30-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ దేహ భానము నుండి మరణించండి అనగా ఈ పాత పతిత దేహము పట్ల ప్రీతిని తొలగించి ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతిని జోడించండి’’

ప్రశ్న:-
సంగమములో పిల్లలైన మీ సహజ సౌందర్యము ఏమిటి?

జవాబు:-
జ్ఞాన ఆభరణాలతో సదా అలంకరించబడి ఉండడము - ఇదే మీ సహజ సౌందర్యము. ఎవరైతే జ్ఞాన ఆభరణాలతో అలంకరించబడి ఉంటారో, వారి ముఖము సంతోషముతో పుష్పము వలె వికసించి ఉంటుంది. ఒకవేళ సంతోషము ఉండడము లేదంటే, తప్పకుండా ఏదో ఒక దేహాభిమానపు అలవాటు ఉంది, దాని కారణముగానే అన్ని వికారాలు ఉత్పన్నమవుతాయి.

పాట:-
సభలో దీపము వెలిగింది...

ఓంశాంతి
ఈ పాట అర్థం ఎంత విచిత్రముగా ఉంది. ప్రీతి ఎందుకు కలిగింది? (మరణించేందుకు) ఎవరి పట్ల ప్రీతి కలిగింది? భగవంతుని పట్ల ప్రీతి కలిగింది, ఎందుకంటే ఈ ప్రపంచము నుండి మరణించి వారి వద్దకు వెళ్ళాలి. ఈ విధముగా ఎప్పుడైనా ఎవరి పట్లనైనా ప్రీతి కలిగిందా? దాని వల్ల తాము మరణిస్తామని తెలిస్తే ఎవరైనా ప్రీతిని ఉంచుతారా? పాట అర్థం ఎంత అద్భుతముగా ఉంది. దీపపు పురుగులు దీపము పట్ల ప్రీతిని ఉంచి, దాని చుట్టూ తిరిగి, కాలిపోయి మరణిస్తాయి. మీరు కూడా తండ్రి వద్దకు వస్తూ-వస్తూ ఈ శరీరాన్ని వదిలేయాలి అనగా తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ శరీరాన్ని వదిలేయాలి. ఎవరి పట్లనైతే మనము ప్రీతిని ఉంచుకున్నందుకు మరణిస్తామో, వారు పెద్ద శత్రువు అయినట్లు, అందుకే మనుష్యులు భయపడతారు. భగవంతుని వద్దకు వెళ్ళేందుకు దాన-పుణ్యాలు, తీర్థయాత్రలు మొదలైనవి చేస్తారు. శరీరము వదిలేటప్పుడు మనుష్యులు భగవంతుడిని స్మృతి చేయమని చెప్తారు. భగవంతుడు ఎంత ప్రసిద్ధమైనవారు. వారు వచ్చారంటే మొత్తం పాత ప్రపంచమంతటినీ సమాప్తము చేసేస్తారు. మనము పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకే ఈ యూనివర్శిటీలోకి వస్తామని పిల్లలైన మీకు తెలుసు. పాత ప్రపంచాన్ని పతిత ప్రపంచమని, నరకమని అంటారు. తండ్రి కొత్త ప్రపంచములోకి వెళ్ళే మార్గాన్ని తెలియజేస్తారు - కేవలం నన్ను స్మృతి చేయండి, నేనే హెవెన్లీ గాడ్ ఫాదర్ ను. ఆ తండ్రి నుండి మీకు ధనము, ఆస్తి, ఇల్లు మొదలైనవి లభిస్తాయి. కుమార్తెలకు వారసత్వము లభించదు. వారిని వేరే ఇంటికి పంపించేస్తారు. అంటే వారు వారసులు కారు. వీరు తండ్రి, ఆత్మలందరికీ తండ్రి, అందరూ వీరి వద్దకు రావాల్సిందే, మరణించాల్సిందే. తండ్రి తప్పకుండా ఏదో ఒక సమయములో వస్తారు, అందరినీ ఇంటికి తీసుకువెళ్తారు ఎందుకంటే కొత్త ప్రపంచములో చాలా తక్కువమంది మనుష్యులుంటారు. పాత ప్రపంచములోనైతే చాలామంది ఉన్నారు. కొత్త ప్రపంచములో మనుష్యులు కూడా తక్కువమందే ఉంటారు మరియు సుఖము కూడా చాలా ఉంటుంది. పాత ప్రపంచములో చాలామంది మనుష్యులున్నారు, అలాగే దుఃఖము కూడా చాలా ఉంది. అందుకే తండ్రిని పిలుస్తూ ఉంటారు. భారత్ కు పితగా భావించబడే బాపూ గాంధీ కూడా, ఓ పతిత-పావనా రండి అని పిలిచేవారు. కానీ, కేవలం వారి (పతిత-పావనుడు) గురించి తెలియదు. పతిత-పావనుడు పరమపిత పరమాత్మ అని, వారే ఈ ప్రపంచానికి లిబరేటర్ (ముక్తిప్రదాత) అని భావిస్తారు కూడా. సీతారాములను మొత్తం ప్రపంచమంతా అయితే స్వీకరించదు కదా. ఆ త్రేతాయుగ రాముడే పతిత-పావనుడు అని అనడము తప్పు. మొత్తం ప్రపంచమంతా పరమపిత పరమాత్మను లిబరేటర్ గా (ముక్తిప్రదాతగా), గైడ్ గా (మార్గదర్శకునిగా) అంగీకరిస్తుంది. వారు దుఃఖాల నుండి విముక్తులుగా చేస్తారు. అచ్ఛా, దుఃఖము ఇచ్చేవారు ఎవరు? తండ్రి అయితే దుఃఖాన్ని ఇవ్వరు ఎందుకంటే వారు పతిత-పావనుడు, వారు పావన ప్రపంచమైన సుఖధామానికి తీసుకువెళ్ళేవారు. మీరు ఆ ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు. తండ్రి ఎలా ఉంటారో, పిల్లలు కూడా అలాగే ఉంటారు. లౌకిక తండ్రికి దైహికమైన పిల్లలు ఉంటారు.

