28-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు మీ ఉన్నతమైన భాగ్యాన్ని
తయారుచేసుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు, ఎంతగా శ్రీమతాన్ని అనుసరిస్తారో, అంత
ఉన్నతమైన భాగ్యము తయారవుతుంది’’
ప్రశ్న:-
భక్తిలో ఉండే
ఏ అలవాటు ఇప్పుడు పిల్లలైన మీలో ఉండకూడదు?
జవాబు:-
భక్తిలో
కొద్దిగా దుఃఖము కలిగినా, అనారోగ్యము వచ్చినా, ఓ రామా, ఓ భగవంతుడా, అని అంటారు.
అయ్యో-అయ్యో అని అంటూ ఆర్తనాదాలు చేసే అలవాటు భక్తిలో ఉంటుంది. ఇప్పుడు మీరు నోటి
ద్వారా ఇటువంటి మాటలను ఎప్పుడూ రానివ్వకూడదు. మీరు లోలోపలే మధురమైన బాబాను ప్రేమగా
స్మృతి చేయాలి.
పాట:-
భాగ్యాన్ని
మేలుకొలుపుకుని వచ్చాను...
ఓంశాంతి
సుఖము మరియు శాంతి యొక్క భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు, మనుష్యులు ప్రతి ఒక్కరూ
పురుషార్థము చేస్తారు. సాధు-సత్పురుషులు, సన్యాసులు మొదలైనవారు మాకు శాంతి కావాలి
అని అంటారు. దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని అంటారు. భగవంతుడే
మనుష్యమాత్రులకు దుఃఖహర్త-సుఖకర్త అని భావిస్తారు. ఇప్పుడు భగవంతుని గురించైతే
మనుష్యులకు తెలియనే తెలియదు. మీరైతే శివబాబా అని అంటారు. బ్రహ్మా-విష్ణు-శంకరులను
బాబా అని అనరు. వారు దేవతలు. భగవంతుడినే బాబా అని అంటారు, వారు నిరాకారుడు, వారిని
పూజిస్తారు. శివబాబా అందరివాడు అని తెలుసు. కానీ మేము ‘బాబా’ అని ఎందుకు అంటున్నాము
అన్న ఆలోచన రాదు. బాబా అని లౌకిక తండ్రి కూడా ఒకరు ఉంటారు - మరి వీరు ఏ తండ్రి! వారు
నిరాకార తండ్రి అని ఆత్మ అంటుంది. వారు కూడా నిరాకారుడే, ఆత్మనైన నేను కూడా
నిరాకారియే. సాకార తండ్రి ఉన్నప్పటికీ, ఆత్మ ఆ తండ్రిని మర్చిపోదు. వారు గాడ్ ఫాదర్,
మనము వారి సంతానము. ఇక్కడ వారిని పరమపిత అని అంటారు. ఇంగ్లీష్ లో గాడ్ ఫాదర్,
సుప్రీమ్ సోల్, అందరికన్నా ఉన్నతమైనవారు అని అంటారు. లౌకిక తండ్రి అయితే శరీరానికి
రచయిత మరియు వారు పారలౌకిక తండ్రి. తండ్రియే కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు.
తండ్రిని స్మృతి చేస్తారు ఎందుకంటే తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. మీరు
వారసత్వము తీసుకునేందుకే తండ్రి వద్దకు వచ్చారు. దుఃఖహర్త, సుఖకర్త అయిన తండ్రియే
వచ్చి సుఖము యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. ఆ తర్వాత అక్కడ దుఃఖము యొక్క
నామ-రూపాలు ఉండవు. ఇక్కడైతే చాలా దుఃఖము ఉంది కదా, అందుకే అందరూ పిలుస్తారు.
ఇప్పుడైతే ప్రపంచములో చాలా దుఃఖము రానున్నది. ఎవరైనా మరణించినప్పుడు ఎంత దుఃఖితులుగా
అవుతారు. ‘అయ్యో భగవంతుడా’, అని అంటూ ఏడుస్తారు. వారు మాత్రమే కళ్యాణకారీ తండ్రి.
