28-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - బాబా ఎంత దూరము నుండి మిమ్మల్ని
చదివించడానికి వస్తారు, చదివించడానికి ఫీజు కూడా తీసుకోరు, మరి ఎంత ప్రేమగా
చదువుకోవాలి’’
ప్రశ్న:-
ఆత్మిక
గవర్నమెంట్ మొత్తం ప్రపంచము కోసం ఈ ఉచిత స్కూలును తెరిచింది - ఎందుకని?
జవాబు:-
ఎందుకంటే అందరూ
అనాథలుగా అయిపోయారు. తండ్రి అలాంటి పేద పిల్లల నుండి ఫీజు ఏమి తీసుకుంటారు. ఈ అంతిమ
జన్మలో తండ్రి ఎలాంటి చదువును చదివిస్తారంటే, దాని ద్వారా మీరు విశ్వానికి
యజమానులుగా అయిపోతారు. కొత్త-కొత్త పిల్లలు ఎవరైతే చదువుకోవడానికి వస్తారో, వారికి
కూడా ఏ నష్టము కలగదు. వారు చివరిలో వచ్చినా కానీ కొద్దిగా కష్టపడి పాతవారి కన్నా
ముందుకు వెళ్ళవచ్చు.
పాట:-
మేలుకోండి
ప్రేయసులారా మేలుకోండి...
ఓంశాంతి
మధురాతి
మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఇక్కడ పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అయి
కూర్చోవాల్సి ఉంటుందని ఆత్మిక తండ్రి చెప్పారు. పరమపిత పరమాత్మ మరియు పిల్లలు
ఇప్పుడు కలుసుకున్నారు. దీనిని ఈ సృష్టిపై జరిగే ఆత్మ మరియు పరమపిత పరమాత్మల మేళా
అని అంటారు. ఈ మేళా ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అర్ధకల్పము సత్య, త్రేతాయుగాలలో
ఎవరూ పిలవనే పిలవరు. అక్కడ పిల్లలైన మీరు సుఖీగా ఉంటారు, ఆ సుఖాన్ని ఆత్మలైన మీరు
ఇప్పుడు పొందుతున్నారు. మీరు ముందు సతోప్రధానముగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానముగా,
పతితముగా అయిపోయారు, మళ్ళీ తండ్రి పావనముగా తయారుచేస్తారు. పూజారులుగా అయినప్పుడు
దుఃఖితులుగా అవుతారు. 5 వికారాల కారణముగానే దుఃఖము కలుగుతుంది. ఎంతెంతగా మెట్లు
దిగుతూ ఉంటారో, అంతంతగా దుఃఖితులుగా అవుతూ ఉంటారు. దుఃఖపు పర్వతాలు పడనున్నాయని
ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈ పాత ప్రపంచ వినాశనము ఇప్పుడు జరగనున్నది. బాబా
నిరాకారుడని, వారు టీచరుగా అయి సాలిగ్రామాలైన మనల్ని చదివిస్తారని మీ బుద్ధికి
తెలుసు. వారు అంటారు - పిల్లలూ, నేను మళ్ళీ మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా
తయారుచేయడానికి వచ్చాను. 5 వేల సంవత్సరాల క్రితం కూడా మీరు స్వర్గానికి యజమానులుగా
ఉండేవారు, గుర్తుంది కదా. సంగమములోనే మిమ్మల్ని అలా తయారుచేసాను. ఇప్పుడు మళ్ళీ
మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా, వైకుంఠానికి, స్వర్గానికి యజమానులుగా
తయారుచేయడానికి వచ్చాను. ఇంతకుముందు మీకు ఈ వారసత్వాన్ని ఇచ్చాను, ఆ తర్వాత మీరు 84
జన్మలు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు నేను
వచ్చాను, మీరు మళ్ళీ మొదటి నంబరు జన్మ నుండి మొదలుపెట్టాలి. మీ తండ్రినైన నేను
మిమ్మల్ని చదివిస్తాను కూడా. మరి, తండ్రి పిల్లల నుండి చదివించడానికి ఫీజు
తీసుకుంటారా? పిల్లల నుండి ఫీజు ఎలా తీసుకుంటారు! ఒక్క పైసా ఫీజు కూడా తీసుకోను.
