30-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు యోగబలముతో శత్రువైన రావణుడిపై విజయము పొందాలి, మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు దైవీ గుణాలను ధారణ చేయాలి’’

ప్రశ్న:-
పిల్లలందరూ తండ్రి శ్రీమతముపై ఒకే విధముగా నడవరు - ఎందుకని?

జవాబు:-
ఎందుకంటే తండ్రి ఎవరు అన్నది అందరూ ఒకే విధముగా గుర్తించలేదు. ఎప్పుడైతే పూర్తిగా గుర్తిస్తారో, అప్పుడు శ్రీమతముపై నడుస్తారు. 2. మాయ శత్రువు శ్రీమతముపై నడవకుండా ఆపు చేస్తుంది, అందుకే పిల్లలు మధ్యమధ్యలో తమ మతాన్ని నడిపిస్తారు. తర్వాత అంటారు - బాబా, మాయ తుఫానులు వస్తున్నాయి, మీ స్మృతిని మర్చిపోతున్నాము. బాబా అంటారు - పిల్లలూ, మాయా రావణుడికి భయపడకండి, తీవ్రముగా పురుషార్థము చేసినట్లయితే అది అలసిపోతుంది.

పాట:-
వారు మా నుండి విడిపోలేరు...

ఓంశాంతి
మీరు సింగిల్ ఆత్మ. ప్రతి ఒక్కరూ ఓం శాంతి అని అంటారు. వీరు డబల్ (ఇద్దరు) కనుక ఓం శాంతి, ఓం శాంతి అని రెండు సార్లు చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీరు ఇక్కడ యుద్ధ మైదానములో కూర్చుని ఉన్నారు. అలాగని అక్కడి మనుష్యుల వలె పరస్పరములో కొట్లాడుకోరు. ఆ మాటకు వస్తే, ప్రతి ఇంటిలో కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. మెజారిటీ గురించి చెప్పడము జరుగుతుంది. నంబరువన్ - దేహాభిమానము, రెండవది - కామము. ఇప్పుడు మీరు స్మృతి బలముతో 5 వికారాల రూపీ రావణుడిపై విజయము పొందుతారు. స్మృతి బలము ఉన్నట్లయితే మీరు పడిపోరు. మీ యుద్ధము ఒక్క రావణుడితోనే. అక్కడైతే అనేక రకాల విషయాలు ఉంటాయి. ఇక్కడ ఒకే విషయము ఉంటుంది. మీ యుద్ధము ఒక్క రావణుడితోనే. మీకు నేర్పించేవారు ఎవరు? పతిత-పావనుడైన భగవంతుడు. వారు పతితులను పావనముగా తయారుచేసేవారు. పావనులు అనగా దేవతలు, మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మీరు రావణుడి ద్వారా పతితులుగా అయ్యారని మనుష్యులెవరూ అర్థం చేసుకోరు. తండ్రి అర్థం చేయించారు - ఈ సమయములో మొత్తం ప్రపంచములో రావణ రాజ్యముంది. ఇదే విధముగా, సత్య-త్రేతాయుగాలలో రామ రాజ్యముంటుంది. అది కూడా మొత్తం ప్రపంచమంతటిపై ఉంటుందని అంటారు. కానీ అక్కడ ఇంతమంది మనుష్యులు ఉండరు. మీరు యోగబలముతో విశ్వ రాజ్యాన్ని తీసుకుంటున్నారు. అలాగని, ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రమే తండ్రిని స్మృతి చేయాలని లేక స్వదర్శన చక్రాన్ని తిప్పాలని కాదు. ఇదైతే ప్రతి క్షణము బుద్ధిలో ఉండాలి. మనము స్వర్గములో అర్ధకల్పము రాజ్యము చేసాము, తర్వాత రావణుడి శాపము లభించడముతో దిగిపోతాము. దిగడానికి సమయమైతే పడుతుంది. 84 మెట్లు దిగవలసి ఉంటుంది. ఎక్కే కళలో మెట్లు ఉండవు. ఒకవేళ మెట్లు ఉన్నట్లయితే సెకెండులో జీవన్ముక్తి అని ఎలా అంటారు? దిగిపోవడానికి 2500 సంవత్సరాలు పట్టడము ఎక్కడ, కొన్ని సంవత్సరాలలోనే మీరు ఎక్కే కళలోకి వెళ్ళడము ఎక్కడ. మీది యోగబలము. వారిది బాహుబలము. ద్వాపరము నుండి మొదలుకుని దిగిపోతారు, తర్వాత బాహుబలము మొదలవుతుంది. సత్యయుగములో హతమార్చే విషయమేమీ ఉండదు. శ్రీకృష్ణుడిని రోలుకు కట్టినట్లుగా చూపిస్తారు కదా, అలాంటిదేమీ జరగదు. అక్కడ పిల్లల్లో ఎప్పుడూ చంచలత్వము ఉండదు. వారు సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా ఉంటారు. శ్రీకృష్ణుడిని ఎంతగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. మంచి వస్తువనేది గుర్తుకువస్తుంది కదా. ఉదాహరణకు, ప్రపంచములో 7 అద్భుతాలు ఉన్నాయి, అవి మనుష్యులకు గుర్తుకువచ్చినప్పుడు వాటిని చూడటానికి వెళ్తారు. ఆబూలో మనుష్యులు చూడటానికి వచ్చే అన్నింటికన్నా మంచి వస్తువేది? ధార్మిక వ్యక్తులు మందిరాలను చూడటానికి వస్తారు. భక్తి మార్గములోనైతే మందిరాలు చాలా ఉంటాయి. సత్య, త్రేతాయుగాలలో మందిరాలేవీ ఉండవు. మందిరాలు స్మృతి చిహ్నాల రూపములో తర్వాత తయారవుతాయి. సత్యయుగములో పండుగలు మొదలైనవేవీ ఉండవు. దీపావళి పండుగ కూడా ఇక్కడి వలె ఉండదు. అయితే, సింహాసనముపై కూర్చున్నప్పుడు పట్టాభిషేకము రోజును జరుపుకుంటారు. అక్కడ అందరి జ్యోతి వెలిగి ఉంటుంది.

