ఈ రోజు బాప్ దాదా తమ నలువైపులా ఉన్న పరమాత్మ ప్రియులైన
పిల్లలను చూస్తున్నారు. ఇటువంటి పరమాత్మ ప్రియులు కోట్లలో
కొద్దిమంది పిల్లలే ఉన్నారు ఎందుకంటే ఈ సమయములోనే పరమాత్మ
ప్రేమను అనుభవం చేయగలరు, కల్పము మొత్తములో ఆత్మల ప్రేమను,
మహాత్ముల ప్రేమను, ధర్మాత్ముల ప్రేమను అనుభవం చేసారు కానీ
పరమాత్మ ప్రేమ కేవలం ఇప్పుడు సంగమయుగములో మాత్రమే ఉంటుంది. ఈ
ప్రేమను పిల్లలైన మీరందరూ అనుభవం చేస్తున్నారు. పరమాత్మ ఎక్కడ
ఉంటారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఏమని జవాబిస్తారు?
నాతో ఉన్నారు, నాతోనే ఉంటారు, నా హృదయములోనే ఉన్నారు, ఇలా
అనుభవం చేస్తున్నారు కదా! మీకే తెలుసు మరియు మీకే ఈ ప్రేమ
యొక్క అనుభవం ఉంది. మా హృదయములో బాబా ఉంటారు మరియు బాబా
హృదయములో మేము ఉంటాము. ఈ పరమాత్మ ప్రేమ యొక్క నషాను అనుభవం చేసే
భాగ్యము మాకే లభించింది అని మీకు తెలుసు. ఎవరితో అయినా ప్రేమ
ఏర్పడితే దానికి గుర్తు ఏమిటి? దానికి గుర్తు ఏమిటంటే - వారిపై
బలిహారమవ్వడము. మరి పరమపిత పరమాత్మ పిల్లలైన మీ నుండి ఏమి
ఆశిస్తున్నారు అనేదైతే మీ అందరికీ తెలుసు కదా? పిల్లలు ప్రతి
ఒక్కరి పట్ల బాబాకున్న ఆశ ఏమిటంటే - నా ఒక్కొక్క బిడ్డ బాబా
సమానముగా అవ్వాలి. తండ్రి వలె పిల్లల స్థితి కూడా శ్రేష్ఠముగా
అవ్వాలి. ఆ శ్రేష్ఠ స్థితి ఏమిటి? సంపూర్ణ పవిత్రతా స్థితి.
ఎంతటి పవిత్రత అంటే స్వప్నములో కూడా అపవిత్రత రాలేకపోవాలి.
ఇటువంటి సంపూర్ణ పవిత్ర స్థితిని తయారు చేసుకుంటున్నారా? ఆ
సంపూర్ణ పవిత్రతలో అపవిత్రత యొక్క నామ-రూపాలు కూడా ఉండకూడదు.
వర్తమాన సమయము సమీపముగా వస్తున్న కారణముగా బాప్ దాదా ఇప్పుడు
ఇస్తున్న సూచన ఏమిటంటే - సమయము యొక్క సమీపత అనుసారముగా వ్యర్థ
సంకల్పాలు కూడా అపవిత్రతకు గుర్తే. మొత్తం రోజంతటిలో ఇది కూడా
చెక్ చేసుకోండి - ఏ వ్యర్థ సంకల్పాలు, అభిమానానికి
సంబంధించినవైనా లేక అవమానానికి సంబంధించినవైనా తమ వైపుకు
ఆకర్షించడము లేదు కదా? ఎందుకంటే నడుస్తూ-నడుస్తూ ఒకవేళ బాబా
ఇచ్చిన విశేషతలను తమ విశేషతలుగా భావిస్తూ అభిమానములోకి
వచ్చినట్లయితే అది కూడా వ్యర్థ సంకల్పమే అవుతుంది. నాది అన్న
భావన ద్వారా వచ్చే అశుభ సంకల్పాలు - నేనేమీ తక్కువ కాదు, నాకూ
అన్నీ తెలుసు, నా ఈ సంకల్పమే యథార్థమైనది, ఉన్నతమైనది... ఈ నాది
అనే భావనతో కలిగే అభిమానము యొక్క సంకల్పాలు కూడా సూక్ష్మ
అపవిత్రత యొక్క అంశమే. కావున స్వయాన్ని చెక్ చేసుకోండి - ఏ
విధమైన అపవిత్రత యొక్క వ్యర్థ సంకల్పాల అంశమేమైనా ఉండిపోయిందా?
