29-04-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - పతిత ప్రపంచముతో సంబంధాన్ని తెంచి,
ఒక్క తండ్రితో బుద్ధియోగాన్ని జోడించినట్లయితే మాయతో ఓడిపోలేరు’’
ప్రశ్న:-
సమర్థుడైన తండ్రి తోడుగా ఉన్నప్పటికీ, యజ్ఞములో అనేక విఘ్నాలు ఎందుకు కలుగుతాయి?
కారణమేమిటి?
జవాబు:-
ఈ విఘ్నాలైతే
డ్రామానుసారముగా కలగవలసిందే, ఎందుకంటే ఎప్పుడైతే యజ్ఞములో అసురుల విఘ్నాలు కలుగుతాయో,
అప్పుడే పాపపు కుండ నిండుతుంది. ఇందులో తండ్రి ఏమీ చేయలేరు, ఇది డ్రామాలో నిశ్చితమై
ఉంది. విఘ్నాలు తప్పకుండా కలిగేదే ఉంది, కానీ విఘ్నాలకు మీరు భయపడకూడదు.
పాట:-
తల్లి ఎవరు,
తండ్రి ఎవరు...
ఓంశాంతి
పిల్లలు అనంతమైన తండ్రి ఆజ్ఞను విన్నారు. ఈ జగత్తులోని తల్లిదండ్రులెవరైతే ఉన్నారో,
వారితో మీకు ఏదైతే సంబంధము ఉందో, అది దేహ పరంగా ఉంది, ఎందుకంటే దేహ పరంగా
మొట్టమొదటగా తల్లితో బంధము ఏర్పడుతుంది, ఆ తర్వాత తండ్రితో ఏర్పడుతుంది, ఆ తర్వాత
సోదరులు, బంధువులు మొదలైనవారితో ఏర్పడుతుంది. అనంతమైన తండ్రి చెప్తుంది ఏమిటంటే - ఈ
జగత్తులో మీ తల్లిదండ్రులుగా ఎవరైతే ఉన్నారో, వారితో బుద్ధియోగాన్ని తెంచివేయండి. ఈ
జగత్తుతో సంబంధము పెట్టుకోకండి ఎందుకంటే ఇవన్నీ కలియుగీ ఛీ-ఛీ సంబంధాలు. జగత్తు అనగా
ప్రపంచము. ఈ పతిత ప్రపంచముతో బుద్ధియోగాన్ని తెంచి, నా ఒక్కరితో జోడించండి మరియు
కొత్త జగత్తుతో జోడించండి, ఎందుకంటే ఇప్పుడు మీరు నా వద్దకు రావాలి. ఇక్కడ కేవలం
సంబంధాన్ని జోడించే విషయమే ఉంది, వేరే విషయమేమీ లేదు, వేరే కష్టమేమీ లేదు. ఎవరికైతే
డైరెక్షన్ లభిస్తుందో, వారు సంబంధాన్ని జోడిస్తారు. సత్యయుగములో మొదట సంబంధాలు
బాగుంటాయి, సతోప్రధానముగా ఉంటాయి, ఆ తర్వాత కిందకు దిగుతూ వస్తారు. అప్పుడిక సుఖము
యొక్క సంబంధాలేవైతే ఉంటాయో, అవి నెమ్మది-నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడైతే ఈ
పాత ప్రపంచముతో సంబంధాన్ని పూర్తిగా తెంచి వేయాల్సి ఉంటుంది. తండ్రి అంటారు - నాతో
సంబంధాన్ని జోడించండి, శ్రీమతాన్ని అనుసరించండి మరియు దేహ సంబంధాలేవైతే ఉన్నాయో,
వాటన్నింటినీ వదిలేయండి. వినాశనమైతే జరగాల్సిందే. ఏ తండ్రినైతే పరమపిత పరమాత్మ అని
అంటారో, వారు కూడా డ్రామానుసారముగా సేవ చేస్తారని పిల్లలకు తెలుసు. వారు కూడా డ్రామా
బంధనములో బంధించబడి ఉన్నారు. ఎలాగైతే శ్రీకృష్ణుడిని కూడా సర్వశక్తివంతునిగా
భావిస్తారో, అలా మనుష్యులు పరమపిత పరమాత్మను సర్వశక్తివంతునిగా భావిస్తారు.