నవయుగము వచ్చింది... అని మీ వద్ద ఒక పాట కూడా ఉంది. మనము నవయుగము అనగా సత్యయుగము కోసం దేవీ-దేవతలుగా తయారయ్యే పురుషార్థము చేస్తున్నామని కేవలం మీకు మాత్రమే తెలుసు. చదువునైతే పూర్తిగా చదువుకోవాలి. ఎప్పటివరకైతే జీవించి ఉంటారో, అప్పటివరకు జ్ఞానామృతాన్ని తాగుతూ ఉండాలి. ఇది జ్ఞానము, సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకోవాలి. ఇక్కడ భాష మొదలైనవేవీ నేర్చుకోరు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పాలి, అంతే. ఇక్కడ మీరు కూర్చుని ఉన్నారు. మీరు స్వదర్శన చక్రధారులు. మా 84 జన్మల చక్రము పూర్తి అయ్యిందని బుద్ధిలో ఉంది. ఇప్పుడు పాత శరీరాన్ని, పాత సంబంధాలను వదిలి కొత్తవి తీసుకోవాలి. విష్ణుపురికి యజమానులుగా అయ్యేందుకు బాబా పురుషార్థము చేయిస్తున్నారు. ప్రపంచములోని మిగిలినవారంతా ఆసురీ సాంప్రదాయానికి చెందినవారు. భగవానువాచ - ఇప్పుడు అదే గీతా యుగము నడుస్తూ ఉంది. ఇది కల్ప-కల్పపు సంగమయుగము. తండ్రి అంటారు - నేను కల్పము యొక్క ఈ సంగమయుగములో వస్తాను. నేను ఆ గీతా భగవానుడినే. నేను కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని రచించడానికి ఇక్కడకు వస్తాను, నేను ద్వాపరములో ఎలా వస్తాను. ఇది ఒక పెద్ద పొరపాటు. కొన్ని చిన్న పొరపాట్లు జరుగుతాయి, కొన్ని పెద్ద పొరపాట్లు జరుగుతాయి. ఇది అన్నింటికంటే పెద్ద పొరపాటు. పునర్జన్మ రహితుడైన శివ భగవానుడికి బదులుగా 84 జన్మలు తీసుకునేవారి పేరును వ్రాసేసారు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని శ్రీకృష్ణుడు చెప్పలేరని ఇప్పుడు మీకు తెలుసు. అన్ని ధర్మాల వారు వారిని అంగీకరించరు. శివుడైతే నిరాకారుడు. మీరు శివశక్తి సైన్యము. శివబాబాతో మీరు యోగాన్ని జోడించి శక్తిని తీసుకుంటారు. ఇందులో స్త్రీ-పురుషుల విషయమేమీ లేదు. ఆత్మలైన మీరంతా సోదరులు. మీరంతా తండ్రి నుండి శక్తిని తీసుకుంటున్నారు. వారసత్వాన్ని తండ్రియే ఇస్తారు కదా. ఆ తండ్రియే సర్వశక్తివంతుడు. ఈ లక్ష్మీ-నారాయణులను కూడా సర్వశక్తివంతులు అని అంటారు ఎందుకంటే వారు మొత్తం విశ్వానికి యజమానులు. వారు ఈ రాజ్యాన్ని ఎలా పొందారు? ఇప్పుడు కేవలం భారత్ లోనే కాదు, మొత్తం ప్రపంచములో రావణ రాజ్యముంది. ఎవరైనా రాజులుంటే, వారి పెద్దలు రాజ్యము చేసారని, అది అలా నడుస్తూ వస్తుందని తెలుస్తుంది. లక్ష్మీ-నారాయణులు సత్యయుగము ఆది నుండి ఉన్నారు అంటే తప్పకుండా పూర్వ జన్మలో అంతటి పురుషార్థము చేసి ఉంటారు. దాన-పుణ్యాలు చేయడము వలన పతిత రాజ్యాలు లభిస్తాయి. ఇక్కడైతే ఈ సంగమములో జ్ఞాన బలము మరియు యోగ బలముతో 21 జన్మల కొరకు రాజ్యాన్ని పొందుతారు.

