27-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీ బుద్ధిని జ్ఞాన మంథనములో బిజీగా
పెట్టుకున్నట్లయితే అన్ని చింతల నుండి దూరమైపోతారు, సంతోషము సదా నిలిచి ఉంటుంది’’
ప్రశ్న:-
ఎవరైతే
స్వయాన్ని శివబాబా యజ్ఞ సేవకులుగా భావిస్తారో, వారి గుర్తులను వినిపించండి?
జవాబు:-
శివబాబా ఈ
బ్రహ్మా నోటి ద్వారా ఏదైతే చెప్తారో, దానిని వారు వెంటనే అంగీకరిస్తారు. ఏది చెప్తే,
అది అంగీకరించడము - దానినే శ్రీమతము అని అంటారు. శ్రీ శ్రీ శివబాబా మతం అనుసారముగా
నడుచుకున్నట్లయితేనే మీరు శ్రేష్ఠముగా తయారవుతారు. శ్రేష్ఠముగా తయారవ్వడము అనగా
విజయమాలలోకి రావడము.
పాట:-
ఓం నమః శివాయ...
ఓంశాంతి
సాలిగ్రామాల
కోసం శివ భగవానువాచ. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ
మనము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోవాలని ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు.
మొత్తము ప్రపంచములో, స్వయాన్ని ఆత్మగా భావించే మనుష్యులు ఒక్కరు కూడా ఉండరు. ఆత్మ
అంటే ఏమిటి అనేది తెలియనప్పుడు, ఇక పరమాత్మను ఎలా తెలుసుకుంటారు. తండ్రి ద్వారానే
మీకు ఆత్మ గురించిన వివరణ లభిస్తుంది, అసలు మూలమేమిటి అనేది తెలుస్తుంది. మనుష్యులకు
ఏమీ తెలియని కారణముగా ఎంత దుఃఖితులుగా ఉన్నారు. ఈ డ్రామా లేక సృష్టి రూపీ
కల్పవృక్షము యొక్క ఆయువు 5 వేల సంవత్సరాలని పిల్లలైన మీకు తెలుసు. ఒకవేళ మామిడి
బీజము చైతన్యముగా ఉంటే - నేను బీజాన్ని, నా నుండి ఈ వృక్షము ఇలా వెలువడింది అని
అర్థం చేయించేది. కానీ అది జడమైనది. చైతన్యమైన వృక్షము ఒక్కటే. ప్రారంభము నుండి
మొదలుకొని అంతిమము వరకు ఈ పూర్తి వృక్షము యొక్క జ్ఞానము మీకు లభించి ఉంది. మీరు
నంబరువారు పురుషార్థానుసారముగా అర్థం చేసుకోగలరు. తండ్రి అంటారు - నేను ఈ మనుష్య
సృష్టి యొక్క బీజాన్ని, సత్-చిత్-ఆనంద స్వరూపుడను, నన్ను జ్ఞానసాగరుడని అంటారు. ఇది
నిరాకారుడి మహిమ. తండ్రి యొక్క ఈ మహిమ అన్నింటికన్నా అతీతమైనదని మీకు తెలుసు.
మనుష్యులకైతే తండ్రి మహిమ గురించి ఏ మాత్రము తెలియదు. ఈ లక్ష్మీ-నారాయణులు
మొదలైనవారు దేవతలు కానీ వారికి కూడా ఈ జ్ఞానము లేదు. ఈ డ్రామా జ్ఞానము మీకు
లభించింది. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అనేది మీకు తెలుసు, దేవతలుగా అయిన
తర్వాత ఇక ఈ జ్ఞానము ఉండదు. ఇది విచిత్రము కదా. మీరు ఈ డ్రామాలోని పాత్రధారులు కదా.
మీకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. ఇకపోతే, శూద్ర వర్ణము వారికి గాని,
దేవతా వర్ణము వారికి గాని ఈ జ్ఞానము లేదు. ఎలాగైతే పండుగల గురించి, అవి పరంపరగా
జరుగుతున్నాయని అంటారో, అలా జ్ఞానము పరంపరగా కొనసాగుతుందని కాదు. సత్యయుగములో ఈ
పండుగల గురించి ఎవ్వరికీ తెలియదని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. అక్కడ ఏమీ
గుర్తుండదు. అక్కడ రాజ్యము చేస్తారు. మీలోని ప్రతి ఒక్కరి బుద్ధి తాళము తెరుచుకుంది.
ముఖ్యమైన క్రియేటర్, డైరెక్టర్, ప్రిన్సిపల్ యాక్టర్ గురించి మీకు తెలుసు. మీకు ఎంత
మంచి జ్ఞానము లభిస్తుంది. ఈ జ్ఞానము గురించి ఎవరికైతే తెలియదో, వారు బుద్ధిహీనులు.
మీరు కూడా బుద్ధిహీనులుగా ఉండేవారు. ఇప్పుడు దేవతలుగా తయారవుతున్నారు. ఈ జ్ఞానము
ఎవరి బుద్ధిలోనైతే మెదులుతూ ఉంటుందో, వారికి అపారమైన సంతోషముంటుంది. ఈ జ్ఞానాన్ని
అర్థం చేసుకునేవారు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. గాడ్ ఫాదర్ నే వరల్డ్ ఆల్మైటీ అథారిటీ
(సర్వశక్తివంతుడు), నాలెడ్జ్ ఫుల్ అని అంటారు, వారి వద్ద దేని గురించిన జ్ఞానము ఉంది?
వారికి అన్ని వేద-శాస్త్రాలు, సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది. శాస్త్రాలలో కూడా
రచయిత మరియు రచనల గురించిన జ్ఞానము లేదు. అందుకే, ఋషులు, మునులు మొదలైనవారు - మాకు
రచయిత మరియు రచనల గురించి తెలియదు అని చెప్తూ వచ్చారు. అర్థం చేయించేవారు ఒక్కరే
అన్నప్పుడు ఇతరులకు ఎలా తెలుస్తుంది. ఈ జ్ఞానాన్ని పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరూ
ఇవ్వలేరు. మీకు ఇచ్చేవారు తండ్రి. వారు ఎంత నాలెడ్జ్ ఫుల్. మీరు ఎంతటి పదవిని
పొందుతారు. మనము అనంతమైన తండ్రికి సంతానమని మీకు ఎంత సంతోషముండాలి. జ్ఞానముతో బుద్ధి
నిండుగా ఉండాలి. మీకు తెలియనిదంటూ ఏదీ లేదు. ఇప్పుడు మీరు మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా
అవుతున్నారు. ఏ ఆత్మ అయితే తమోప్రధానముగా అయిందో, ఆ ఆత్మ తండ్రిని స్మృతి
చేస్తూ-చేస్తూ సతోప్రధానముగా అయిపోతుంది. నంబరువారుగా అయితే ఉంటారు కదా. కొందరి
బుద్ధి తమో నుండి రజోగా అయి ఉంటుంది, కొందరిది రజో నుండి సతోగా అయి ఉంటుంది. ఇప్పుడు
ఎవరి బుద్ధి సతోప్రధానముగా లేదు. సతోప్రధానముగా అయినప్పుడు మీరు కర్మాతీత అవస్థను
చేరుకుంటారు. అప్పుడిక రాజ్యము చేయడానికి కొత్త ప్రపంచము కావాలి. ఈ యజ్ఞము ఎప్పుడైతే
పూర్తి అవుతుందో, అప్పుడు ఇందులో మొత్తం పాత ప్రపంచమంతా ఆహుతి అవుతుంది. అప్పుడు,
చదువు కూడా పూర్తయిపోతుంది, నంబరువారు పురుషార్థము అనుసారముగా. స్కూల్లో
విద్యార్థులు - మేము ఈ పరీక్ష పాస్ అయిన తర్వాత ఆ క్లాసులోకి ట్రాన్స్ఫర్ అవుతామని
భావిస్తారు కదా. అలా మీరు కూడా కర్మాతీత అవస్థను చేరుకున్నప్పుడు, ఈ మృత్యులోకము
నుండి ట్రాన్స్ఫర్ అయి అమరపురిలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్
అవ్వాల్సి ఉందని మీకు తెలుసు. పవిత్రముగా అయి అమరలోకములోకి వెళ్ళిపోతారు.