శ్రీకృష్ణుడికి స్వదర్శన చక్రాన్ని చూపించారు. దానితో శిరస్సును ఖండిస్తారని
భావిస్తారు. కానీ దేవతలు హింసాత్మకమైన పనులు ఎలా చేయగలరు అన్నది అర్థం చేసుకోరు.
దేవతలు అలా చేయలేరు. దేవతల విషయములో, వారికి అహింస పరమ ధర్మముగా ఉండేదని అంటారు.
వారిలో హింస ఎక్కడ నుండి వచ్చింది. ఎవరికి ఏది తోస్తే, అది కూర్చుని రాసేశారు.
ధర్మాన్ని ఎంతగా కించపరిచారు. తండ్రి అంటారు, ఈ శాస్త్రాలలో సత్యమనేది, కేవలం
పిండిలో ఉప్పు అంత మాత్రమే ఉంది. రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారని కూడా వ్రాసి ఉంది.
అందులో అసురులు విఘ్నాలను వేసేవారని, అబలలపై అత్యాచారాలు జరిగేవని వ్రాశారు. ఇదంతా
సరిగ్గానే వ్రాయబడి ఉంది. శాస్త్రాలలో సత్యమేమిటి, అసత్యమేమిటి అన్నది ఇప్పుడు మీరు
అర్థం చేసుకున్నారు. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞములో విఘ్నాలు తప్పకుండా కలుగుతాయని భగవంతుడు
స్వయంగా చెప్తున్నారు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. పరమాత్మ తోడుగా ఉన్నారు కనుక
విఘ్నాలను తొలగించేస్తారని కాదు. ఇందులో తండ్రి ఏమి చేస్తారు! డ్రామాలో అలా జరగాలని
ఉంది. వారంతా విఘ్నాలు వేసినప్పుడే కదా పాపపు కుండ నిండుతుంది. తండ్రి అర్థం
చేయిస్తున్నారు, డ్రామాలో ఏదైతే నిశ్చితమై ఉందో అదే జరగనున్నది. అసురుల విఘ్నాలు
తప్పకుండా కలుగుతాయి. మన రాజధాని స్థాపన అవుతూ ఉంది. అర్ధకల్పము మాయ రాజ్యములో
మనుష్యులు ఎంతగా తమోప్రధాన బుద్ధి కలవారిగా, భ్రష్టాచారులుగా అయిపోతారు. తిరిగి
వారిని శ్రేష్ఠాచారులుగా తయారుచేయడము తండ్రి పని కదా. భ్రష్ఠాచారులుగా అవ్వడానికి
అర్ధకల్పము పడుతుంది, ఆ తర్వాత ఒక్క క్షణములో తండ్రి మళ్ళీ శ్రేష్ఠాచారులుగా
చేస్తారు. నిశ్చయము ఏర్పడేందుకు సమయము పట్టదు. ఈ విధముగా నిశ్చయము కలిగిన మంచి
పిల్లలు చాలామంది ఉన్నారు, వారు వెంటనే ప్రతిజ్ఞ చేస్తారు, కానీ మాయ కూడా పహల్వాన్
(వస్తాదు) కదా. మనసులో ఏవో ఒక తుఫానులను తీసుకువస్తుంది. ఏదో ఒక పురుషార్థము చేసి
అది కర్మల్లోకి రాకుండా చూసుకోండి. అందరూ పురుషార్థము చేస్తున్నారు. కర్మాతీత అవస్థ
అయితే ఇంకా ఏర్పడలేదు. కర్మేంద్రియాల ద్వారా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కర్మాతీత
అవస్థ వరకు చేరుకునే లోపు, మధ్యలో విఘ్నాలు తప్పకుండా కలుగుతాయి. తండ్రి అర్థం
చేయించారు - పురుషార్థము చేస్తూ-చేస్తూ అంతిమములో కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది,
అప్పుడిక ఈ శరీరము ఉండదు, అందుకే సమయము పడుతుంది. ఏవో ఒక విఘ్నాలు కలుగుతాయి,
అక్కడక్కడ మాయ ఓడించేస్తుంది కూడా. ఇది బాక్సింగ్ కదా. బాబా స్మృతిలో ఉండాలని
అనుకుంటారు, కానీ ఉండలేకపోతారు. ఏదైతే కొద్ది సమయము మిగిలి ఉందో, అందులో
నెమ్మది-నెమ్మదిగా ఆ అవస్థను ధారణ చేయాలి. జన్మించగానే ఎవరూ రాజుగా అవ్వరు. చిన్న
బాలుడు నెమ్మది-నెమ్మదిగా పెద్దవాడవుతాడు కదా, ఇందులో కూడా సమయము పడుతుంది.
