29-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - అన్ని విషయాలలోనూ సహనశీలురుగా అవ్వండి,
నిందా-స్తుతి, జయాపజయాలు అన్నింటిలోనూ సమానముగా ఉండండి, చెప్పుడు మాటలను
విశ్వసించకండి’’
ప్రశ్న:-
ఆత్మ సదా ఎక్కే
కళలో ముందుకు వెళ్తూ ఉండాలంటే దానికి సహజమైన యుక్తిని వినిపించండి?
జవాబు:-
ఒక్క తండ్రి
నుండే వినండి, ఇతరుల నుండి వినకండి. అనవసరమైన పరచింతనలో, వ్యర్థమైన మాటలలో మీ
సమయాన్ని వృధా చేసుకోకండి, అప్పుడు ఆత్మ సదా ఎక్కే కళలో ఉంటుంది. తప్పుడు మాటలు
వినడము వలన, వాటిని విశ్వసించడము వలన మంచి పిల్లలు కూడా పడిపోతారు, అందుకే చాలా
సంభాళించుకోవాలి.
ఓంశాంతి
రావణ రాజ్యము మొదలైనప్పటి నుండి, తప్పకుండా అర్ధకల్పము మనము తండ్రిని స్మృతి చేసామని
మధురాతి-మధురమైన పిల్లలకు ఇప్పుడు స్మృతి కలిగింది. అలాగని పూర్తి అర్ధకల్పమంతా
స్మృతి చేసామని కూడా కాదు. ఎక్కువ దుఃఖము కలిగినప్పుడల్లా స్మృతి చేసాము. భక్తి
మార్గము నుండి మనము దిగిపోతూనే వచ్చామని ఇప్పుడు మీకు తెలిసింది. డ్రామా రహస్యము
బుద్ధిలో ఉంది. నోటి ద్వారా ఏమీ చెప్పాల్సిన అవసరము కూడా లేదు. మనము వారికి
చెందినవారిగా అయిపోయాము, అందుకే ఇప్పుడిక ఎక్కువ జ్ఞానము యొక్క అవసరము లేదు.
తండ్రికి చెందినవారిగా అయ్యారంటే తండ్రి ఆస్తికి యజమానులుగా అయినట్లే. ఇక
కర్మేంద్రియాలతో ఏమీ చేయనవసరము లేదు. భక్తి మార్గములో భగవంతుడిని కలుసుకునేందుకు
ఎన్ని యజ్ఞాలు-తపస్యలు, దాన-పుణ్యాలు చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే, అన్ని చోట్ల
తీర్థ స్థానాలు, మందిరాలు ఎన్నో ఉన్నాయి. మొత్తం భారత్ లో ఉన్న తీర్థ స్థానాలన్నీ
మరియు మందిరాలన్నీ తిరగగలిగిన మనుష్యులు ఒక్కరు కూడా లేరు. ఒకవేళ అలా తిరిగినా కూడా
ఏమీ లభించదు. అక్కడ గుడి గంటల శబ్దాలు మొదలైన అలజడులు ఎన్ని ఉంటాయి. ఇక్కడైతే అలజడి
అనే మాటేమీ లేదు. పాటలు పాడడము కానీ, చప్పట్లు కొట్టడము కానీ ఏమీ లేవు. అసలు
మనుష్యులు చేయనిదంటూ ఏముంది, ఎన్నో కర్మకాండలు ఉన్నాయి. ఇక్కడైతే పిల్లలైన మీరు
కేవలం స్మృతి చేయాలి. ఇంకేమీ చేయనవసరము లేదు. ఇంటిలో ఉంటూ, అన్నీ చేసుకుంటూ కేవలం
తండ్రిని స్మృతి చేయాలి. ఇప్పుడు మనము దేవతలుగా అవుతామని మీకు తెలుసు. ఇక్కడే దైవీ