వాస్తవానికి మనము శాంతిధామ నివాసులము, తర్వాత పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ
అమరలోకము నుండి మృత్యులోకానికి చేరుకున్నాము. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉన్నట్లయితే
సంతోషముంటుంది. జ్ఞానము తప్ప ఇంకేదీ రుచించదు. ఇప్పుడు మనము చదువుకుని కొత్త
ప్రపంచానికి యజమానులుగా అవుతాము - ఇది కూడా అర్థం చేయించాలి. ఇక్కడ ఉన్నదే పతితులు.
ఇక్కడ దేవతలు ఎవరూ లేరు. మనుష్యుల నుండి దేవతలుగా ఎవరు తయారుచేస్తారు? తండ్రే
తయారుచేయగలరు. ఒకప్పుడు స్వర్గముండేదని, అందులో లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేదని
ఇప్పుడు మీరు అర్థం చేయించగలరు. దానిని ఎవరు స్థాపన చేసారు? హెవెన్లీ గాడ్ ఫాదర్
స్వర్గాన్ని స్థాపన చేసారు. అక్కడ దేవీ-దేవతలు రాజ్యము చేస్తారు, అక్కడ వేరే
ధర్మమేదీ ఉండదు. ఇది చాలా పెద్ద అనంతమైన నాటకము. మీరు చైతన్యమైనవారు కదా. ఈ వృక్షము
యొక్క బీజము పైన ఉన్నారని మీకు తెలుసు. తండ్రి కూడా అవినాశీ. మీరు కూడా అవినాశీ.
ఇప్పుడు మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. ఈ సమయములో మనుష్యులందరూ ముళ్ళలా
అయిపోయారు. ఇది ముళ్ళ అడవి కదా. అందరూ ఒకరికొకరు దుఃఖము ఇచ్చుకునేవారే. తండ్రియే
తోట యజమాని, వారిని నావికుడు అని కూడా అంటారు. మీరు కూడా నావను నడిపించడము
నేర్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరి నావ తీరాన్ని ఎలా చేరుకుంటుంది అనేది మీకు కూర్చుని
అర్థం చేయిస్తారు. నావ అంటే శరీరము కాదు. నావ అంటే - ఆత్మ మరియు శరీరము,
రెండింటితోనూ తయారుచేయబడింది. నా నావను తీరానికి చేర్చండి అని పాడుతారు కూడా.
ఇప్పుడు ఆత్మ కూడా పతితముగా ఉంది, శరీరము కూడా పతితముగా ఉంది. ఇప్పుడు తీరానికి ఎలా
చేరుకుంటారు మరియు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మీరు మూలవతనము, సూక్ష్మవతనము,
స్థూలవతనము... సత్యయుగము నుండి మొదలుకుని కలియుగము వరకు అన్ని రహస్యాలను
తెలుసుకున్నారు. అయినా సరే, బుద్ధిలో ఈ విషయాలు ఎందుకు ఉండవు! మీరు ఎందుకు
మర్చిపోతారు? ఈ విషయాలు బుద్ధిలో సదా మెదులుతూ ఉన్నట్లయితే మీరు సంతోషముగా ఉంటారు,
చింతల నుండి దూరమైపోతారు.