ఇప్పుడింకా కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. మొత్తమంతా పురుషార్థముపైనే ఆధారపడి
ఉంది. ఎలాగైనా సరే, మేము తండ్రి నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటాము అన్న
అటెన్షన్ పెట్టాలి. మాయను తప్పకుండా ఎదుర్కుంటారు, అందుకే ప్రతిజ్ఞ చేస్తారు. మాయ
కూడా తక్కువైనదేమీ కాదు. చాలా చిన్న-చిన్న రూపాలలో కూడా వస్తుంది. బలశాలితో బాగా
తీవ్రముగా పోరాడుతుంది. ఈ విషయాలేవీ శాస్త్రాలలో లేవు. తండ్రి అంటారు, పిల్లలైన మీకు
ఇప్పుడు అర్థం చేయిస్తాను. తండ్రి ద్వారా మీరు సద్గతిని పొందుతారు. ఇక తర్వాత ఈ
జ్ఞానము యొక్క అవసరమే ఉండదు. జ్ఞానముతో సద్గతి జరుగుతుంది. సద్గతి అని సత్యయుగాన్ని
అంటారు.
మధురాతి మధురమైన పిల్లలకు లక్ష్యము లభించింది. డ్రామానుసారముగా వృక్షము
పెరిగేందుకు సమయమైతే పడుతుందని కూడా పిల్లలు అర్థం చేసుకుంటారు. విఘ్నాలైతే చాలా
కలుగుతాయి. పరివర్తన అవ్వవలసి ఉంటుంది. గవ్వ నుండి వజ్రము వలె అవ్వవలసి ఉంటుంది.
రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. దేవతల మందిరాలను ఇప్పటికీ కూడా నిర్మిస్తూ ఉంటారు.
బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు మందిరాలను నిర్మించరు ఎందుకంటే అది భక్తి మార్గము.
ఇప్పుడు భక్తి మార్గము సమాప్తమై, జ్ఞాన మార్గము జిందాబాద్ అవ్వనున్నదని ప్రపంచానికి
తెలియనే తెలియదు. ఇది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనుష్యులైతే కలియుగము
ఇంకా బాల్యావస్థలో ఉందని భావిస్తారు. వారిదంతా శాస్త్రాలపై ఆధారపడి ఉంటుంది.
పిల్లలైన మీకైతే తండ్రి కూర్చుని అన్ని వేద-శాస్త్రాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు.
తండ్రి అంటారు - ఇప్పటివరకు మీరు ఏదైతే చదివారో, అదంతా మర్చిపోండి, దాని ద్వారా ఎవరి
సద్గతి జరగదు, మహా అయితే అల్పకాలిక సుఖము లభిస్తూ వచ్చింది. సదా సుఖమే సుఖము
లభించడమనేది జరగజాలదు. అది క్షణభంగుర సుఖము. మనుష్యులు దుఃఖములో ఉంటారు. సత్యయుగములో
దుఃఖము యొక్క నామ-రూపాలే ఉండవని మనుష్యులకు తెలియదు. అక్కడ కృష్ణపురిలో కంసుడు
ఉండేవాడని, అది ఇది ఉండేదని, శ్రీకృష్ణుడు జైలులో జన్మ తీసుకున్నారని... అక్కడి కోసం
వారు ఇటువంటి విషయాలను చెప్పారు. ఇలా చాలా విషయాలు వ్రాశారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు
స్వర్గము యొక్క మొదటి నంబరు రాకుమారుడు, అతనేమి పాపము చేశారు. అవన్నీ కల్పితమైన కథలు.