ఎందుకంటే ఇప్పుడు పవిత్ర ప్రపంచము యొక్క స్థాపనా సమయాన్ని
సమీపముగా తీసుకురావడానికి పరమాత్మకు ప్రియమైన పిల్లలైన మీరు
నిమిత్తులు. నిమిత్త ఆత్మల వైబ్రేషన్లు నలువైపులా వ్యాపిస్తాయి.
కావున చెక్ చేసుకోండి, ఏ విధమైన వ్యర్థ సంకల్పమైనా తన వైపు
ఆకర్షించట్లేదు కదా? ఎందుకంటే ఇప్పుడు పవిత్ర ప్రపంచము, పవిత్ర
రాజ్యము సమీపముగా వస్తున్నాయి. దుఃఖము మరియు అశాంతి నలువైపులా
భిన్న-భిన్న స్వరూపాలలో పెరుగుతూ ఉన్నాయి. దాని కోసం పవిత్రతా
వైబ్రేషన్లు అవసరము. దుఃఖము మరియు అశాంతికి కారణము అపవిత్రత.
ఇప్పుడు అపవిత్ర ఆత్మలకు మరియు భక్త ఆత్మలకు డబుల్ సేవ చేయాలి.
వాణి సేవనైతే బాప్ దాదా చూసారు, అది నలువైపులా చాలా బాగా
చేస్తున్నారు, మీపై ఉన్న ఫిర్యాదును కూడా తొలగించుకుంటున్నారు.
కానీ ఇప్పుడు ఆత్మలకు ఎక్స్ ట్రా సకాష్ కావాలి. మనసా సేవ ద్వారా
సకాష్ ను ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి, ఉల్లాస-ఉత్సాహాలను
ఇవ్వండి. ఈ సమయములో డబుల్ సేవ యొక్క అవసరము ఉంది. దీని కోసం
బాప్ దాదా ఏమన్నారంటే - ప్రతి ఒక్క బిడ్డ స్వయాన్ని పూర్వజులుగా
భావించండి. మీరు ఈ కల్పవృక్షానికి పునాది, మీరు పూర్వజులు మరియు
పూజ్య ఆత్మలు. బాప్ దాదా అయితే దుఃఖములో ఉన్న పిల్లల పిలుపులు
వింటూ ఉంటారు. పిల్లలైన మీకు వారి పిలుపులు వినిపించాలి. ఎంతగా
సంపూర్ణ పవిత్ర ఆత్మగా అవుతారో, అవుతూ ఉన్నారు, అయ్యారు కూడా,
కానీ దానితోపాటు ఇప్పుడు మనసా సేవను పెంచాలి.
ఈ రోజుల్లో విశ్వములో సుఖము, శాంతి, సంతోషము ఆత్మలలో తక్కువ
అవుతున్నాయి. మరి పరమాత్మ ప్రేమకు పాత్రులైన మీరు ఇప్పుడు
ప్రేమ, సంతుష్టత, సంతోషము యొక్క అంచలిని ఇవ్వాల్సిన అవసరము ఉంది.
దుఃఖములో ఉన్నవారికి సుఖము యొక్క అంచలిని ఇవ్వాలి. ఒకటి, మనసా
సేవ ద్వారా సకాష్ ను ఇవ్వండి. రెండవది, మీ ముఖము మరియు నడవడిక
ద్వారా బాబాను ప్రత్యక్షము చేయండి. ఇప్పుడేదైతే సేవ చేస్తూ
ఉన్నారో మరియు చేసారో, అది చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు.