గుణాలను ధారణ చేయాలి. ఆహార-పానీయాలు కూడా శుద్ధముగా ఉండాలి. 36 రకాల భోజనమైతే అక్కడ
లభిస్తుంది. ఇక్కడ సాధారణముగా ఉండాలి. చాలా ఎక్కువగానూ ఉండకూడదు, చాలా తక్కువగానూ
ఉండకూడదు. అన్ని విషయాలలోనూ సహనశీలత కావాలి. నింద-స్తుతి, జయాపజయాలు, చలి-వేడి
వీటన్నింటినీ సహనము చేయవలసి ఉంటుంది. ఇప్పుడు సమయమే అలా ఉంది. నీరు లభించదు, ఇంకేదో
లభించదు. సూర్యుడు కూడా తన వేడిని చూపిస్తాడు. ప్రతి వస్తువు తమోప్రధానమవుతుంది. ఈ
సృష్టియే తమోప్రధానముగా ఉంది. తత్వాలు కూడా తమోప్రధానముగా ఉన్నాయి. అందుకే ఇవి
దుఃఖాన్ని ఇస్తున్నాయి. నింద-స్తుతులకు కూడా ప్రభావితమవ్వకూడదు. ఎవరైనా ఎవరికైనా
ఏవైనా తప్పుడు మాటలు వినిపిస్తే చాలామంది వెంటనే డిస్టర్బ్ అవుతారు, ఎందుకంటే ఈ
రోజుల్లో చాలా విషయాలను కల్పిస్తున్నారు కదా. ఉదాహరణకు - మీకు దేహాభిమానముందని,
బాహ్య ఆర్భాటము చాలా ఉందని బాబా మీ గురించి అన్నారని ఎవరైనా చెప్తే, అంతే, ఇక జ్వరము
వచ్చేస్తుంది, నిద్ర కూడా పట్టదు. అర్ధకల్పము నుండి మనుష్యులు ఇలానే ఉన్నారు.
ఎవరికైనా వెంటనే జ్వరము తెప్పించేలా చేస్తున్నారు, దానితో అవతలివారు వెంటనే
పాలిపోయినట్లు అయిపోతున్నారు. అందుకే తండ్రి అంటున్నారు - ఇటువంటి వ్యర్థమైన మాటలేవీ
వినకండి. తండ్రి ఎప్పుడూ ఎవరినీ నిందించరు. తండ్రి అయితే అర్థం చేయించేందుకే
చెప్తారు. ఒకరికొకరు తప్పుడు విషయాలను వినిపించడముతో మంచి-మంచి పిల్లలు కూడా
డిస్టర్బ్ అయిపోతారు. అప్పుడు వారు ద్రోహులుగా అయి వెళ్ళి ఇతరులకు వ్యర్థమైన మాటలను
వినిపిస్తారు. భక్తి మార్గములో కూడా ఎలాంటి కథలను తయారుచేసారు. ఇప్పుడు మీకు జ్ఞానము
లభించింది కావున మీరెప్పుడూ కూడా ఓ రామా లేక అయ్యో భగవంతుడా అని అనలేరు, ఇవి కూడా
భక్తి మార్గములోని మాటలు. మీ నోటి నుండి ఇటువంటి మాటలు రాకూడదు.
మధురమైన ప్రియమైన పిల్లలూ, ఆత్మాభిమానులుగా అవ్వండి అని మాత్రమే తండ్రి చెప్తున్నారు.
ఎంత ప్రేమగా అర్థం చేయిస్తున్నారు. ఎవరి మాటలు వినకండి, అనవసరమైన పరచింతన చేయకండి.
నేను ఒక ఆత్మను - ఈ ఒక్క విషయాన్ని పక్కా చేసుకోండి. ఆత్మ అవినాశీ, శరీరము వినాశీ.
ఆత్మయే సంస్కారాలను ధారణ చేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి.