బాబా మనల్ని
తీసుకువెళ్ళేందుకు వచ్చారని మీకు తెలుసు. ఏ జ్ఞానమైతే తండ్రిలో ఉందో, అది మనకు
ఇస్తున్నారు. ఇవి పూర్తిగా కొత్త విషయాలు, వీటిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం
చేయించలేరు. నిరాకార తండ్రి సాకారుని ద్వారా వినిపిస్తారు. మీరు కూడా ఈ శరీరము
ద్వారా వింటారు. కనుక తండ్రి పిల్లలైన మిమ్మల్ని కూడా తమ సమానముగా తయారుచేస్తారు.
తండ్రికి ఏ మహిమ ఉందో, అది మీకు కూడా ఉండాలి, తేడా ఏమీ లేదు. తండ్రి అంటారు - కేవలం
నేను జనన-మరణాలలోకి రాను, మీరు జనన-మరణాలలోకి వస్తారు. మీరు నన్ను జ్ఞానసాగరుడు,
సుఖసాగరుడు... అని అంటారు కనుక తప్పకుండా నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను, కల్ప-కల్పము
ఇస్తాను. తప్పకుండా 84 జన్మల చక్రములో తిరిగి ఇప్పుడు మనము అంతిమములో ఉన్నామని మీరు
అర్థం చేసుకున్నారు. మళ్ళీ తండ్రి మనల్ని మొదటి నంబరులోకి తీసుకువెళ్తారు. ఇది
జ్ఞానము కదా. నాలెడ్జ్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ (జ్ఞానము సంపాదనకు ఆధారము). ఎవరు ఎంతగా
చదువుకుంటారో, వారి సంపాదన అలా ఉంటుంది. ఇది జ్ఞానము కూడా, వ్యాపారము కూడా. మీరు
బాబాకు మీ వద్ద ఉన్న చెత్తను ఇస్తారు. ఎవరైనా మరణించినప్పుడు, వారికి చెందినవి ఆ
అంత్యక్రియలు జరిపే పురోహితుడికి ఇస్తారు కదా. ఇక్కడ మీరు జీవించి ఉండగానే ఇవ్వాలి.
వాస్తవానికి అది ఈ సమయానికి సంబంధించిన విషయము. తండ్రి అంటారు - మీ వద్ద ఏదైతే ఉందో,
అదంతా మరణించే కన్నా ముందే ఇవ్వండి. మీరు ట్రస్టీలుగా అవ్వండి. లేదంటే మీ వద్ద ఏదైతే
మిగిలి ఉంటుందో, అది అంతిమములో గుర్తుకువస్తుంది. ఉదాహరణకు షావుకారు వ్యక్తి జ్ఞానము
తీసుకోరనుకోండి, అతని షావుకారుతనము కూడా కేవలం ఒక్క జన్మకే కదా. శరీరమైతే
వదిలేస్తారు, ఇక కర్మల అనుసారముగా ఎక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటారో తెలియదు. మీకైతే
తెలుసు, ఇప్పుడు మనమెంత పురుషార్థము చేస్తామో, అంత ప్రారబ్ధాన్ని పొందుతాము. ఈ
సమయములో అందరూ భౌతిక సేవ చేసేవారే. ఆత్మిక సేవ గురించి ఎవరికీ తెలియనే తెలియదు.
సుప్రీమ్ ఆత్మ వచ్చి మీకు జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. వారు సుఖసాగరుడు,
దుఃఖహర్త-సుఖకర్త. వారి శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ ఈ విషయము బుద్ధిలోకి రాదు.
బాబా మనకు మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి వినిపిస్తారు అనే జ్ఞానము ఇప్పుడు మీ
బుద్ధిలో ఉంది. సత్యయుగములో ఈ జ్ఞానము ఉండదు, మరి కలియుగములో ఎక్కడ నుండి వస్తుంది.
ఈ లక్ష్మీ-నారాయణుల మందిరాలను మనమెందుకు తయారుచేస్తాము, వారు ఎవరు, వారికి ఈ
రాజ్యాన్ని ఎవరిచ్చారు, ఇది ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. ఇది వారి కర్మల ఫలం కదా.