ఈ పాత ప్రపంచమంతా వినాశనమవ్వనున్నదని మీకు తెలుసు. ఈ దేహము కూడా మిగలదు. అందుకే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. బాబా-బాబా అని అనడము నేర్చుకోండి. ఎలాగైతే చిన్న పిల్లలకు నేర్పించినప్పుడు, ఇక వారు వారి తండ్రిని గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు ఆత్మిక తండ్రి పిల్లలైన మీకు చెప్తున్నారు - ఓ పిల్లలూ, ఇది కొత్త విషయము. తండ్రి అంటారు - ఇప్పుడు ఆత్మిక తండ్రినైన నన్ను స్మృతి చేయండి ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆత్మ అయితే అవినాశీ, శరీరము వినాశీ, మరి శక్తివంతమైనది ఏది? శరీరము, ఆత్మ యొక్క ఆధారముతో నడుస్తుంది. ఆత్మ వెళ్ళిపోతే శరీరాన్ని అగ్నిలో కాల్చవలసి ఉంటుంది. ఆత్మ ఎలాగూ అవినాశీయే, అది ఒక చిన్న బిందువులానే ఉంటుంది. ఆ ఆత్మను గురించి ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ ఎవరికైనా సాక్షాత్కారము జరిగినా, దాని వల్ల లాభమేముంటుంది! ఆత్మ ఒక బిందువు అని, అందులో 84 జన్మల అవినాశీ పాత్ర నిండి ఉంటుందని వారికి తెలియనే తెలియదు. ఈ విషయాలు మీ బుద్ధిలో మాత్రమే ఉన్నాయి. రాజయోగాన్ని నేర్పించేవారు ఆ తండ్రి మాత్రమే. ఇకపోతే, బ్యారిస్టర్లు, వకీళ్ళు, ఇంజనీర్లు మొదలైనవారైతే ఉంటూనే ఉంటారు. ఇక్కడ మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వాలి. వారు కూడా మనుష్యులే కానీ వారిని దేవతలని అంటారు. దేవతలు అనగా దైవీ గుణాలను ధారణ చేసేవారు. మీరు పురుషార్థము చేసి అలాంటి దైవీ గుణాలు కలవారిగా తయారవ్వాలి. ఇదే లక్ష్యము-ఉద్దేశ్యము. ఈ దేవతలలో ఏయే గుణాలున్నాయి అనేది మీకు తెలుసు! మనము ఆ విధముగా తయారవ్వాలి. ప్రజలు కూడా ఉంటారు కదా. ప్రజలు ఎంతోమంది తయారవుతారు కానీ రాజు-రాణులుగా అవ్వడములో శ్రమ ఉంటుంది. ఎవరైతే బాగా శ్రమిస్తారో, వారు రాజు-రాణులుగా అవుతారు. ఎవరైతే అనేకమందికి జ్ఞానాన్ని ఇస్తారో, వారిలోని ప్రతి ఒక్కరూ తమ హృదయము ద్వారా అర్థం చేసుకోగలరు. ఆత్మ అంటుంది - నేను అనంతమైన తండ్రికి చెందినవానిగా తప్పకుండా అవుతాను, వారిపై బలిహారమవుతాను, అర్పణ అవుతాను. నా వద్ద ఏదైతే ఉందో, అదంతా అర్పణ చేస్తాను. ఈశ్వరునికైతే ఇస్తారు కదా. మీరు వచ్చినట్లయితే నేను బలిహారమవుతాను. దానికి బదులుగా మీ నుండి కొత్త తనువును, మనసును, ధనాన్ని తీసుకుంటాను. కొత్త మనసును ఎలా తీసుకుంటారు? ఆత్మను కొత్తగా (పవిత్రముగా) తయారుచేస్తారు. ఆ తర్వాత శరీరము కూడా కొత్తది తీసుకుంటారు. రాజధానిని కూడా తీసుకుంటారు. ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు కదా. ఆత్మ అంటుంది - ఓ బాబా, నేను ఈ శరీర సహితముగా మీ వాడిని, బాబా, నేను మీ శరణులోకి వస్తాను. అందరూ రావణ రాజ్యములో చాలా దుఃఖితులుగా ఉన్నారు, అందుకే, బాబా, ఇప్పుడు దీని నుండి విముక్తులుగా చేసి మీ రాజధానిలోకి తీసుకువెళ్ళండి అని అంటారు. శివబాబా అయితే లభించారు, ఇంకేమి కావాలి! మీకు తెలుసు - శివబాబా యొక్క శ్రీమతముతో స్వర్గము తయారవుతుంది. ఆసురీ రావణుడి మతముతో నరకము తయారవుతుంది. ఇప్పుడు శ్రీమతముతో మళ్ళీ స్వర్గము తయారవ్వనున్నది. ఎవరైతే కల్పక్రితం వచ్చి ఉంటారో, తప్పకుండా వారే వస్తారు. శ్రీమతముతో ఉన్నతముగా తయారవుతారు. రావణుడి మతముపై నడవడముతో పడిపోతారు. మీది ఇప్పుడు ఎక్కే కళ, మిగిలినవారందరిదీ దిగే కళ. అనేక ధర్మాలు ఎన్నో ఉన్నాయి. సత్యయుగములో ఒక్క దేవీ-దేవతా ధర్మముండేది. ఇప్పుడు అది కనుమరుగైపోయింది (మర్రి వృక్షము వలె).