ఇప్పుడు పిల్లలైన మీరు, మేము ఆత్మలము, పరమపిత పరమాత్మ మాకు వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారని భావించాలి. మేము విద్యార్థులము - ఈ విషయాన్ని మర్చిపోకూడదు. శివబాబా మధుబన్ లో మురళిని వినిపిస్తారని పిల్లల బుద్ధిలో ఉంటుంది. ఇక్కడ ఆ వెదురు మురళీ ఏదీ లేదు. శ్రీకృష్ణుడు డ్యాన్స్ చేయడము, మురళిని మోగించడము, ఇవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. శ్రీకృష్ణుడు మురళిని వాయిస్తారని మీరు అనలేరు. మురళిని శివబాబా వినిపిస్తారు. మీ వద్దకు మంచి-మంచి పాటలను తయారుచేసేవారు వస్తారు. పాటలను ఎక్కువగా పురుషులే తయారుచేస్తారు. మీరు భక్తి మార్గపు పాటలు మొదలైనవి పాడాల్సిన అవసరము లేదు. మీరైతే ఒక్క శివబాబాను మాత్రమే స్మృతి చేయాలి. తండ్రి అంటారు - భగవంతుడైన నన్ను స్మృతి చేయండి. శివుడిని బిందువు అని అంటారు. వ్యాపారస్థులు సున్నా పెట్టినప్పుడు ‘శివ’ అని అంటారు. ఒకటి పక్కన ఒక సున్నా పెడితే అది 10 అవుతుంది, మరొక సున్నా పెడితే 100 అవుతుంది... మీరు కూడా శివబాబాను స్మృతి చేయాలి. శివుడిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా అర్ధకల్పానికి చాలా షావుకారులుగా అయిపోతారు. అక్కడ పేదలు ఎవరూ ఉండరు. అందరూ సుఖముగా ఉంటారు. దుఃఖమనే పేరే ఉండదు. తండ్రి స్మృతితో వికర్మలు వినాశనమైపోతాయి. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. దీనినే సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన సంపాదన అని అంటారు. ఇదే మీతో పాటు వస్తుంది. మనుష్యులందరూ ఖాళీ చేతులతో వెళ్తారు. మీరు నిండు చేతులతో వెళ్ళాలి. తండ్రిని స్మృతి చేయాలి మరియు పవిత్రముగా అవ్వాలి. తండ్రి అర్థం చేయించారు, పవిత్రత ఉంటే శాంతి, సంపద లభిస్తాయి. ఆత్మ అయిన మీరు ముందు పవిత్రముగా ఉండేవారు, తర్వాత అపవిత్రముగా అవుతారు. సన్యాసులను కూడా సెమీ-పవిత్రులని అంటారు. మీది ఫుల్ సన్యాసము. వారు ఎంత సుఖాన్ని పొందుతారు అనేది మీకు తెలుసు. వారికి కొద్దిగా సుఖముంటుంది, ఆ తర్వాత ఇక దుఃఖమే ఉంటుంది. అదంతా భక్తి మార్గము. భక్తి మార్గములో హనుమంతుడిని పూజిస్తే, వారి సాక్షాత్కారము కలుగుతుంది. చండికా దేవికి ఎంత పెద్ద మేళా జరుగుతుంది, వారి చిత్రము కూడా ఉంటుంది. ఎవరిపైనైతే ధ్యానము ఉంచుతారో, వారు తప్పకుండా తమ ముందుకు వస్తారు. కానీ దాని వల్ల ఏం లభిస్తుంది? అనేక రకాల మేళాలు జరుగుతాయి ఎందుకంటే వాటి వలన సంపాదనైతే జరుగుతుంది కదా. ఇవన్నీ వారికి వ్యాపారాలు వంటివి. నరుని నుండి నారాయణునిగా తయారుచేసే వ్యాపారములో తప్ప మిగిలిన వాటన్నింటిలోనూ ఉన్నది ధూళి మాత్రమే అని అంటారు. కానీ ఈ వ్యాపారాన్ని ఎవరో అరుదుగా చేస్తారు.