తండ్రి కూర్చుని ఇప్పుడు మీకు కర్మ-అకర్మ-వికర్మల గతిని అర్థం చేయిస్తున్నారు.
భగవానువాచ కదా. గీత ద్వారానే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. అక్కడ
మనుష్యులు కొద్దిమందే ఉంటారు. మిగిలినవారంతా తప్పకుండా ముక్తిని పొందుతూ ఉండవచ్చు.
మహాభారత యుద్ధము గురించి కూడా వ్రాయబడి ఉంది. చాలా ఆపదలు వస్తాయి. ప్రకృతి
వైపరీత్యాలు వస్తాయి. పాత ప్రపంచము సమాప్తమవుతుంది. ఈ బాంబులు, మిసైల్స్ అప్పటివే.
ఇది ఆ వినాశన సమయమే, ఈ సమయములోనే భగవంతుడు వచ్చి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు,
దీని ద్వారానే వినాశ జ్వాల వెలువడింది. భగవంతుడు సుఖ-శాంతుల కోసం యజ్ఞాన్ని
రచిస్తారు. ఇకపోతే, దుఃఖము-అశాంతి తప్పకుండా వినాశనమవుతాయి. ఈ ఈశ్వరీయ జ్ఞాన
యజ్ఞములో మొత్తం సృష్టి అంతా స్వాహా అవుతుంది. ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి.
మనము బ్రాహ్మణులము. ఈ
శివబాబా యజ్ఞములో బ్రాహ్మణులైన మనము సేవకులము. మనము సత్యాతి-సత్యమైన ముఖవంశావళి
బ్రాహ్మణులము. తండ్రి పిల్లలైన మీకు నోటితో ఏదైతే చెప్తారో, దానిని అంగీకరించాలి.
మనము శ్రీమతము అనుసారముగానే నడుచుకోవాలి. శ్రీ శ్రీ శివబాబా మతమనుసారముగా మనము
శ్రేష్ఠముగా అయి మాలలోని మణులుగా అవుతామని కూడా మీకు తెలుసు. మాలలోని మణులను
వంశవృక్షము అని అంటారు. వంశవృక్షము ఉంటుంది కదా, అది తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది.
బాబా స్వయంగా వంశవృక్షాన్ని తయారుచేసారు, ఇది కూడా వంశవృక్షమే. పైన నిరాకారీ శివబాబా
ఉన్నారు, తర్వాత ఆత్మలు ఉన్నారు. నిరాకారీ వంశ వృక్షము తర్వాత సాకారమవుతుంది.
మొట్టమొదటి నంబరులో ఉన్నవారు ప్రజాపిత, వీరు సాకారీ, వారు ఆకారీ. ఆత్మిక తండ్రి
వచ్చి ప్రజాపిత బ్రహ్మా ద్వారా రచిస్తారు. మీరు వచ్చి పతిత ప్రపంచాన్ని పావనముగా
తయారుచేయండి అని అంటారు కూడా. ప్రళయము ఎప్పుడూ జరగదు. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు
రిపీట్ అవుతాయి. పాత ప్రపంచము మళ్ళీ కొత్తదిగా అవుతుంది. ఇప్పుడు మీరు కొత్త
ప్రపంచము కోసం పురుషార్థము చేస్తున్నారు. ఈ అనంతమైన జ్ఞానాన్ని అనంతమైన తండ్రే
ఇస్తారు. హద్దు వారసత్వము ఉన్నప్పటికీ అనంతమైన తండ్రిని గుర్తు చేసుకుంటారు. ఓ
భగవంతుడా అని అంటారు కదా. ఎవరైనా మరణించేటప్పుడు - గాడ్ ఫాదర్ ను స్మృతి చేయండని
అంటారు. అంటే, ఇద్దరు తండ్రులు ఉన్నారని ఋజువవుతుంది కదా. ఆత్మలందరూ సోదరులు. ఆత్మయే
పిలుస్తుంది - ఓ దుఃఖహర్త-సుఖకర్త, ఓ ముక్తిదాత రండి, ఇంటికి వెళ్ళేందుకు మాకు
మార్గము చూపించండి అని. మనకు ఇల్లు గుర్తుంది కానీ వెళ్ళలేము, ఎందుకంటే మాయ రెక్కలను
కట్ చేసేసింది. ఎవరూ తిరిగి ఇంటికి వెళ్ళలేరు. ఇప్పుడు మీరు మీ జ్యోతిని మీరే
వెలిగించుకోవాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే జ్యోతిలో నెయ్యి నిండుతుంది. జ్యోతి
పూర్తిగా ఆరిపోదు. ఎవరైనా మరణిస్తే దీపం వెలిగిస్తారు. అందులో నెయ్యి వేస్తూ
ఉండడానికి ప్రత్యేకముగా ఒకరిని నియమిస్తారు, లేదంటే అంధకారమవుతుందని భావిస్తారు.