ద్వాపరము నుండి మీరు రావణ రాజ్యములో దేహాభిమానులుగా అవుతారు. అందుకే ఇప్పుడు
దేహీ-అభిమానులుగా అవ్వడము కష్టమనిపిస్తుంది. మాకు అనంతమైన తండ్రి లభించారు అని
పదే-పదే బుద్ధిలోకి వస్తూ ఉండాలి. కల్ప-కల్పము తండ్రి వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు
వారి మతాన్ని అనుసరించాలి. నీవే తల్లివి-తండ్రివి... అన్న మహిమ వారి గురించే ఉంది.
వారు సర్వ సంబంధాల సుఖాన్ని ఇచ్చేవారు, వారిలో మాధుర్యమంతా ఉంది. ఇకపోతే మిగిలిన
మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరూ దుఃఖాన్ని ఇచ్చేవారే. ఒక్క తండ్రి మాత్రమే అందరికీ
సుఖాన్ని ఇచ్చేవారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని
మార్గము కూడా చాలా సహజమైనది తెలియజేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది కొత్త
విషయమేమీ కాదు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మనము ఇటువంటి తండ్రి వద్దకు వస్తామని
మీకు తెలుసు. వీరు సాధువు-సన్యాసి కారు. మీరు ఏమీ సాధు-సన్యాసుల వద్ద ఉండరు. ఇకపోతే
తండ్రి అంటారు, ప్రవృత్తి మార్గము యొక్క సంబంధాలలో యుక్తిగా నడుచుకోవాలి. లేదంటే
ఇంకా గొడవలు జరుగుతాయి. యుక్తిగా నడుచుకోండి. ప్రతి ఒక్కరికీ ఇలా ప్రేమగా అర్థం
చేయించాలి - చూడండి, ఇప్పుడు వినాశన సమయము సమీపముగా ఉంది, ఈ ఆసురీ ప్రపంచము
సమాప్తమవ్వనున్నది, ఇప్పుడు దేవతలుగా అవ్వాలి, దైవీ గుణాలను ఇక్కడే ధారణ చేయాలి.
ప్రేమగా అర్థం చేయించాలి. దేవతలు కూడా ఉల్లి-వెల్లుల్లి మొదలైనవైతే తినరు. మనము కూడా
మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము కనుక మనము వీటిని ఎలా తింటాము. వాటిని
వదిలేయండి అని మీకు కూడా సలహానిస్తారు. అటువంటి పదార్థాలు మనము తినము. ఇప్పుడు మీకు
దైవీ గుణాలను నేర్పించే అనంతమైన తండ్రి లభించారు, కనుక సర్వగుణ సంపన్నులుగా...
ఇక్కడే అవ్వాలి. ఇక్కడ తయారైతే, అప్పుడు భవిష్య కొత్త ప్రపంచము వస్తుంది. రాత్రి
తర్వాత మళ్ళీ పగలు వచ్చినట్లుగా, ఇది కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు రాత్రి యొక్క
అంతిమములోనే దైవీ గుణాలను ధారణ చేయాలి. అప్పుడు ఉదయము వస్తుంది. ప్రతి ఒక్కరూ తమను
తామే పరీక్షించుకోవాలి. తండ్రికి అన్నీ తెలుసు అని కాదు. మీరు స్వయాన్ని చూసుకోండి
కదా. టీచరుకైతే అన్నీ తెలుసు అని విద్యార్థులు ఎప్పుడూ ఇలా అనరు. పరీక్ష రోజులు
దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలు కూడా - నేను ఎంతవరకు పాస్ అవుతాను, నేను ఏ సబ్జెక్టులో
ఢీలాగా ఉన్నాను అన్నది స్వయమే అర్థం చేసుకుంటారు. వేటిలోనైనా తక్కువ మార్కులు వస్తే,
అన్ని సబ్జెక్టుల మార్కులు కలవడముతో పాస్ అయిపోతామని భావిస్తారు. మరి ఇక్కడ కూడా
స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి - నాలో ఏ లోపముంది? నేను చాలా మధురముగా అయ్యానా?