ఇది కూడా తండ్రి ఎప్పుడైతే సత్యము చెప్తారో, అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు.
తండ్రియే వచ్చి సత్య ఖండాన్ని స్థాపన చేస్తారు. సత్య ఖండములో ఎంత సుఖముండేది, అసత్య
ఖండములో ఎంత దుఃఖముంది. ఇదంతా మర్చిపోయారు. మేము శ్రీమతాన్ని అనుసరించి సత్య
ఖండాన్ని స్థాపన చేసి, దానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ విధముగా మీరు శ్రీమతాన్ని అనుసరించినట్లయితే
ఉన్నత పదవిని పొందగలరు. మేము ఈ చదువు చదువుకుని సూర్యవంశీ మహారాజా-మహారాణిగా
అవ్వాలని పిల్లలకు తెలుసు. ఉన్నత పదవిని పొందాలని అందరూ కోరుకుంటారు. అందరి
పురుషార్థము నడుస్తూ ఉంటుంది. మంచి పక్కా భక్తులు ఎవరైతే ఉంటారో, వారు చిత్రాలను
తమతో పాటు పెట్టుకుంటారు, అప్పుడు పదే-పదే వారి స్మృతి ఉంటుంది. త్రిమూర్తి
చిత్రాన్ని మీతో పెట్టుకోండి, అప్పుడది పదే-పదే గుర్తుకువస్తుందని బాబా కూడా అంటారు.
తండ్రిని స్మృతి చేసినట్లయితే మనము సూర్యవంశీ రాజ్యములోకి వచ్చేస్తాము. గదిలో
త్రిమూర్తి చిత్రము తగిలించి ఉన్నట్లయితే, పదే-పదే దృష్టి అటువైపు వెళ్తుంది, మేము
బాబా ద్వారా ఈ సూర్యవంశములోకి వెళ్తాము అని అనుకుంటారు. ఉదయము లేవగానే ఆ చిత్రము
వైపు దృష్టి వెళ్తుంది. ఇది కూడా ఒక పురుషార్థమే. బాబా సలహా ఇస్తున్నారు. మంచి-మంచి
భక్తులు చాలా పురుషార్థము చేస్తారు. కళ్ళు తెరవగానే శ్రీకృష్ణుడు గుర్తుకు రావాలని,
ఆ చిత్రాన్ని ఎదురుగా పెట్టుకుంటారు. మీకైతే ఇంకా సహజము. ఒకవేళ సహజమైన స్మృతి కలగడము
లేదంటే, మాయ సతాయిస్తుందంటే, అప్పుడు ఈ చిత్రాలు సహాయపడతాయి. శివబాబా మనల్ని బ్రహ్మా
ద్వారా విష్ణుపురికి యజమానులుగా చేస్తారు. మనము బాబా ద్వారా విశ్వానికి యజమానులుగా
అవుతున్నాము. ఈ స్మరణలో ఉన్నా సరే చాలా సహాయము లభిస్తుంది. ఏ పిల్లలైతే పదే-పదే
స్మృతిని మర్చిపోతున్నామని భావిస్తున్నారో, అటువంటివారికి బాబా సలహానిస్తున్నారు -
చిత్రాన్ని ఎదురుగా పెట్టుకున్నట్లయితే, తండ్రి కూడా గుర్తుకువస్తారు మరియు
వారసత్వము కూడా గుర్తుకువస్తుంది. కానీ బ్రహ్మాను గుర్తు చేయకూడదు. నిశ్చితార్థము
జరిగినప్పుడు మధ్యవర్తి గుర్తుకు రారు కదా. మీరు బాబాను మంచి రీతిలో స్మృతి
చేసినట్లయితే బాబా కూడా మిమ్మల్ని స్మృతి చేస్తారు. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది.