ఇప్పుడైతే మీరు యోగబలముతో నెయ్యి వేయాలి, అప్పుడు ఘోర అంధకారము నుండి ప్రకాశములోకి
వస్తారు, అది దీపావళి అవుతుంది. దీపావళి సత్యయుగములో జరుగుతుంది, ఇక్కడ కాదు. ఏ
ఉత్సవాలనైతే జరుపుకుంటూ ఉంటారో, వాటి రహస్యాలను కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఆ
మనుష్యులైతే ఏమీ అర్థం చేసుకోరు. అయినా, ఈ రాఖీ మొదలైనవి పవిత్రముగా ఉండటము కోసమని
అర్థం చేయించడము జరుగుతుంది. మనుష్యులకు జ్ఞాన ఇంజెక్షన్ ను ఎంత యుక్తిగా ఇవ్వాలంటే,
వారు తమను తాము భ్రష్టాచారులని అర్థం చేసుకోవాలి. శ్రేష్ఠాచారులుగా తండ్రే
తయారుచేస్తారు. తండ్రి అంటారు - మన్మనాభవ, అప్పుడు మీరు తమోప్రధానము నుండి
సతోప్రధానముగా అవుతారు. యుక్తిగా బాణము వేయాలి, మాట్లాడే శక్తి కావాలి. ఇప్పుడు మీరు
సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తిని పొంది మాయపై విజయము పొందుతారు. అప్పుడు మీకు
రాజ్యభాగ్యము లభించగలదు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ విజయము పొందేలా చేయలేరు. తండ్రి
అంటారు - పిల్లలూ, ఎలా ఉన్న మిమ్మల్ని ఎలా తయారుచేస్తానో చూడండి. ఇప్పుడు అలాంటి
తండ్రిని నిరంతరము తప్పకుండా స్మృతి చేయాలి, అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి
అంటారు - నన్నొక్కరినే స్మృతి చేస్తే అంతమతి సో గతి జరుగుతుంది (అంతిమ సమయములో
ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో, అలాంటి జన్మ లభిస్తుంది). ఎలాంటి ఆలోచనలు చేస్తారో, అలా
తయారవుతారు, అందుకే తండ్రి అంటారు - నన్ను స్మృతి చేస్తూ-చేస్తూ మీరు కూడా అలా
తయారవుతారు. స్మృతి ద్వారా వికర్మలు కూడా వినాశనమవుతాయి మరియు తమ ఇంటికి తిరిగి
వెళ్తారు. ఈ జ్ఞానము సంపాదనకు ఆధారము. ఆరోగ్యము, ఐశ్వర్యము ఉంటే ఆనందము కూడా ఉంటుంది.