సేవలో నలువైపులా ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఒక్క
సేవ మిగిలిపోయింది. ఇప్పటివరకు అందరూ ఏమని చెప్పుకుంటున్నారంటే
- బ్రహ్మాకుమారీలు మనుష్యాత్మలను మంచిగా తయారుచేస్తారు, అశుద్ధ
వ్యవహారము ఏదైతే ఉందో, దాని నుండి విముక్తులుగా చేస్తారు. యువత
కోసం ప్రభుత్వము ఏదైతే కోరుకుంటుందో, ఆ సేవను చాలా బాగా
చేస్తారు. కానీ ఇప్పుడు - బాబా వచ్చారు, పరమాత్మ వచ్చారు,
పరమాత్ముని జ్ఞానాన్ని వీరు ఇస్తున్నారు, నా తండ్రి తన
వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు - ఈ విధముగా ఇప్పుడు బాబా
వైపుకు వారి దృష్టి వెళ్ళడము ద్వారా వారిని కూడా పరమాత్మ ప్రేమ,
పరమాత్మ ఆకర్షణ ఆకర్షిస్తాయి. బాగుంది-బాగుంది అనైతే అంటున్నారు
కానీ తండ్రి అయిన పరమాత్ముని యొక్క ప్రత్యక్షత వారిని ఆకర్షించి
మంచిగా తయారుచేస్తుంది. ఇప్పుడు బాబాను గుర్తించాలి, ఎవరినైతే
గుర్తు చేస్తున్నామో వారు జ్ఞానము ఇస్తున్నారు, వారి నుండి
వారసత్వము లభిస్తుంది అని వారికి అర్థం కావాలి. కావున ఇప్పుడు
మనసా ద్వారా తండ్రికి సమీపముగా తీసుకురండి. మీ ముఖము మరియు
నడవడిక ద్వారా, మీ నయనాలలో బాబా ప్రత్యక్షమవ్వాలి. ఇప్పుడు దీని
కోసం పరస్పరము ప్లాన్ తయారుచేయండి.
బాప్ దాదా ఏమి చూసారంటే బాప్ దాదా సమయమనుసారముగా ఏవైతే
ప్లాన్లు ఇచ్చారో, వాటిని పిల్లలు ఎంతో విధిపూర్వకముగా,
ఉల్లాస-ఉత్సాహాలతో ప్రాక్టికల్ గా చేసారు, చేస్తూ ఉన్నారు, దీని
కోసం బాప్ దాదా పిల్లలందరికీ పదమాల, పదమాల రెట్లు అభినందనలు
తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఎడిషన్ ఏమి చెయ్యండి అంటే, భగవంతుడు
వారసత్వాన్ని ఇస్తున్నారు, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు
వారసత్వాన్ని తీసుకుంటారు! దుఃఖము, అశాంతి యొక్క వాయుమండలాన్ని
చూసి బాబాకు పిల్లలపై దయ కలుగుతుంది. అంతేకాక, ఇది అతిలోకి
వెళ్ళేదే ఉందని బాబాకు మరియు మీకు తెలుసు. అతి అవ్వకుండా
అంతమవ్వదు. ఇటువంటి సమయములో ఆత్మలకు ఇది అనుభవం చేయించండి,
కేవలం వినిపించడం కాదు, భగవంతుడు వారసత్వాన్ని ఇస్తున్నారు అని
అనుభవం చేయించండి. బాబా ప్రత్యక్షత ఎప్పుడు మరియు ఎలా అవుతుంది
అని మీరందరూ కూడా అడుగుతూ ఉంటారు కదా. మరి వారు బ్రహ్మాకుమారీల
వరకు చేరుకున్నారు, కానీ బ్రహ్మాకుమారీలకు నేర్పించేది ఎవరు!
