేందుకు బదులుగా బాప్ దాదా గుణాలను మరియు కర్తవ్యాన్ని లక్ష్యముగా చేసుకోండి. బాప్ దాదాతో పాటు అధర్మము యొక్క వినాశనము మరియు సత్య ధర్మము యొక్క స్థాపనా కర్తవ్యములో సహాయకులుగా అవ్వండి. అధర్మాన్ని వినాశనము చేసేవారు అధర్మ కార్యాన్ని గాని లేక దైవీ మర్యాదను ఉల్లంఘించే కార్యాన్ని గాని చేయలేరు. వారు మాస్టర్ మర్యాదా పురుషోత్తములుగా ఉంటారు.

స్లోగన్:-
నాలెడ్జ్ ఫుల్ గా అయి వ్యర్థ ప్రశ్నలను స్వాహా చేసినట్లయితే సమయము పొదుపు అవుతుంది.

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

భగవంతుడు ఎవరికైతే తోడుగా ఉంటారో, వారిని గాలివానలు మరియు తుఫానులు ఏమి ఆపుతాయి... చూడండి, ఈ పాట ఆత్మ మరియు పరమాత్మ ఇరువురు వేర్వేరు అనేది ఋజువు చేస్తుంది. అలానే, ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనేది ఋజువు చేస్తుంది ఎందుకంటే ఈశ్వరుడు ఎవరికైనా తోడుగా ఉన్నట్లయితే, వారు హాజరై ఉన్నట్లయితే, మరి సృష్టిలో ఇంతటి దుఃఖము ఎందుకు ఉంది, మనుష్యులు ఇంతటి నిరుపేదలుగా, బానిసలుగా ఎందుకు ఉన్నారు? పరమాత్మ సుఖస్వరూపుడు కావున పరమాత్మను సర్వవ్యాపి అనడమంటే పరమాత్మను అవమానపర్చడము. భగవంతుడు హాజరై ఉన్నప్పుడు, ఈ ప్రపంచము సుఖ స్వరూపముగా ఉంటుందా లేదా దుఃఖ రూపముగా ఉంటుందా? ఇక అటువంటప్పుడు పరమాత్మను పిలవాల్సిన అవసరమేముంది? కనుక ఈ సమయములో మాయ సర్వవ్యాపిగా ఉంది, అంతేకానీ పరమాత్మ అంతటా హాజరై ఉన్నారని కాదు. పరమాత్మ కేవలం ఒక్కసారి మాత్రమే సంగమములో వస్తారు, అప్పుడు వారిని హాజిర్-నాజిర్ (అంతటా ఉన్నారు) అని చెప్పవచ్చు. ఇకపోతే వారి స్మృతి అనేది తప్పకుండా అందరి హృదయాలలో వ్యాపించి ఉంది. ప్రతి ఒక్కరిలోనూ శరీరాన్ని నడిపించే శక్తి అనేది, రకరకాల సంస్కారాలు గల ఆత్మ, అంతేకానీ పరమాత్మ కాదు. ఇప్పుడు ఇంతకీ మీరు పరమాత్మను ఎందుకు తోడుగా పెట్టుకుంటారు అనేది ఆలోచించాలి. ఈ మాయ యొక్క గాలివానలను మరియు తుఫానులను దాటేందుకు తోడుగా పెట్టుకుంటారు. అంటే, తప్పకుండా ఏవో మాయ తుఫానులు ఉన్నాయి మరియు వాటిని దాటేందుకు, ఆత్మలైన మనం ఆ పరమాత్ముని తోడును అడుగుతాము. ఒకవేళ వారు హాజరై ఉన్నట్లయితే, మాయ అలజడులు ఉండవు, అంతేకాక వారి తోడును పొందేందుకు స్మృతి చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కనుక ఆత్మలైన మనకు మరియు పరమాత్మకు, ఇరువురికీ ఈ ఆటలో పాత్ర ఉంది. పరమాత్మ వచ్చినప్పుడు, వారిని పూర్తిగా తోడు పెట్టుకుని, వారికి చెందినవారిగా అయిపోవాలి, అప్పుడే మాయ తుఫాన్ల నుండి విముక్తులుగా అవ్వగలము. వారు అందరికీ సుఖదాతనే కానీ ప్రాక్టికల్ గా ఎవరైతే వారి ఆధారాన్ని తీసుకుంటారో, వారికే ఆ తోడు లభిస్తుంది. అటువంటి పిల్లలకు అదనపు ప్రాప్తి లభిస్తుంది. వారు ప్రపంచములోకి వచ్చి, ఉపస్థితులై ఉన్నారు కానీ ఓహో! ఆశ్చర్యకరము! ప్రపంచానికి వారి గురించి తెలియని కారణముగా, వారి తోడును అందుకోరు. ఒకవేళ వారిని పూర్తిగా తోడుగా పెట్టుకున్నట్లయితే, వారు సహాయము చేయడములో ప్రసిద్ధమైనవారు. మీరు ఒక్క అడుగు ముందుకు వేసినట్లయితే నేను పది అడుగులు ముందుకు వేస్తానని అంటారు. కనుక వారు సంపూర్ణ వారసత్వాన్ని ఇస్తారు, అందులో ఎటువంటి అసంపూర్ణత ఉండదు. అచ్ఛా!

అవ్యక్త ప్రేరణలు - ‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చేయండి’’

ఏదైనా సంకల్పము వస్తే దానిని పై వాళ్ళ ముందు ఉంచి స్వయం నిస్సంకల్పులుగా అవుతూ వెళ్ళండి. మీ ఆలోచన చెప్పటము, సూచన ఇవ్వటము, అది వేరే విషయము, కానీ అలజడిలోకి రావటమనేది వేరే విషయము. కావున సదా ఏకరసముగా ఉండండి. సంకల్పాన్ని చెప్పారు మరియు నిస్సంకల్పులుగా అయిపోయారు, అంతే. నేను కర్మేంద్రియజీతునిగా అవ్వాలి అని సదా అటెన్షన్ ఉండాలి. ఏ ఒక్క కర్మేంద్రియానికి చెందిన ఆకర్షణ ఉన్నా సరే, అది ఒక్క బాబాకు చెందినవారిగా అవ్వనివ్వదు, ఏకరస స్థితిలో స్థితులవ్వనివ్వదు.