28-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు అమరలోక యాత్రలో ఉన్నారు,
మీ ఈ ఆత్మిక యాత్ర బుద్ధికి సంబంధించింది, ఈ యాత్రను సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులైన
మీరు మాత్రమే చేయగలరు’’
ప్రశ్న:-
మీతో మీరు లేక
పరస్పరములో ఒకరితో ఒకరు ఎటువంటి మాటలు మాట్లాడుకోవడాన్ని శుభ సమ్మేళనమని అంటారు?
జవాబు:-
మీతో మీరు ఇలా
మాట్లాడుకోండి - ఆత్మనైన నేను ఇప్పుడు ఈ పాత ఛీ-ఛీ శరీరాన్ని వదిలి తిరిగి ఇంటికి
వెళ్తాను, ఈ తనువు దేనికీ పనికి రాదు, ఇప్పుడు ఇక బాబాతో పాటు వెళ్తాను. పరస్పరములో
కలుసుకున్నప్పుడు ఇవే మాటలు మాట్లాడుకోండి - సేవను ఎలా వృద్ధి చేయాలి, అందరి
కళ్యాణము ఎలా చేయాలి, అందరికీ మార్గాన్ని ఎలా తెలియజేయాలి అని... ఇదే శుభ సమ్మేళనము.
పాట:-
హృదయము యొక్క
ఆధారము తెగిపోకూడదు...
ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు, అన్ని సెంటర్లకు చెందిన బ్రహ్మా ముఖవంశావళి
సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణులకు తమ కులము గురించి తెలుసు. ఎవరు ఏ కులానికి
చెందినవారో, వారికి ఆ కులము గురించి తెలుస్తుంది. తక్కువ కులానికి చెందినవారికైనా
లేక మంచి కులానికి చెందినవారికైనా, ప్రతి ఒక్కరికీ తమ కులము గురించి తెలుస్తుంది
మరియు ఫలానావారి కులము మంచిది అని అర్థం చేసుకుంటారు. కులము అనండి లేక జాతి అనండి,
ఈ బ్రాహ్మణ కులమే సర్వోత్తమమైనదని ఈ ప్రపంచములో పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ
తెలియదు. బ్రాహ్మణులైన మీ కులమునే మొదటి నంబరు కులమని అంటారు. బ్రాహ్మణ కులము అనగా
ఈశ్వరీయ కులము. మొదటిది నిరాకారీ కులము, తర్వాత సాకార సృష్టిలోకి వస్తారు.
సూక్ష్మవతనములోనైతే కులము ఉండదు. సాకార సృష్టిలో ఉన్నతోన్నతమైనది బ్రాహ్మణులైన మీ
కులము. బ్రాహ్మణులైన మీరు పరస్పరములో సోదరీ-సోదరులు. పరస్పరములో సోదరీ-సోదరులు
కావున వికారాలలోకి వెళ్ళలేరు. పవిత్రముగా ఉండేందుకు ఇది చాలా మంచి యుక్తి అని మీరు
అనుభవముతో చెప్పగలరు. మీలోని ప్రతి ఒక్కరూ, మేము బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలమని
చెప్పుకుంటారు. అందరూ శివ వంశీయులే, తర్వాత సాకారములోకి వచ్చినప్పుడు ప్రజాపిత పేరు
ఉండడము వలన సోదరీ-సోదరులు అవుతారు. ప్రజాపిత బ్రహ్మా ఉన్నారంటే తప్పకుండా రచయిత
ఉన్నట్లే, వారు దత్తత తీసుకుంటారు. మీరు కుఖ వంశావళి కాదు, మీరు ముఖ వంశావళి.