బ్రహ్మాకుమారీలు, బ్రహ్మాకుమారులకు దాత ఎవరు! ఇప్పుడు సమయాన్ని
సమీపముగా తీసుకురావాలి. సమాప్తి చేయాలి. సమాప్తిని సమీపముగా
తీసుకువచ్చేది ఎవరు? నేనే నిమిత్తుడను అని పిల్లలు ప్రతి ఒక్కరూ
భావిస్తున్నారు కదా. ఈ బాధ్యతను బాబా తమతోపాటు పిల్లలకు కూడా
ఇచ్చారు. పిల్లలు తండ్రిని ప్రత్యక్షము చేస్తారు. చూడండి,
మీరందరూ బాబాను తెలుసుకున్నప్పుడు ఏమి చేసారు? గుర్తించారు,
తెలుసుకున్నారు, ఇక పిల్లలుగా అయి వారసత్వానికి అధికారులుగా
అయ్యారు. ఇప్పుడు వారసత్వాన్ని తీసుకునేవారి క్యూ మొదలవ్వాలి.
మరి ఈ క్యూ ఎందుకు ఆగి ఉంది? ఎందుకంటే కొంతమంది పిల్లలు
ఇప్పటికీ వ్యర్థ సంకల్పాల క్యూలోనే ఉన్నారు. ఎందుకు, ఏమిటి, ఎలా
- ఇప్పుడు వీటిని సమాప్తము చేయడానికే సమయాన్ని కేటాయిస్తున్నారు
కానీ వ్యర్థం సమాప్తమవ్వలేదు. సమర్థముగా అవ్వడములో వ్యర్థము
ఆటంకాన్ని వేస్తుంది.
ఈ రోజు బాప్ దాదా వ్యర్థ సంకల్పాలను సమాప్తము చెయ్యడానికి
నలువైపులా ఉన్న పిల్లలందరికీ ధైర్యాన్ని ఇస్తున్నారు -
ఇప్పటినుండి వ్యర్థాన్ని సమాప్తము చేసి సదా సమర్థవంతులుగా అయ్యి
సమర్థులుగా తయారుచేయండి. కేవలం సందేశాన్ని ఇవ్వకండి, సమర్థులుగా
తయారుచేయండి. సమర్థులుగా అవ్వండి, సమర్థులుగా తయారుచేయండి.
వ్యర్థము యొక్క సమాప్తి దివసాన్ని జరుపుకోండి. వీలవుతుందా?
వ్యర్థ సంకల్పాలు స్వయానికి కూడా నష్టము కలిగిస్తాయి, సమయాన్ని
వృధా చేస్తాయి, ముఖముపై సదా సంతోషము, అదృష్టము యొక్క అనుభవం
తగ్గిస్తాయి అని అనుకుంటారు కూడా. అందుకే ఇప్పుడు సమాప్తి
యొక్క సమయాన్ని సమీపముగా తీసుకురావాలి. ఎవరు తీసుకురావాలి? మీరే
కదా! ఇప్పుడు సమాప్తి సమయాన్ని సమీపముగా తీసుకురావాలి, దాని
కోసం వ్యర్థాన్ని సమాప్తము చెయ్యాల్సిందే, చెయ్యాలి కాదు,
చెయ్యాల్సిందే, స్వప్నములో కూడా రాకూడదు, సంకల్పములో కాదు కదా
స్వప్నములో కూడా రాకూడదు, ఏ పిల్లలైతే స్వయాన్ని ఇంతటి
ధైర్యవంతులుగా భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. మనసు యొక్క
చేతిని ఎత్తుతున్నారు కదా! స్థూల చేతిని ఎత్తడము చాలా సులువు
కానీ మనసు యొక్క చేతిని ఎత్తుతున్నారా? మనసు యొక్క చేతిని
ఎత్తేవారు చేతులెత్తండి, మనసు యొక్క చెయ్యి... అచ్ఛా!
ఇప్పుడు బాప్ దాదా పిల్లలందరికీ ఈ వరదానము ఇస్తున్నారు,
అదేమిటంటే - మీరందరూ రాబోయే కొత్త ప్రపంచములో 21 జన్మలు సదా
సంతోషముగా ఉంటారు. కష్టపడరు... ప్రపంచము యొక్క అలజడులలోకి రారు...
జీవితములో కావలసినవన్నీ, తనువు-మనసు-ధనము, అన్నీ లభిస్తాయి.