మిమ్మల్ని చదివించడానికి ఎంత దూరంలో ఉన్న పరంధామము నుండి వస్తాను. ఈ ఉద్యోగము
చేయడానికి రోజూ వస్తాను. ఎవరి ఉద్యోగమైనా ఎక్కడో దూరంగా ఉంటే, రోజూ వెళ్ళి-రావడము
జరుగుతుంది కదా. బాబా జ్ఞానసాగరుడని, వారు మనకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని
ఇస్తారని మీకు తెలుసు. భగవానువాచ - నిరాకారుడినైన నేను పరమాత్మను, అంతేకానీ
శ్రీకృష్ణుడు కాదు. మీరు ఏ శ్రీకృష్ణుడిని అయితే భగవంతునిగా భావిస్తారో, వారు
భగవంతుడు కాలేరు. వారైతే పూర్తిగా 84 జన్మలను తీసుకుంటారు. భగవంతునికి తమదంటూ శరీరము
లేదు. ఎలాగైతే మీరు ఆత్మనో, అలా వారు కూడా ఆత్మనే. కానీ కేవలం ఆత్మ అని సంబోధిస్తే
అందరితో కలిసిపోతాను కదా, అందుకే నన్ను పరమ ఆత్మ అని అంటారు. డ్రామా ప్లాన్
అనుసారముగా ఆత్మనైన నా పేరు ‘శివ’. నేను నిరాకారుడిని. నన్ను ‘శివబాబా’ అని
పిలుస్తారు. వాస్తవానికి నా పేరు ఒక్కటే కానీ వేర్వేరు పేర్లు పెట్టేసారు. నా పేరు
రుద్రుడు ఏమీ కాదు. అలాగే శ్రీకృష్ణుడు ఏమీ యజ్ఞాన్ని రచించలేదు. ఇదంతా అసత్యము.
నేనే వచ్చి మీకు సత్యము తెలియజేస్తాను. మిమ్మల్ని నిజంగా నరుని నుండి నారాయణునిగా
తయారుచేయడానికి నేను వచ్చాను. నా ఇల్లు చాలా దూరంగా ఉంది. ఇక్కడికి వచ్చి ఈ శరీరము
ద్వారా మిమ్మల్ని చదివిస్తాను. మొత్తం రోజంతా ఇతనిలో కూర్చోను. తిరుగుతూ ఉంటాను.
నన్ను నిందించిన కారణముగా మీరు చాలా దుఃఖితులుగా, మహాన్ పతితులుగా అయిపోయారు.
బ్రహ్మాను కూడా కొందరు ఆది దేవ్ అని అంటారు, కొందరు ఏడమ్ అని అంటారు, కొందరు మహావీర్
అని అంటారు, మీరు ప్రజాపిత అని అంటారు. మీరు నన్ను అర్ధకల్పము స్మృతి చేసారు, అందుకే
నేను ఈ పరాయి దేశములోకి రావాల్సి వచ్చింది. అందరూ పతితులుగా, దుఃఖితులుగా ఉన్నారు,
అనాథలుగా ఉన్నారు. ఎవ్వరికీ నాథుడు లేరు. అనాథలను చదివించేందుకు గవర్నమెంట్ ఫీజు
తీసుకోదు. ఇది చాలా పెద్ద ఆత్మిక గవర్నమెంట్. అనంతమైన తండ్రి గురించి ఎవరికీ తెలియదు.