మనుష్యులకు కుఖ వంశావళి మరియు ముఖ వంశావళి అంటే ఏమిటి అనే అర్థం కూడా తెలియదు. ముఖ
వంశావళి అనగా దత్తత తీసుకోబడిన పిల్లలు. కుఖ వంశావళి అనగా గర్భము ద్వారా జన్మ
తీసుకున్నవారు. మీ ఈ జన్మ అలౌకికమైనది. మీకు లౌకిక, అలౌకిక మరియు పారలౌకిక తండ్రులు
ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మాను అలౌకిక తండ్రి అని అంటారు. లౌకిక తండ్రి అయితే అందరికీ
ఉన్నారు, అది కామన్. పారలౌకిక తండ్రి కూడా అందరికీ ఉన్నారు. భక్తి మార్గములోనైతే -
ఓ భగవంతుడా, ఓ పరమపితా అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఈ బాబాను (ప్రజాపిత బ్రహ్మాను)
ఎప్పుడూ ఎవరూ పిలవరు. వీరు బ్రాహ్మణ పిల్లలకు బాబా. లౌకిక మరియు పారలౌకిక తండ్రుల
గురించైతే అందరికీ తెలుసు కానీ బ్రహ్మా విషయములో తికమకపడతారు ఎందుకంటే బ్రహ్మా
సూక్ష్మవతనములో ఉన్నారు. వారిని ఇక్కడ చూపించరు. చిత్రాలలో కూడా బ్రహ్మాకు మీసము,
గడ్డము ఉన్నట్లుగా చూపిస్తారు ఎందుకంటే ప్రజాపిత బ్రహ్మా ఈ సృష్టిలో ఉన్నారు.
సూక్ష్మవతనములోనైతే ప్రజలను రచించలేరు. ఇది కూడా ఎవరి బుద్ధిలోకీ రాదు. ఈ
విషయాలన్నింటినీ తండ్రి అర్థం చేయిస్తారు.
పిల్లలైన మీ యొక్క ఈ ఆత్మిక యాత్రను గురించి కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎక్కడ నుండైతే
ఇక తిరిగి రారో, దానిని ఆత్మిక యాత్ర అని అంటారు. వేరే యాత్రలనైతే అందరూ
జన్మజన్మలుగా చేస్తూ ఉంటారు మరియు ఆ యాత్రలకు వెళ్ళి తిరిగి వస్తారు. అవి దైహిక
యాత్రలు, మీది ఆత్మిక యాత్ర. ఈ ఆత్మిక యాత్రను చేసినట్లయితే ఇక మీరు తిరిగి
మృత్యులోకములోకి రారు. తండ్రి మీకు అమరలోక యాత్రను నేర్పిస్తారు. వాళ్ళు కాశ్మీర్
వైపు అమరనాథ యాత్రకు వెళ్తారు. అదేమీ అమరలోకము కాదు. అమరలోకము అనేది - ఒకటి ఆత్మలది,
మరొకటి మనుష్యులది, దానిని స్వర్గము లేక అమరలోకమని అంటారు. ఆత్మల లోకము నిర్వాణధామము.
ఇకపోతే, అమరలోకము సత్యయుగము మరియు మృత్యులోకము కలియుగము మరియు నిర్వాణధామము
శాంతిలోకము, అక్కడ ఆత్మలు నివసిస్తాయి. తండ్రి అంటారు - మీరు అమరపురి యొక్క యాత్రలో
ఉన్నారు. ఆ దైహిక యాత్రలకు కాలినడకన వెళ్తారు. ఇది ఆత్మిక యాత్ర, ఈ యాత్రను
నేర్పించేవారు ఒక్క ఆత్మిక తండ్రి మాత్రమే, వారు ఒక్కసారి మాత్రమే వచ్చి
నేర్పిస్తారు. ఆ యాత్రలను జన్మజన్మలుగా చేస్తూ వచ్చారు. ఇది మృత్యులోకము యొక్క
అంతిమ యాత్ర. దీని గురించి బ్రాహ్మణ కులభూషణులైన మీకు మాత్రమే తెలుసు. ఆత్మిక యాత్ర
అనగా స్మృతిలో ఉంటారు. అంతమతి సో గతి (అంతిమ సమయములో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో,
అటువంటి జన్మ లభిస్తుంది) అని అంటూ ఉంటారు. మీకు బాబా ఇల్లే గుర్తుకువస్తుంది.
ఇప్పుడు నాటకము పూర్తవుతుందని అర్థం చేసుకుంటారు. ఇది పాత వస్త్రము, పాత శరీరము.