తండ్రికి చెందినవారిగా అయి తమ దేహ సహితముగా అంతా తండ్రికి ఇచ్చేయాలి, ఎందుకంటే మనకు కొత్త శరీరము కావాలని మీకు తెలుసు. తండ్రి అంటారు - మీరు కృష్ణపురికి వెళ్ళగలరు కానీ ఆత్మ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయినప్పుడే వెళ్ళగలరు. మమ్మల్ని పావనముగా తయారుచేయండి అని కృష్ణపురిలో అనరు. ఇక్కడ మనుష్యమాత్రులందరూ, ఓ లిబరేటర్ (ముక్తిప్రదాత) రండి, ఈ పాపాత్ముల ప్రపంచము నుండి విముక్తులుగా చేయండి అని పిలుస్తూ ఉంటారు. మనల్ని తమతో పాటు తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడికి వెళ్ళడము మంచిదే కదా. మనుష్యులు శాంతిని కోరుకుంటారు కానీ అసలు శాంతి అని దేనినంటారు - ఇది వారికి తెలియదు. కర్మలు చేయకుండానైతే ఎవరూ ఉండలేరు. శాంతి అయితే శాంతిధామములో ఉంటుంది. తర్వాత ఈ శరీరాలను తీసుకుని కర్మలనైతే చేయాల్సిందే. సత్యయుగములో కర్మలు చేస్తూ శాంతిగా ఉంటారు, అశాంతిలో మనుష్యులకు దుఃఖము కలుగుతుంది, అందుకే శాంతి ఎలా లభిస్తుంది అని అడుగుతారు. శాంతిధామము మన ఇల్లు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. సత్యయుగములో శాంతి, సుఖము అన్నీ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ కావాలా లేక కేవలం శాంతి మాత్రమే కావాలా. ఇక్కడైతే దుఃఖము ఉంది, అందుకే పతిత-పావనుడైన తండ్రిని కూడా ఇక్కడ పిలుస్తారు. భగవంతుడిని కలుసుకునేందుకనే భక్తి చేస్తారు. భక్తి కూడా ముందు అవ్యభిచారిగా, తర్వాత వ్యభిచారీ భక్తిగా అవుతుంది. వ్యభిచారీ భక్తిలో ఏమేమి చేస్తారో చూడండి. మెట్ల వరుస చిత్రములో ఎంత బాగా చూపించారో చూడండి. కానీ మొట్టమొదట భగవంతుడు ఎవరు, శ్రీకృష్ణుడిని ఆ విధముగా తయారుచేసింది ఎవరు, మునుపటి జన్మలో వారు ఎవరు అనేది నిరూపించాలి. ఈ విషయాలను అర్థం చేయించడానికి చాలా యుక్తి కావాలి. ఎవరైతే బాగా సేవ చేస్తారో, వారి హృదయము కూడా సాక్ష్యము ఇస్తుంది. యూనివర్శిటీలో ఎవరైతే బాగా చదువుకుంటారో, వారు తప్పకుండా ముందుకు వెళ్ళిపోతారు. నంబరువారుగా అయితే ఉంటారు. కొంతమంది మంద బుద్ధి కలవారు కూడా ఉంటారు. నా బుద్ధి తాళము తెరవండి అని శివబాబాతో ఆత్మ అంటుంది. తండ్రి అంటారు - బుద్ధి తాళాన్ని తెరిచేందుకే కదా నేను వచ్చింది, కానీ మీ కర్మలే ఎలా ఉన్నాయంటే వాటివల్ల అసలు మీ తాళం తెరుచుకోవడమే లేదు, ఇక బాబా ఏం చేయగలరు. చాలా పాపాలు చేసారు, దానికి ఇప్పుడు బాబా ఏం చేయగలరు! నేను తక్కువగా చదువుతున్నాను అని టీచరుకు చెప్తే టీచరు ఏం చేయగలరు? టీచరు ఏమీ కృపను చూపించరు. కావాలంటే, ఎక్స్ ట్రా టైమ్ ఇస్తారు. ఆ విషయములో మిమ్మల్ని కాదనరు. ప్రదర్శనీ చిత్రాలు ఖాళీగా ఉన్నాయి, కూర్చుని ప్రాక్టీస్ చేయండి. భక్తి మార్గములోనైతే కొంతమంది మాలను తిప్పమని చెప్తారు. కొంతమంది ఫలానా మంత్రాన్ని జపించమని చెప్తారు. ఇక్కడైతే తండ్రి తమ పరిచయాన్ని ఇస్తారు. తండ్రినే స్మృతి చేయాలి, వారి నుండి వారసత్వము లభిస్తుంది. సత్యయుగములోనైతే పారలౌకిక తండ్రి వారసత్వము లభిస్తుంది, ఇక స్మృతి చేయాల్సిన అవసరమే ఉండదు. 21 జన్మల కోసం వారసత్వము లభిస్తుంది కావున తండ్రి నుండి మంచి రీతిలో వారసత్వము తీసుకోవాలి కదా. ఇందులో కూడా తండ్రి అంటారు - వికారాల్లోకి ఎప్పుడూ వెళ్ళకండి. ఏ మాత్రం వికారాల రుచి తగిలినా సరే, అది ఇంకా వృద్ధి అవుతూ ఉంటుంది. సిగరెట్ మొదలైనవాటిని ఒక్కసారి రుచి చూసినా సరే, వెంటనే సాంగత్యపు రంగు అంటుకుంటుంది. ఇక తర్వాత ఆ అలవాటును వదలడము కష్టమైపోతుంది. అప్పుడు ఎన్ని సాకులు చెప్తారు. ఏదీ అలవాటు చేసుకోకూడదు. ఛీ-ఛీ అలవాట్లను తొలగించుకోవాలి. తండ్రి అంటారు - జీవిస్తూనే దేహ భానాన్ని వదలండి, నన్ను స్మృతి చేయండి. దేవతలకు ఎప్పుడూ పవిత్రమైన నైవేద్యాన్నే పెడతారు కావున మీరు కూడా పవిత్రమైన భోజనాన్నే తినండి.