అందరికీ ప్రేమగా అర్థం చేయించాలి, ఏమనంటే - ఆత్మలైన మన తండ్రి పరమపిత పరమాత్మ,
అంతేకానీ మనుష్యులెవరూ కాదు. మేము నిరాకారుడిని భగవంతుడని అంటాము, రచయిత అయిన
భగవంతుడు ఒక్కరే, మిగిలినవారంతా రచన. రచన నుండి ఎవరికీ వారసత్వము లభించదు. నియమము
అలా లేదు. ఇప్పుడు రచన అంతటికీ సద్గతిదాత, రచయిత అయిన తండ్రి ఒక్కరే. ఈ రచనలోనే
సాధు-సత్పురుషులు అందరూ వచ్చేస్తారు. వాస్తవానికి అందరూ ఆత్మలే కదా. అయితే,
మనుష్యులు మంచివారిగా, చెడ్డవారిగా ఉంటారు. పొజిషన్ ఎక్కువగా, తక్కువగా ఉంటుంది.
సన్యాసులలో కూడా నంబరువారుగా ఉన్నారు. కొంతమందిని చూడండి, భిక్షము అడుగుతూ ఉంటారు,
మరికొంతమంది విషయములో అందరూ వారి పాదాలపై పడతారు. పిల్లలైన మీరు కూడా ఉన్నతముగా
అవ్వాలి, చాలా మధురముగా అవ్వండి. ఎప్పుడూ కూడా క్రోధముతో మాట్లాడకండి. ఎంత వీలైతే
అంత ప్రేమతో పని కానీయండి. పిల్లలు చాలా విసిగిస్తున్నారని అంటూ ఉంటారు. ఈ రోజుల్లో
పిల్లలు అలానే ఉన్నారు. వారికి ప్రేమగా అర్థం చేయించండి. శ్రీకృష్ణుడు అల్లరి చేస్తే
వారిని తాడుతో కట్టేసినట్లుగా చూపిస్తారు. ఎంత వీలైతే అంత ప్రేమగా అర్థం చేయించాలి
లేదంటే తేలికపాటి శిక్షను విధించండి. పాపం వారు అమాయకులు కదా. సమయము కూడా అలాగే ఉంది.
బయటి సాంగత్య దోషము చాలా చెడ్డగా ఉంది. ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు - మీరు
విగ్రహాలు మొదలైనవి పెట్టుకోవాల్సిన అవసరమేమీ లేదు. ఏ శ్రమ చేయాల్సిన అవసరము లేదు.
శివుని చిత్రాన్ని అయినా ఎందుకు పెట్టుకోవాలి! వారు మీ తండ్రి కదా. పిల్లలు ఇంటిలో
తండ్రి చిత్రాన్ని ఎందుకు పెట్టుకుంటారు? తండ్రి అయితే ఎల్లప్పుడూ ప్రత్యక్షముగా
ఉంటారు కదా. తండ్రి అంటారు, నేనిప్పుడు మీ కళ్ళ ముందు ప్రత్యక్షముగా ఉన్నాను కదా.
ఇక చిత్రాల అవసరము లేదు. నేను కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తాను. బాప్ దాదాను
చూడాలి అని అంటారు. ఇప్పుడు తండ్రి అయితే నిరాకారుడు, వారిని చూడలేరు. బుద్ధి ద్వారా
అర్థం చేసుకోగలరు. తండ్రి అంటారు - నేను వీరిలో ప్రవేశించి మీకు జ్ఞానాన్ని ఇస్తాను.
లేదంటే మరి ఎలా రాను! శ్రీకృష్ణుని తనువులోకి ఎలా వస్తాను. సన్యాసులలోకి కూడా రాలేను.
ఎవరైతే మొదటి నంబరులో ఉండేవారో, నేను వారిలోకే వస్తాను. వారే ఇప్పుడు లాస్ట్ నంబరులో
ఉన్నారు. మీరు కూడా ఇప్పుడు చదువుకుని మళ్లీ మొదటి నంబరులోకి వెళ్ళాలి.