దేవీ-దేవతా ధర్మానికి సంబంధించిన గుర్తులున్నాయని మీకు తెలుసు. నిజంగా ఒకప్పుడు దేవీ-దేవతల రాజ్యముండేది. ఇది 5000 సంవత్సరాల నాటి విషయము. ఇది 5000 సంవత్సరాల చక్రమని మీరు నిరూపించి చెప్తారు. ఇందులో 4 యుగాలు ఉన్నాయి. ప్రతి యుగము యొక్క ఆయువు 1250 సంవత్సరాలు. వారైతే లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. చాలా తేడా ఉన్న కారణముగా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. ఇతర సంస్థలు ఎలా ఉన్నాయో, అలా ఇది బి.కె.ల సంస్థ, వీరు గీత గురించి చెప్తారు అని భావిస్తారు. ఇప్పుడు గీతను శ్రీకృష్ణ భగవానుడు వినిపించారు కదా అని అనుకుంటారు. ఇక్కడ వజ్రాల వ్యాపారి అయిన దాదా కూర్చుని ఉన్నారు కనుక మనుష్యులు తికమకపడతారు కదా. తండ్రి అంటారు - నేను ఎవరినో, ఎలా ఉన్నానో, అలా నా గురించి ఇప్పటివరకు ఎవరూ తెలుసుకోలేదు. చివరిలో మీరు పూర్తిగా తెలుసుకుంటారు. ఇప్పటివరకు నంబరువారుగా తెలుసుకున్నారు. అందుకే శ్రీమతముపై నడవడము చాలా కష్టమని భావిస్తారు. మంచి-మంచి పిల్లలు కూడా శ్రీమతముపై నడవరు. రావణుడు శ్రీమతముపై నడవనివ్వడు. తమ సొంత మతాన్ని నడిపిస్తారు. శ్రీమతముపై పూర్తిగా నడిచేవారు కొద్దిమందే ఉన్నారు. మున్ముందు పూర్తిగా గుర్తిస్తారు, అప్పుడు శ్రీమతముపై నడుస్తారు. నేను ఎవరినో, ఎలా ఉన్నానో, అది మున్ముందు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నారు. పూర్తిగా అర్థం చేసుకుంటే, ఇంకేమి కావాలి! ఉండటము కూడా తమ గృహస్థములోనే ఉండాలి కానీ శత్రువైన మాయ ఎలాంటిదంటే, అది శ్రీమతముపై నడవకుండా ఆపు చేస్తుంది. బాబా, మాయ తుఫానులు చాలా వస్తున్నాయి, మాయ మీ స్మృతిని మరపింపజేస్తుంది అని అంటారు. అయితే, పురుషార్థము తీవ్రముగా చేస్తూ ఉంటే, చివరికి మాయ కూడా అలసిపోతుంది. మాల కూడా 8 మందిదే. ముఖ్యమైనవారు 8 రత్నాలు. ఆ 8 మంది జంటలు, మధ్యలో 9వ రత్నముగా శివబాబాను పెడతారు. కొందరు ఎరుపు రంగు రత్నాన్ని పెడతారు, కొందరు తెలుపు రంగు రత్నాన్ని పెడతారు. ఇప్పుడు శివబాబా అయితే ఒక బిందువు. బిందువు ఎర్రగా ఉండదు. బిందువైతే తెల్లగానే ఉంటుంది. అది చాలా సూక్ష్మముగా ఉంటుంది. దానిని దివ్యదృష్టితో తప్ప ఎవరూ చూడలేరు. డాక్టర్లు మొదలైనవారు బిందువును చూడటానికి ఎంతగా ప్రయత్నిస్తారు, కానీ వారు చూడలేరు ఎందుకంటే అది అవ్యక్తమైనది కదా. అందుకే మిమ్మల్ని అడుగుతారు - నేను ఒక ఆత్మను అని మీరు అంటారు కదా, అచ్ఛా, ఆత్మను ఎప్పుడైనా చూశారా. తమను తామే చూడలేరన్నప్పుడు తండ్రిని ఎలా చూడగలరు. ఆత్మలో పాత్ర ఎలా నిండి ఉంది అని ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఈ విషయము గురించి ఎవరికీ ఏమాత్రము తెలియదు. 84 జన్మలకు బదులుగా 84 లక్షల జన్మలని అంటారు. తండ్రి వచ్చి పిల్లలకు కూడా అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. నేటి భారత్ ఎలా ఉంది, రేపటి భారత్ ఎలా ఉంటుంది! మహాభారత యుద్ధము కూడా ఉంది. గీతా జ్ఞానాన్ని కూడా ఇచ్చారు, ఇది రుద్ర యజ్ఞము కూడా. అన్ని ధర్మాల వినాశనము, ఏక ధర్మ స్థాపన జరుగుతుంది.

