28-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీకు డ్రామా యొక్క గుప్తమైన రహస్యము గురించి తెలుసు, అదేమిటంటే - ఈ సంగమయుగమే ఎక్కే కళ యొక్క యుగము, సత్యయుగము నుండి మొదలుకుని కళలు తగ్గుతూ ఉంటాయి’’

ప్రశ్న:-
అన్నింటికంటే ఉత్తమమైన సేవ ఏమిటి మరియు ఆ సేవను ఎవరు చేస్తారు?

జవాబు:-
భారత్ ను స్వర్గముగా తయారుచేయడము, పేదవారిని ధనవంతులుగా చేయడము, పతితులను పావనముగా తయారుచేయడము - ఇది అన్నింటికన్నా ఉత్తమమైన సేవ. ఇటువంటి సేవను ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. తండ్రి ఇటువంటి గొప్ప సేవను చేసారు, అందుకే పిల్లలు వారికి గౌరవాన్ని ఇస్తారు, మొట్టమొదట సోమనాథ మందిరాన్ని నిర్మించి వారిని పూజిస్తారు.

పాట:-
చివరికి ఆ రోజు నేటికి రానే వచ్చింది...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఆత్మ గుప్తముగా ఉంటుంది మరియు శరీరము ప్రత్యక్షముగా ఉంటుంది. ఆత్మను ఈ కళ్ళ ద్వారా చూడలేము, అది గుప్తముగా ఉంటుంది. ఆత్మ అనేది ఉండటము తప్పకుండా ఉంది కానీ ఈ శరీరముతో కప్పబడి ఉంటుంది, అందుకే ఆత్మ గుప్తముగా ఉందని అంటారు. ఆత్మ స్వయంగా చెప్తుంది - నేను నిరాకారిని, ఇక్కడ సాకారములోకి వచ్చి గుప్తమయ్యాను. ఆత్మలది నిరాకారీ ప్రపంచము. అక్కడైతే గుప్తము అనే మాటేమీ లేదు. పరమపిత పరమాత్మ కూడా అక్కడే ఉంటారు, వారిని సుప్రీమ్, ఉన్నతోన్నతమైన ఆత్మ అని అంటారు. అన్నింటికంటే దూరమైన స్థానములో నివసించేవారు పరమపిత పరమాత్మ. తండ్రి అంటారు - ఎలాగైతే మీరు గుప్తముగా ఉన్నారో, అలా నేను కూడా గుప్తముగా రావాల్సి ఉంటుంది. నేను గర్భజైలులోకి రాను. నాకు శివ అన్న పేరు ఒకటే కొనసాగుతూ వస్తుంది. నేను వీరిలోకి వచ్చినా కూడా నా పేరు మారదు. వీరి ఆత్మ ఏ శరీరములోనైతే ఉందో, దాని పేరు మారుతుంది. నన్ను అయితే శివ అనే అంటారు, నేను ఆత్మలందరికీ తండ్రిని. ఆత్మలైన మీరు ఈ శరీరములో గుప్తముగా ఉన్నారు. ఈ శరీరము ద్వారా కర్మలు చేస్తారు. నేను కూడా గుప్తముగా ఉన్నాను. ఆత్మనైన నేను ఈ శరీరముతో కప్పబడి ఉన్నాను అనే జ్ఞానము పిల్లలైన మీకు ఇప్పుడు లభిస్తుంది. ఆత్మ గుప్తముగా ఉంటుంది. శరీరము ప్రత్యక్షముగా ఉంటుంది. నేను కూడా అశరీరినే. గుప్తమైన తండ్రి ఈ శరీరము ద్వారా వినిపిస్తారు. మీరు కూడా గుప్తమైనవారే, మీరు శరీరము ద్వారా వింటారు. తండ్రి వచ్చి ఉన్నారని మీకు తెలుసు. భారత్ ను మళ్ళీ నిరుపేద నుండి షావుకారుగా చేయడానికి తండ్రి వస్తారు. మీరు మా భారత్ పేదది అని అంటారు, ఈ విషయము అందరికీ తెలుసు కానీ మన భారత్ షావుకారుగా ఎప్పుడుండేది, ఎలా ఉండేది అనే విషయము వారికి తెలియనే తెలియదు. మన భారత్ అయితే చాలా షావుకారుగా ఉండేదని, దుఃఖమనే మాటే ఉండేది కాదని పిల్లలైన మీకు చాలా నషా ఉంది. సత్యయుగములో ఇతర ధర్మాలేవీ ఉండేవి కావు. ఒకే ఒక దేవీ-దేవతా ధర్మముండేది. ఈ విషయము ఎవరికీ తెలియదు. ప్రపంచ చరిత్ర-భౌగోళికాల గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు మంచి రీతిలో అర్థం చేసుకున్నారు - మన భారత్ చాలా షావుకారుగా ఉండేది, ఇప్పుడు చాలా నిరుపేదగా ఉంది, ఇప్పుడు మళ్ళీ షావుకారుగా చేయడానికి తండ్రి వచ్చారు. భారత్ సత్యయుగములో చాలా షావుకారుగా ఉండేది. అప్పుడు దేవీ-దేవతల రాజ్యముండేది. తర్వాత ఆ రాజ్యము ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది ఎవరికీ తెలియదు. ఋషులు, మునులు మొదలైనవారు కూడా మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదని అంటారు. తండ్రి అంటారు - సత్యయుగములో ఈ దేవీ-దేవతలకు రచయిత-రచనల జ్ఞానముండేది కాదు, వారికి ఆదిమధ్యాంతాల గురించి తెలియదు. ఒకవేళ వారికి - మేము మెట్లు దిగుతూ పాతాళములోకి వెళ్తామనే జ్ఞానము ఉన్నట్లయితే, ఇక రాజ్యాధికారము యొక్క సుఖము కూడా ఉండదు. చింత మొదలవుతుంది.