ఎన్ని జపతపాదులు, దాన-పుణ్యాలు మొదలైనవి చేస్తారు. ఇవి ఎందుకు చేస్తున్నారు అని
అడిగితే, వీటి ద్వారా భగవంతుని వద్దకు చేరుకుంటామని అంటారు. కొందరు జపతపాదులు చేయడము
ద్వారా చేరుకుంటామని, కొందరు శాస్త్రాలను చదవడము ద్వారా చేరుకుంటామని అంటారు. తండ్రి
అంటారు - అలా జరగదు. భక్తి చేస్తూ-చేస్తూ మీరు మరింత పతితముగా అయిపోయారు. రెక్కలు
తెగిపోయాయి. ఎప్పటివరకైతే మీలో జ్ఞానమనే నెయ్యి పడదో, అప్పటివరకు మీరు ఎగరలేరు.
నెయ్యి లేక పెట్రోల్ సమాప్తమవ్వడము వలన జ్యోతి ఆరిపోయింది. మళ్ళీ నేను వచ్చి
నింపుతాను.
బాబా వచ్చి ఉన్నారని
మీకు తెలుసు. ఇక్కడ మీరు సంతోషముగా ఉంటారు. ఇంటికి వెళ్ళడముతో మీరు మర్చిపోతారు. మీ
నుండి నేను ఈ చదువు కోసం ఫీజు తీసుకోను. ఈ పిడికెడు బియ్యము ఇస్తామని మీరు అంటారు.
ఆ పిడికెడు బియ్యాన్ని మీరు భక్తి మార్గము నుండి ఇస్తూ వచ్చారు, దానికి ప్రతిఫలం
మరుసటి జన్మలో లభిస్తుంది. తండ్రి సమ్ముఖములో కూర్చుని ఉన్నారని ఇప్పుడు మీకు తెలుసు,
వారు ఫ్రీగా చదివిస్తారు ఎందుకంటే మీ వద్ద ఏమీ లేదని వారికి తెలుసు. తండ్రి మీ నుండి
ఏమీ తీసుకోరు. ఆ చదువులోనైతే ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్ని పరీక్షలు పాస్
అవ్వాల్సి ఉంటుంది. నేను ఒక్క చదువును మాత్రమే చదివిస్తాను. ఈ స్కూలుకు ఎవరైతే వస్తూ
ఉంటారో, వారిని చేరుస్తూ ఉంటాను. ఎవరైతే ఆలస్యముగా వస్తారో, వారు కొద్దిగా ఎక్కువ
కష్టపడాల్సి ఉంటుంది. దానికి రిటర్న్ లో ఆలస్యముగా వచ్చేవారికి మంచి పాయింట్లు
లభిస్తాయి. ఎవరైతే త్వరత్వరగా చదువుకుంటారో వారికి ఏ నష్టము ఉండదు. కొత్త-కొత్త మంచి
పాయింట్లు లభించడముతో పాతవారి కన్నా కూడా చురుకుగా ముందుకు వెళ్తారు. తండ్రి అంటారు
- ప్రారంభములో ఎవరైతే వచ్చారో, వారిలో ఎంతమంది వదిలి వెళ్ళిపోయారు. మీరు ఆలస్యముగా
రావడము మంచిదైంది, దాని వలన మీకు గుహ్యాతి-గుహ్యమైన పాయింట్లు లభిస్తున్నాయి. తండ్రి
అంటారు - లౌకిక చదువును కూడా చదువుకోండి. శరీర నిర్వహణార్థము వ్యాపార-వ్యవహారాలు
చేసుకోండి, కేవలం నన్ను స్మృతి చేయండి మరియు చక్రాన్ని స్మృతి చేయండి. ఇది
మర్చిపోకూడదు. ఇప్పుడిది మన 84 జన్మల అంతిమము అని మీకు అర్థమవుతుంది కదా.
తండ్రి అర్థం
చేయిస్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా
అవుతారు. మీరు తండ్రిని కూడా స్మృతి చేస్తారు, పతిని కూడా స్మృతి చేస్తారు. ఇప్పుడు
నేను మీకు పతులకే పతిని, తండ్రులకే తండ్రిని, టీచరును కూడా. నేను మీ సర్వస్వాన్ని.