తనువు ఆరోగ్యముగా ఉంటుంది, మనసు సంతోషముగా ఉంటుంది, ధనము
అపారముగా లభిస్తుంది, ఇవి మీకు 21 జన్మల గ్యారంటీ. అచ్ఛా, ఈనాటి
ప్రపంచము అనుసారముగానైతే పరిస్థితులు చాలా మారుతూ ఉంటాయి.
ప్రభుత్వ నియమాలు కూడా మారనున్నాయి. మనుష్యుల వృత్తి కూడా
మారనున్నది. ప్రతి ఒక్కరి జీవితములో వ్యర్థ విషయాలైతే వచ్చేదే
ఉంది, ఆ వ్యర్థాన్ని సమాప్తము చెయ్యడానికి సమర్థ సంకల్పాలు
కావాలి. వేస్ట్ ను సమాప్తము చెయ్యడానికి బెస్ట్ సంకల్పాలు
కావాలి. కావున ప్రతిరోజూ మురళిలో ఏదైతే వరదానము, స్లోగన్
వస్తాయో, అవి వినండి. ఆ వరదానమే శ్రేష్ఠ సంకల్పము. ఎప్పుడైతే
వ్యర్థము వస్తుందో, అప్పుడు మనసుకు శ్రేష్ఠ సంకల్పాలు కావాలి.
మనసు ఖాళీగా ఉండలేదు. మనసుకు ఏదో ఒక సంకల్పము కావాలి. మరి
వ్యర్థాన్ని, వేస్ట్ ను బెస్ట్ లోకి మార్చడానికి, మీకు ఈ
వరదానము మరియు స్లోగన్ మొదలైనవి మనసును మార్చడానికి కావాలి.
రెండవది - ఉదయము కళ్ళు తెరవగానే మొట్టమొదటగా శివబాబాకు గుడ్
మార్నింగ్ చెప్పండి. చెప్పగలరా? చూడండి, ఒక సామెత ఉంది కదా,
మొత్తము రోజంతటిలో ఎవరైనా మంచివారిని చూస్తే రోజంతా మంచిగా
గడుస్తుంది. ఏదైనా చెడు చూస్తే ఏమంటారు? ఈ రోజు ఎవరి ముఖము
చూసానో రోజంతా పాడైపోయింది అని అంటారు. మరి అత్యంత మంచివారు
ఎవరు? శివబాబా. శివబాబాపై ప్రేమ ఉంది కదా. కనుక కళ్ళు తెరవగానే
శివబాబా, గుడ్ మార్నింగ్ అని చెప్పండి, అలాగే కళ్ళు
మూసుకునేటప్పుడు, రాత్రివేళ మంచముపైకి వెళ్ళినప్పుడు, శివబాబా
గుడ్ నైట్ అని చెప్పండి. ఇది సహజమే కదా. అప్పుడు రోజంతా మీకు
మంచే జరుగుతుంది, ఎందుకంటే శుభ సంకల్పాన్ని కూడా చేసారు,
వరదానాన్ని విన్నారు. ఇప్పుడు ఇలా చేయండి. మీ పట్ల బాప్ దాదాకు
ప్రేమ ఉంది కదా. ఇలా చెయ్యడము ద్వారా మీరు మరింత ముందుకు వెళ్తూ
ఉంటారు. మీ ఈ జీవితములో కూడా సంతోషాన్ని అనుభవం చేస్తారు.
ఎప్పుడూ దుఃఖపు అల రాదు. మరి ఒప్పుకున్నట్లేనా, అలాగే
సహజయోగులుగా అవ్వండి, చాలు. నేను ఆత్మను, శివబాబా బిడ్డను, అంతే,
సహజయోగి అంటే ఇదే. నడుస్తూ-తిరుగుతూ - నేను ఆత్మను, శివబాబా
బిడ్డను అని గుర్తుంచుకోండి. ఇదైతే గుర్తు పెట్టుకోగలరు కదా.
చాలా మంచిది.
మీరందరూ వారసులు కూడా, వారసులుగా అయ్యేవారు కూడా ఉన్నారు.