అక్కడ ఆయువు చాలా ఎక్కువగా ఉంటుంది. యోగేశ్వరుడు అని కృష్ణుడిని అనరు. యోగేశ్వరులు
మీరు. ఈశ్వరుడు మీకు యోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది రాజయోగము. యోగము జోడించి మీరు
రాజ్యభాగ్యాన్ని పొందుతారు. ఈశ్వరుడు మీకు యోగము నేర్పించి రాజ్య వారసత్వాన్ని
ఇస్తారు. మీకు రాజ్యము ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చారు. తండ్రి అంటారు - భగవంతుడిని
స్మృతి చేయండి. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తే పాపాలు తొలగుతూ ఉంటాయి.
ఇది చాలా సహజము. మీ బుద్ధిలో ఎంత జ్ఞానముంది. భగవంతుని పిల్లలైన మీరు మాస్టర్ గాడ్
అయినట్లు. అలాగని తండ్రి వద్ద కూర్చుండిపోకూడదు. మనము పాత్రను అభినయించాలి, ఇందులో
దేహీ-అభిమానులుగా అవ్వాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన
సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక
పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి ఏ జ్ఞానాన్ని అయితే ఇస్తారో, దానినే సదా మంథనము చేయాలి. యుక్తిగా
మాట్లాడాలి. చాలా ప్రేమగా అర్థం చేయించాలి.
2. తమ వద్ద ఏదైతే ఉందో, దానినంతటినీ జీవిస్తూ ఉండగానే తండ్రికి ఇచ్చి ట్రస్టీలుగా
అయి ఒక్క తండ్రిని స్మృతి చేయాలి.
వరదానము:-
దేహాభిమానపు నేను అనే భావనను సంపూర్ణ ఆహుతి చేసే ధారణా
స్వరూప భవ
ఎప్పుడైతే సంకల్పము మరియు స్వప్నములో కూడా దేహాభిమానపు
నేను అనే భావన ఉండదో, అనాది ఆత్మిక స్వరూపపు స్మృతి ఉంటుందో, బాబా-బాబా అనే అనంత
నాదము వెలువడుతూ ఉంటుందో, అప్పుడు ధారణా స్వరూపులు, సత్యమైన బ్రాహ్మణులని అంటారు.
నేను అనే భావనను అనగా పాత స్వభావము మరియు సంస్కారాల రూపీ సృష్టిని, ఎప్పుడైతే
బ్రాహ్మణులైన మీరు ఈ మహా యజ్ఞములో స్వాహా చేస్తారో, అప్పుడు ఈ పాత సృష్టి యొక్క
ఆహుతి జరుగుతుంది. కావున ఏ విధముగా యజ్ఞాన్ని రచించేందుకు మీరు నిమిత్తమయ్యారో, అదే
విధముగా ఇప్పుడు అంతిమ ఆహుతి వేసి సమాప్తికి కూడా నిమిత్తమవ్వండి.
స్లోగన్:-
స్వయంతో, సేవతో
మరియు సర్వులతో సంతుష్టతా సర్టిఫికెట్ ను తీసుకోవడమే సిద్ధి స్వరూపులుగా అవ్వడము.
అవ్యక్త ప్రేరణలు -
పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి
యోగీ జీవితము యొక్క
ఉన్నతమైన గమ్యాన్ని ప్రాప్తి చేసుకునే ఆత్మ నిందను స్తుతిలోకి, నిందను మహిమలోకి,
తిరస్కారాన్ని సత్కారములోకి, అవమానాన్ని స్వాభిమానములోకి, అపకారాన్ని ఉపకారములోకి
పరివర్తన చేసి బాబా సమానముగా సదా విజయులుగా, అష్టరత్నాలుగా మరియు భక్తులకు ఇష్టులుగా
అవ్వండి. వారు కూడా కొంచెం మారితే నేను మారుతాను అన్న భావనను పెట్టుకోకండి, ఇది
తీసుకునే భావన. నేను వైబ్రేషన్లు ఇవ్వాలి, నేను దయాహృదయునిగా అవ్వాలి, నేను గుణాలు,
శక్తుల సహయోగాన్ని ఇవ్వాలి, ఈ విషయములో మాస్టర్ దాతలుగా, విశాల హృదయులుగా అవ్వండి.