చదివించేవారైతే ఒక్కరే, వారినే జ్ఞానసాగరుడు అని అంటారు. మీకు చాలా మంచి జ్ఞానము
లభిస్తుంది. మీకు తెలుసు - శాంతిధామము మన ఇల్లు, సుఖధామము మన రాజధాని, దుఃఖధామము
రావణుడి రాజ్యము. ఇప్పుడు తండ్రి అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, మీ ఇల్లు అయిన
శాంతిధామాన్ని గుర్తు చేయండి, సుఖధామాన్ని గుర్తు చేయండి. దుఃఖధామము యొక్క బంధనాలను
మర్చిపోతూ వెళ్ళండి. ఈ విధముగా ఇంకెవ్వరూ చెప్పలేరు, అలా వెళ్ళలేరు కూడా. డ్రామా
మధ్యలో నుండి ఎవరూ తిరిగి వెళ్ళలేరు. ఫలానావారి జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని లేక
నిర్వాణము చెందారని అంటూ ఉంటారు కానీ ఒక్కరు కూడా వెళ్ళరు. అందరి తండ్రి మరియు
యజమాని పరమపిత పరమాత్మ ఒక్కరే, ప్రేయసులందరికీ వారొక్కరే ప్రియుడు. ఆ దైహిక
ప్రేయసీ-ప్రియులు ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు, ఆ సమయములో వారి చిత్రము
బుద్ధిలోకి వస్తుంది. ఇక ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. భోజనము చేస్తూ ఉంటారు,
గుర్తు చేసుకుంటూ ఉంటారు. వారు ఒక్క జన్మ యొక్క ప్రేయసీ-ప్రియులు. మీరు ఆ ఒక్క
ప్రియునికి జన్మజన్మల ప్రేయసులు. మీరు ఇంకేమీ చేయనవసరము లేదు, కేవలం ఒక్క తండ్రిని
స్మృతి చేయాలి. ఆ ప్రేయసీ-ప్రియులకు ఎదురుగా ఒకరి ముఖము ఒకరికి కనిపిస్తున్నట్లు
ఉంటుంది, అంతే, ఇక అది చూసుకుంటూ-చూసుకుంటూ పని కూడా ఆగిపోతుంది, తర్వాత వారి ముఖము
మాయమైపోతుంది, అప్పుడిక మళ్ళీ పని చేయడము మొదలుపెడతారు. ఇక్కడైతే అలాంటిదేమీ లేదు.
ఆత్మ కూడా బిందువు, పరమాత్మ కూడా బిందువే. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని
స్మృతి చేయాలి, ఇందులోనే శ్రమ ఉంది. ఇటువంటి అభ్యాసాన్ని ఎవరూ చేయడము లేదు. ఆత్మ
జ్ఞానము లభించింది అనగా ఆత్మను రియలైజ్ అయ్యారు, ఇక మిగిలింది పరమాత్మ. వారి గురించి
కూడా మీకు తెలుసు. బాబా వచ్చి ఇక్కడ (భృకుటి మధ్యలో) కూర్చుంటారు, వీరి స్థానము కూడా
ఇక్కడ భృకుటిలోనే ఉంది. ఆత్మ ఎక్కడి నుండైనా బయటకు వెళ్ళిపోతుంది, అది తెలియదు. దాని
ముఖ్య స్థానము భృకుటి. తండ్రి అంటారు - నేను కూడా బిందువునే, వీరిలోకి వచ్చి
కూర్చున్నాను. మీకు అసలు తెలియదు కూడా. తండ్రి కూర్చుని పిల్లలైన మీకు వినిపిస్తారు.