ఎవరైతే స్వయాన్ని బాప్ దాదాకు పక్కా వారసులుగా భావిస్తున్నారో
వారు చేతులెత్తండి. వారసులేనా? వి.ఐ.పి.లు కూడా అందరూ
చేతులెత్తుతున్నారు. చప్పట్లు కొట్టండి కదా. అచ్ఛా. ఇప్పుడు
వారస క్వాలిటీవారు ఈ రోజు ఒక సంకల్పాన్ని దృఢము చేసుకోండి. బాప్
దాదాతో సంకల్పము చేయండి - మేము ఇప్పటినుండి, ఎప్పటినుండో కాదు,
ఇప్పటినుండి వ్యర్థ సంకల్పాలను సమాప్తము చేసే తీరుతాము.
ఒప్పుకున్నట్లేనా? ఒప్పుకున్నట్లేనా? అయితే చేతులెత్తండి. రెండు
పనులు ఉన్నాయి, ఒకటి, సదా సమర్థులుగా అవ్వడము మరియు రెండు,
సమర్థ సమయాన్ని సమీపముగా తీసుకురావడము. ఎందుకంటే బాప్ దాదా
వద్దకు ఆర్తనాదాలు, దుఃఖపు ఆక్రందనలు చాలా వినిపిస్తూ ఉంటాయి.
మీకెందుకు వినిపించవో తెలియటం లేదు. బాప్ దాదా ఇలా విన్నప్పుడు,
పిల్లలైన మీరు ఎవరైతే స్వయాన్ని వారసులుగా భావిస్తున్నారో,
వారసత్వాన్ని తీసుకునేవారో, మరి వారసత్వాన్ని తీసుకునేవారికి
ఇతరులకు వారసత్వాన్ని ఇప్పించే విషయములో దయ కలగాలి కదా. దయ
ఎందుకు కలగడము లేదు? వైరాగ్యము, అనంతమైన వైరాగ్యము మరియు దయ
కలగాలి. చిన్న-చిన్న విషయాలలో ఎందుకు, ఏమిటి అన్న క్యూలో
సమయాన్ని గడపవద్దు. ఇప్పుడు బాప్ దాదా యొక్క సికీలధే, పదమాల,
పదమాల వరదానాలతో నిండిన వరదానీ పిల్లలూ! ఇప్పుడు సంకల్పాన్ని
దృఢం చేయండి మరియు దృఢత అనే తాళంచెవిని ఉపయోగించండి.
కర్మయోగులుగా అవ్వండి. కర్మయోగి జీవితము కలవారిగా అవ్వండి.
జీవితము అన్నది సదాకాలం ఉంటుంది, అప్పుడప్పుడూ ఉండదు. కావున
ఇప్పుడు మీ కృపాళువు, దయాళువు, దుఃఖహర్త, సుఖదాత స్వరూపాన్ని
ఇమర్జ్ చేసుకోండి. బాప్ దాదా అకస్మాత్తు యొక్క సమయము గురించి
ఎంతోకాలంగా చెప్తూ ఉన్నారు. కావున అకస్మాత్తుగా జరిగేకన్నా
ముందే భక్తుల పిలుపులను పూర్తి చేయండి. దుఃఖముతో ఉన్నవారి
దుఃఖపు మొరను వినండి. ఇప్పుడు చిన్నవారు, పెద్దవారు, ప్రతి
ఒక్కరూ స్వయాన్ని విశ్వ పరివర్తకులుగా, విశ్వములోని దుఃఖాన్ని
పరివర్తన చేసి సుఖ ప్రపంచాన్ని తీసుకువచ్చేందుకు బాధ్యులుగా
భావించండి.
బాప్ దాదా ఇలా రావడము వెళ్ళడము కూడా ఎప్పటివరకు? అందుకే
అన్నీ అకస్మాత్తుగా జరగనున్నాయి. ఇప్పుడు వారస క్వాలిటీ వారు,
వారసత్వాన్ని ఇప్పించండి, దయార్ద్ర హృదయులుగా అయ్యే పాత్రను
వహించండి. ఎప్పటివరకు జరుగుతుంది అని అనుకోకండి! అకస్మాత్తుగా
జరుగుతుంది. అందుకే వ్యర్థాన్ని సమాప్తము చెయ్యాల్సిందే.