ఇప్పుడు ప్రియుని కర్తవ్యము గురించి మీకు తెలుసు. శివునికి ఎంతమంది భక్తులు ఉన్నారు,
శివ-శివ అని అంటూ ఉంటారు. కానీ అది రాంగ్ - శివకాశీ, విశ్వనాథ అని అంటారు, మళ్ళీ
గంగ అని అంటారు. నదుల తీరాలలోకి వెళ్ళి కూర్చుంటారు. జ్ఞానసాగరుడు తండ్రి అని వారు
అర్థం చేసుకోరు. బనారస్ ను చూసేందుకు విదేశీయులు మొదలైనవారు చాలామంది వెళ్తారు.
అక్కడ పెద్ద-పెద్ద నదీ తీరాలు ఉంటాయి, అయినా సర్వుల తండ్రి అయిన వారి మందిరమే
ఆకర్షిస్తుంది, అందరూ వారి వద్దకు వెళ్తారు. మందిరమైతే ఎవరి వద్దకు వెళ్ళదు.
మందిరాలలోని దేవతలు ఆకర్షిస్తారు, అలాగే శివబాబా కూడా ఆకర్షిస్తారు. నంబరు వన్
శివబాబా, ఆ తర్వాత సెకండు నంబరులో ఈ బ్రహ్మా, సరస్వతులు అనగా విష్ణువు. విష్ణువే
బ్రహ్మాగా అవుతారు. బ్రాహ్మణులే విష్ణుపురి దేవతలుగా అవుతారు. విష్ణుపురి దేవతలే
బ్రాహ్మణులుగా అవుతారు. మనమే దేవతలుగా అవుతున్నాము కనుక ఇతరులకు కూడా మార్గాన్ని
తెలియజేయాలి - ఇప్పుడిది మీ వ్యాపారము. మిగిలినవారంతా అడవులలోకి తీసుకువెళ్ళేవారే.
మీరు అడవి నుండి బయటకు తీసి పుష్పాల తోటలోకి తీసుకువెళ్తారు. శివబాబా వచ్చి ముళ్ళను
పుష్పాలుగా తయారుచేస్తారు. మీరు కూడా ఈ వ్యాపారమే చేస్తారు. ఈ విషయాల గురించి మీకు
మాత్రమే తెలుసు. మీరు అర్థం చేయించేందుకు, ఇక్కడ రాజా-రాణులు ఎవరూ లేరు. పాండవులకు
3 అడుగుల భూమి కూడా లభించేది కాదని అంటారు. తండ్రి సమర్థుడు కనుక వారికి (పాండవులకు)
విశ్వరాజ్యాధికారాన్ని ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆ పాత్రే నడుస్తుంది కదా. తండ్రి
గుప్తమైనవారు. శ్రీకృష్ణునికైతే ఎటువంటి విఘ్నాలు రావు. ఇప్పుడు తండ్రి వచ్చారు,
తండ్రి వద్దకు వచ్చి వారసత్వాన్ని తీసుకోవాలి, దీని కోసం శ్రమించడము జరుగుతుంది.
రోజురోజుకు కొత్త-కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. ప్రదర్శనీ ద్వారా అర్థం
చేయించినప్పుడు మంచి ప్రభావము కలుగుతుంది అన్నది కనిపిస్తుంది. ప్రదర్శనీ ద్వారా
మంచి ప్రభావము కలుగుతుందా లేక ప్రొజెక్టరు ద్వారా కలుగుతుందా అన్న విషయములో బుద్ధిని
ఉపయోగించవలసి ఉంటుంది. ప్రదర్శనీలో అర్థం చేయించేటప్పుడు, వారి ముఖాలను చూస్తూ అర్థం
చేయించవచ్చు. వారికి ఇలా వ్రాసి ఇవ్వండి - ‘గీతా భగవానుడు తండ్రి అని భావిస్తే, మరి
తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థము చేయాలి, 7 రోజులు సమయము ఇవ్వాలి.’