ఇప్పుడు పిల్లలైన మీరు పుష్పాల వలె హర్షితముగా ఉండాలి. కన్యకు పతి లభించగానే ముఖము వికసించిపోతుంది కదా. మంచి నగలు, వస్త్రాలు మొదలైనవి ధరించడముతో మెరుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు జ్ఞానపు నగలను ధరిస్తారు. అక్కడ స్వర్గములోనైతే సహజ సౌందర్యముంటుంది. శ్రీకృష్ణుని పేరే సుందరుడు. అక్కడ రాజు-రాణి, యువరాజు-యువరాణి అందరూ సుందరముగా ఉంటారు. అక్కడ ప్రకృతి కూడా సతోప్రధానముగా ఉంటుంది. లక్ష్మీ-నారాయణుల వంటి సహజ సౌందర్యాన్ని ఇక్కడ ఎవరూ తయారుచేయలేరు. వారిని ఎవరూ ఈ కనుల ద్వారా చూడలేరు. అయితే, సాక్షాత్కారము జరుగుతుంది కానీ సాక్షాత్కారముతో ఎవరూ ఉన్నది ఉన్నట్లుగా చిత్రాన్ని తయారుచేయలేరు. ఒకవేళ ఎవరైనా ఆర్టిస్టుకు సాక్షాత్కారము జరిగితే, అతను వెంటనే అదే సమయములో కూర్చుని తయారుచేయాలి, అయినా అంత ఖచ్చితముగా తయారుచేయడము కష్టం. పిల్లలైన మీకు చాలా నషా ఉండాలి. ఇప్పుడు బాబా మనల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చారు. బాబా నుండి మనకు స్వర్గ వారసత్వము లభిస్తుంది. మన ఈ 84 జన్మలు పూర్తయ్యాయి. ఇటువంటి ఆలోచనలు బుద్ధిలో ఉండడము ద్వారా సంతోషము కలుగుతుంది. వికారాల ఆలోచనలు కొద్దిగా కూడా రాకూడదు. తండ్రి అంటారు - కామము మహాశత్రువు. ద్రౌపది కూడా అందుకే పిలిచారు కదా.