ఆత్మలో మాలిన్యము చేరినప్పుడు శరీరములో కూడా మాలిన్యము చేరుతుంది. ఆత్మ పవిత్రముగా
అయినప్పుడు, మనకు శరీరము కూడా పవిత్రమైనది లభిస్తుంది. ఇది కూడా పిల్లలైన మీరు అర్థం
చేసుకుంటారు. బయటివారు ఏమీ అర్థం చేసుకోరు. కొంతమంది అర్థం చేసుకోవడాన్ని మీరు
చూస్తుంటారు. కొందరి బుద్ధిలో ఈ జ్ఞానము లేదు. అర్థం చేసుకునేవారైతే తప్పకుండా
ఇతరులకు అర్థం చేయిస్తారు. మనుష్యులు యాత్రలకు వెళ్ళినప్పుడు పవిత్రముగా ఉంటారు.
ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అపవిత్రమవుతారు. నెల, రెండు నెలలు పవిత్రముగా ఉంటారు.
యాత్రలకు కూడా సీజన్ ఉంటుంది. యాత్రలకైతే అన్ని సమయాలలోనూ వెళ్ళలేరు. చలికాలము లేక
వర్షాకాలములో ఎవరూ వెళ్ళలేరు. మీ యాత్రలోనైతే వేడి-చలి అనే మాట ఉండదు. మీరు తండ్రి
ఇంటికి వెళ్తున్నారని స్వయము బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. ఎంతగా మనము స్మృతి
చేస్తామో, అంతగా వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి ఇంటికి వెళ్ళి మళ్ళీ మనము కొత్త
ప్రపంచములోకి వస్తాము. ఇది బాబాయే అర్థం చేయిస్తారు. ఇక్కడ కూడా పిల్లలు నంబరువారుగా
ఉన్నారు. వాస్తవానికి యాత్రను మర్చిపోకూడదు కానీ మాయ మర్చిపోయేలా చేస్తుంది. అందుకే
- బాబా, మీ స్మృతిని మర్చిపోతున్నామని వ్రాస్తారు కూడా. అరే, ఏ స్మృతియాత్రతోనైతే
మీరు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారో, అటువంటి ఔషధాన్ని మీరు
మర్చిపోతారా. తండ్రిని స్మృతి చేయడము చాలా సులభమని కూడా చెప్తారు. మీతో మీరు ఈ
విధముగా మాట్లాడుకోవాలి - ఆత్మనైన నేను ముందు సతోప్రధానముగా ఉండేవాడిని, ఇప్పుడు
తమోప్రధానముగా అయ్యాను. ఇప్పుడు, శివబాబా మనకు యుక్తులైతే చాలా మంచివి
తెలియజేస్తున్నారు, ఇకపోతే అభ్యాసము చేయాలి. ఆలోచించడమనేది కళ్ళు మూసుకుని చేయరు (ఆ
సమయములో బాబా అలా యాక్ట్ చేసి చూపించారు). మీతో మీరు ఇలా మాట్లాడుకోండి - మేము
సతోప్రధానముగా ఉండేవారము, మేమే రాజ్యము చేసేవారము. ఆ ప్రపంచము బంగారుయుగముగా ఉండేది,
ఆ తర్వాత వెండి, రాగి, ఇనుప యుగాలలోకి వచ్చేసాము. ఇప్పుడిది ఇనుప యుగము యొక్క
అంతిమము కావున బాబా వచ్చి ఉన్నారు. బాబా ఆత్మలైన మనకు చెప్తున్నారు - నన్ను స్మృతి
చేయండి మరియు ఎక్కడి నుండైతే వచ్చారో, ఆ ఇంటిని స్మృతి చేయండి, అప్పుడు అంతమతి సో
గతి జరుగుతుంది. మీరు అక్కడికే వెళ్ళాలి. ఉదయాన్నే లేచి మీతో మీరు మాట్లాడుకోండి అనే
యుక్తిని తండ్రి తెలియజేస్తారు. నేను కూడా ఉదయాన్నే లేచి విచార సాగర మంథనము
చేస్తానని బాబా యాక్ట్ చేసి చూపిస్తున్నారు. సత్యమైన సంపాదనను చేసుకోవాలి కదా. ఓ
ప్రాతః స్మరణీయ ప్రభూ, ఈ రోజంతటికీ సరిపడే సంపాదనను ఇచ్చే కొనుగోలుదారుడిని పంపించు...