నేను సుఖాన్ని ఇచ్చేవాడిని. ఆ పతిత సంబంధీకులు మొదలైనవారైతే మీకు దుఃఖమే ఇస్తారు.
సత్యయుగములో ఎవరూ ఎవరికీ దుఃఖమివ్వరు. ఇప్పుడు నేను సత్యయుగ రాజ్యభాగ్యాన్ని
ఇచ్చేందుకు వచ్చాను. ఈ సంగమములోనే తండ్రి నుండి మనము వారసత్వాన్ని తీసుకుంటామని మీకు
తెలుసు. ఇప్పుడు మీరు ఎంత చదువుకుంటే, అంత పొందుతారు. చదువు కూడా చాలా సహజమైనది. ఇది
ఉన్నదే సహజ జ్ఞానము, సహజ స్మృతి. మృత్యువు కూడా ఎదురుగా నిలబడి ఉంది. నేను
మిమ్మల్నందరినీ తీసుకువెళ్ళేందుకు వచ్చాను, అందుకే నన్ను కాలుడికే కాలుడు అని కూడా
అంటారు. వీరిని మృత్యువు కబళించిందని కూడా అంటారు. మృత్యువు శరీరాన్ని కబళిస్తుంది,
ఆత్మను కబళించలేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరొకటి తీసుకుంటుంది. పాత్రను
అభినయిస్తుంది. ఒక్క దెబ్బతో ఇదంతా సమాప్తమవుతుందని ఇప్పుడు మీకు తెలుసు. ఎలాంటి
మృత్యువు రానున్నది అంటే, ఎవరూ ఎవరి కోసం ఏడవడానికి ఉండదు. అందరూ తిరిగి
వెళ్ళాల్సిందే. పునర్జన్మలు మళ్ళీ-మళ్ళీ దుఃఖపు ప్రపంచములోనే తీసుకున్నప్పుడు
ఏడుస్తారు. బాబా, మమ్మల్ని మీతోపాటు తీసుకువెళ్ళండి అనే మీరు తండ్రిని పిలుస్తారు.
కనుక ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు, మనుష్యమాత్రులందరినీ తీసుకువెళ్తారు. వినాశనము
జరిగితే అందరూ మరణిస్తారు. ఎవ్వరూ మిగలరు. గవర్నమెంట్ తన ప్లాన్ లను తయారుచేస్తుంది.
మనుష్య సృష్టి అయితే వృద్ధి చెందుతూనే ఉంటుంది. చిన్న-చిన్న కొమ్మలు, రెమ్మలకు కూడా
ఎన్ని ఆకులు వెలువడతాయి. వృక్షమైతే తప్పకుండా వృద్ధి చెందుతుంది. కానీ దానికి
ఆయుష్షు కూడా తప్పకుండా ఉంది. కల్పవృక్షము యొక్క ఆయుష్షు లక్షల సంవత్సరాలు ఏమీ ఉండదు.
ఇప్పుడు తండ్రి మిమ్మల్ని పూజ్య దేవీ-దేవతలుగా తయారుచేయడానికి చదివిస్తున్నారు.
మొట్టమొదటగా తండ్రి మీకే లభిస్తారు, మిగిలిన ధర్మాలవారు రావడమే చివరిలో వస్తారు.