ఇలా పాడుతున్నారంటే తప్పకుండా దుఃఖాన్ని హరించారు, సుఖాన్ని ఇచ్చారు అనే కదా. తండ్రి
వచ్చి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, కల్ప-కల్పము ఎప్పుడైతే మీరు చాలా దుఃఖితులుగా,
పతితులుగా అవుతారో, అప్పుడు ఓ బాబా రండి, అని పిలుస్తారు. నేను కల్ప-కల్పము
సంగమములోనే వస్తాను. పావన ప్రపంచము యొక్క ఆదిని మరియు పతిత ప్రపంచము యొక్క
అంతిమాన్ని సంగమము అని అంటారు. ఈ సంగమయుగము ఒక్కటే గాయనము చేయబడుతుంది. తండ్రి అందరి
జ్యోతులను వెలిగించి, దుఃఖాన్ని హరించి, సుఖాన్ని ఇవ్వడానికి వస్తారు. ఏ బాబా అయితే
వీరిలో ప్రవేశించారో, మేము ఆ పారలౌకిక తండ్రి వద్దకు వచ్చామని మీకు తెలుసు. నేను
వీరిలోకి ప్రవేశించి, వీరికి బ్రహ్మా అన్న పేరును పెడతాను అని తండ్రి స్వయంగా
చెప్తారు. మీరంతా బ్రహ్మాకుమారులు మరియు కుమారీలు. మేము తండ్రి నుండి సుఖము యొక్క
వారసత్వాన్ని తీసుకునేందుకు బ్రహ్మా యొక్క సంతానముగా అయ్యాము అన్న నిశ్చయము మీకు
ఉంది. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేటప్పుడు పిల్లలైన మీకే సుఖముండేది. ఇప్పుడిది
కలియుగము, దుఃఖధామము. దీని తర్వాత మళ్ళీ సత్యయుగము వస్తుంది. ప్రపంచ
చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవుతాయి కదా. సత్యయుగములో మళ్ళీ ఈ లక్ష్మీ-నారాయణుల
రాజ్యమే ఉండాలి. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. మీరు నరకవాసులుగా అయ్యారని, ఇప్పుడు
మళ్ళీ స్వర్గవాసులుగా అవ్వాలని బాబా అర్థం చేయించారు. దేవీ-దేవతలైన మీ వృక్షము చాలా
చిన్నదిగా ఉండేది. మేమే 84 జన్మలను తీసుకున్నామని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది.
మనము మొత్తము విశ్వానికి యజమానులుగా ఉండేవారము, మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ
వచ్చాము. ఇప్పుడు మీది 84 జన్మల అంతిమములో కూడా అంతిమ సమయము. ప్రపంచము కొత్తది నుండి
పాతదిగా తప్పకుండా అవుతుంది. కొత్త ప్రపంచము పావనముగా ఉండేది, ఇప్పుడిది పాత, పతిత
ప్రపంచము. ఎంత దుఃఖితులుగా, నిరుపేదలుగా ఉన్నారు. భారత్ చాలా షావుకారుగా ఉండేది,
పవిత్ర గృహస్థాశ్రమము ఉండేది. పవిత్ర ప్రవృత్తి మార్గముండేది, సంపూర్ణ
నిర్వికారులుగా ఉండేవారు, సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు. ఈ
విషయాలు శాస్త్రాలలో లేవు. శాస్త్రాలు భక్తి మార్గము కోసం ఉన్నాయి. వాటిలో భక్తి
యొక్క ఆచార-పద్ధతులే ఉన్నాయి. తండ్రిని కలుసుకునే మార్గము శాస్త్రాలలో లభించదు.