అని అంటారు. కావున ఆ భగవంతుడిని స్మృతి చేసినట్లయితే మీ నావ తీరానికి చేరుకుంటుంది.
బాబా ఏదైతే చేస్తారో, అది ఎలా అయితే చేస్తారో, అది పిల్లలకు కూడా అర్థం చేయిస్తారు.
ఇందులో ఘర్షణ యొక్క విషయమేమీ లేదు. ఇది సంపాదన చేసుకునేందుకు చాలా మంచి యుక్తి.
భగవంతుడిని స్మృతి చేసినట్లయితే స్వర్గ రాజ్యాధికారము తప్పకుండా లభిస్తుంది.
మేము రాజయోగము నేర్చుకుంటున్నాము అని పిల్లలకు తెలుసు. బాబా బీజరూపుడు, నాలెడ్జ్
ఫుల్ కనుక మనము కూడా వృక్షము గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాము. ఇది కూడా
విస్తారమైన జ్ఞానము. ఆదిలో ఈ వృక్షము ఎలా వృద్ధి చెందుతుంది, తర్వాత దీని ఆయువు ఎలా
పూర్తవుతుంది మరియు తుఫానులు రావడముతో వృక్షము ఎలా పడిపోతుంది అనేది మనకు తెలుసు.
కానీ, ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షము యొక్క మొదటి పునాది అయిన దేవీ-దేవతా ధర్మము
కనుమరుగైపోతుంది. ఇది కూడా జరగాల్సిందే. ఈ ధర్మము మాయమైపోయినప్పుడే మళ్ళీ ఏక ధర్మ
స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనము జరుగుతుందని అంటారు. కల్ప-కల్పము ఈ ధర్మము
కనుమరుగైపోతుంది. ఆత్మలో మాలిన్యము చేరినప్పుడు ఆభరణము (శరీరము) అసత్యమైనదిగా
అయిపోతుంది. పిల్లలు అర్థం చేసుకుంటారు - ఇంతకుముందు మాలో మాలిన్యము ఉండేది, ఇప్పుడు
మేము స్వచ్ఛముగా అవుతున్నాము కనుక ఇతరులకు మార్గాన్ని తెలియజేస్తాము. ప్రపంచమైతే
తమోప్రధానముగా ఉంది. ఇంతకుముందు సతోప్రధాన స్వర్గము ఉండేది. పిల్లలు ఉదయాన్నే లేచి
తమతో తాము మాట్లాడుకోవాలి అనగా ఆత్మిక సంభాషణ చేయాలి. విచార సాగర మంథనము చేయాలి. ఆ
తర్వాత - ఇది 84 జన్మల చక్రమని, 84 జన్మలను ఎలా తీసుకుంటారు, ఎవరు తీసుకుంటారు అనేది
ఇతరులకు అర్థం చేయించాలి. తప్పకుండా ఎవరైతే ముందు వస్తారో, వారే 84 జన్మలు
తీసుకుంటారు. తండ్రి కూడా భారత్ లోనే వస్తారు. వారు వచ్చి 84 జన్మల చక్రము గురించి
అర్థం చేయిస్తారు. తండ్రి ఎక్కడ వచ్చారు అనేది కూడా తెలియదు. తండ్రి వచ్చి తమ
పరిచయాన్ని స్వయముగా ఇస్తారు. తండ్రి అంటారు - నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను,
మన్మనాభవ, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఈ విధముగా ఎవరూ అర్థం
చేయించలేరు. గీత మొదలైనవి వినిపిస్తూ ఉంటారు, అక్కడికి కూడా మనుష్యులు వెళ్తూ ఉంటారు.
కానీ, భగవంతుడనేవారు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఉంటారు, జ్ఞానాన్ని వినిపించి ఉంటారు.