సత్యయుగములో మీరు వస్తారు. నేను చదివించేది కూడా మిమ్మల్నే. పావన ప్రపంచములోకి
వెళ్ళాలంటే వికారాలలోకి వెళ్ళకండి అని మాత్రమే చెప్తాను. అయినా సరే, మీరు ఎందుకు
వినరు, విషము లేకుండా మీరు ఉండలేరా? నా మతం అనుసారముగా నడుచుకోకపోతే ఉన్నత పదవిని
కూడా పొందరు. మీకు కృష్ణపురిలోకి వెళ్ళాలనే ఆశ ఉండేది. మరి శ్రీకృష్ణుని రాజధానిలోకి
వెళ్తారా లేక ప్రజల్లోకి వెళ్తారా? శ్రీకృష్ణునితో పాటు రాకుమార-రాకుమారీలే
ఆటలాడుతారు. ప్రజలు ఆడరు. ఈ మమ్మా-బాబా కూడా చదువుకుంటున్నారు. ఈ రాధా-కృష్ణులు
స్వయంవరం తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అవుతారని మీకు తెలుసు. రాజ్యము చేసేవారిదే మాల
తయారవుతుంది కదా. అష్టరత్నాలలోకి రండి, అచ్ఛా, 8 లోకి రాలేకపోతే కనీసం 108 లోకైనా
రండి. కనీసం 16,108 లోకైనా రండి. ఇది ఉన్నదే రాజయోగము. తండ్రి యొక్క
శ్రీమతమనుసారముగా నడుచుకోవాలి. కుటుంబ సభ్యులకు కూడా అర్థం చేయించండి. ఇతరులకు అర్థం
చేయించేందుకు, తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. పాత ప్రపంచ వినాశనము తప్పకుండా
జరగనున్నది. మహాభారత యుద్ధము కూడా ప్రసిద్ధమైనది, అప్పుడే భగవంతుడు వచ్చారు.
భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పించారు, స్వర్గ స్థాపన మరియు నరకము యొక్క వినాశనము
జరిగింది. ఇది ఆ సమయమే. తర్వాత రాజధాని స్థాపనవుతుంది. సత్యయుగములో వేరే ధర్మాలేవీ
ఉండవు. భారత్ శిరోకిరీటముగా ఉండేది, ఎంత షావుకారుగా ఉండేది. క్రైస్తవులందరూ ఇక్కడి
నుండే షావుకారులుగా అయ్యారు. సోమనాథ మందిరము నుండి కూడా ఒంటెలపై నింపి ఎంత సంపదను
తీసుకువెళ్ళారు. ఇది ఇంకా కేవలం ఒక మందిరానికి సంబంధించిన విషయమే. భారత్ లో అనేక
మందిరాలు ఉండేవి. బాబా మొత్తం వృక్షము యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. బీజమునైన
నేను పైన ఉన్నాను. ఇది తలకిందులుగా ఉన్న వృక్షము కదా. నేను నాలెడ్జ్ ఫుల్. మీరు
నన్ను, పతిత-పావనా రండి అనే పిలుస్తారు. మళ్ళీ నామ-రూపాలకు అతీతమైనవారని కూడా అంటారు.
రావణుడు అందరినీ పూర్తిగా తెలివిహీనులుగా చేసేసాడు. ఇప్పుడు మీకు - మా తండ్రి ఎవరు,
ఈ చక్రము ఎలా తిరుగుతుంది అనేది గుర్తుకువచ్చింది. అందరి బుద్ధి ఒకేలా ఉండదు. ఒకరి
బుద్ధి మరొకరితో కలవదు. ఒకరి ముఖకవళికలు మరొకరితో కలవవు. ఇప్పుడు పిల్లలైన మీరు
తండ్రికి చెందినవారిగా అవ్వాలి కదా. వారు తండ్రి కూడా, టీచరు కూడా, సద్గురువు కూడా.
వారు ఫీజు ఏమీ తీసుకోరని మీకు తెలుసు. ఒక్క పైసా ఖర్చు లేకుండా మీకు 21 జన్మల కోసం
రాజ్యము లభిస్తుంది. మీరు భక్తి మార్గములో ఈశ్వరార్థము ఏదైనా ఇస్తే, మరుసటి జన్మలో
మీకు లభించేది. ఇప్పుడు నేను డైరెక్టుగా వచ్చి భారత్ ను స్వర్గముగా తయారుచేస్తాను.