భగవంతుడు ఇక్కడికి రావాల్సి ఉంటుందని భావిస్తారు కూడా. కానీ తిరిగి అక్కడకు చేరుకునే
విషయమేమీ లేదు. యజ్ఞ-తపాదులు మొదలైనవి చేయడము - ఇవేవీ మార్గాలు కావు. మీరు రండి,
వచ్చి మార్గాన్ని తెలియజేయండి అనే భగవంతుడిని పిలుస్తారు. మన ఆత్మ తమోప్రధానముగా
అయిపోయింది, ఈ కారణముగా ఎగరలేదు అనగా తండ్రి వద్దకు వెళ్ళలేదు. వాస్తవానికి ఆత్మ ఒక
శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోతుంది.
అమెరికాకు కూడా వెళ్ళగలదు. ఎవరికైనా ఎవరితోనైనా సంబంధము ఉంటే, ఆత్మ వెంటనే అక్కడికి
ఒక్క సెకెండులో ఎగిరి వెళ్ళిపోతుంది. అంతేకానీ, ఎగురుతూ తన ఇంటికి తిరిగి
వెళ్ళడమనేది జరగదు. పతితులు అక్కడికి వెళ్ళలేరు, అందుకే - ఓ పతితపావనా రండి అని
పిలుస్తారు. మొత్తం ప్రపంచము పతితముగా ఉన్నప్పుడు నేను వస్తానని తండ్రి వచ్చినప్పుడు
అర్థం చేయిస్తారు. పతిత ప్రపంచములో పావనమైనవారు ఒక్కరు కూడా లేరు. గంగను
పతిత-పావనిగా భావిస్తారు, అందుకే స్నానాలు చేయడానికి వెళ్తారు. కానీ నీటి ద్వారా
ఎవరూ పావనముగా అవ్వలేరు. పాత ప్రపంచము పతితముగా ఉంది, కొత్త ప్రపంచము పావనమైనది.
ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడానికి వచ్చారు. మీరు
పుణ్యాత్ములుగా అవ్వాలి. మీ ఆత్మ సతోప్రధానముగా ఉండేది, ఇప్పుడు తమోప్రధానముగా ఉంది.
మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలంటే గంగా స్నానముతో అవ్వదు. పతితులను పావనముగా చేయడము -
ఇది తండ్రి పని మాత్రమే. ఇకపోతే ఆ నీటి నదులైతే అన్ని చోట్ల ఉంటాయి. మేఘాల నుండి
నీరు వర్షిస్తుంది, ఆ నీరు అందరికీ లభిస్తుంది. ఒకవేళ నీటి నది పావనముగా
చేసినట్లయితే, అది అందరినీ పావనముగా చేయాలి. పావనముగా అయ్యే యుక్తిని తండ్రియే వచ్చి
వీరి ద్వారా తెలియజేస్తారు. వీరికి తమ ఆత్మ అనేది ఉంది. తండ్రి అంటారు - నాకు నా
శరీరమంటూ లేదు. మీకు అర్థం చేయించేందుకు కల్ప-కల్పము వీరిలోనే వస్తాను. మీకు మీ
జన్మల గురించి తెలియదు. కల్పము ఆయువును లక్షల సంవత్సరాలని అనేస్తారు.
తండ్రి అంటారు - ఇది 84 జన్మల చక్రము. 5 వేల సంవత్సరాలలో 84 లక్షల జన్మలు ఎవరూ
తీసుకోలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - స్వర్గములో మీరు 16 కళల సంపూర్ణులుగా
ఉండేవారు, ఆ తర్వాత 2 కళలు తగ్గాయి, ఆ తర్వాత నెమ్మది-నెమ్మదిగా కళలు తగ్గిపోతూ
ఉంటాయి. కొత్త ప్రపంచమే మళ్ళీ పాతదిగా అవుతుంది. ద్వాపర-కలియుగాలను పతిత ప్రపంచమని
అంటారు. ఈ విషయాలు శాస్త్రాలలోనేమీ లేవు. నన్నే జ్ఞానసాగరుడని అంటారు. నేను ఏమైనా
శాస్త్రాలు చదువుతానా? నాకు ఈ సృష్టి ఆదిమధ్యాంతాలు తెలుసు. భక్తి మార్గము వారికి ఈ
జ్ఞానము ఉండదు. అదంతా భక్తికి సంబంధించిన జ్ఞానము. మేము పాపులము, నీచులము, మాలో ఏ
గుణాలూ లేవు, మీరే దయ చూపించండి... అని పాడుతారు కూడా. వీరిపై దయ చూపించడము జరిగింది,
అందుకే మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారు, దీనినే ఉన్నతోన్నతమైన భాగ్యము అని అంటారు.
భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు స్కూలుకు వెళ్తారు. కొందరు జడ్జీలుగా, కొందరు
ఇంజనీర్లుగా అవుతారు. అది వికారీ భాగ్యము, ఇక్కడ మీకు ఈశ్వరుని ద్వారా భాగ్యము
తయారవుతుంది, అందుకే - దుఃఖహర్త-సుఖకర్త అని పిలుస్తారు. దేవతలుగా తయారుచేయడానికి
తండ్రి తప్ప ఎవరూ చదివించలేరు. తండ్రి కూర్చుని ఆత్మలతో మాట్లాడుతున్నారు. ఇది నా
శరీరమని ఆత్మ అంటుంది. శరీరము, ఇది నా ఆత్మ అని అనదు. శరీరములో ఆత్మ ఉంది, ఇది నా
శరీరము అని ఆత్మ అంటుంది. నా ఆత్మను దుఃఖపెట్టకండి అని మనుష్యులు అంటారు. ఆత్మ
శరీరములో లేకపోతే మాట్లాడలేదు కూడా. నేను ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటానని
ఆత్మ అంటుంది. మనము తప్పకుండా 84 జన్మలను అనుభవించాము, ఇప్పుడు నరకవాసులుగా అయ్యాము.
ఇప్పుడు మళ్ళీ మీరు స్వర్గవాసులుగా అయ్యే పురుషార్థాన్ని చేస్తున్నారు.
స్వర్గవాసులుగా అయితే తండ్రే చేస్తారు. స్వర్గమని సత్యయుగాన్నే అంటారు. ఫలానావారు
స్వర్గస్థులయ్యారని ఏదైతే అంటారో, అది అసత్యము చెప్తున్నారు. ఇది నరకము. ఎవరైనా
మరణించినప్పుడు స్వర్గానికి వెళ్ళారని అంటారు, మరి వచ్చి భోజనము చేయండి అని మళ్ళీ
నరకములోకి ఎందుకు పిలుస్తారు. స్వర్గములోనైతే వారికి చాలా వైభవాలు లభిస్తాయి, మరి
మీరు నరకములోకి ఎందుకు పిలుస్తారు? మనుష్యులలో ఈ మాత్రం తెలివి కూడా లేదు. తండ్రి
కూర్చుని అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు ఈ కలియుగము సమాప్తమవ్వనున్నది, దీనికి
నిప్పు అంటుకోనున్నది. ఇవన్నీ సమాప్తమైపోతాయి. పిల్లలైన మీలో, ఎవరైతే తండ్రి నుండి
వారసత్వాన్ని తీసుకుంటారో, వారు సత్యయుగములోకి వచ్చి రాజ్యము చేస్తారు. ఈ
లక్ష్మీ-నారాయణులకు ఈ వారసత్వాన్ని ఎవరు ఇచ్చారు? తండ్రి ఇచ్చారు. మీరు ఇప్పుడు
తండ్రి ద్వారా యోగ్యులుగా అవుతున్నారు. మేము నరకవాసుల నుండి స్వర్గవాసులుగా
అవుతున్నామని మీరు అంటారు. తండ్రి అంటారు - నేను స్వర్గవాసిగా అవ్వను, నేను
పరంధామములో ఉంటాను. నరకవాసులుగా, స్వర్గవాసులుగా మీరు అవుతారు. ఆత్మ నివాస స్థానము
శాంతిధామము, ఆ తర్వాత మీరు సుఖధామములోకి వస్తారు. ఇది దుఃఖధామము, ఇది ఇప్పుడు
వినాశనమవ్వనున్నది. భగవంతుడు బ్రహ్మా తనువులోకి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారని
ఎవరికీ తెలియదు. వారు శ్రీకృష్ణుడు వచ్చారని భావిస్తారు, శ్రీకృష్ణుని తనువులోకి
వచ్చారని కూడా అనరు. శ్రీకృష్ణుడిని భగవంతుడని అనలేము. వారు విశ్వానికి యజమాని.