మేము తమోప్రధానము నుండి సతోప్రధానముగా ఎలా అవ్వాలి - అని ఇప్పుడు మీకు ఈ చింత పట్టుకుంది. ఆత్మలమైన మనము నిరాకారీ ప్రపంచములో ఉండేవారము, మరి అక్కడ నుండి సుఖధామములోకి ఎలా వచ్చాము - ఇది కూడా జ్ఞానమే. మనము ఇప్పుడు ఎక్కే కళలో ఉన్నాము. ఇది 84 జన్మల మెట్ల వరుస. ఈ 84 జన్మలలో ఏమి జరుగుతుంది అనేది కూడా మీకు తెలుసు. సత్యయుగములోకి అందరూ రారు. డ్రామానుసారముగా ప్రతి పాత్రధారి నంబరువారుగా తమ-తమ సమయమనుసారముగా వచ్చి పాత్రను అభినయిస్తారు.

పేదల పెన్నిధి అని ఎవరిని అంటారు అనేది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, ఇది ప్రపంచము వారికి తెలియదు. చివరికి ఆ రోజు నేడు రానే వచ్చింది... అని పాటలో కూడా విన్నారు. ఇదంతా భక్తి. భగవంతుడు ఎప్పుడు వచ్చి భక్తులైన మనల్ని ఈ భక్తి మార్గము నుండి విడిపించి సద్గతిలోకి తీసుకువెళ్తారు అనేది కూడా మీరు అర్థం చేసుకున్నారు. రామ రాజ్యము, రావణ రాజ్యము అనే పేర్లు వేటికి పెట్టారు అనేది కూడా మనుష్యులెవరికీ తెలియదు. బాబా ఈ శరీరములోకి మళ్ళీ వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు అంటే శివుడు తప్పకుండా వస్తారు. అలాగని, నేను శ్రీకృష్ణుని తనువులోకి వస్తానని కూడా వారు అనరు. అలా అనరు. తండ్రి అంటారు - శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుంది. ఎవరైతే మొదటి నంబరులో ఉండేవారో, వారు ఇప్పుడు అంతిమములో ఉన్నారు. తతత్వమ్ (ఇది మీకు కూడా వర్తిస్తుంది). నేనైతే సాధారణ తనువులోకే వస్తాను. మీరు 84 జన్మలను ఎలా అనుభవిస్తారు అనేది నేను వచ్చి మీకు తెలియజేస్తాను. ఈ సమయములో ఒక్కరు కూడా తమను తాము దేవతా ధర్మము వారిగా భావించరు ఎందుకంటే సత్యయుగాన్ని చాలా దూరంగా తీసుకువెళ్ళిపోయారు. కల్పము ఆయువును లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. వాస్తవానికి డ్రామా చరిత్ర చాలా చిన్నది. ఇందులో కొన్ని ధర్మాలకు 500 సంవత్సరాలు చరిత్ర, కొన్నింటికి 2500 సంవత్సరాల చరిత్ర ఉంది. మీ చరిత్ర 5000 సంవత్సరాలది. దేవతా ధర్మము వారే స్వర్గములోకి వస్తారు. మిగిలిన ధర్మాల వారు తర్వాత వస్తారు. దేవతా ధర్మము వారే ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. డ్రామానుసారముగా మళ్ళీ అలాగే కన్వర్ట్ అవుతారు. తర్వాత తమ-తమ ధర్మాలలోకి తిరిగి వస్తారు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. బాబా స్వర్గ స్థాపన చేసేవారు కనుక మేమెందుకు స్వర్గములో ఉండకూడదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మేము తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము - ఈ మాట అన్నప్పుడు వారు మన ధర్మానికి చెందినవారని ఋజువవుతుంది. ఎవరైతే మన ధర్మానికి చెందినవారు కారో, వారు అసలు రానే రారు. వారు పరాయి ధర్మములోకి ఎందుకు వెళ్ళాలని అంటారు. సత్యయుగీ కొత్త ప్రపంచములో దేవతలకు చాలా సుఖముండేదని, బంగారు మహళ్ళు ఉండేవని పిల్లలైన మీకు తెలుసు. సోమనాథ మందిరములో ఎంత బంగారముండేది. ఇటువంటి మందిరము అసలు ఇంకొకటేదీ ఉండదు. అందులో చాలా వజ్ర-వైఢూర్యాలు ఉండేవి. బౌద్ధులు మొదలైనవారికి వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఏమీ ఉండవు. ఏ తండ్రి అయితే పిల్లలైన మిమ్మల్ని ఇంత ఉన్నతముగా తయారుచేసారో, మీరు వారి పట్ల ఎంత గౌరవాన్ని ఉంచారు. ఎవరైతే మంచి కర్మలు చేసి వెళ్తారో, వారి పట్ల గౌరవాన్ని ఉంచడము జరుగుతుంది. అన్నింటికంటే మంచి కర్మను పతిత-పావనుడైన తండ్రియే చేసి వెళ్తారని ఇప్పుడు మీకు తెలుసు. అన్నింటికంటే ఉత్తమోత్తమ సేవను అనంతమైన తండ్రియే వచ్చి చేస్తారని మీ ఆత్మ అంటుంది. వారు మనల్ని నిరుపేదల నుండి ధనవంతులుగా, బికారుల నుండి రాకుమారులుగా తయారుచేస్తారు. ఎవరైతే భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారో, వారి పట్ల కూడా ఎవరూ గౌరవాన్ని ఉంచడము లేదు. సోమనాథ మందిరము ఉన్నతోన్నతమైన మందిరముగా మహిమ చేయబడిందని మీకు తెలుసు, దానిని దోచుకుని వెళ్ళిపోయారు. లక్ష్మీ-నారాయణుల మందిరాన్ని ఎప్పుడూ ఎవరూ దోచుకోలేదు. సోమనాథ మందిరాన్ని దోచుకున్నారు. భక్తి మార్గములో వారు చాలా ధనవంతులుగా ఉంటారు. రాజులలో కూడా నంబరువారుగా ఉంటారు కదా. ఎవరైతే ఉన్నత పదవి కలవారు ఉంటారో, వారిని చిన్న పదవి వారు గౌరవిస్తారు. దర్బారులో కూడా నంబరువారుగా కూర్చుంటారు. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. ఇక్కడ పతిత రాజుల దర్బారు ఉంటుంది. పావన రాజుల దర్బారు ఎలా ఉంటుంది, వారి వద్ద అంత ధనమున్నప్పుడు మరి వారి భవనము కూడా అంత బాగుంటుంది. బాబా మనల్ని చదివిస్తున్నారని, స్వర్గ స్థాపన చేయిస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనము స్వర్గానికి మహారాజు-మహారాణులుగా అవుతాము, తర్వాత పడిపోతాము, ఆ తర్వాత మొట్టమొదట మనము శివబాబాకు పూజారులుగా అవుతాము. ఎవరైతే స్వర్గానికి యజమానులుగా చేసారో, వారిని మనము పూజిస్తాము. వారు మనల్ని చాలా షావుకారుగా చేస్తారు. ఇప్పుడు భారత్ ఎంత నిరుపేదగా ఉంది. ఇంతకుముందు ఇంత నిరుపేదగా ఉండేది కాదు, చాలా సంతోషముగా ఉండేవారు. ఏ భూమినైతే 500 రూపాయలకు కొన్నారో, అది ఈ రోజు 5000 రూపాయలకు కూడా లభించదు. అక్కడైతే భూమికి ధర ఉండదు. ఎవరికి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఎంతో భూమి ఉంటుంది. మధురమైన నదీ తీరాలలో మీ మహళ్ళు ఉంటాయి కదా. చాలా తక్కువమంది మనుష్యులుంటారు. ప్రకృతి దాసీగా ఉంటుంది, చాలా మంచి ఫలాలు, పుష్పాలు లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంత కృషి చేస్తున్నారు. కానీ కరువు వస్తే భోజనము లభించదు. పాటను వినడముతో మీ రోమాలు నిక్కబొడుచుకోవాలి. తండ్రిని పేదల పెన్నిధి అని అంటారు. దాని అర్థం ఇప్పుడు తెలిసింది కదా. వారు ఎవరిని షావుకారులుగా తయారుచేస్తారు? ఎవరైతే ఇక్కడికి వస్తారో, తప్పకుండా వారినే షావుకారులుగా తయారుచేస్తారు కదా. మనము పావనము నుండి పతితముగా అవ్వడానికి 5 వేల సంవత్సరాలు పట్టిందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ వెంటనే బాబా పతితము నుండి పావనముగా చేస్తారు, ఉన్నతోన్నతముగా చేస్తారు. ఒక్క సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా, మేము మీ వారము అని అంటారు. బాబా అంటారు - పిల్లలూ, మీరు విశ్వానికి యజమానులు. కొడుకు జన్మించగానే వారసుడిగా అవుతారు. ఎంత సంతోషము కలుగుతుంది. కానీ కూతురుని చూస్తే ముఖము వాడిపోతుంది. ఇక్కడైతే ఆత్మలందరూ కొడుకులే. మనము స్వర్గానికి యజమానులుగా అయిపోయాము. మనము 5 వేల సంవత్సరాల క్రితం స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు మీకు తెలిసింది. బాబా అలా తయారుచేసారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వచ్చారు అనేది తెలియదు. లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఎప్పుడుండేది అనేది అసలేమీ తెలియదు. వాస్తవానికి భారత్ యొక్క జనాభా సంఖ్య అన్నింటికంటే ఎక్కువగా ఉండాలి. భారత్ యొక్క భూమి కూడా అన్నింటికంటే ఎక్కువగా ఉండాలి. లక్షల సంవత్సరాలంటే మరి చాలా భూమి కావాలి. మొత్తం ప్రపంచములో ఉన్న భూమి అంతా కూడా సరిపోదు. లక్షల సంవత్సరాలలో ఎంతమంది మనుష్యులు జన్మిస్తారు. లెక్కలేనంత మంది మనుష్యులు అయిపోతారు. కానీ అంతమందైతే లేరు. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మనుష్యులు వీటిని వింటే - ఈ విషయాలనైతే ఎప్పుడూ వినలేదు, ఏ శాస్త్రాలలోనూ చదవలేదు, ఇవి అద్భుతమైన విషయాలు అని అంటారు.

ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్రము యొక్క జ్ఞానముంది. వీరు అనేక జన్మల అంతిమములో ఇప్పుడు పతితాత్మగా ఉన్నారు, సతోప్రధానముగా ఉండే వీరే ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు, మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. ఆత్మలైన మీకు ఇప్పుడు శిక్షణ లభిస్తూ ఉంది. ఆత్మ శరీరము ద్వారా వింటున్నప్పుడు శరీరము ఊగుతుంది, ఎందుకంటే ఆత్మ వింటుంది కదా. తప్పకుండా ఆత్మలమైన మనము 84 జన్మలను తీసుకున్నాము. 84 తల్లిదండ్రులు తప్పకుండా లభించి ఉంటారు. ఇది కూడా లెక్క కదా. మేము 84 జన్మలు తీసుకుంటాము, ఇంకా తక్కువ జన్మలు తీసుకునేవారు కూడా ఉంటారు అని బుద్ధిలోకి వస్తుంది. మినిమమ్ మరియు మ్యాగ్జిమమ్ (తక్కువలో తక్కువ మరియు ఎక్కువలో ఎక్కువ) యొక్క లెక్క ఉంటుంది కదా. శాస్త్రాలలో ఏమేమి వ్రాసేసారు అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మీ గురించి అయితే కనీసం 84 జన్మలు అనైనా అంటారు, నా గురించి అయితే లెక్కలేనన్ని జన్మలని అనేసారు. కణకణంలో ఎక్కడ చూసినా నీవే నీవు, కృష్ణుడే కృష్ణుడని అంటారు. మథురా మరియు బృందావనములో శ్రీకృష్ణుడు సర్వవ్యాపి అని అంటారు. రాధా మార్గము వారు ఎక్కడ చూసినా రాధయే రాధ అని అంటారు. వారు మేము రాధా-స్వాములము అని చెప్పుకుంటారు. కృష్ణ స్వాములు వేరే ఉంటారు. రాధా మార్గము వారు రాధను నమ్ముతారు. ఎక్కడ చూసినా రాధయే రాధ, నీవు కూడా రాధయే, నేను కూడా రాధయే అని అంటారు.

ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, తప్పకుండా నేను పేదల పెన్నిధిని కదా. భారత్ యే అన్నింటికంటే షావుకారుగా ఉండేది. ఇప్పుడు అన్నింటికంటే నిరుపేదగా అయ్యింది, అందుకే నేను భారత్ లోకే రావాల్సి ఉంటుంది. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా. ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. ఇది చాలా పెద్ద డ్రామా. డ్రామాలో ఏదైతే షూటింగ్ జరిగిందో, అది మళ్ళీ యథావిధిగా రిపీట్ అవుతుంది. డ్రామా గురించి కూడా తెలిసి ఉండాలి. డ్రామా అంటే డ్రామా. అది హద్దు డ్రామా, ఇది అనంతమైన డ్రామా. దీని ఆదిమధ్యాంతాల గురించి ఎవరికీ తెలియదు. పేదల పెన్నిధి అని నిరాకార భగవంతుడినే భావిస్తారు, శ్రీకృష్ణుడిని కాదు. శ్రీకృష్ణుడైతే ధనవంతునిగా, సత్యయుగ రాకుమారునిగా అవుతారు. భగవంతునికైతే తమదంటూ శరీరము లేదు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని ధనవంతులుగా చేస్తారు. మీకు రాజయోగ శిక్షణను ఇస్తారు. మనుష్యులు కూడా చదువు ద్వారా బ్యారిస్టరు మొదలైనవారిగా అవుతారు, అప్పుడు సంపాదిస్తారు. తండ్రి కూడా మిమ్మల్ని ఇప్పుడు చదివిస్తారు. మీరు భవిష్యత్తులో నరుని నుండి నారాయణునిగా అవుతారు. మీ జన్మ జరుగుతుంది కదా. స్వర్గము అనేది సముద్రము నుండేమీ బయటకు రాదు. శ్రీకృష్ణుడు కూడా జన్మ తీసుకున్నారు కదా. కంసపురి మొదలైనవైతే ఆ సమయములో ఉండేవి కావు. శ్రీకృష్ణుని పేరు ఎంతగా మహిమ చేయబడుతుంది. అతని తండ్రికి మహిమ లేదు. అతని తండ్రి ఎక్కడ ఉన్నారు. శ్రీకృష్ణుడు తప్పకుండా రాజుకు సంతానమై ఉంటారు కదా. అక్కడ పెద్ద రాజు ఇంటిలో జన్మ జరుగుతుంది. కానీ అతను పతిత రాజు అయిన కారణముగా అతనికి పేరు ఉండదు. శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు కొద్దిమంది పతితులు కూడా ఉంటారు. వారు పూర్తిగా సమాప్తమైనప్పుడు శ్రీకృష్ణుడు సింహాసనముపై కూర్చుంటారు, తన రాజ్యాన్ని తీసుకుంటారు, అప్పుడే వారి కాలం ప్రారంభమవుతుంది. లక్ష్మీ-నారాయణులతో శకం ప్రారంభమవుతుంది. వారి రాజ్యము ఇంత సమయము ఉంటుందని, తర్వాత వారిది ఇంత సమయము ఉంటుందని మీరు పూర్తి లెక్కను వ్రాస్తారు. అప్పుడు కల్పము ఆయువు ఎక్కువగా ఉండనే ఉండదు అని మనుష్యులు అర్థం చేసుకుంటారు. 5 వేల సంవత్సరాల పూర్తి లెక్క ఉంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. రచయిత మరియు రచనల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుని సతోప్రధానముగా అయ్యే పురుషార్థము చేయాలి. నేను సతోప్రధానముగా తప్పకుండా అవ్వాలి అన్న ఒక్క చింతను మాత్రమే పెట్టుకోవాలి.