ఇందులో ఏ ఖర్చు జరిగినా అది పిల్లలే చూసుకుంటారు. ఖర్చు చూసుకోవాలని నేను పిల్లలకే
చెప్తాను. ఖర్చు చూసుకోవడానికి ఈ ఒక్క బ్రహ్మాను బాగా పట్టుకున్నాను. వీరిలో
ప్రవేశించి వీరి ద్వారా అంతా చేయించాను. వీరైతే వెంటనే స్వాహా అయిపోయారు. వీరి వద్ద
ఏదైతే ఉందో, అదంతా ఇచ్చేసారు. బాబా చెప్పారు - మీరు బికారిగా అయిపోండి, అప్పుడు
మిమ్మల్ని రాకుమారునిగా తయారుచేస్తాను, అది సాక్షాత్కారము చేయించారు. ఇప్పుడు ఇది
ఏం చేయాలని బాబాకు ఆలోచన కలిగింది. వినాశనము జరిగేదే ఉంది. బాబా అన్నారు - కోతి వలె
పిడికిలి మూయవద్దు, తెరవండి. అప్పుడు వెంటనే తెరిచేసారు. లేదంటే ఇంతమంది పిల్లల
ఖర్చు ఎలా చూసుకోవాలి. కొడుకు చక్రవర్తి అయ్యారు, తండ్రి మంత్రిగా లేక సలహాదారునిగా
అయ్యారు. ధనము కోసం ఒక్కరినే పట్టుకున్నారు. పిల్లలైన మీ భట్టి జరగాల్సి ఉంది.
స్కూళ్ళు కూడా తయారయ్యాయి. ఇప్పుడు మీరు చురుకైనవారిగా అయి ఇతరులను కూడా చదివిస్తారు.
మీరు ఎంతమంది కళ్యాణము చేస్తారు. తండ్రి ఉన్నదే కళ్యాణకారి, అందరినీ నరకము నుండి
బయటకు తీసి స్వర్గములోకి తీసుకువెళ్తారు.
ఇప్పుడు ఎంత
పురుషార్థము చేస్తే అంత ఉన్నత పదవిని పొందుతారు. ప్రజల కోసం కూడా ప్రదర్శనీలు
మొదలైన యుక్తులు మరిన్ని వెలువడుతూ ఉంటాయి. అనేకమంది ప్రజలు తయారవుతూ ఉంటారు.
రాజు-రాణులైతే కొద్దిమందే ఉంటారు. ప్రజలైతే కోట్లలో ఉంటారు కదా. రాజు-రాణి అయితే
ఒక్కరే ఉంటారు. అక్కడ యుద్ధాలు, గొడవలు మొదలైనవి జరగవు. ఇప్పుడు మృత్యువు ఎదురుగా
నిలబడి ఉందని పిల్లలకు తెలుసు. ఎంతగా యోగములో ఉంటారో, అంతగా పాపాత్ముల నుండి
పుణ్యాత్ములుగా అవుతారు, దీని కోసం వేరే ఉపాయమేమీ లేదు. సుపుత్రులైన పిల్లలు
తల్లి-తండ్రిని ఫాలో చేస్తారు. తండ్రి పావనముగా అయి, కొడుకు అవ్వకపోతే, అతను
కుపుత్రుడు అయినట్లే కదా. ఇందులో నష్టోమోహులుగా అవ్వాల్సి ఉంటుంది. నాకు ఒక్క
శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. వారసత్వము కూడా వారి నుండే లభిస్తుంది. ఇప్పుడు తండ్రి
నుండి కొత్త ప్రపంచ వారసత్వాన్ని తీసుకోవాలంటే మరి పతితముగా అవ్వకండి. పావనముగా
అవ్వకుండా కొత్త ప్రపంచములోకి వెళ్ళలేరు. జన్మజన్మలుగా పాపాలు చేసారు, వాటికి
శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. 63 జన్మల పాపాలకు శిక్షలు లభించినట్లుగా ఉంటుంది.