అవ్వాల్సిందే కాదు, చెయ్యాల్సిందే. బాప్ దాదా రిజల్టును చూసారు.
అందరి కర్మల గతిని చెక్ చేసారు. పురుషార్థ వేగాన్ని చెక్ చేసారు.
ఖజానాల జమ ఖాతాను చెక్ చేసారు. మరి రిజల్టులో ఏమి చూసారు? జమ
చేసుకోవడానికి చాలా మంచిగా పురుషార్థము చేస్తారు, కానీ జమ
చేసుకోవడములో పర్సెంటేజ్ రకరకాలుగా ఉంది. మేము ఇంత జమ
చేసుకున్నాము అని ఏదైతే అనుకుంటున్నారో, జమ అయితే అవుతుంది కానీ
పర్సెంటేజ్ ఉంటుంది, కొద్దిగా జమ అవుతుంది, సదా కోసం జమ అవ్వడము
లేదు. ఎంతైతే చేస్తున్నారో అంతగా సదా కోసం జమ అవ్వడములో తేడా
ఉంటుంది. అందుకే బాప్ దాదా ఇప్పుడు ఒక్కొక్క విషయములోనూ దృఢ
సంకల్పాన్ని చేయిస్తున్నారు. క్రోధము విషయములో చేయించారు -
మనసులో కూడా ఎవరిపట్ల అలజడి కలగకూడదు, ఎందుకు, ఏమిటి అనేది
రాకూడదు అని చెప్పారు. అయితే నోటి విషయములో కొందరు మంచిగా
కంట్రోల్ చేసుకున్నారు, కానీ మనసులో కొంత జరుగుతూ ఉంటుంది.
క్రోధాన్ని తొలగించుకునే ప్రయత్నమైతే చేస్తున్నారు. అయినా
అటెన్షన్ పెట్టినందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. దీని వల్ల
నాకే నష్టముంది అని అర్థం చేసుకుంటున్నారు. అర్థమైందా. అచ్ఛా!
ఇప్పుడు నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమీ పిల్లలను, ఎవరైతే సదా
బాబా ప్రేమలో ఎగురుతూ ఉంటారో, తీవ్ర పురుషార్థులుగా ఉన్నారో
మరియు సేవలో నిర్విఘ్నమైన సత్యమైన సేవాధారులుగా ఉన్నారో,
నలువైపులా ఉన్న ఇటువంటి పిల్లలను బాప్ దాదా కూడా చూస్తున్నారు,
అంతేకాక దూరంగా ఉన్నవారిని కూడా చూస్తున్నారు మరియు ఇక్కడ
శాంతివన్ లో కూడా అక్కడక్కడ స్క్రీన్ పై చూస్తున్నవారు,
వింటున్నవారు, ఆ పిల్లలందరికీ బాప్ దాదా - సదా కోసం సంతోషముగా
ఉండండి, సంతోషాన్ని పంచండి అన్న వరదానాన్ని ఇస్తున్నారు.
సంతోషకరమైన ముఖము ఉండాలి. ఎవరు మీ ముఖము చూసినా వారు ముఖము చూసి
సంతోషించాలి. ఎలా ఉన్నా కానీ మీ సంతోషకర ముఖాన్ని చూసి వారు
స్వయం కూడా సంతోషించాలి. ఈ వరదానాన్ని నలువైపులా ఉన్న పిల్లలకు,
సమ్ముఖములో ఉన్న పిల్లలందరికీ ఒక వరదానము. ఎప్పుడూ ముఖము
వాడిపోయి ఉండకూడదు. మీరే వాడిపోతే ఇక ప్రపంచ పరిస్థితి ఏమిటి!
మీరు సదా సంతోషకర ముఖముతో, సంతోషము నిండిన నడవడికతో ఉండాలి
మరియు ఉంచాలి. ఇటువంటి తీవ్ర పురుషార్థీ పిల్లలందరికీ బాప్ దాదా
ప్రియస్మృతులు మరియు మధురాతి మధురమైన పిల్లలకు నమస్తే.