మీకు ఏదైతే వినిపిస్తారో, అది నేను (బ్రహ్మా) కూడా వింటాను. వివరణ అయితే పూర్తిగా
రైట్. ఇక్కడ రాజధాని స్థాపన అవుతూ ఉందని దైవీ ధర్మము వారైతే వెంటనే అర్థం
చేసుకుంటారు. ముందు స్థాపన, తర్వాత వినాశనము కూడా జరుగుతుంది. ఇతర ధర్మ
స్థాపకులెవ్వరూ ఇలా చెయ్యరు. వారు కేవలం తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు. తర్వాత అది
వృద్ధి చెందుతుంది. ఇక్కడ ఎవరు ఎంత పురుషార్థము చేస్తారో, భవిష్యత్తులో అంత ఉన్నత
పదవిని పొందుతారు. మీరు భవిష్య 21 జన్మల కొరకు ప్రారబ్ధాన్ని తయారు
చేసుకుంటున్నారంటే ఎంత పురుషార్థము చేయాలి. ఇది చాలా సహజము కూడా, యోగము కూడా సహజమే.
దానితో మీ వికర్మలు వినాశనమవుతాయి.
తండ్రి అంటారు - కల్ప-కల్పము నేనే వచ్చి పిల్లలైన మిమ్మల్ని పావనముగా చేస్తానని నేను
గ్యారెంటీ ఇస్తున్నాను. అక్కడ పతితులు ఒక్కరు కూడా ఉండరు. జ్ఞానము కూడా ఎంత సహజము,
84 జన్మల చక్రములో ఎలా తిరుగుతారు అనే జ్ఞానము కూడా బుద్ధిలో ఉంది. మేము 84 జన్మల
చక్రములో తిరిగామనే నిశ్చయము ఉంచుకోవాలి. నిశ్చయములోనే విజయముంది. మేము 84 జన్మలు
తీసుకుంటామా లేక ఇంకా తక్కువ తీసుకుంటామా తెలియదు అని అనుకోకూడదు. మీరు బ్రాహ్మణులు
కనుక మేము తప్పకుండా 84 జన్మల చక్రాన్ని పూర్తిగా అనుభవించామని మీకు నిశ్చయముండాలి.
ఇది చాలా సహజమైన వివరణ. ఈ చిత్రాలన్నింటినీ దివ్యదృష్టి ద్వారా తండ్రి
తయారుచేయించారని పిల్లలకు అర్థం చేయించారు. చిత్రాలను కరెక్షన్ కూడా చేయించారు.
ప్రారంభములో బనారస్ లో బాబా ఏకాంతములో ఉన్నప్పుడు కూర్చుని గోడలపై ఇటువంటి చక్రాలను
గీసేవారు. అయితే, అదేమిటి అనేది వారికేమీ అర్థమయ్యేది కాదు. కానీ సంతోషము అనిపించేది.
సాక్షాత్కారము జరిగినప్పుడు ఎగురుతున్నట్లుగా అనిపించేది. ఏమి జరుగుతుంది అనేది
అర్థమయ్యేది కాదు. ఏ చిత్రాలైతే ముందు తయారయ్యాయో, వాటిని మళ్ళీ మార్చి
కొత్త-కొత్తవి తయారుచేస్తూ వచ్చారని మీకు తెలుసు. కల్పక్రితం వలె ఇప్పుడు
కొత్త-కొత్త చిత్రాలు తయారవుతూ ఉంటాయి. మెట్ల వరుస చిత్రము ఎంత బాగుందో చూడండి.
దీనిపై అర్థం చేయించడము సహజము. ఆలస్యముగా వచ్చేవారికి మరింత సహజమైన వివరణ లభిస్తుంది.
ఇప్పుడు కొత్త-కొత్త వారు ఎవరైతే వస్తారో, వారు ఏడు రోజుల్లోనే జ్ఞానమంతా అర్థం
చేసుకుంటారు. పాతవారి కంటే ముందుకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది, ముందే వచ్చి ఉంటే
బాగుండేదని అంటారు. అరే, దీని గురించి కూడా చింతించకండి. ఒకవేళ ముందే వచ్చి ఉంటే,
మళ్ళీ పారిపోయి ఉంటే అప్పుడు ఏమై ఉండేది? ఆలస్యముగా వచ్చేవారికైతే సింహాసనము సహజముగా
లభిస్తుంది. ఇదివరకు ఎవరైతే ఉండేవారో, చూడండి, వారు ఇప్పుడు అసలు లేరు కూడా.