లేదంటే బయటకు వెళ్ళగానే మాయ మరపింపజేస్తుంది. మేము 84 జన్మల చక్రములో తిరిగామని,
ఇప్పుడు తిరిగి వెళ్ళాలని, తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలని మీ బుద్ధిలోకి
వచ్చింది. ఈ చిత్రాలైతే మీతో పాటు ఉండాల్సిందే, ఇవి చాలా బాగుంటాయి. ఈ
లక్ష్మీ-నారాయణులు ఈ రాజ్యభాగ్యాన్ని ఎప్పుడు మరియు ఎలా తీసుకున్నారు అనేది బిర్లా
మొదలైనవారికి కూడా తెలియదు. మీకు తెలుసు కనుక మీకు చాలా సంతోషముండాలి.
లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని తీసుకుని, వారు ఈ పదవిని ఎలా పొందారు అన్నది ఎవరికైనా
వెంటనే అర్థం చేయిస్తారు. ఈ విషయాలు బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసినవి మరియు అర్థం
చేయించవలసినవి. గమ్యము ఉన్నతమైనది. ఎవరు ఎలాంటి టీచరో, వారు అలాంటి సేవనే చేస్తారు.
తమ అవస్థ అనుసారముగా ఎవరెవరు సెంటర్లు సంభాళిస్తున్నారు అనేది బాబా చూస్తారు. నషా
అయితే అందరికీ ఉంది. కానీ అర్థం చేయించేవారు ఎంత తెలివైనవారిగా ఉంటే, సేవ అంత బాగా
జరుగుతుందని వివేకము చెప్తుంది. అందరూ తెలివైనవారిగా ఉండలేరు. అందరికీ ఒకేలాంటి
టీచరు లభించలేరు. కల్పక్రితం జరిగినట్లుగానే జరుగుతూ ఉంది. తండ్రి అంటారు, మీ
అవస్థను తయారుచేసుకుంటూ ఉండండి. ఇది కల్ప-కల్పపు పందెము. ప్రతి ఒక్కరి పురుషార్థము
కల్పక్రితం వలె నడుస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఏమి జరిగినా సరే - కల్పక్రితం కూడా
ఇలాగే జరిగిందని మనము అంటాము, అప్పుడు సంతోషము కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది.
తండ్రి అంటారు, కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చేయండి. బుద్ధియోగము అక్కడ వేలాడుతూ
ఉన్నట్లయితే చాలా కళ్యాణము జరుగుతుంది, ఎవరైతే చేస్తారో వారు పొందుతారు. మంచి చేస్తే
మంచిని పొందుతారు. మాయ మతముపై అందరూ చెడునే చేస్తూ వచ్చారు. ఇప్పుడు శ్రీమతము
లభిస్తుంది. మంచి చేసినట్లయితే మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ స్వయము కోసం
శ్రమిస్తారు. ఎలా చేస్తే అలా పొందుతారు. మరి మనము యోగాన్ని జోడిస్తూ, సేవ చేస్తూ
ఎందుకు ఉండకూడదు. యోగముతో ఆయుష్షు పెరుగుతుంది. స్మృతియాత్ర ద్వారా నిరోగులుగా
అవ్వాలి, కనుక మనము బాబా స్మృతిలో ఎందుకు ఉండకూడదు. ఇది యథార్థమైన విషయము అన్నప్పుడు,
మనమెందుకు ప్రయత్నించకూడదు. జ్ఞానమైతే చాలా సహజమైనది. చిన్న పిల్లలు కూడా అర్థం
చేసుకుంటారు మరియు అర్థం చేయిస్తారు. కానీ వారు యోగీ అయితే కాదు కదా. తండ్రిని
స్మృతి చేయాలి అన్నది పక్కా చేయించాలి. ఎవరైతే పదే-పదే మర్చిపోతున్నామని అనుకుంటారో,