అంటే, వారు వచ్చినప్పుడే వినిపిస్తారు కదా. ఆ వ్యక్తులు గీతా పుస్తకాన్ని పట్టుకుని
కూర్చుని వినిపిస్తారు. ఇక్కడైతే భగవంతుడు జ్ఞానసాగరుడు, వీరేమీ చేతిలో పట్టుకుని
చదవాల్సిన అవసరము లేదు. వీరేమీ నేర్చుకోరు. కల్పక్రితం కూడా వచ్చి పిల్లలైన మీకు
సంగమములో నేర్పించారు. తండ్రియే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది స్మృతియాత్ర.
బ్రహ్మా ముఖవంశావళి వద్ద తప్ప ఇంకే మనుష్యుల వద్ద ఈ జ్ఞానము ఉండదని మీ బుద్ధికి
మాత్రమే తెలుసు. అందరిలోనూ సర్వవ్యాపి జ్ఞానము నిండి ఉంది. పరమాత్మ బిందువని,
జ్ఞానసాగరుడు, పతిత-పావనుడని ఎవరికీ తెలియదు. కేవలం అలా పాడుకుంటూ ఉంటారు. గురువులు
ఏది నేర్పిస్తే అది సత్యము-సత్యము అని అంటూ ఉంటారు, అంతేకానీ అర్థమేమీ తెలియదు,
అలానే ఇది సత్యమా కాదా అని కూడా ఎప్పుడూ ఆలోచించరు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలైన మీరు నడుస్తూ-తిరుగుతూ స్మృతియాత్రలో
తప్పకుండా ఉండాలి, లేదంటే వికర్మలు వినాశనమవ్వవు. ఏ కర్మలు చేస్తున్నా సరే బుద్ధిలో
తండ్రి స్మృతి ఉండాలి. శ్రీనాథ ద్వారములో భోజనము తయారుచేస్తున్నప్పుడు వారి బుద్ధిలో
శ్రీనాథుడు ఉంటారు కదా. కూర్చోవడమే మందిరములో కూర్చుని ఉన్నారు. మేము శ్రీనాథుని
కోసం భోగ్ తయారుచేస్తున్నామని వారికి తెలుసు. భోజనము తయారుచేస్తారు, భోగ్
సమర్పిస్తారు, ఆ తర్వాత ఇంటివారు, పిల్లలు గుర్తుకువస్తూ ఉంటారు. అక్కడ భోజనము
తయారుచేసేటప్పుడు నోటిని కప్పుకుంటారు, మాట్లాడరు. మనసు ద్వారా ఏ వికర్మలు తయారవ్వవు.
వారు శ్రీనాథుని మందిరములో కూర్చున్నారు. ఇక్కడ మీరు శివబాబా వద్ద కూర్చున్నారు.
ఇక్కడ కూడా బాబా యుక్తులు తెలియజేస్తూ ఉంటారు. పిల్లలూ, అనవసరమైన మాటలేవీ
మాట్లాడకండి. సదా తండ్రితో మధురాతి మధురమైన మాటలను మాట్లాడాలి. తండ్రి ఎలా ఉన్నారో,
పిల్లలు అలా ఉంటారు. చక్రము ఎలా తిరుగుతుంది అనేది తండ్రి స్మృతిలో ఉంటుంది కావున
వారు వచ్చి పిల్లలైన మీకు వినిపిస్తారు. మా బాబా మనుష్య సృష్టికి బీజరూపుడని,
చైతన్యమైనవారని పిల్లలైన మీకు తెలుసు. ఇది ఎంత సహజమైన విషయము, అయినా అర్థం చేసుకోరు
ఎందుకంటే రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు కదా. ఆ బీజాన్ని మనము చైతన్యమైనదని అనము.
వీరు నాలెడ్జ్ ఫుల్, చైతన్యమైనవారు. వీరు ఒక్కరే. ఆ బీజాలు అనేక రకాలవి ఉంటాయి.
భగవంతుడిని మనుష్య సృష్టికి బీజరూపుడని అంటారు. అంటే, వారు తండ్రి అయినట్లు కదా.