సమాప్తమైపోయారు. ఎవరు పాస్ అయ్యారు అనేది చివరిలో రిజల్టు తెలుస్తుంది. కొత్త-కొత్త
వారు వస్తారు, వెంటనే సేవలో నిమగ్నమైపోతారు. పాతవారు అంతగా నిమగ్నమవ్వరు.
కొత్త-కొత్త కుమార్తెలు సేవ ద్వారా తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు. పాతవారు ఎంతమంది
సమాప్తమైపోయారు. అందుకే బాబా అంటారు - సర్వోత్తమ బ్రాహ్మణ కుల భూషణులని ఎవరినైతే
అంటారో, వారిలో కూడా కొంతమంది ఆశ్చర్యము కలిగేలా వింటారు, మళ్ళీ పారిపోతారు. దేని
గురించైతే ఇంతకుముందు చెప్తూ ఉండేవారో, అది ఇప్పుడు ప్రాక్టికల్ గా జరుగుతుంది.
అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. స్వయము యొక్క చెకింగ్ ను స్వయమే చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి - నేను చాలా-చాలా
మధురముగా అయ్యానా? నాలో ఏయే లోపాలు ఉన్నాయి? అన్ని దైవీ గుణాలు ధారణ అయ్యాయా! మీ
నడవడికను దేవతల వలె తయారుచేసుకోవాలి. ఆసురీ ఆహార-పానీయాలను త్యజించాలి.
2. ఎటువంటి వ్యర్థమైన మాటలను వినకూడదు మరియు మాట్లాడకూడదు. సహనశీలురుగా అవ్వాలి.
వరదానము:-
తమ స్మృతిని, వృత్తిని మరియు దృష్టిని అలౌకికముగా చేసుకునే
సర్వ ఆకర్షణల నుండి ముక్త భవ
‘‘ఎటువంటి సంకల్పమో, అటువంటి సృష్టి’’ అని అంటూ ఉంటారు.
ఎవరైతే కొత్త సృష్టిని రచించేందుకు నిమిత్తమైన విశేష ఆత్మలుగా ఉన్నారో, వారి
ఒక్కొక్క సంకల్పము శ్రేష్ఠముగా అనగా అలౌకికముగా ఉండాలి. ఎప్పుడైతే స్మృతి, వృత్తి
మరియు దృష్టి అన్నీ అలౌకికముగా అవుతాయో, అప్పుడు ఈ లోకములోని ఏ వ్యక్తి కానీ, ఏ
వస్తువు కానీ తమ వైపుకు ఆకర్షించలేవు. ఒకవేళ ఆకర్షిస్తున్నాయంటే తప్పకుండా అలౌకికతలో
లోపమున్నట్లు. అలౌకిక ఆత్మలు సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా ఉంటారు.
స్లోగన్:-
హృదయములో
పరమాత్ముని ప్రేమ మరియు శక్తులు ఇమిడి ఉన్నట్లయితే మనసులో అలజడి రాలేదు.
అవ్యక్త ప్రేరణలు -
అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా)
అవ్వండి
సంపూర్ణ సత్యత కూడా
పవిత్రత ఆధారముగానే ఉంటుంది. పవిత్రత లేకపోతే సదా సత్యత ఉండటము అనేది జరగదు. కేవలం
కామ వికారమే అపవిత్రత కాదు, కానీ దానితో పాటు వేరే సహచరులు కూడా ఉన్నాయి. కావున
మహాన్ పవిత్రులు అనగా అపవిత్రత యొక్క నామ-రూపాలు కూడా ఉండకూడదు.