అందరి ముక్తిదాత ఒక్కరే, వారు సుప్రీమ్ ఆత్మ, పరమ ఆత్మ. మేము తండ్రి నుండి స్వర్గ
వారసత్వాన్ని తీసుకుంటామని భావించే సత్సంగము ప్రపంచములో ఇంకేదీ ఉండదు. పతితుల నుండి
పావనులుగా తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి అంటారు - నేను మీ సత్యమైన
గురువును, మిమ్మల్ని పావనముగా తయారుచేస్తాను. ఇకపోతే, గంగా నీరు పావనముగా చేయలేదు.
ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచము. మనుష్యులు ఏమి చేసినా కానీ మెట్లు కిందకు
దిగాల్సిందే, సతోప్రధానము నుండి తమోప్రధానముగా అవ్వాల్సిందే. మీరు భక్తి చేయరు.
అయ్యో రామా, అని కూడా అనరు. వారు మీ తండ్రి, మిమ్మల్ని చదివిస్తున్నారు. ఓ భగవంతుడా
రండి, ఓ రామా, అని కూడా అనకూడదు. కానీ చాలా మందికి ఇది అలవాటైపోయింది కావున ఈ పదాలు
వెలువడుతాయి. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని మరియు మీరు నా
వద్దకు వచ్చేస్తారని మీకు తండ్రి చెప్తారు. స్మృతి ఒక్కరినే చేయాలి.
తండ్రి అంటారు - ఇది మీ అంతిమ జన్మ. ఇప్పుడు వారసత్వాన్ని తీసుకుంటే తీసుకున్నట్లు,
ఇక మళ్ళీ ఎప్పుడూ పొందలేరు. తండ్రి అర్థం చేయించారు - ఎవరైతే స్వయాన్ని హిందువులని
చెప్పుకుంటున్నారో, వారు వాస్తవానికి దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు. క్రిస్టియన్
ధర్మము వారు ఎప్పుడూ పేరు మార్చుకోరు. తమోప్రధానముగా ఉన్నా సరే క్రిస్టియన్
ధర్మములోనే ఉన్నారు. మీరు దేవీ-దేవతలు, కానీ పతితులుగా ఉన్న కారణముగా తమను తాము
హిందువులని చెప్పుకుంటారు, తమను తాము దేవతలుగా చెప్పుకోలేరు. వాస్తవానికి మేము
దేవీ-దేవతలుగా ఉండేవారమని మర్చిపోయారు. స్వయాన్ని ఎవరూ దేవతా ధర్మమువారిగా
చెప్పుకోరు ఎందుకంటే వికారులుగా ఉన్నారు. ఇది దేహాభిమానము. పిల్లలకు చాలా బాగా అర్థం
చేయించడము జరుగుతుంది, ఇక్కడ సాధు-సన్యాసులు మొదలైనవారెవరూ లేరు. మేము
వ్యాపారస్థులము, మేము ఫలానా అని భావిస్తారు - ఇదంతా దేహాభిమానము. ఇప్పుడు మీరు
దేహీ-అభిమానులుగా అవ్వాలి. దేహీ-అభిమానులుగా అవ్వడములోనే శ్రమ ఉంది. మీరు బాబా నుండి
వారసత్వాన్ని తీసుకోవాలంటే బాబాను స్మృతి చేయాలి. చేతులు పని వైపు, హృదయము తండ్రి
వైపు... మీరు ఒక్క ప్రియునికి ప్రేయసులు. సర్వుల సద్గతిదాత ఆ ఒక్క ప్రియుడే.