వారు చిత్రము పెట్టుకోండి, అలా అయినా మంచిదే. ఉదయాన్నే చిత్రాన్ని చూడగానే స్మృతి
కలుగుతుంది - శివబాబా ద్వారా మేము విష్ణుపురి యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాము
అని. ఈ త్రిమూర్తి చిత్రమే ముఖ్యమైనది, దీని అర్థాన్ని అయితే మీరిప్పుడే
తెలుసుకున్నారు. ప్రపంచములో ఇటువంటి త్రిమూర్తి చిత్రము ఇంకెవ్వరి వద్దా లేదు. ఇది
చాలా సహజమైనది. మనము వ్రాసినా వ్రాయకపోయినా, బ్రహ్మా ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా
పాలన అన్నది అందరికీ తెలుసు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మాయ బాక్సింగ్ లో ఎప్పుడూ కూడా ఓటమి కలగకూడదు, ఈ విషయము పట్ల అటెన్షన్
పెట్టాలి. కల్పక్రితపు స్మృతి ద్వారా మీ అవస్థను తయారుచేసుకోవాలి. సంతోషముగా మరియు
శాంతిగా ఉండాలి.
2. మీ మేలు చేసుకునేందుకు శ్రీమతముపై నడవాలి. ఈ పాత ప్రపంచముతో సంబంధాన్ని
తెంచివేయాలి. మాయా తుఫానుల నుండి రక్షించుకునేందుకు చిత్రాలను ఎదురుగా పెట్టుకుని
తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి.
వరదానము:-
మననము ద్వారా తండ్రి ఆస్తిని తమ ఆస్తిగా చేసుకునే దివ్య
బుద్ధివాన్ భవ
తండ్రి ద్వారా ఏ ఖజానా అయితే లభిస్తుందో, దానిని మననము
చేసినట్లయితే, అది మీ లోపల ఇమిడిపోతూ ఉంటుంది. ఆస్తి అయితే అందరికీ ఒకే విధముగా
లభించింది కానీ ఎవరైతే మననము చేసి దానిని తమదిగా చేసుకుంటారో, వారికి దాని నషా మరియు
సంతోషము ఉంటుంది, అందుకే - ఎంత బాగా మననము చేస్తే, అంత నషా ఎక్కుతుంది అని అంటారు.
ఎవరైతే మననము యొక్క ఆనందములో సదా నిమగ్నమై ఉంటారో, వారిని ప్రపంచములోని ఏ వస్తువు,
ఏ చిక్కు ఆకర్షించలేదు. వారికి దివ్య బుద్ధి యొక్క వరదానము స్వతహాగా లభిస్తుంది.
స్లోగన్:-
మనసు
యొక్క చిక్కులను సమాప్తము చేసేందుకు నిర్ణయశక్తిని పెంచుకోండి.
అవ్యక్త ప్రేరణలు -
‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’
ఎప్పుడూ కూడా ఇలా
అనుకోకండి - మేమైతే సదా ఒదిగే ఉంటాము కానీ మాకు ఎటువంటి గౌరవము లేదు, ఎవరైతే ఒదిగి
ఉండరో మరియు అబద్ధాలు చెప్తారో వారికే గౌరవము ఉంది అని. అలా కాదు. ఇది
అల్పకాలికమైనది, కానీ మీరు దూరదృష్టి కల బుద్ధిని పెట్టుకోండి, ఇక్కడ ఎంతమంది
ముందైతే వంగుతారో అనగా నమ్రత గుణాన్ని ధారణ చేస్తారో, వారికే పూర్తి కల్పమంతా
సర్వాత్మలు నమస్కరిస్తారు. సత్య, త్రేతాయుగాలలో రాజు అనే గౌరవముతో శిరస్సు ద్వారా
కాకుండా మనసు ద్వారా వంగుతారు మరియు ద్వాపర, కలియుగాలలో శిరస్సు వంచుతారు.
| | | |