ఇది శివబాబా యొక్క భండారా (వంటిల్లు), ఇందులో మీకు పవిత్రమైన భోజనము లభిస్తుంది. బ్రాహ్మణ-బ్రాహ్మణీలే తయారుచేస్తారు కావుననే దీని మహిమ అపారమైనది. దీని ద్వారా మీరు పవిత్రముగా అయి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు, అందుకే పవిత్రమైన భోజనము మంచిది. మీరు ఎంతగా ఉన్నతముగా అవుతూ ఉంటారో, అంతగా మీకు భోజనము కూడా శుద్ధమైనది లభిస్తూ ఉంటుంది. ఎవరైనా యోగయుక్తముగా భోజనము తయారుచేస్తే, చాలా బలం లభిస్తుంది, అది కూడా మున్ముందు లభిస్తుంది. సేవాధారులైన పిల్లలెవరైతే సెంటరులో ఉంటారో, వారు తమ చేతులతోనే భోజనాన్ని తయారుచేసుకుని తింటే, దానితో కూడా చాలా బలం లభించగలదు. ఎలాగైతే పతివ్రత స్త్రీ పతిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయరో, అలా పిల్లలైన మీరు కూడా స్మృతిలో ఉంటూ తయారుచేయండి, తినండి, అప్పుడు చాలా బలం లభిస్తుంది. తండ్రి స్మృతిలో ఉండటముతో మీరు విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. బాబా సలహానైతే ఇస్తారు కానీ ఇప్పుడు ఎవరి బుద్ధిలోకి రాదు. మున్ముందు కొంతమంది చెప్పవచ్చు - మేము మా చేతులతోనే యోగయుక్తముగా భోజనము తయారుచేస్తాము, తద్వారా అందరి కళ్యాణము జరుగుతుంది అని.