గర్భజైలులో కూడా శిక్షలు అనుభవిస్తారు. సత్యయుగములో జైళ్ళు మొదలైనవేవి ఉండవు. అది
ఉన్నదే స్వర్గము. ఇప్పుడు తండ్రి సాధారణ తనువులోకి వచ్చారు, అందుకే తండ్రిని
గుర్తించరు. తండ్రితో యోగము జోడిస్తేనే ఆత్మ పావనముగా అవుతుంది. తండ్రి అంటారు -
నేను పతిత ప్రపంచములోకి, పతిత శరీరములోకి వస్తాను, మళ్ళీ వీరిని నంబరువన్ పావనముగా
తయారుచేస్తాను - తతత్వమ్ (ఇది మీకు కూడా వర్తిస్తుంది) మీరు కూడా పావనముగా అవుతారు.
మీరు తండ్రికి పిల్లలుగా అయ్యారు. మీరు ప్రజాపిత బ్రహ్మాకు కూడా పిల్లలు. అందుకే
బాప్ దాదా అని అనడము జరుగుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు సమయము చాలా
తక్కువగా ఉంది. శరీరముపై నమ్మకము లేదు. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి, స్వదర్శన
చక్రధారులుగా అవ్వండి. రోజంతా ఈ విషయాలనే బుద్ధిలో పెట్టుకోండి. అచ్ఛా!
మధురాతి మధురమైన
సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక
పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పూర్తిగా నష్టోమోహులుగా అవ్వాలి. ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు, ఈ
పాఠాన్ని పక్కా చేసుకోవాలి. సుపుత్రులైన పిల్లలుగా అయి తల్లి-తండ్రిని ఫాలో చేయాలి.
2. పైసా ఖర్చు లేకుండా చదువు ద్వారా 21 జన్మల కోసం రాజ్యము లభిస్తుంది కనుక చాలా
తపనతో చదువు చదువుకోవాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి.
వరదానము:-
సదా తమ శ్రేష్ఠ భాగ్యము యొక్క నషా మరియు సంతోషములో ఉండే
పదమాపదమ భాగ్యశాలి భవ
మొత్తం విశ్వములో ధర్మపితలు లేక జగద్గురువులు అని ఎవరైతే
పిలవబడుతూ వచ్చారో, వారెవ్వరికీ కూడా తల్లి-తండ్రి సంబంధముతో అలౌకిక జన్మ మరియు
పాలన ప్రాప్తించదు. వారు అలౌకిక తల్లి-తండ్రుల అనుభవాన్ని స్వప్నములో కూడా పొందలేరు
కానీ పదమాపదమపతులైన శ్రేష్ఠ ఆత్మలైన మీరు ప్రతిరోజు తల్లి-తండ్రి నుండి లేక సర్వ
సంబంధాలు కలవారి నుండి ప్రియస్మృతులను తీసుకునేందుకు పాత్రులుగా ఉన్నారు. స్వయంగా
సర్వశక్తివంతుడైన తండ్రి పిల్లలైన మీకు సేవకునిగా అయి ప్రతి అడుగులోనూ తోడును
నిర్వర్తిస్తారు - ఈ శ్రేష్ఠ భాగ్యము యొక్క నషాలో మరియు సంతోషములో ఉండండి.
స్లోగన్:-
తనువును మరియు
మనసును సదా సంతోషముగా ఉంచుకునేందుకు సంతోషముతో కూడిన సమర్థ సంకల్పాలనే చేయండి.
అవ్యక్త ప్రేరణలు -
పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి
బాప్ దాదా సదా ఈ
శ్రీమతాన్ని ఇస్తారు - మనసులో ప్రతి ఆత్మ పట్ల శుభభావనను మరియు శుభ కామనను
పెట్టుకోండి, అపకారులపై కూడా ఉపకార వృత్తిని పెట్టుకోండి - స్వచ్ఛమైన మనసు అంటే ఇదే.
స్వయం గురించి లేక ఇతరుల గురించి వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయంటే అది స్వచ్ఛమైన మనసు
కాదు. స్వచ్ఛమైన మనసు, శుద్ధమైన మరియు స్పష్టమైన బుద్ధి ఉండాలి, అప్పుడు డబల్ లైట్
స్థితి తయారవ్వగలదు. బాబా సమాన స్థితిని తయారుచేసుకునేందుకు ఇదే సహజ సాధనము.