2. ఈ అనంతమైన డ్రామాను బుద్ధిలో ఉంచుకుని అపారమైన సంతోషములో ఉండాలి, తండ్రి సమానముగా గౌరవాన్ని పొందేందుకు పతితులను పావనముగా చేసే సేవను చేయాలి.

వరదానము:-
అధికారీతనపు స్మృతి ద్వారా సర్వ శక్తులను అనుభవము చేసే ప్రాప్తి స్వరూప భవ

ఒకవేళ బుద్ధి యొక్క సంబంధము సదా ఒక్క తండ్రితో జోడించబడి ఉన్నట్లయితే సర్వ శక్తుల వారసత్వము అధికారము రూపములో ప్రాప్తిస్తుంది. ఎవరైతే స్వయాన్ని అధికారిగా భావిస్తూ ప్రతి కర్మను చేస్తారో, వారికి మాటలలో లేదా సంకల్పాలలో కూడా ఏమీ యాచించవలసిన అవసరముండదు. ఈ అధికారీతనపు స్మృతియే సర్వ శక్తుల ప్రాప్తిని అనుభవము చేయిస్తుంది. కావున నషా ఉండాలి - సర్వ శక్తులు నా జన్మ సిద్ధ అధికారము. అధికారిగా అయి నడుచుకున్నట్లయితే ఆధీనత సమాప్తమైపోతుంది.

స్లోగన్:-
స్వయముతో పాటుగా ప్రకృతిని కూడా పావనముగా చేయాలంటే సంపూర్ణ మోహ ముక్తులుగా అవ్వండి.

అవ్యక్త ప్రేరణలు - అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా) అవ్వండి

ఒకవేళ పవిత్రతా నియమము పక్కాగా ఉన్నట్లయితే మోహము నుండి ముక్తులుగా, ఈర్ష్య మరియు క్రోధము నుండి కూడా ముక్తులుగా అవ్వండి. చికాకుపడే తత్వము కూడా ఉండకూడదు. ఇది జరగాల్సిందే అన్న మోహము కూడా పెట్టుకోకండి. స్వార్థము లేక ఈర్ష్యకు వశమై ఏదైనా మాట చెప్తే, అది నెరవేరకపోతే క్రోధము వస్తుంది, అందుకే పవిత్రతా స్తంభాన్ని దృఢము చేసుకోండి, అప్పుడు ఈ స్తంభము లైట్ హౌస్ వలె పని చేస్తుంది.