తండ్రి అంటారు - మీరు ఒక్క నా నుండే వినండి మరియు ఈ శ్రీమతాన్నే ఇతరులకు వినిపించండి. తండ్రి, కొడుకును ప్రత్యక్షము చేస్తారు. కొడుకు తండ్రిని ప్రత్యక్షము చేస్తారు. ఫాదర్ అంటే ఎవరు? శివ్ ఫాదర్. శివుడు మరియు సాలిగ్రామాలకు మహిమ ఉంది. శివబాబా ఏదైతే అర్థం చేయిస్తారో, దానిని ఫాలో చేయండి. ఫాలో ఫాదర్. ఈ మహిమ వారిదే. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, ఫాలో చేసి పవిత్రముగా అవ్వండి. ఫాలో చేయడముతోనే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. లౌకిక తండ్రిని ఫాలో చేయడము వలన 63 జన్మలు మీరు మెట్లు కిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు పారలౌకిక తండ్రిని ఫాలో చేసి పైకి ఎక్కాలి. తండ్రితో పాటు వెళ్ళాలి. తండ్రి అంటారు - ఒక్కొక్క రత్నము లక్షల రూపాయలు విలువైనది. తండ్రి రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు - మధురాతి-మధురమైన పిల్లలూ, మొట్టమొదట అందరికీ ఇద్దరు తండ్రుల పరిచయాన్ని ఇవ్వాలి. లౌకిక తండ్రి పతితముగా అయ్యే వారసత్వాన్ని ఇస్తారు. పారలౌకిక తండ్రి పావనముగా అయ్యే వారసత్వాన్ని ఇస్తారు. ఎంత తేడా ఉంది. ఇప్పుడు పారలౌకిక తండ్రి పావనముగా అవ్వమని చెప్తున్నారు. వికారాల్లోకి వెళ్ళేవారిని పతితులు అని అంటారు.