తండ్రి పిల్లలకు అన్ని రకాల డైరెక్షన్లు ఇస్తారు కదా. త్రిమూర్తి చిత్రము ఎదురుగా ఉండాలి. వారసత్వము శివబాబా నుండి తీసుకోవాలి. ఏదో ఒక యుక్తిని రచిస్తూ ఉండండి. బాబా తమ ఉదాహరణను ఇలా చెప్తారు - భక్తి మార్గములో నేను నారాయణుడి చిత్రాన్ని చాలా ప్రేమించేవాడిని, వారిని స్మృతి చేస్తూ ఉంటే అశ్రువులు వచ్చేవి ఎందుకంటే ఆ సమయములో వైరాగ్యముండేది, బాల్యములో వైరాగ్య వృత్తి ఉండేది. ఇవి అనంతమైన విషయాలు. అయినా, ‘మన్మనాభవ’ అని చెప్తారు. యోగములో ఉండటముతోనే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. స్మృతిలో ఉండాలనే చింత ఉంచుకోవాలి. శ్రీమతము లభిస్తుంది, తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. నేను సృష్టి రచయితను కనుక మీరు కూడా కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు కదా. లేకుంటే శిక్షలు కూడా అనుభవిస్తారు మరియు పదవి కూడా భ్రష్టమవుతుంది. మరణించే కంటే ముందే మేము సతోప్రధానముగా ఎలా అవ్వాలి అన్న చింతను పిల్లలు ఉంచుకోవాలి. తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. ఇది అన్నింటికంటే పెద్ద చింత. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. యోగయుక్తముగా ఉంటూ తమ చేతులతో భోజనాన్ని తయారుచేసుకోవాలి మరియు తినాలి. పవిత్ర ప్రపంచములోకి వెళ్ళేందుకు పవిత్రమైన భోజనాన్ని తినాలి. అందులోనే బలముంది.

2. కొత్త తనువు, మనసు, ధనములను ప్రాప్తి చేసుకునేందుకు పాతదంతా తండ్రిపై బలిహారము చేయాలి. ఈ శరీర సహితముగా తండ్రిపై పూర్తిగా బలిహారమవ్వాలి.

వరదానము:-
ఏకాంతము మరియు అంతర్ముఖత యొక్క అభ్యాసము ద్వారా స్వయాన్ని అనుభవాలతో సంపన్నముగా చేసుకునే మాయాజీత్ భవ

నాలెడ్జ్ ఫుల్ తో పాటు పవర్ ఫుల్ గా అనగా అనుభవీ మూర్తులుగా అయ్యేందుకు ఏకాంతవాసులుగా మరియు అంతర్ముఖులుగా అవ్వండి. అలజడి చెందడానికి కారణము అనుభవం యొక్క లోపమే, అందుకే కేవలం అర్థం చేసుకునేవారిగా, అర్థం చేయించేవారిగా లేక మనన మూర్తులుగా అవ్వకండి, కానీ ఏకాంతవాసులుగా అయి ప్రతి పాయింటు యొక్క అనుభవీలుగా అవ్వండి, అప్పుడు ఏ రకమైన మోసము నుండైనా, దుఃఖము లేక సందేహము నుండైనా రక్షింపబడతారు. నేను ఎవరి సంతానాన్ని, ప్రాప్తి ఏమిటి - ఈ మొదటి పాఠాన్ని అనుభవం చేసినట్లయితే మాయాజీతులుగా సహజముగానే అవుతారు.

స్లోగన్:-
బాధ్యతను నిర్వర్తిస్తూ డబల్ లైట్ గా ఉండేవారే తండ్రికి సమీప రత్నాలు.

అవ్యక్త ప్రేరణలు - పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి

మీ మూడు స్వరూపాలను సదా స్మృతిలో పెట్టుకోండి, ఒకటి - నేను ఉపకారిని, రెండు - నేను నిరహంకారిని మరియు మూడు - నేను అధికారిని. ఎవరు ఎంతటి అపకారులైనా కానీ మీ దృష్టి మరియు వృత్తి ఉపకారముతో కూడినదిగా ఉండాలి, ఎంతటి అధికారులో అంతగా నిరహంకారులుగా ఉండాలి. వృత్తిలో నుండి కూడా ‘నేను’ అన్నదానిని త్యాగము చేసినట్లయితే, స్మృతిలో ఎల్లప్పుడూ బాబా మరియు దాదా ఉన్నట్లయితే మరియు నోటి నుండి ఇవే మాటలు వస్తున్నట్లయితే, విశ్వపతిగా అయ్యి విశ్వ సేవను చెయ్యగలరు.