ఆత్మల తండ్రి పరమాత్మ కనుక పరస్పరములో అందరూ సోదరులు అయినట్లు. ఆత్మలైన మీరు
నివసించే చోటే తండ్రి కూడా నివసిస్తారు. నిర్వాణధామములో తండ్రి మరియు పిల్లలు ఉంటారు.
ఈ సమయములో ప్రజాపిత బ్రహ్మాకు సంతానమైన మీరు పరస్పరములో సోదరీ-సోదరులు. అందుకే,
శివవంశీ బ్రహ్మాకుమార-కుమారీలుగా పిలవబడతారు. బ్రహ్మాకుమార-కుమారీలైన మేము
పరస్పరములో సోదరీ-సోదరులము అని కూడా మీరు వ్రాయాలి. తండ్రి బ్రహ్మా ద్వారా సృష్టిని
రచిస్తారు కావున మీరు పరస్పరములో సోదరీ-సోదరులు అయినట్లు కదా. కల్ప-కల్పము ఇదే
విధముగా సృష్టిస్తారు. దత్తత తీసుకుంటూ ఉంటారు. ఇతర మనుష్యులెవరినీ ప్రజాపిత బ్రహ్మా
అని అనరు. బాబా అని సంబోధిస్తారు కానీ వారు హద్దు తండ్రి. వీరిని ప్రజాపిత అని
అంటారు ఎందుకంటే చాలామంది ప్రజలు ఉన్నారు అనగా అనేకమంది పిల్లలున్నారు. అనంతమైన
తండ్రి కూర్చుని పిల్లలకు అన్ని విషయాలను అర్థం చేయిస్తున్నారు. ఈ ప్రపంచము పూర్తిగా
పాడైపోయింది, ఛీ-ఛీ గా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని వాహ్-వాహ్ అనబడే ప్రపంచములోకి
తీసుకువెళ్తారు. మీలో కూడా చాలా మంది ఈ విషయాన్ని మర్చిపోతారు. ఒకవేళ ఈ విషయము
గుర్తున్నట్లయితే తండ్రి కూడా గుర్తుంటారు మరియు గురువు కూడా గుర్తుంటారు, అలాగే
ఇప్పుడు తిరిగి వెళ్ళాలి, పాత శరీరాన్ని వదిలేస్తాము అనేది కూడా గుర్తుంటుంది
ఎందుకంటే ఈ తనువు ఇప్పుడిక పనికి రాదు. ఇప్పుడు ఆత్మ పవిత్రముగా అవుతూ ఉంటే, శరీరము
కూడా పవిత్రముగా అవుతుంది. పరస్పరములో కూర్చుని ఇటువంటి మాటలను మాట్లాడుకోవాలి,
దీనినే శుభ సమ్మేళనమని అంటారు. ఇక్కడ మంచి-మంచి మాటలు మాట్లాడుకుంటారు. సేవను ఎలా
వృద్ధి చేయాలి, కళ్యాణము ఎలా చేయాలి అని మాట్లాడుకోవాలి. వారిది ఛీ-ఛీ సమ్మేళనము,
కేవలం ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఇక్కడ ప్రగల్భాలు మొదలైనవి ఉండవు.
సత్యాతి-సత్యమైన సమ్మేళనమని దీనినే అంటారు. మీకు ఈ కథను వినిపించారు - ఇది కలియుగము,
సత్యయుగాన్ని స్వర్గము అంటారు. భారత్ స్వర్గముగా ఉండేది, భారతవాసులే 84 జన్మలు
తీసుకుంటారు. ఇప్పుడు అంతిమములో ఉన్నారు. ఇప్పుడు మీరు తమోప్రధానము నుండి
సతోప్రధానముగా అవుతారు. దీని కోసం గంగా స్నానాలు మొదలైనవేవీ చేయాల్సిన అవసరము లేదు.
భగవానువాచ - నేను అందరికీ తండ్రిని, శ్రీకృష్ణుడు అందరికీ తండ్రి కాలేరు. శ్రీ
నారాయణుడు ఒకరు లేక ఇద్దరు పిల్లలకు తండ్రి, అంతేకానీ శ్రీకృష్ణుడు తండ్రి కారు.