పతితులను పావనముగా తయారుచేసే మార్గాన్ని తెలియజేయడమే మీ మిషన్. ఇప్పుడు వినాశనము ఎదురుగా నిలబడి ఉంది కావున పావనముగా అవ్వండి అని పారలౌకిక తండ్రి కూడా ఇప్పుడు చెప్తున్నారు. కావున ఇప్పుడు ఏం చేయాలి? తప్పకుండా పారలౌకిక తండ్రి మతముపై నడవాలి కదా. ప్రదర్శనీలో ఈ ప్రతిజ్ఞను కూడా వ్రాయించాలి - పారలౌకిక తండ్రిని ఫాలో చేస్తారా? పతితముగా అవ్వడము మానేస్తారా? ఇవి వ్రాయమని వారికి చెప్పాలి. బాబాయే గ్యారంటీ ఇస్తారు, మీరు కూడా గ్యారంటీ ఇవ్వవచ్చు. అసలు మీరు పతితముగా ఎందుకవుతారు, మళ్ళీ ఓ పతిత-పావనా రండి, అని ఎందుకు పిలుస్తారు. మొత్తం విషయమంతా పవిత్రతపైనే ఆధారపడి ఉంది. తండ్రి మనకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు అని పిల్లలైన మీకు ప్రతిరోజు సంతోషము ఉండాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎటువంటి అశుద్ధమైన (ఛీ-ఛీ) అలవాట్లు అలవాటు చేసుకోకూడదు. జీవిస్తూనే దేహ భానాన్ని వదిలేయాలి. పుష్పాల వలె హర్షితముగా ఉండాలి.

2. పారలౌకిక తండ్రిని ఫాలో చేసి పావనముగా అవ్వాలి. వారి శ్రీమతాన్ని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేయాలి మరియు చేయించాలి.

వరదానము:-
నిర్వికారీ మరియు ఫరిశ్తా స్వరూపము యొక్క స్థితిని అనుభవం చేసే ఆత్మాభిమాని భవ

ఏ పిల్లలైతే ఆత్మాభిమానులుగా అవుతారో, వారు సహజముగానే నిర్వికారులుగా అవుతారు. ఆత్మాభిమాని స్థితి ద్వారా మనసులో కూడా నిర్వికారీతనపు స్థితి అనుభవమవుతుంది. ఇటువంటి నిర్వికారులు, ఎవరినైతే ఎలాంటి రకమైన అపవిత్రత లేక 5 తత్వాల ఆకర్షణ ఆకర్షించదో, వారే ఫరిశ్తాలని పిలవబడతారు. దీని కోసం సాకారములో ఉంటూ తమ నిరాకారీ, ఆత్మాభిమానీ స్థితిలో స్థితులై ఉండండి.

స్లోగన్:-
జీవితములో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసేందుకు విశేషముగా అమృతవేళలో ఏకాంతప్రియులుగా అవ్వండి.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి

బ్రాహ్మణ ఆత్మల వద్ద జ్ఞానమైతే ముందు నుండే ఉంది, కానీ వారి పట్ల రెండు రకాలుగా దాతగా అవ్వండి - 1. ఏ ఆత్మకు ఏ శక్తి అవసరమో, ఆ ఆత్మకు మనసా ద్వారా అనగా శుద్ధ వృత్తి, వైబ్రేషన్ల ద్వారా శక్తుల దానాన్ని ఇవ్వండి అనగా సహయోగాన్ని ఇవ్వండి. 2. కర్మల ద్వారా సదా స్వయము జీవితములో గుణమూర్తులుగా అయ్యి, ప్రత్యక్ష శ్యాంపుల్ గా అయ్యి ఇతరులకు సహజముగా గుణాలను ధారణ చేసే సహయోగాన్ని ఇవ్వండి, దీనినే గుణదానము అని అంటారు. దానము అంటే అర్థం సహయోగాన్ని ఇవ్వటము.