ఎప్పుడైతే అందరికీ సద్గతి లభించవలసి ఉంటుందో మరియు స్వర్గ స్థాపన జరగవలసి ఉంటుందో,
అప్పుడే వారు వస్తారు. అప్పుడు దుఃఖము యొక్క నామ-రూపాలు మాయమైపోతాయి. ఇప్పుడు
పిల్లలైన మీరు, అనంతమైన తండ్రి నుండి స్వర్గము యొక్క వారసత్వాన్ని, 21 జన్మలకు సదా
సుఖము యొక్క వారసత్వాన్ని పొందేందుకు ఇక్కడకు వచ్చారు. ఇతర మనుష్యమాత్రులెవరూ ఎవరినీ
స్వర్గానికి యజమానులుగా చేయలేరు. శివబాబా భారత్ లోనే వచ్చి, భారత్ ను స్వర్గముగా
తయారుచేస్తారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ బాబా నుండి మాకు స్వర్గ వారసత్వము
లభిస్తుందని మర్చిపోయారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. చదువు ఆధారముగా తమ భాగ్యాన్ని ఉన్నతముగా తయారుచేసుకోవాలి, మనుష్యుల నుండి
దేవతలుగా అవ్వాలి. పావనముగా అయి తిరిగి ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కొత్త ప్రపంచములోకి
రావాలి.
2. చేతులతో పని చేస్తూ - ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. ఎటువంటి తప్పుడు విషయాలను
వినకూడదు, వినిపించకూడదు.
వరదానము:-
సదా మీ పవిత్ర స్వరూపములో స్థితులై గుణాల రూపీ ముత్యాలను
ఏరుకునే హోలీహంస భవ
హోలీ హంసలైన మీ స్వరూపము పవిత్ర స్వరూపము మరియు మీ
కర్తవ్యము సదా గుణాల రూపీ ముత్యాలను ఏరుకోవడము. అవగుణాల రూపీ రాళ్ళను ఎప్పుడూ
బుద్ధిలో స్వీకరించకూడదు. కానీ ఈ కర్తవ్యాన్ని పాలన చేయడానికి సదా ఒక ఆజ్ఞ
గుర్తుండాలి, అదేమిటంటే - చెడు ఆలోచించకూడదు, చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు
మాట్లాడకూడదు... ఎవరైతే ఈ ఆజ్ఞను సదా స్మృతిలో ఉంచుకుంటారో, వారు సదా సాగర తీరములో
ఉంటారు. హంసల నివాస స్థానమే సాగరము.
స్లోగన్:-
నడుస్తూ-తిరుగుతూ ఫరిశ్తా స్వరూపములో ఉండటము - ఇదే బ్రహ్మాబాబా మనసుకు ఇష్టమైన
కానుక.
అవ్యక్త ప్రేరణలు -
‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చేయండి’’
సదా
అచంచలముగా-స్థిరముగా ఉండేందుకు స్వ ఉన్నతి మరియు సేవా ఉన్నతిలో సదా బిజీగా ఉండండి,
సర్వుల పట్ల శుభ భావనను పెట్టుకోండి. సంబంధాల ఆధారముగా పాత్రను అభినయించకుండా, సేవా
సంబంధముతో పాత్రను అభినయించండి. రెండవది - వినాశీ సాధనాలను ఆసరాగా లేక ఆధారముగా
చేసుకోకండి, అవన్నీ నిమిత్తమాత్రముగా ఉన్నాయి, సేవ కొరకు ఉన్నాయి. సేవార్థము
కార్యములో ఉపయోగించండి, ఆ తర్వాత అతీతులైపోండి. సాధనాల ఆకర్షణకు మనసు
ఆకర్షితమవ్వకూడదు.