శ్రీకృష్ణుడు కుమారుడు. ఈ ప్రజాపిత బ్రహ్మాకు అయితే అనేకమంది పిల్లలున్నారు.
శ్రీకృష్ణ భగవానువాచ ఎక్కడ, శివ భగవానువాచ ఎక్కడ. ఎంత పెద్ద పొరపాటు చేసారు. ఎక్కడ
ప్రదర్శనీ పెట్టినా, గీతా భగవానుడు శివుడా లేక శ్రీకృష్ణుడా అనేది ముఖ్యమైన విషయము.
ముందుగా శివుడిని భగవంతుడని అంటారని అర్థం చేయించాలి. ఈ విషయాన్ని బుద్ధిలో
కూర్చోబెట్టాలి. దీనికి సంబంధించిన ప్రశ్నావళి ఉండాలి. గీతా భగవానుడి చిత్రము కూడా
పెద్దగా, పర్మనెంట్ గా ఉండాలి. చిత్రము కింద - నిర్ణయించుకోండి, వచ్చి తెలుసుకోండి
అని వ్రాయాలి, ఆ తర్వాత వారి చేత వ్రాయించి సంతకము తీసుకోవాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పరస్పరములో శుభ సమ్మేళనము చేసి సేవా వృద్ధి కోసం ప్లాన్లు తయారుచేయాలి. స్వ
కళ్యాణము మరియు సర్వుల కళ్యాణము కోసం యుక్తులను రచించాలి. ఎప్పుడూ కూడా ఎటువంటి
వ్యర్థమైన (అనవసరమైన) మాటలేవీ మాట్లాడకూడదు.
2. ఉదయాన్నే లేచి మీతో మీరు మాట్లాడుకోవాలి, విచార సాగర మంథనము చేయాలి. భోజనము
తయారుచేస్తూ ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. మనసు కూడా బయట భ్రమించకూడదు, దాని పట్ల
అటెన్షన్ పెట్టాలి.
వరదానము:-
సర్వాత్మలపై స్నేహముతో రాజ్యము చేసే విశ్వ రాజ్యాధికారి భవ
ఏ పిల్లలైతే వర్తమాన సమయములో సర్వాత్మల హృదయాలపై స్నేహముతో
రాజ్యము చేస్తారో, వారే భవిష్యత్తులో విశ్వ రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు.
ఇప్పుడు ఎవరిపైనా ఆర్డర్ చేయకూడదు. ఇప్పటినుండే విశ్వమహారాజుగా అవ్వకూడదు, ఇప్పుడు
విశ్వ సేవాధారిగా అవ్వాలి, స్నేహాన్ని ఇవ్వాలి. తమ భవిష్య ఖాతాలో స్నేహాన్ని ఎంత జమ
చేసుకున్నారు అనేది చూసుకోవాలి. విశ్వ మహారాజుగా అయ్యేందుకు కేవలం జ్ఞాన దాతగా
అవ్వడమే కాదు, దాని కోసం అందరికీ స్నేహాన్ని అనగా సహయోగాన్ని ఇవ్వండి.
స్లోగన్:-
అలసట ఫీల్
అయినప్పుడు సంతోషముగా డ్యాన్స్ చేయండి, దానితో మూడ్ చేంజ్ అయిపోతుంది.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి
బాప్ దాదా ఇప్పుడు
పిల్లల నుండి ఇదే కోరుకుంటున్నారు - నా ప్రతి బిడ్డ మాస్టర్ దాతగా అవ్వాలి. ఇప్పుడు
దయార్ద్ర హృదయులుగా అయ్యి మీ గుణాలు మరియు శక్తులతో అందరికీ సహయోగాన్ని ఇవ్వండి,
విశాల హృదయులుగా అవ్వండి. ఎంతగా ఇతరులకు ఇస్తూ ఉంటారో అంతగా పెరుగుతూ ఉంటాయి. వినాశీ
ఖజానాను ఇచ్చినట్లయితే అది తక్కువవుతుంది, కానీ అవినాశీ ఖజానాను ఇచ్చినట్లయితే అది
పెరుగుతుంది - ఒక్కటి ఇవ్వండి, వెయ్యి పొందండి.